WCL 2024: 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. డబ్ల్యూసీఎల్ విజేతగా యూవీసేన..

WCL 2024: 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. డబ్ల్యూసీఎల్ విజేతగా యూవీసేన..
x
Highlights

పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఫైనల్లో విజయం సాధించింది.

యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత ఛాంపియన్స్ జట్టు పాకిస్థాన్ ఛాంపియన్స్‌ను ఓడించి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ట్రోఫీని గెలుచుకుంది. పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఫైనల్లో విజయం సాధించింది. భారత ఛాంపియన్స్ విజయంలో, ఓపెనర్ అంబటి రాయుడు, ఇటీవల TMC నుంచి ఎంపీ అయిన యూసుఫ్ పఠాన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో కీలక పాత్ర పోషించారు. ఫైనల్ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడుతున్నారు.

లక్ష్యాన్ని ఛేదించిన భారత్ ఛాంపియన్స్ జట్టుకు రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఉతప్ప 10 పరుగులు చేశాడు. ఉతప్ప ఔటయ్యాక, సురేశ్ రైనా రూపంలో భారత్ వెంటనే రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన తర్వాత రైనా వెనుదిరిగాడు. రైనా అవుటయ్యే సమయానికి భారత్ స్కోరు 38 పరుగులు. ఆ తర్వాత రాయుడికి గురుకీరత్ సింగ్ మద్దతు లభించింది. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ స్కోరును 98కి తీసుకెళ్లారు. 34 పరుగుల వద్ద గురుకీరత్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. అంబటి రాయుడు 30 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. యూసుఫ్ పఠాన్ 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఔట్ కాగా, కెప్టెన్ యువరాజ్ సింగ్ 15 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ తరపున అమీర్ యమీన్ అత్యధికంగా 2 వికెట్లు పడగొట్టాడు.

ఫైనల్లో యూనిస్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు ఓటమి..

అంతకు ముందు యూనిస్ ఖాన్ సారథ్యంలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. అనుభవజ్ఞుడైన షోయబ్ మాలిక్ 36 బంతుల్లో 41 పరుగులతో ఇన్నింగ్స్ ఆడగా, వికెట్ కీపర్ ఓపెనర్ కమ్రాన్ అక్మల్ 24 పరుగులు చేశాడు. మక్సూద్ 21 పరుగులు చేసి ఔట్ కాగా, మిస్బా ఉల్ హక్ 18 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. భారత్ తరపున పేసర్ అనురీత్ సింగ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. వినయ్ కుమార్, పవన్ నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలో వికెట్ తీశారు.

ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌ను ఓడించి ఇండియా ఛాంపియన్స్ ఫైనల్స్‌కు చేరుకోగా, వెస్టిండీస్‌ను ఓడించి పాకిస్తాన్ ఛాంపియన్స్ టైటిల్ మ్యాచ్‌లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొన్నాయి. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రాయుడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories