Rishabh Pant: డబ్బు కోసం కాదు.. గవాస్కర్‌కు కౌంటర్ వేసిన పంత్..!

IPL 2025 Auction Rishabh Pant Counter To Sunil Gavaskar Over Leaving Delhi Capitals Comments
x

Rishabh Pant: డబ్బు కోసం కాదు.. గవాస్కర్‌కు కౌంటర్ వేసిన పంత్..!

Highlights

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) ప్రాంచైజీ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఐపీఎల్ 2025 కోసం రిటైన్ చేసుకోని విషయం తెలిసిందే.

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) ప్రాంచైజీ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఐపీఎల్ 2025 కోసం రిటైన్ చేసుకోని విషయం తెలిసిందే. ఆరుగురికి అవకాశం ఉన్నా.. కేవలం నలుగురిని మాత్రమే ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను రిటైన్ చేసుకుంది. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, హ్యారీ బ్రూక్, మిచెల్ మార్ష్, గుల్బాదిన్ నయిబ్ లాంటి స్టార్ ఆటగాళ్లను డీసీ వేలంలోకి వదిలేసింది. ఇక నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనున్న వేలంలో స్టార్ ఆటగాళ్లను తీసుకునేందుకు ఢిల్లీ ప్రాంచైజీ ప్రణాళికలు రచించింది.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో అందరి దృష్టి రిషబ్ పంత్‌పైనే ఉంది. అతడికి భారీ ధర ఖాయం అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీలు పంత్‌ను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాయకత్వ అనుభవం ఉన్న పంత్ కోసం భారీ ధర వెచ్చించేందుకు ఆ రెండు ప్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయట. మెగా వేలం నేపథ్యంలో ఢిల్లీని పంత్‌ వీడడానికి గల కారణాలను భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విశ్లేషించాడు. రిటెన్షన్ ఫీజు విషయంలో ఢిల్లీ ఫ్రాంఛైజీతో పంత్ విభేదించి ఉండొచ్చని స్టార్‌స్పోర్ట్స్‌ షోలో అన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలపై రిషబ్ పంత్ తాజాగా స్పందించాడు. ఢిల్లీ ఫ్రాంఛైజీని వీడటానికి గల కారణం డబ్బు మాత్రం కాదని తెలిపాడు. ‘నా రిటెన్షన్ అంశం డబ్బుతో ముడిపడి లేదని కచ్చితంగా చెప్పగలను’ అని పంత్ ట్వీట్ చేశాడు. డబ్బు మ్యాటర్ కాదని చెప్పిన పంత్ అసలు విషయం మాత్రం చెప్పలేదు. ఢిల్లీ తడిని ఎందుకు రిటైన్ చేసుకోలేదో కారణం తెలియకుండా పోయింది. ప్రమాదం కారణంగా ఏడాదిన్నర పాటు ఆటకు దూరంగా ఉన్న పంత్.. ఐపీఎల్ 2024లో పునరాగమనం చేశాడు. ఢిల్లీ తరఫున 446 రన్స్ చేసిన పంత్.. సారథిగా మాత్రం విఫలమయ్యాడు. 14 మ్యాచులలో 7 విజయాలు సాధించిన డీసీ.. పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

రిషబ్ పంత్‌ను తిరిగి దక్కించుకోవడానికి ఢిల్లీ ప్రయత్నిస్తుందని సునీల్ గావస్కర్ అంచనా వేశాడు. 'రిషబ్ పంత్‌ను మెగా వేలంలో తీసుకోవడానికి ఢిల్లీ ట్రై చేస్తుంది. ఒక ఆటగాడిని రిటైన్ చేయాలనుకున్నప్పుడు ఫీజుల గురించి ప్లేయర్, ఫ్రాంఛైజీ మధ్య చాలా చర్చలు జరుగుతాయి. కొంతమంది ఆటగాళ్లకు మొదటి రిటెన్షన్‌ ఫీజు కంటే ఎక్కువగా ఫ్రాంఛైజీలు చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీకి కెప్టెన్ అవసరం ఉంది కాబట్టి.. పంత్‌ను జట్టులోకి తీసుకుంటుంది. లేదంటే డీసీ కొత్త కెప్టెన్ కోసం చూడాల్సి ఉంటుంది' అని సన్నీ చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories