KKR vs SRH: ఫైనల్ పోరుకు సిద్ధమైన హైదరాబాద్, కోల్‌కతా.. హోరాహోరీ తప్పదంటోన్న గణాంకాలు..!

IPL 2024 Final Match KKR vs SRH Match Preview and Head to Head Details
x

KKR vs SRH: ఫైనల్ పోరుకు సిద్ధమైన హైదరాబాద్, కోల్‌కతా.. హోరాహోరీ తప్పదంటోన్న గణాంకాలు..!

Highlights

IPL Final Match: ఐపీఎల్‌ 17వ సీజన్‌ చివరి అంకానికి చేరుకుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్‌ ఫైట్‌కు సమయం ఆసన్నమైంది.

IPL Final Match: ఐపీఎల్‌ 17వ సీజన్‌ చివరి అంకానికి చేరుకుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్‌ ఫైట్‌కు సమయం ఆసన్నమైంది. ఒకే ఒక్క అడుగు.. అరవై రోజుల పోరాటంలో అంతిమ విజేత ఎవరో తేల్చనుంది. ఆఖరి పోరాటంలో సన్‌రైజర్స్‌ ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలిస్తుందా? కోల్‌కతా జోరు కొనసాగుతుందా?ఎవరి బలమెంత?

ఐపీఎల్‌.. అదో పెను విధ్వంసం.. ప్రతీ మ్యాచ్‌ ఓ పరుగుల సునామీ..అరవై రోజుల క్రికెట్ అభిమానుల పండగ. క్రికెట్ రూపురేఖలే మార్చిన ఈ రిచెస్ట్ లీగ్‌కు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్‌ వేరు. ఆ క్రేజ్‌తోనే 16 సీజన్‌లు పూర్తిచేసుకుని 17వ సీజన్ కూడా అంతే రేంజ్ ఫాలోయింగ్‌తో కొనసాగింది. బాల్ బాల్‌కు కోట్లు కురిపించింది. మరికొద్ది గంటల్లోనే ఈ సీజన్‌కు ముగింపు పడనుండగా.. టైటిల్ పట్టుకెళ్లేదెవరన్న ఉత్కంఠతో ఉన్నారు క్రికెట్ అభిమానులు.

అంచనాలకు మించిన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్ రైజర్స్ ఒకవైపు.. వార్ వన్‌సైడ్ అంటూ నైట్ రైడర్స్ మరోవైపు. ఈ రెండు బలమైన జట్ల మధ్య జరిగే ఫైనల‌్‌లో ఎవరు గెలుస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ ఐపీఎల్ సీజన్‌ను కోల్‌కతా, హైదరాబాద్‌ జట్లు హెడ్ టూ హెడ్ మ్యాచ్‌తోనే మొదలుపెట్టాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఆ మ్యాచ్‌ను సన్ రైజర్స్ 4పరుగుల తేడాతో కోల్పోయింది. ఆ తర్వాత మళ్లీ ఈ రెండు టీమ్స్ తలపడింది క్వాలిఫైయర్ 1లోనే. క్వాలిఫైయర్ 1లో మళ్లీ సన్ రైజర్స్‌పై పూర్తి ఆధిపత్యం చూపించిన కోల్‌కతా నాలుగోసారి ఐపీఎల్ ఫైన‌ల్‌కు చేరింది. అయితే క్వాలిఫైయర్ 1 ఓటమి నుంచి వెంటనే తేరుకున్న సన్ రైజర్స్... ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై సూపర్‌ విక్టరీతో ఫైనల్‌లో మళ్లీ కోల్‌కతాతో తలపడేందుకు సిద్దమైంది.

ఇప్పటివరకు ఈ రెండు టీమ్ లు 27 మ్యాచ్‌లు ఆడగా.. 18 సార్లు కోల్‌కతా.... 9 సార్లు సన్‌రైజర్స్ విజయం సాదించాయి. బలాబలాల పరంగా చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ కోల్‌కతా టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఓ వైపు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతూనే.. క్లాస్ ప్లేతో ఆ టీమ్‌ ఎదురులేకుండా ఫైనల్‌ దాకా వెళ్లింది. ఇటు హైదరాబాద్‌ జట్టును చూస్తే ఈ సీజన్‌లో రికార్డుల మోత మోగించిన జట్టు.. హెడ్‌షేక్‌గా పిలుచుకునే ఓపెనర్లు సన్‌రైజర్స్ బలం. ఆరంభంలో ఈ ఇద్దరిపైనా ఆధారపడిన జట్టు ప్లే ఆఫ్స్‌కు వచ్చేసరికి బ్యాటింగ్‌లా బలంగా మారింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ ఫెయిల్ అయినా నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, క్లాసిన్ ఫామ్‌లోకి వచ్చారు. బౌలింగ్‌లోనూ కాస్త డల్‌గా ఉన్న సన్‌రైజర్స్‌ క్వాలిఫైయర్ 2తో తమ బౌలింగ్ సత్తాను చాటింది. చెన్నైలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లో తేలిపోయినట్టే అనుకున్న తరుణంలో ఆ జట్టు అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. దీంతో రెండు జట్లు బలాబలాలపరంగా సమఉజ్జీలుగానే ఉన్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని అంతా భావిస్తున్నారు.

ఈ ఫైనల్‌లో 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది సన్‌రైజర్స్ హైదరాబాద్. క్వాలిఫయర్-2 ఆడిన వేదికగా అయిన చెన్నైలోని ఫైనల్ జరగనుండటం తమకు కలిసొస్తుందని... ఈ ఫైనల్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో సన్‌రైజర్స్ పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగుతోంది. పిచ్ స్వభావాన్ని బట్టి తుది జట్టులో కీలక మార్పు చేసే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నా.. క్వాలిఫయర్-2లో దారుణంగా విఫలమైన ఎయిడెన్ మార్‌క్రమ్‍‌పై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. మార్‌క్రమ్‌ ఈ సీజన్‌లో 10 మ్యాచులు ఆడి.. కేవలం 200 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో అతడిని జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్, పవర్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్‌ను జట్టులోకి తీసుకోవాలని ఎస్ఆర్‌హెచ్ భావిస్తున్నట్లు సమాచారం.

ఐపీఎల్ ఆరంభ సీజన్ అయిన 2008లో డెక్కన చార్జర్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే 2009 సీజన్ లో ఫైనల్ చేరడంతో పాటు చాంపియన్ గా అవతరించింది. ఇక తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఇదే రికార్డును సాధించింది. 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ లో ఏకంగా ఫైనల్ కు చేరుకుంది. డెక్కన్ చార్జర్స్ విషయంలో వర్క్ అయిన సెంటిమెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయంలోనూ జరిగితే 2024 ఐపీఎల్ చాంపియన్ గా నిలవడం ఖాయం.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్స్ ఆడిన జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5వ స్థానంలో ఉంది. ఈ జట్టు ఐపీఎల్‌ టైటిల్‌ను కూడా ఒకసారి గెలుచుకుంది. ఐపీఎల్ 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి హైదరాబాద్ టైటిల్ గెలుచుకుంది. ప్రస్తుత సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016, 2018లో ఫైనల్స్‌లో భాగమైంది. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 3 సార్లు ఫైనల్స్ ఆడింది. కానీ, ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఫైనల్స్ ఆడిన జట్ల జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ పేరు మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో కేకేఆర్ నాలుగోసారి ఫైనల్ ఆడనుంది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఫైనల్స్ ఆడిన ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోగా, ఫైనల్స్‌లో ఒక్కసారి మాత్రమే ఓటమిని చవిచూసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ విదేశీ కెప్టెన్సీ కలిసొస్తుందనే చెప్పాలి. ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫైనల్‌కు వెళితే.. అన్నిసార్లు విదేశీ ఆటగాళ్లే సారథులుగా ఉండడం విశేషం. 2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌ను ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అంతేకాదు కప్ కూడా అందించాడు. 2008లో పేలవ ప్రదర్శనతో పాయింట్స్ పట్టికలో అట్టడుగున నిలిచిన ఛార్జర్స్‌.. 2009లో గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి టైటిల్ సాదించింది.

ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2012లో డెక్కన్‌ ఛార్జర్స్ ఫ్రాంఛైజీని ఐపీఎల్‌ కమిటీ రద్దు చేసింది. అనంతరం హైదరాబాద్‌ జట్టు హక్కులను సన్‌ టీవీ నెట్‌వర్క్‌ దక్కించుకుని.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గా 2013లో ఎంట్రీ ఇచ్చింది. 2016లో డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించాడు. కేన్ విలియమ్సన్ సారథ్యంలో 2018లో ఎస్‌ఆర్‌హెచ్ ఫైనల్ చేరింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి టైటిల్ చేజార్చుకుంది.

తాజాగా పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. దాంతో సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన మూడో ఆసీస్ ప్లేయర్‌గా కమిన్స్ నిలిచాడు. రూ.20.5 కోట్లను వెచ్చించి మరీ కమిన్స్‌ హైదరాబాద్‌ ప్రాంచైజీ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎస్‌ఆర్‌హెచ్ ఫైనల్ చేరడంతో ఆ మొత్తానికి అతడు న్యాయం చేశాడని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఫైనల్‌లో కోల్‌కతాపై సన్‌రైజర్స్ గెలవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories