IPL 2020 : ఇషాన్ నువ్వొక్కడివే కాదు...కోహ్లీ..గేల్ కూడా నీలాగే 99 దగ్గర ఆగిపోయారు!!

IPL 2020 : ఇషాన్ నువ్వొక్కడివే కాదు...కోహ్లీ..గేల్ కూడా నీలాగే 99 దగ్గర ఆగిపోయారు!!
x

Century miss by one run in IPL

Highlights

IPL 2020 : ముంబాయి బ్యాట్స్ మెన్ ఇషాన్ ఒక్క పరుగుతో సెంచరీ మిస్ అయ్యాడు. ఐపీఎల్ లో అలా మిస్ అయిన వారు గతంలోనూ ఉన్నారు. వారి వివరాలు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ముంబయి ఇండియన్స్ మ్యాచ్ ఒక దశలో ఏకపక్షంగా మారిపోతున్నట్టు కనిపించింది. బెంగళూరు గెలుపు నల్లేరు మీద నడక అనిపించింది. ఈ స్థితిలో మెల్లగా చాపకింద నీరులా.. ఒక ఇంజనీరులా.. ముంబాయి ఇండియన్స్ ఇన్నింగ్స్ ని నిర్మిస్తూ పోయాడో డైనమైట్..పోలార్డ్ తోడుగా బెంగళూరు జట్టునుంచి విజయాన్ని దాదాపు లాగేసుకున్నాడు. ఆ జార్ఖండ్ యువక్రికెటర్ ఇషాన్ కిషన్! అయితే, త్రుటిలో తన సెంచరీని మిస్ అయ్యాడు. ఒక్క పరుగు దూరంలో వంద పరుగుల మైలురాయిని చేరుకోలేక ఆగిపోయాడు. దీంతో కిషన్ ఎంతో నిరాశకు గురయ్యాడు. నిజమే కదా..ఒక్క పరుగు దూరంలో సెంచరీ కోల్పోవడం ఏ క్రికెటర్ కి అయినా చెప్పలేని వేదన కలిగిస్తుంది. చివరకు క్రీజు వదిలి వెళుతున్నపుసు కిషన్ హావభావాలు చూసిన ప్రతి క్రికెట్ ప్రేమికుడు అయ్యో అనుకున్నారు. అదీ కాకుండా కిషన్ ఇన్నింగ్స్ ఒక అద్భుతంగా సాగింది. దాదాపుగా ఓటమి కోరల్లో ఉన్న జట్టును తన ఆటతీరుతో ఒడ్డున పాదేసినట్టు అయిపొయింది. అటువంటి సమయంలో అవుట్ అయిపోవడం తో కిషన్ నిరాశకు గురవడం సహజమే కదా.

అయితే, ఐపీఎల్ లో కిషన్ ఒక్కడే మొదటి వాడు కాదు ఇలా 99 పరుగుల వద్ద సెంచరీ చేజార్చుకున్నది. ఇంతకు ముందు కొంతమంది క్రికెటర్లు ఇలా ఒక్క పరుగు తేడాతో తమ సెంచరీ మిస్ చేసుకున్నారు. ఆ వివరాలివే..

అది 2013 ఐపీఎల్ .. హైదరాబాద్..చెన్నై మ్యాచ్.. చెన్నై మొదట బ్యాటింగ్ చేసింది. ఆరో ఓవర్లో మొదటి వికెట్ కోల్పోయింది. అప్పుడు జట్టు స్కోరు 45 పరుగులు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చాడు సురేష్ రైనా.. అప్పుడు మొదలైంది సునామీ.. హైదరాబాద్ బౌలర్లను కంగారు పట్టేసి 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసేశాడు.. తరువాత ఇన్నింగ్స్ చివరి ఓవర్ రైనా ఆడాడు. అప్పుడు రైనా 90 పరుగులతో ఉన్నాడు. ఈ ఓవర్ చివరి బంతికి 95 పరుగులతో ఉన్నాడు. చివరి బంతికి బౌండరీ చేసాడు రైనా. దీంతో ఇన్నింగ్స్ ముగిసింది..ఇక రైనా సెంచరీ కూడా ఒక్క పరుగు ముందు ఆగిపోయింది. ఈ మ్యాచ్ లో చెన్నై గెలిచింది.

ఇక కోహ్లీ కథ ఇది.. ఇది కూడా ఒక్క పరుగుతో మిస్ అయిన సెంచరీ.. ఢిల్లీ తో తలపడిన మ్యాచ్ లో కోహ్లీ తృటిలో సెంచరీ మిస్ అయిపోయాడు. ఈ మ్యాచ్ లో కూడా బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసింది. వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. 44 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ..డీవిలియర్స్ వచ్చిన తరువాత ఇక రెచ్చిపోయాడు.. 19 వ ఓవర్ వచ్చేసరికి 52 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు.. రెండు సిక్స్ లు బాది ఐదు బాల్స్ పూర్తయ్యేసరికి 98 పరుగుల వద్దకు చేరుకున్నాడు..చివరి బంతిని డీప్‌ పాయింట్లోకి నెట్టిన విరాట్ కోహ్లీ వేగంగా మొదటి పరుగు పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే.. ఆ క్రమంలో రనౌట్ అయ్యాడు. ఇలా కోహ్లీ తన సెంచరీ కోల్పోయాడు! జస్ట్ ఒక్క పరుగుతో!!

ఇది 2019 సీజన్ లో .. ఢిల్లీ..కోల్‌కతా మ్యాచ్. బ్యాట్స్ మెన్ ఓపెనర్‌ పృథ్వీషా. కోల్‌కతా 185/8 పరుగులు చేసింది. ఇక చేజింగ్ మొదలెట్టింది ఢిల్లీ. ఓపెనర్ గా వచ్చిన షా ఒక వైపు నిలదొక్కుకుంటే.. మరో పక్క ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ లతో కలిసి చక్కని భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 16 ఓవర్లకు ఢిల్లీ 152 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. పృధ్వీషా 81 పరుగులతో ఉన్నాడు. తర్వాత వేగంగా ఆడిన షా 18 వ ఓవర్ కు వచ్చేసరికి 99 పరుగులతో ఉన్నాడు. ఫెర్గూసన్ వేసిన షార్ట్ పిచ్ బాల్ ని అడ్డంగా ఆడబోయిన పృధ్వీ కీపర్ దినేష్ కు చిక్కాడు. దీంతో 99 పరుగుల వద్ద ఔట్ అయిపోయి నిరాశగా వెనుతిరిగాడు.

అదే సంవత్సరం అంటే గతేడాది క్రిస్ గేల్ కూడా ఇలానే సెంచరీకి ఒక్క పరుగు ముందు ఆగిపోయాడు. బెంగళూరుతో మ్యాచ్ లో ఇలా జరిగింది. అయితే గేల్ అవుట్ కాలేదు. అదే తేడా. ఈ మ్యాచ్ లో 64 బంతుల్లో 10 బౌండరీలు, 5 సిక్సర్లు తో బెంగళూరు బౌలర్లను చెడుగుడు ఆడేశాడు. అయితే, 60 బంతుల్లో 90 పరుగులు చేసిన గేల్ కు సిరాజ్ 20 ఓవర్లో అడ్డుపడ్డాడు. మొదటి మూడు బంతుల్లో సింగిల్స్ ఇచ్చాడు. ఇక నాలుగో బంతికి గేల్ బౌండరీ బాదాడు. దీంతో గేల్ 95 పరుగుల వద్దకు చేరుకున్నాడు. ఈసారి డాట్ బాల్. ఇక ఒక్కటే బాల్ ఉంది. కచ్చితంగా సిక్స్ కొట్టాల్సిందే.. కానీ, గేల్ కు ఆ అవకాశం సిరాజ్ ఇవ్వలేదు. గేల్ బౌండరీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో సెంచరీకి ఒక్కపరుగు దూరంలో ఆగిపోయాడు.

ఇవీ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లలో ఒక్క పరుగు దూరంలో ఆగిపోయిన సెంచరీలు. సో.. కిషన్ బెటర్ లాక్ నెక్స్ట్ టైం అంటున్నారు అభిమానులు!

Show Full Article
Print Article
Next Story
More Stories