దేశంలోనే ఏకైక నరనారసింహ క్షేత్రం అహోబలం. ఆ తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న క్షేత్రం యాదగిరిగుట్ట. ఎందుకంటే ఇది పంచనారసింహ క్షేత్రం. యాదగిరి గుట్టకు...
దేశంలోనే ఏకైక నరనారసింహ క్షేత్రం అహోబలం. ఆ తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న క్షేత్రం యాదగిరిగుట్ట. ఎందుకంటే ఇది పంచనారసింహ క్షేత్రం.
యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని విభాండక ఋషి. అతడి పుత్రుడైన ఋష్యశృంగుడి కుమారుడు యాదరుషి. అతణ్ణే మాదర్షి అంటారు. చిన్నపట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుణ్ణి అన్వేషించడానికి అడవులూ, కొండలూ కోనలూ తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావిచెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు కలలో ఆంజనేయస్వామి కనిపించి 'నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠినంగా తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు' అని చెప్పారట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఉగ్రనారసింహుడు ప్రత్యక్షమయ్యారట. ఆ తేజస్సును చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరారట యాదర్షి. అప్పుడు లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చి 'ఏం కావాలో కోరుకో' అని అడిగాడు స్వామి. 'నీ దర్శనం కోసం ఇంత ఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంత రూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో' అని కోరారట. అప్పుడు కొండశిలమీద స్వామి ఆవిర్భవించాడు. కొన్నాళ్ల తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. స్వామిని ఒకే రూపంలో చూశాను. వేర్వేరు రూపాల్లో చూడలేకపోయానే అనుకుని మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి ప్రత్యక్షమైయ్యాడు.గర్భగుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరి కాస్త లోపలయోగముద్రలో యోగానందస్వామి. లక్ష్మీనరసింహ స్వాములను చూడొచ్చు.
గర్భాలయం నుంచి బయటకు వస్తే మెట్లకు ఎడమపక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి కిందన ఉన్న పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక బయట ఎడమవైపున మెట్లు దిగితే పుష్కరిణి. కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుని ఆలయం కనిపిస్తాయి. ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. దీనినే "విష్ణుకుండం" అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది.
భక్తుల రాక యేటేటా పెరగడంతో ఈక్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరబాద్ వాస్తవ్యుడైన రాజామోతీలాల్ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించాడు. స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుచుతూ వచ్చారు. ప్రస్తుతం ఈక్షేత్ర యాజమాన్యం దేవాదయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. యాదగిరిలక్ష్మీనర్సింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నది.
ఈ క్షేత్రంలో' ప్రదక్షిణల మొక్కు' ప్రధానమైనది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్థికబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు), అర్థమడలం, 11 రోజుల ప్రదక్షిణల మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గర్భాలయానికి రెండుసార్లూ, ఆంజనేయస్వామికి 16 సార్లూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు శత్ర చికిత్సలు చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తారని నమ్ముతారు.
బ్రహ్మోత్సవాలు
సత్యనారాయణస్వామి వ్రతాలకు అన్నవరం తర్వాత అంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాదగిరిగుట్ట. రోజులో నాలుగుసార్లు ఈ వ్రతాలు జరుగుతాయి.
శ్రీ యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా ఫాల్గుణశుద్ధ విదియ నుంచి మొదలై ద్వాదశి వరకు 11 రోజుల పాటు కన్నుల పండవగా కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని విశేష అలంకారాలు, సేవలు నిర్వహిస్తారు. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ఎదుర్కోళ్ళు, కళ్యాణం, రథోత్సవం ముఖ్యమైనవి. బ్రహ్మాత్సవాలలో భాగంగా స్వామి జగన్మోహిని , రామ, కృష్ణ, నరసింహ అవతరాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం పూట అలంకారాలు, సాయంత్రం పూట సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మాత్సవాలను పురస్కరించుకొని స్వామి వారికి కేశవాహాన సేవ, అన్నవాహాన సేవ, కల్పవృక్షం, గరుడసేవ, అశ్వవాహాన సేవలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సేవల సందర్భంగా స్వామి అమ్మవారులను పట్టుపీతాంబరాలు, వివిధ బంగారు ఆభరణాలు, పూలతో శోభాయమానంగా అలంకరించి పుర వీధులలో ఊరేగిస్తారు. ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేందుకు 75 మంది రుత్వికులతో రామాయణం, మహాభారతం, భాగవతం, విష్ణుసహాస్రనామాలు, సుందరకాండ పారాయణాలు చేస్తారు.
మార్గం
యాదగిరి గుట్ట హైదరాబాద్ నుంచి 60 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులున్నాయి. హైదరాబాద్ - వరంగల్ జాతియ రహదారిలో రామగిరిక్రాస్ రోడ్డు నుంచి రావొచ్చు. రైలుమార్గంలో భవనగిరి, రాయగిరి, ఆలేరు రైల్వేషేషన్లలో దిగి స్వామి సన్నిధికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి సరికొత్తగా 'యాదగిరి రోడ్డు' పేరిట 8 లైన్ల రహదారి నిర్మాణపనులు చేపట్టారు.
వసతి విషయానికి వస్తే...ఆలయాన్ని ఆనుకునే అనేక వందల గదులు గల ఎన్నో సత్రాలు ఉంటాయి. ఇందులో కొన్ని ఉచితంగా ఇచ్చే గదులు కూడా ఉంటాయి. అద్దె గదులు వంద రూపాయలలోపు దొరుకుతుంటాయి. ఇక భోజన సౌకర్యం కోసం ఈ ప్రాంతంలోనే భక్తులను, పర్యాటకులను ఆకర్షించే విధంగా పలు రకాల హోటళ్లు ఉన్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire