Australia vs India 3rd Test : ముగిసిన రెండో రోజు ఆట..ఆస్ట్రేలియాకు దీటుగా బదులిస్తున్న భారత్‌!

Australia vs India 3rd Test : ముగిసిన రెండో రోజు ఆట..ఆస్ట్రేలియాకు దీటుగా బదులిస్తున్న భారత్‌!
x
Highlights

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు భారత్ ఆధిపత్యం చెలాయించింది.

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజులో ఆసీస్ పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలుత బంతితో, ఆపై బ్యాట్‌తో భారత్ సత్తాచాటింది. దీంతో ఆసీస్ 338 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన రహానే సేన ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. టీమిండియా ఓపెనర్లు శుభారంభం అందించారు. గాయం నుంచి కోలుకొని నేరుగా ఈ మ్యాచ్‌లోనే ఆడుతున్న రోహిత్‌ శర్మ (26)... యువ ఓపెనర్‌ శుభ్‌మన్ ‌గిల్‌ (50; 101 బంతుల్లో 8x4)అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. దీంతో శుక్రవారం ఆట నిలిచిపోయే సమయానికి భారత్‌ 45 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. మరో 242 పరుగుల వెనుకంజలో ఉంది భారత్. చేటేశ్వర్ పుజారా (9), కెప్టెన్ ‌అజింక్య రహానె (5) పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు166/2తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ మరో 182 పరుగులు జోడించి ఏనిమిది వికెట్లు కోల్పోయింది. ఆసీస్ వెన్నువిరచడంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా జట్టును తనదైన శైలిలో ఆదుకున్నాడు. ఆసీస్ జట్టు స్కోరు 188/2 పరుగుల వద్ద వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు. ఆపై వర్షం ఆగిపోవడంతో ఆట మళ్లీ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారిన మార్నస్ లబుషేన్‌ను 91పరుగులు 196 బంతుల్లో జడేజా పెవిలియన్‌కు పంపాడు. లబుషేన్ ,స్టీవ్ స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వేడ్‌ (13)ను కూడా జడేజా బోల్తా కొట్టించాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్న స్టీవ్ స్మీత్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుక్కొన్నాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ సిరీస్‌లో తొలిసారి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. స్మిత్ అద్భుత శతకం చేశాడు. 201 బంతుల్లో 102 పరుగులు చేసి కెరీర్‌లో 27వ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే స్మిత్‌ చివర్లో ధాటిగా ఆడుతూ జట్టు స్కోర్‌ 338 పరుగుల వద్ద జడేజా చేతిలో రనౌటయ్యాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు, బూమ్రా రెండు, షైనీ రెండు వికెట్లు దక్కించుకోగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories