IPL 2021: విజయవంతంగా 13 ఏళ్లు ముగించుకుని, 14వ సీజన్ లోకి అడుగుపెట్టింది ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్).
IPL 2021: విజయవంతంగా 13 ఏళ్లు ముగించుకుని, 14వ సీజన్ లోకి అడుగుపెట్టింది ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్). 8 టీంలతో మరోసారి ఉత్కంఠతతోపాటు, వినోదాన్ని పంచేందుకు ఆటగాళ్లతో సిద్ధమైంది క్యాష్ రిచ్ లీగ్ గా పేరొందిన ఐపీఎల్. అయితే ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లను కేవలం టీవీల్లోనే చూడాల్సివస్తోంది. కోవిడ్-19 కారణంగా స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9 నుంచి ఆరంభం కానుంది ఐపీఎల్ సందడి.
గడిచిన 13 సీజన్ లలో 5 జట్లు మాత్రమే ట్రోఫిని ముద్దాడాయి. మిగిలిన టీంలకు నిరాశే ఎదురవుతోంది. 51 రోజుల పాటు ఇండియా వేదికగా జరుగనున్న ఐపీఎల్‌లో మొత్తం 60 మ్యాచ్‌లతో అలరించేదుకు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి టైటిల్ పాత చాంపియన్లే గెలుస్తారా... లేదా కొత్త చాంపియన్ సాధిస్తారా చూడాలి. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ టీం 5 సార్లు ట్రోఫీని గెలుచుకుని రికార్డు సాధించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 3సార్లు చాంపియన్ గా నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ చెరో 2 సార్లు ఐపీఎల్ విజేతలుగా నిలిచాయి. రాజస్థాన్ రాయల్స్ మాత్రం కేవలం ఒక్కసారే కప్ గెలిచింది.
13 సీజన్లలో విజేతలను ఓ సారి పరిశీలిద్దాం.
ఐపీఎల్-2020; విజేత - ముంబై ఇండియన్స్ (Mumbai Indians)
గతేడాది ఫామ్ నే కొనసాగించిన ముంబై ఇండియన్స్ టీం అద్భుత ఆటతీరుతో ఢిల్లీ క్యాపిటల్స్ పై 5 వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్-13 వ సీజన్ లో విజేతగా నిలిచింది. ఓవరాల్ గా 5 వ సారి టైటిల్ ను గెలిచి, అన్ని టీంల కంటే ఎక్కువ సార్లు ట్రోపి గెలిచిన టీం గా రికార్డలు క్రియోట్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (65 పరుగులు, నాటౌట్)తో పాటు యువ ఆటగాడు రిషభ్ పంత్ (56 పరుగులు) చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్సోయి 156 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ (68 పరుగులు) మెరుపులకు తోడు ఇషాన్ కిషన్ (33 నాటౌట్) కుమ్మేయడంతో 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించి కప్ ను సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో కేఎల్ రాహుల్ 670 పరుగులతో మొదటి స్థానంలో నిలిచి సాధించి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే బౌలింగ్ లో కగిసో రబాడా 30 వికెట్లతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.
ఐపీఎల్-2019; విజేత - ముంబై ఇండియన్స్ (Mumbai Indians)
మూడో సారి చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి, ముంబై ఇండియన్స్ టీం ఐపీఎల్ –2019 విజేతగా నిలిచింది. మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కేవలం 149 పరుగులే చేసినా... ధోనీ సేనను కట్టడిచేయడంలో సఫలమైంది. కేవలం 1 పరుగుతో విజయం సాధించి ట్రోపిని ముద్దాడింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన చెన్నై టీం 7 వికెట్ల నష్టానికి 148 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్) అవార్డు డేవిడ్ వార్నర్‌ను వరించింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు (692) సాధించి వార్నర్‌ను ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఎక్కువ వికెట్ల (26) తో పర్పుల్ క్యాప్ ను ఇమ్రాన్ తాహీర్ అందుకున్నాడు.
ఐపీఎల్-2018; విజేత - చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)
వివాదంతో లీగ్‌కు రెండేళ్లు దూరమైనా.. ఘనంగా తిరిగొచ్చి ఐపీఎల్ - 2018 ట్రోఫీని అందుకుంది. మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. చెన్నై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్(735) అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కింగ్స్ పంజాబ్ బౌలర్ ఆండ్రూ టై(24) అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్-2017; విజేత - ముంబై ఇండియన్స్ (Mumbai Indians)
ముంబై ఇండియన్స్ ఫైనల్ పోరులో రైజింగ్ పుణెతో తలపడి, 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ (316 పరుగులు, 12 వికెట్లు) ప్రదర్శన కనబర్చిన రైజింగ్ పుణె ఆటగాడు బెన్‌స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ దిటోర్నీగా నిలిచాడు. సన్ రైజర్స్ ఆటగాళ్లు డెవిడ్ వార్నర్ (641) ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.
ఐపీఎల్-2016; విజేత - సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)
ఈ సీజన్ లో విజేతగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 8 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి, 973పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఫ్లేయర్ ఆఫ్ ది టోర్నీతో పాటు ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. బౌలింగ్‌తో సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.
ఐపీఎల్-2015; విజేత - ముంబై ఇండియన్స్ (Mumbai Indians)
ముంబై ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌పై 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రెండో సారి టైటిల్ ను సాధించింది. కోల్‌కతా ఆటగాడు ఆండ్రూ రస్సెల్ (326 పరుగులు, 14 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. సన్‌రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 562 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. బౌలింగ్‌లో 26 వికెట్లతో చెన్నై ఆటగాడు డ్వాన్ బ్రావో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్-2014; విజేత - కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders)
ఈ సీజన్ టైటిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. ఫైనల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై మూడు వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. ఈ సీజన్‌లో పంజాబ్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ 552 పరుగులతో మ్యాన్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. కోల్‌కతా ఆటగాడు రాబిన్ ఉతప్ప 660 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. చెన్నై ఆటగాడు మోహిత్ శర్మ 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.
ఐపీఎల్-2013; విజేత - ముంబై ఇండియన్స్ (Mumbai Indians)
చెన్నై సూపర్‌కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించి, ట్రోపిని గెలిచింది. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు షేన్ వాట్సన్(543 పరుగులు, బౌలింగ్‌లో 13 వికెట్లు) మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. చెన్నై ఆటగాడు మైక్‌హస్సీ 733 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకోగా.. చెన్నైకే చెందిన మరో ఆటగాడు డ్వాన్ బ్రావో 32 వికెట్లతో పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్-2012; విజేత - కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders)
ఈ సీజన్ టైటిల్‌ను గంభీర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలుచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ను కోల్‌కతా 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరైన్ 24 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ 733 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. 25 వికెట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు మోర్నీ మోర్కెల్ పర్పుల్ క్యాప్ సాధించాడు.
ఐపీఎల్-2011; విజేత - చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పై చెన్నై సూపర్ కింగ్స్ 58 పరుగుల తేడాతో విజయం సాధించి, విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఆటగాడు క్రిస్‌గేల్ 608 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. అలాగే బౌలింగ్‌లోనూ 8 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్‌ది టోర్నీగా ఎన్నికయ్యాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడు లసిత్ మలింగా 28 వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్-2010; విజేత - చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)
మూడో సీజన్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకంది. సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో ముంబై కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 618 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది టోర్నీతో పాటు ఆరెంజ్ క్యాప్ ను అందుకున్నాడు. 21 వికెట్లతో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు.
ఐపీఎల్ -2009; విజేత - డెక్కన్ చార్జర్స్ (Hyderabad Deccan Chargers)
రెండో సీజన్ లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ సారథ్యంలోని డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది. అనిల్ కుంబ్లే కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరుపై 6 పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్ జట్టు కప్ ను సొంతం చేసుకుంది. హైదరాబాద్ కెప్టెన్ గిల్‌క్రిస్ట్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ(495 పరుగులు, కీపర్‌గా 18 డిసిమిసల్స్) గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మాథ్యూ హెడెన్ 572 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ బౌలర్ ఆర్పీ సింగ్ 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్ -2008; విజేత - రాజస్థాన్ రాయల్స్ (Rajsthan Royals)
తొలి సీజన్ టైటిల్‌ను షేన్‌వార్న్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుచుకుంది. చెన్నైసూపర్ కింగ్స్ రన్నరప్‌గా నిలిచింది. రాజస్థాన్ ప్లేయర్ షేన్ వాట్సన్ (472 పరుగులు, 17 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా ఎన్నికయ్యాడు. కింగ్స్‌ఎలెవన్ పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ 616 పరుగులతో ఆరేంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. రాజస్థాన్ ప్లేయర్ సోహైల్ తన్వీర్ 22 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire