Champions Trophy 2025: తగ్గని పాకిస్తాన్.. తెగని ఛాంపియన్స్ ట్రోఫీ పంచాయితీ! ఫైనల్ డెసిషన్‌ ఎప్పుడంటే?

Champions Trophy 2025
x

Champions Trophy 2025: తగ్గని పాకిస్తాన్.. తెగని ఛాంపియన్స్ ట్రోఫీ పంచాయితీ! ఫైనల్ డెసిషన్‌ ఎప్పుడంటే?

Highlights

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025పై ఐసీసీ నేడు సమావేశం అయింది. బీసీసీఐ, పీసీబీ ప్రతినిధులతో 20 నిమిషాలు వర్చువల్‌గా మీటింగ్ జరిగింది.

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025పై కొనసాగుతున్న అనిశ్చితికి నేడు తెరపడుతుందనుకుంటే.. మరలా వాయిదా పడింది. నేడు బీసీసీఐ, పీసీబీ ప్రతినిధులతో ఐసీసీ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించగా.. పాకిస్తాన్ హైబ్రిడ్‌ మోడల్‌కు ఒప్పుకోలేదు. టోర్నీ మొత్తాన్ని పాక్‌లో నిర్వహిస్తామని, హైబ్రిడ్‌ మోడల్‌కు తాము సముఖంగా లేమని ఐసీసీకి పీసీబీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఐసీసీకి చెందిన ఓ అధికారి తెలిపారు. 20 నిమిషాల పాటు సాగిన సమావేశం అసంపూర్తిగా ముగిసిందని, శనివారం మరోసారి మీటింగ్ జరుగుతుందని సదరు అధికారి చెప్పారు.

'ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025పై ఐసీసీ నేడు సమావేశం అయింది. బీసీసీఐ, పీసీబీ ప్రతినిధులతో 20 నిమిషాలు వర్చువల్‌గా మీటింగ్ జరిగింది. టోర్నీ నిర్వహించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. హైబ్రిడ్‌ మోడల్‌కు పాకిస్తాన్ ఒప్పుకోలేదు. టోర్నీని పాక్‌లోనే నిర్వహిస్తాం అని పట్టుబడుతోంది. శనివారం మరోసారి ఐసీసీ సమావేశం అవుతుంది. పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం' అని ఐసీసీ సీనియర్ అడ్మినిస్ట్రేటర్ ఒకరు తెలిపారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాక్ వద్ద ఉండగా.. భద్రతాపరమైన కారణాలతో భారత జట్టును అక్కడికి పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

ఐసీసీ సమావేశం వేళ భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేశారు. బీసీసీఐ చెప్పినట్లుగానే పాకిస్థాన్‌కు భారత జట్టును పంపేది లేదన్నారు. 'ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఇప్పటికే బీసీసీఐ స్టేట్‌మెంట్‌ను రిలీజ్ చేసింది. పాకిస్థాన్‌లో సెక్యూరిటీ సంబంధిత సమస్యలు ఎదురవుతాయని బీసీసీఐ ఆందోళనలో ఉంది. అందుకే టీమిండియాను అక్కడికి పంపించడం లేదని చెప్పింది. వీటన్నింటినీ మేం పరిగణనలోకి తీసుకున్నాం. భారత జట్టును పాకిస్థాన్‌కు పంపే అవకాశమే లేదు' అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

ఐసీసీ మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించడం మొదటిది. మెజారిటీ మ్యాచ్‌లను పాక్‌లో నిర్వహించి.. భారత్‌ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడించడం. హైబ్రిడ్‌ మోడల్‌కు పీసీబీ ఒప్పుకోకుంటే.. ట్రోఫీ మొత్తాన్ని పాక్‌ వెలుపల నిర్వహించడం రెండో ప్రత్యామ్యాయం. భారత్‌ను తప్పించి.. పాక్‌లోనే టోర్నీ నిర్వహించాలన్నది మూడో ప్రత్యామ్యాయం. టీమిండియా లేకుండా టోర్నీ నిర్వహిస్తే.. ఆర్థికంగా భారీ నష్టం వాటిళ్లుతుంది కాబట్టి ఇది అసాధ్యమనే చెప్పాలి. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories