PBKS vs GT: పంజాబ్ కింగ్స్ పై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం

Gujarat Titans Win With 3 Wickets Against Punjab Kings
x

PBKS vs GT: పంజాబ్ కింగ్స్ పై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం 

Highlights

PBKS vs GT: 143 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో చేధించిన గుజరాత్

PBKS vs GT: ఐపీఎల్ 17వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ ధీటైన బౌలింగ్ తో కట్టడి చేసినప్పటికీ నిలకడగా ఆడుతూ గుజరాత్ బ్యాటర్ల లక్ష్యాన్ని చేరుకున్నారు. 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ చేధించారు. 143 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. శుభ్ మన్ గిల్ 35 పరుగులు, సాయి సుదర్శన్ 31 పరుగులు చేశారు. పంజాబ్ బౌలింగ్ లో మిగిలిన బ్యాటర్లు అందరూ తేలిపోయారు. అయినప్పటికీ ఓవర్ ఆల్ గా తలా కొంత స్కోర్ చేయడం జట్టుకు ప్లస్ అయ్యింది. ఇక చివరలో రాహుల్ తెవాటియా 31 పరుగులతో విజృంభించడంతో 19.1 ఓవర్లోనే లక్ష్యాన్ని చేధించి పంజాబ్ ను ఓడించారు.

తొలిత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ దూకరుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. కాని పవర్ ప్లే పూర్తయ్యే లోపే తొలివికెట్ ను కోల్పోయింది. అప్పట్నుంచి పంజాబ్ కు కష్టాలు మొదలయ్యాయి. ఏడో ఓవర్ లో చివరి బంతికి రోస్సోవ్ తొమ్మిది పరుగులు చేసి... ఎనిమిదో ఓవర్లో ఐదో బంతికి కరన్ 20 పరుగులకు ఔటయ్యారు. ఈ రెండు వికెట్ల విషయంలో పంజాబ్‌ రివ్యూకు వెళ్లినప్పటికీ పంజాబ్‌కు వ్యతిరేకంగానే ఫలితం వచ్చింది. వరుసగా రెండు వికెట్లను కోల్పోవడంతో పంజాబ్‌ స్కోర్ నెమ్మదించింది. గుజరాత్‌ బౌలర్లను తట్టుకోలేక నిలకడగా ఆడుతూ వచ్చింది. దీంతో పవర్‌ప్లే పూర్తయ్యే సరికి 56 పరుగులు చేసిన పంజాబ్‌.. 10 ఓవర్లకు 74 పరుగులు మాత్రమే చేసింది.

ఇక 11వ ఓవర్‌ నుంచి పంజాబ్‌ మళ్లీ వరుసగా వికెట్లను కోల్పోయింది. 11వ ఓవర్‌లో రెండో బంతికి లివింగ్‌స్టన్‌ (6) ఔటయ్యాడు. 12వ ఓవర్‌లో నాలుగో బంతికి జితేశ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 14వ ఓవర్‌లో ఆశుతోష్‌ (3) కూడా ఔటయ్యాడు. తొలి బంతికి రివ్యూ వెళ్లడంతో సానుకూల ఫలితం వచ్చింది. కానీ ఐదో బంతికి భారీ సిక్స్‌ కొట్టేందుకు యత్నించి క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. 16వ ఓవర్‌లో రెండో బంతికి శశాంక్‌ సింగ్‌ (8) కూడా ఔటయ్యాడు. 19వ ఓవర్‌లో చివరి బంతికి భారీ సిక్స్‌ కొట్టేందుకు ప్రయత్నించిన బ్రార్‌ (29) షారుక్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఇక చివరి ఓవర్‌లో హర్షల్‌ పటేల్‌ (0), భాటియా (14) వికెట్‌ను పంజాబ్‌ కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 142 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. గుజరాత్‌ బౌలర్లలో సాయి కిశోర్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. నూర్‌ అహ్మద్‌, మోహిత్‌ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశాడు.

143 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో ఓవర్‌లో నాలుగో బంతికి వృద్ధిమాన్‌ సాహా (13) ఔటయ్యాడు. 10వ ఓవర్‌లో మూడో బంతికి శుభ్‌మన్‌ గిల్‌ (35) ఔటయ్యాడు. రబాడా బౌలింగ్‌లో భారీ సిక్స్‌ కొట్టేందుకు యత్నించి లివింగ్‌స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 11వ ఓవర్‌లో లివింగ్‌స్టోన్‌ వేసిన ఐదో బంతికి మిల్లర్‌ (4) బౌల్డ్‌ అయ్యాడు. 15వ ఓవర్‌లో మూడో బంతికి ఫోర్‌ బాదిన సాయి సుదర్శన్‌.. నాలుగో బంతికి బౌల్డ్‌ అయ్యాడు. ఆ వెంటనే 16వ ఓవర్‌లో హర్షల్‌ పటేల్‌ వేసిన రెండో బంతికి ఒమర్జాయ్‌ (13) క్యాచ్‌ ఔటయ్యాడు. దీంతో గుజరాత్‌ పరుగుల వేగం తగ్గింది. ఒక రకంగా కష్టాల్లోకి వెళ్లిపోయింది. కష్టకాలంలో క్రీజులోకి వచ్చిన రాహుల్‌ తెవాటియా (32) విజృంభించాడు. ఇక గుజరాత్‌ విజయం ఖాయమైందని అనుకుంటున్న తరుణంలో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. 19వ ఓవర్‌లో గుజరాత్‌ రెండు వికెట్లను కోల్పోయింది. 19వ ఓవర్‌లో మొదటి బంతికి షారుక్‌ఖాన్‌ (4), చివరి బంతికి రషీద్‌ఖాన్‌ (3) ఔటయ్యారు. అయినప్పటికీ తెవాటియా నిలకడగా ఆడి టార్గెట్‌ను చేధించాడు. పంజాబ్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు, లివింగ్‌స్టోన్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్‌, శామ్‌ కరన్‌ చెరో వికెట్‌ తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories