IND vs AUS: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆస్ట్రేలియాకు అగార్కర్! పెద్ద ప్లానింగే

IND vs AUS: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆస్ట్రేలియాకు అగార్కర్! పెద్ద ప్లానింగే
x
Highlights

IND vs AUS: భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు...

IND vs AUS: భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఆసీస్ గడ్డకు వెళ్లింది. శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో ఇటీవల న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో విఫలమైన సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఎలా ఆడుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్‌ అజిత్ అగార్కర్‌ను జట్టుతో పాటే ఆస్ట్రేలియాలోనే ఉండాలని ఆదేశించింది.

ఓ పర్యటనకు జట్టును ఎంపిక చేసిన తర్వాత కోచ్‌, ఆటగాళ్లు మాత్రమే వెళ్తారు. ఏదైనా స్పెషల్, లేదా ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ లాంటి వాటికి బీసీసీఐ చీఫ్, చీఫ్ సెలెక్టర్లు మ్యాచుకు హాజరవుతుంటారు. కానీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను మాత్రం ఐదు టెస్టులు జరిగే వరకూ ఆస్ట్రేలియాలోనే ఉండాలని ఆదేశించారు. దీని వెనక పెద్ద ప్లానింగే ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్‌ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ భవిష్యత్తుపై చర్చించేందుకు అగార్కర్‌ను అక్కడికి పంపినట్లు సమాచారం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి ఆస్ట్రేలియాలో ఆటగాళ్ల ప్రదర్శనను అగార్కర్‌ పరిశీలిస్తాడట. అంతేకాదు సీనియర్లతో మాట్లాడి ఇంకా ఎంతకాలం ఆడతారనేది తెలుసుకుంటాడట.

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. వన్డేల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా ఆర్ జడేజా కూడా రాణిస్తున్నాడు. ఒకవేళ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధిస్తే.. 2025 జూన్ వరకు వీరు అందుబాటులో ఉంటారు.

భారత్‌ డబ్ల్యూటీసీ సీజన్‌ 2025-27 ఇంగ్లండ్‌తో ఆరంభం అవుతుంది. వచ్చే డబ్ల్యూటీసీ సీజన్‌ ముగిసేసరికి.. రోహిత్‌కు 39, కోహ్లీకి 38 ఏళ్లు పూర్తవుతాయి. వన్డే ప్రపంచకప్‌ 2027లో ఉంది. అప్పటివరకు సీనియర్లు ఉంటారా? లేదా తప్పుకొని కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తారా? అన్నది తెలియదు. ఈ విషయంపై క్లారిటీ కోసమే ఇప్పటినుంచే సీనియర్లతో ప్రయాణించి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని బీసీసీఐ ప్లాన్ చేసినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. రోహిత్, విరాట్, జడేజాలు టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories