IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్.. ధర్మశాల వేదికగా బిగ్ ఫైట్

India Vs New Zealand Match Today
x

IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్.. ధర్మశాల వేదికగా బిగ్ ఫైట్  

Highlights

IND vs NZ: మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న కివీస్

IND vs NZ: క్రికెట్‌ అభిమానుల కోసం మరో అసలైన వినోదానికి రంగం సిద్ధమైంది. ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు విజయాలతో అజేయంగా సాగుతున్న జట్లు నేడు జరిగే పోరులో ముఖాముఖీ తలపడనున్నాయి. ప్రపంచంలోని అందమైన క్రికెట్‌ వేదికల్లో ఒకటైన ధర్మశాలలో నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడుతోంది.

సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో టీమిండియా చెలరేగిపోతుండగా... ఫేవరెట్‌లుగా భావించిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలను వెనక్కి నెట్టి గత రన్నరప్‌ న్యూజిలాండ్‌ ముందుకు దూసుకొచ్చింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకునేందుకు జరిగే ఈ పోరులో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తిగా మారింది.

జోరు మీదున్న భారత్‌కు గత మ్యాచ్‌ తర్వాత అనూహ్య సమస్య వచ్చింది. గాయపడిన హార్దిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అతని స్థానంలో ఎవరిని ఎంచుకుంటారనేది కీలకంగా మారింది. పిచ్‌ పరిస్థితిని బట్టి చూస్తే నేరుగా షమీకి అవకాశం దక్కవచ్చు. అయితే బ్యాటింగ్‌ బలహీనంగా మారే అవకాశం ఉంది. దీంతో సూర్యకుమార్‌ లేదా ఇషాన్‌ కిషన్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది.

అలా చేస్తే శార్దుల్‌ ఠాకూర్‌ పూర్తి స్థాయిలో ఐదో బౌలర్‌గా తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత బ్యాటర్లంతా మంచి ఫామ్‌లో ఉండటం సానుకూలమైన అంశం. రోహిత్, కోహ్లి, గిల్, రాహుల్‌ అద్భుత ఆటతో కొనసాగిపోతున్నారు. రోహిత్, కోహ్లి దూకుడు భారత్‌కు మరో సారి గెలుపు అవకాశాలు సృష్టించగలదు. ఇప్పటి వరకు టీమిండియాకు లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌కు పరీక్షించే అవకాశం రాలేదు.

అయితే కివీస్‌ బౌలర్లు చెలరేగితే వారు కూడా సత్తా చాటాల్సి ఉంటుంది. బుమ్రా, సిరాజ్‌లతో పేస్‌ బౌలింగ్‌ పదునుగా ఉంది. కుల్దీప్‌ను ఒక్క ప్రత్యర్థి కూడా సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు. జడేజా స్పిన్‌ కూడా కివీస్‌ను కట్టడి చేయగలదు.

మొదటినుంచీ కివీస్‌ నమ్ముకున్న సమష్టితత్వమే ఆ జట్టును గెలిపిస్తోంది. గత నాలుగు మ్యాచ్‌లలో కూడా అది కనిపించింది. ఒకరు విఫలమైతే మరొకరు ఆ బాధ్యతను తీసుకుంటున్నారు. అందుకే న్యూజిలాండ్‌ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. విలియమ్సన్, సౌతీ ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కూ దూరమయ్యాడు.

పిచ్‌పై కాస్త పచ్చిక ఉంటుంది. స్వింగ్, బౌన్స్‌కు మంచి అనుకూలం. పేసర్లకు సానుకూలాంశం. బ్యాటర్లు నిలదొక్కుకుంటే పరుగులు రావచ్చు. వాతావరణం చల్లగా ఉంటుందని, వర్ష సూచనలేదని వాతావరణ శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories