Ugadi Rasi Phalalu: ఉగాది పంచాంగం.. ప్లవ నామ సంవత్సరం ఎలా ఉంటుంది?
Ugadi Rasi Phalalu: సోమవారంతో శార్వరి నామ సంవత్సరం ముగిసింది. శ్రీ ప్లవనామ సంవత్సరం వచ్చింది.
Ugadi Rasi Phalalu: సోమవారంతో శార్వరి నామ సంవత్సరం ముగిసింది. శ్రీ ప్లవనామ సంవత్సరం వచ్చింది. తెలుగు సంవత్సరాది. ఉగాది పండగతోనే సృష్టి ఆరంభమైందంటారు. నూతన శకం పురుడు పోసుకుందని చెబుతారు. యుగారంభానికి పునాది వేసింది కూడా ఉగాదే. అందుకే ఉగాదిని కాలానికి సంబంధించిన పండుగ అని చెప్పుకుంటాం. వసంత రుతువు ఆగమనానికి సంకేతం. నవ వసంతానికి నాందీవచనం. చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేసే శుభదినం. కోయిలలు కుహు... కుహు రాగాలు పాడుతూ హాయిగొలిపే సుదినం. అదే ఉగాది. సృష్టికి ఆది. కాలచక్రంగా, ఒక ఆవృతం పూర్తిచేసి మళ్లీ మొదలయ్యే రోజే ఉగాది.
శార్వరి (అంటే చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోకి నెట్టింది. ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైంది. ఇది శుభప్రదమైన సంవత్సరం. ప్లవ అంటే దాటించునది అని అర్థం. "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం" దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుందని అర్థం. ఈ సంవత్సరం వర్షాలు సంవృద్ధిగా ఉంటాయి. రైతులకు బాగుగా ఉంటుంది. ఆషాడంలో వర్షలు పడతాయి. రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికి వర్షలు పడతాయి. పంట నష్టం తక్కువగా ఉంటుంది. ఎర్ర భూములు పంట అద్భుతంగా పండుతాయి.
ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో కుంభకోణాలు భయటపడాయిని పండితులు చెబుతున్నారుు. భూమి కోనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని చెబుతున్నారు. ఈ సంవత్సరం సింధునదికి పుస్కరాలు వస్తాయి. ఈ ఏడాది గ్రహనాలు మన దేశంలో కన్పించేవి లేవుని పండితులు అంటున్నారు.
ప్లవ నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితములు
అశ్వని 1,2,3,4 పాదములు,
భరణి 1,2,3,4 పాదములు,
కృత్తిక 1వ పాదము
ఈ రాశి వారి ఆదాయం-8 వ్యయం-14 రాజయోగం -4 అవమానం-3గా ఉంటుంది. ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 5 నుంచి సెప్టెంబరు 14 వరకు,నవంబరు 20 నుంచి సంవత్సరాంతం వరకు కుంభంలో (లాభం) సంచరించి మిగిలిన కాలము అంతయు మకర రాశి (దశమం)లో సంచరించును. శని సంవత్సరం అంతయూ మకరంలో (దశమం) సంచరించును. రాహువు వృషభంలో (ద్వితీయం) కేతువు వృశ్చికంలో (అష్టమం) సంచరించెదరు.
శుభవార్తలు వింటారు. ఈ సంవత్సరం అధికకాలము గురు, రాహు, శని గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. శని సంచారము ఇబ్బంది లేదు. గురువు లాభరాశి సంచారం కాలములో జరిగే మంచి ఆర్థిక లావాదేవీలు సంవత్సరం అంతా కూడా మీకు అనుకూల స్థితిని కలుగచేయునవిగా ఉంటాయి. అంతేకాకుండా మధ్యమధ్యలో నెలకు ఒకసారి మారే రవికుజ శుక్రల సంచారం ప్రభావం చేత కూడా యింకా విశేషాలు అందే అవకాశం ఉంది.దైనందిన కార్యక్రమములు అన్నీ సవ్యంగా ఉన్నాయి. రోజురోజుకు అనుకూల స్థితి పెరగడం దృష్ట్యా మీకు భవిష్యత్తు మీద ఆశ జనియిస్తుంది. అందరి నుంచి ప్రోత్సాహం బాగా అందడమే కాకుండా కొత్త వ్యాపార అంశాలకు పాత వ్యవహార చికాకుల పరిష్కారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వ్యాపారులకు మంచి పోటీతత్వంతో వ్యాపారం నడిచి లబ్దిని అందుకునే కాలము.
కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. శ్రతృవులు కూడా మీత్రులుగా మారతారు, శుభకార్య ప్రయత్నాలలో వున్నవారికి అంతా అనుకూల వాతావరణమే. గ్రహచారం దృష్ట్యా పుణ్యక్షేత్రాలు సందర్శించడం, గురువులను, పూజ్యులను సందర్శించడం వంటి ఫలితాలు ఉంటాయి. . కోర్టు వ్యవహారములలో వున్న వారికి ఈ సంవత్సరం అంతా యిబ్బందికర అంశాలు ఎదురౌతాయి. అయితే విజయం వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి పనులు వేగవంతం అవుతాయి.
ఆరోగ్య విషయంలో అంతా అనుకూలమే అయితే కొత్తగా వచ్చే సమస్యలు ఏమీ ఉండవు కానీ హృద్రోగులు చర్మ వ్యాధులు వున్నవారు చిన్నచిన్న చికాకులు పొందే అవకాశం ఉంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం గత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగం చేయువారికి అధికారుల ప్రోత్సాహం, వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరం అవుతాయి.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
"ఓం నమో భగవతేతుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే" ఈ శ్లోక పారాయణ అధికంగా చేయుట ద్వారా గత సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నము సానుకూల స్థితి అందుకుంటారు.
వృషభ రాశి ఫలితములు
కృత్తిక 2,3,4 పాదములు
రోహిణి 1,2,3,4 పాదములు
మృగశిర 1,2 పాదములు
ఆదాయం-2 వ్యయం-8 రాజయోగం-7 అవమానం-3
ఈ సంవత్సరం అధికకాలము గురు కుజ గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. గురువు భాగ్యంలో ఉండగా నీచరాశి అయినను యోగ సంచారమే. రాహువు కేతువు సంచారం ప్రతిబంధకములను సృష్టించును. శని వలన లాభము ఉండదు నష్టము ఉండదు. ఈ రాశివారికి మిగిలిన గ్రహముల ప్రభావంగా ఎన్నిరకములైన ఒత్తిడి వున్ననూ దైనందిన కార్యక్రమములలో అంతా శుభసూచకమే ఉంటుంది. రాహువు మానసిక అధైర్యము, అశాంతి ఒత్తిడి కలుగచేస్తారు. అందరినీ అనుమానించే లక్షణం కలిగిస్తారు. వరి వ్యవహారములలో కలుగ చేసుకోవద్దు. ఒక్కోసారి ఆర్థిక లావాదేవీలు బాగా జరిగి మీరు చాలా ఆనందంగా కాలం గడుపుతుంటారు. ఒక్కోసారి ఎందుకు దుఃఖభరితమైనటువంటినీ, ఏదో తెలియని భారంతో కూడిన మనస్సుతో సంచరిస్తూ ఉంటారు కారణం ఉండదు. ఆదాయం రావలసిన స్థాయికి తగిన రీతిగా అందుకుంటారు. లాగే వ్యాపారులకు కూడా సత్ఫలితాలు అందుతాయి అనే చెప్పాలి. సంవత్సరం ద్వితీయ భాగం అన్ని పనులలో విఘ్నములు తప్పక ఏర్పడతాయి. కానీ ప్రతి సమస్యను తెలివిగా దాటవేయు అవకాశములు కూడా ఉంటూ ఉంటాయి.
విద్యార్థులు మనస్సు నిగ్రహించుకోవలసిన కాలము అలాగే ఫలితాలు సానుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది. విద్యానిమిత్తంగా విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి ఫలితాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలోను వున్నవారికి అధిక ఒత్తిడి ఉంటుంది. లాభం తక్కువ షేర్ వ్యాపారులు మరియు సరుకు నిల్వచేసి వ్యాపారం చేయువారు రాహు ప్రభావంగా మంచి లాభాలు అందుకోలేని స్థితి ఉంటుంది. కోర్టు వ్యవహారములలో వున్నవారికి రాహు కేతువులు సరిగాలేని ఈ కాలంలో మీరు మంచి సూచనలు చేసినా వాటిని అమలు చేయలేని స్థితిలో ఉంటారు. స్థానచలన ప్రయత్నాలలో వున్నవారికి మీ ప్రమేయం లేకుండా అనుకూలం లేని ప్రాంతం వెళ్ళవలసి ఉంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం ఉద్యోగ విషయంగా యిబ్బందులు లేని విధంగా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయంగా కూడా సమర్థంగా విధి నిర్వర్తిస్తారు. అయితే మీకు కోరికలకు తగిన విధంగా కాలక్షేపం జరగకపోవడం వస్తువులు అందకపోవడం మీకు చికాకులు యిస్తుంది.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
"సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే - శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే"
"అరుణాంకరుణా తరంగి తాక్షీం - ధృత పాశాంకుశ పుష్పబాణ చాపామ్"
"అణిమాదిభి రావృతాంమయూ భై: - అహమిత్యేవ విభావయే భవానీమ్"
మిథున రాశి ఫలితములు
మృగశిర 3,4 పాదములు
ఆరుద్ర 1,2,3,4 పాదములు
పునర్వసు 1,2,3 పాదములు
ఆదాయం-5 వ్యయం-5 రాజయోగం-3 అవమానం-6
ఈ సంవత్సరం అధిక కాలము భాగ్యంలో వుండే గురుగ్రహము అనుకూలము వలన కాలము నడుచును. మిగిలిన రోజులలో గ్రహచారం మాస వారి గోచార గ్రహాలు రవి శుక్ర బుధుల సంచారం వలన కొంత ఉపశమనం కలుగును. గత సంవత్సరాలలో జరిగిన నష్టాలకు ఈ సంవత్సరం మీరు పునరాలోచనలు చేసి ఎంత పొరపడ్డామో! అని బాధపడాల్సి వస్తుంది. మీరు ఎవరితోను వాదనలు సాగించవద్దు. రోజువారీ పనులు అస్తవ్యస్తంగా నడుచును. ఏవరిని నమ్మలో లేదో తెలియని పరిస్థితి, నమ్మదగినవారిని నమ్మకపోవడం వంటివి చేసి ఈ సంవత్సరం ఇంకా కొత్త కొత్త చికాకులు పొందుతూనే ఉంటారు. ఉద్యోగస్తులకు ఏ పని చేసినా గుర్తింపు రాకపోవడంతో నిరాశతో ఉంటారు. ఈ రాశివారికి గురువు కుంభంలో సంచారం చేయు కాలం అంతా రక్షణ చేస్తుంటారు. అనవసర భయాందోళనలు పెరుగుతాయి.
ఏప్రియల్ మే నెలల్లో చికాకులు సానుకూలం అవుతాయి.సంవత్సరాంతంలో కొన్ని కొత్త కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగించేవి కలుగుతాయి. విద్యా విషయముగా విదేశాలకు వెళ్ళేవారికి కుంభంలో గురువు వుండగా కాలం అనుకూలం. విదేశీ ప్రయాణ ఆలోచనలు ఏమీ చేయకుండా ఉంటే మంచిది. ఫైనాన్స్ వ్యాపారులు అధికైన జాగ్రత్తలు పాటింపవలసిన కాలము. విద్యార్థులు తరచుగా నిగ్రహం కోల్పోయే స్థితిలో ఉంటారు. రైతులకు జాగ్రత్తలు తీసుకోవలెనని ప్రత్యేక సూచన. కోర్టు వ్యవహారములలో వున్నవారికి మోసపూరిత వాతావరణం వెనుకనే ఉంటుంది. స్థానచలన ప్రయత్నాలలో వున్నవారికి యిబ్బందికర ఘటనలు ఎన్నో ఎదురౌతాయి.కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా చికాకులు తరచుగా రాగలవు అయితే కొన్ని సందర్భాలలో ముందు జాగ్రత్తలు పాటించి మంచి ఫలితాలు కూడా తీసుకుంటారు.
స్త్రీలకు ఈ సంవత్సరం శారీరకంగా యిబ్బందులు పెరిగే అవకాశం ఎక్కువ. గురువు కుంభంలో సంచారం చేయుకాలంలో కొన్ని ఉద్యోగ వ్యాపార అంశాలు అనుకూలం అవుతాయి. రోజు దక్షిణామూర్తి స్తోత్రం దుర్గా సప్తశ్లోకీ పారాయణ చేయండి.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
"మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన - శత్రూన్ సంహారమాంరక్ష శ్రియం దాపయమే ప్రభో" ఈ శ్లోకం తరచుగా పఠించడం వలన అష్టమ శని ప్రభావంగా రావలసిన కలహములు నివారింపబడి సుఖపడతారు.
కర్కాటక రాశి ఫలితములు
పునర్వసు 4వ పాదము
పుష్యమి 1,2,3,4 పాదములు
ఆశ్లేష 1,2,3,4 పాదములు
ఆదాయం -14 వ్యయం-2 రాజయోగం-6 అవమానం-౬
ఈ సంవత్సరం అధిక కాలము రాహువు కేతువు గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. ఇక్కడ నుంచి నాలుగు సంవత్సరాలు శని సంచారం బాగుండలేదు. శని సంచారం బాగుండినప్పుడు సహజంగా మీ కోరికలకు తగినరీతిగా మీ వ్యవస్థ ఉండదు. ఈ రాశివారి అదృష్టం ఏమిటి అంటే కొన్నాళ్ళు గురువు కొన్నాళ్ళు రాహువు యితర గ్రహాలు అలాగే యోగిస్తున్న కారణంగా సమస్యలు దాటవేయు అవకాశములు పొందుతారు.అద్భుతమైన గ్రహముల కలయిక వలన కాలం గడుచును. కంగారు పడవద్దు. సహజంగా ఉద్యోగ విషయాలు శోధిస్తే మీకు యితరుల సహకారం బాగుంటుంది.
ఏప్రిల్ మాసత్రయంలోను మీరు తొందరపాటుగా మాట్లాడడం వంటివి చేసి కొన్ని చికాకులు తెచ్చుకుంటారు. ఆదాయం సాధారణ స్థాయిగా అందుతుంది. ఖర్చులు అధికంగా ఉంటుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. విద్యా విషయంగా విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు అయినా పనులు పూర్తి అవుతాయి కానీ ధనవ్యయం కాల విలంబం ఎక్కువ అవుతుంది. కన్స్ట్రక్షన్ రంగంలోను, రియల్ ఎస్టేట్ రంగంలో వున్నవారు శ్రమ ఎక్కువ చేసి సత్ఫలితాలు అందుకుంటారు. ఫైనాన్స్ వ్యాపారులు ధైర్యంగా వ్యాపారం చేసి వ్యవహారములు సానుకూలం చేసి కొన్ని సత్ఫలితాలు అందుకుంటారు. శుభకార్య ప్రయత్నాలలో ఆలస్యం చోటు చేసుకుంటుంది. మీరు మొండిధైర్యం ప్రదర్శించి, ధనవ్యయం అధికంగా చేసి పనులు పూర్తి చేసుకోవాలి అని ప్రయత్నిస్తారు.
కోర్టు వ్యవహారములలో వున్న వారికి గురువుబలం లేదు. సలహాలు సరియగు విధంగా అందవు. అయితే మీరు ధైర్యంగా ప్రతిపనీ చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి పనులు ఆలస్యం అవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. ఫలితాలు సంబంధం లేకుండా ధైర్యంగా ప్రయత్నిస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు చాలా చక్కగా నడుచును. అందరూ సహకారం చేస్తారు. ధనవ్యయం ఎక్కువ. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలకు ఈ సంవత్సరం శారీరక రక్షణ విషయంలో తెలివిగా జాగ్రత్తగా వ్యవహరించి ఆరోగ్యం కాపాడుకుంటారు. ఉద్యోగ నిర్వహణ, కుటుంబ విషయాలు సమర్థంగా గడుపుతారు. అయితే ఈ రాశికి చెందిన వ్యాపారులైన స్త్రీలు యిబ్బందులకు గురి అవుతారు.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
"కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకోయమః శౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః"
"నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజమ్ - ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ "
సింహ రాశి ఫలితములు
మఘ 1,2,3,4 పాదములు
పుబ్బ 1,2,3,4 పాదములు
ఉత్తర 1వ పాదము
ఆదాయం -2 వ్యయం-14 రాజయోగం-2 అవమానం-2
ఈ సంవత్సరం అధికకాలము శని రాహువు గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. శని సంచారం బహు అద్భుతంగా ఉంటుంది. అనంతరం శని వలన అనుకూలం కాదు. ఈ నేపథ్యంలో దీర్ఘకాల సమస్యలు ఉన్నవారు క్షణం వృథా చేయ కుండా సమయం సానుకూలం చేసుకోవాలి. మీరు ఎవరినయితే మీ స్వంతవారు అని భావిస్తారో వారు మీ యొక్క నిజ అవసరాలకు సంబంధించిన సమయంలో సహకరించరు. మీరు ఎవరిమీదా ద్వేషపూరిత మనస్సును ప్రదర్శింపవద్దు.
భోజన సౌకర్యం బాగుంటుంది. ప్రతి వ్యవహారమూ నడిపే ప్రయత్నంలో శరీరం మనస్సు బాగా సహకరిస్తాయి. కానీ ఆర్థిక వనరులు సరిగా సమకూరవు. ఆదాయం తక్కువ స్థాయిగాను ఖర్చులు అధిక స్థాయిలోను ఉంటాయి. అధికారులు బాగా సహకరిస్తారు. తద్వారా ఉద్యోగ వ్యాపార విషయాలలో అనుకూలస్థితి ఉంటుంది. అనుకున్న ఫలితాలు వృత్తి విషయంలో అందుకుంటారు. సాంఘిక కార్యకలాపాల ద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువైరం జ్ఞాతివైరం వంటి వాటికి పరిష్కారం లభిస్తుంది. మస్యలకు భయపడకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గురువు మకరంలో ఉండగా చోరభయం ఉంటుంది.
మీ జన్మ స్థలంలోని విశేష దేవాలయములు సందర్శించే ప్రయత్నిస్తే అది అనుకూలం పెంచుతుంది. భవిష్యత్కు అనుకూల స్థాయి పెరుగుతుంది. ఉద్యోగ విషయంగా విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారి విషయమై శని రాహువుల అనుకూల సంచారం లాభ ఫలితాలనే సూచిస్తోంది. పుణ్యక్షేత్ర సందర్శన చేయు సంకల్పం వున్నవారు శని రాహువుల అనుకూలం దృష్ట్యా మంచి ఫలితాలు అందుతాయి. కోర్టు వ్యవహారములలో వున్న వారికి ప్రత్యక్షంగా శత్రువులతో లావాదేవీలు జరుగక మధ్యవర్తుల ద్వారా వ్యవహారం జరిగి కార్యలాభం చేకూరగలదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి.
స్త్రీలకు ఈ సంవత్సరం భర్త నుంచి, భర్త తరఫు బంధువుల నుండి ప్రోత్సాహం, సహకారం బాగా లభిస్తుంది. మీ యొక్క తోటి ఉద్యోగుల సహకారం దృష్ట్యా, ఉద్యోగ లాభం చేకూరుతుంది. వ్యాపారస్తులైన స్త్రీలు శ్రమతో కూడుకొని మంచి ఫలితాలు అందుకుంటారు.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
"ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం - సకల భువననేత్రం నూత్న రత్నోపధేయమ్ - తిమిరకరి మృగేంద్రం
బోధకం పద్మినీనాం - సురవర ముభివన్ద్యం సుందరం విశ్వరూపమ్"
కన్యా రాశి ఫలితములు
ఉత్తర 2,3,4 పాదములు
హస్త 1,2,3,4 పాదములు
చిత్త 1,2 పాదములు
ఆదాయం-5 వ్యయం-5 రాజయోగం-5 అవమానం-2
ఈ సంవత్సరం అధిక కాలము పంచమ గురువు / కేతు తృతీయ కాల గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. గతం కంటే ఆశాజనకంగా కాలం వుంటుంది. అయితే సంవత్సరాంతంలో ఫలితాలు చూసుకుంటే ఏమి సాధించలేదు కదా! అనే భావన కలుగుతుంది. స్థిరాస్తికి సంబంధించిన వ్యాజ్యములు వున్నవారికి ఈ సంవత్సరం అనుకూలం తక్కువ. ఎవరి విషయాలలో కలుగచేసుకోకుండా కేవలం వారి స్వకార్యములు మాత్రమే చేసుకునేవారు సుఖించే అవకాశం ఉంటుంది. బంధువులతో జ్ఞాతులతో ఆస్తి వ్యవహారముల విషయంగా చర్చలు సాగింపవద్దు. వారితో ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. అలాగే బంధువులతో కలిసి చేయు వ్యాపారాలతో బహు జాగ్రత్త అవసరం.
దూకుడుతునం పనికిరాదు. ఎవరిమీదా ఆధారపడి ఏ పనీ చేయవద్దు అని సూచన. మౌనం పెద్ద రక్షణ చేయు ఆయుధం, తరచుగా వృత్తి విషయంలో తోటివారి సహకారం తగ్గడం, అధికారుల ఒత్తిడి ఎక్కువ అవుతాయి. మకరంలో గురువు సంచారం చేయుకాలంలో బంధువులు స్నేహితులు సహకారం బాగుంటుంది. విద్యావిషయంగా విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి మకరంలో గురువు ఉండగా కాలం అనుకూలము. అయితే ఉద్యోగ విషయంగా వెళ్ళేవారి విషయంలో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి.
స్త్రీలకు ఈ సంవత్సరం అన్ని కోణాలలోను జాగ్రత్తలు పాటింపమని సూచన. కుటుంబ విషయంలో సానుకూల స్థితి పెరుగుతుంది. అయితే ఆరోగ్య విషయంలోను ఉద్యోగ వ్యాపార విషయంలోను అనుకూల స్థితి ఉండదు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉన్నది.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
"ఉత్తానితేకరతలే ప్యపసవ్యసవ్య, సోపాన సదృశైరుపరి స్వనాభేః ప్రసార్య చర్మవసనం భసితాంగ రాంగం, మంత్రేణ తంభజతరక్త జటా కలాపమ్"
"శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం - దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజమ్ " శ్లోకద్వయం పారాయణం శుభం కలుగుతుంది.
తులా రాశి ఫలితములు
చిత్త 3,4 పాదములు
స్వాతి 1,2,3,4 పాదములు
విశాఖ 1,2,3 పాదములు
ఆదాయం-2 వ్యయం-8 రాజయోగం-1 అవమానం-౫
ఈ సంవత్సరం అధిక కాలము గురు బుధ శుక్ర గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. అసంతృప్తి విడనాడవలెను. అసంతృప్తి మీకు ప్రతి అంశంలోను ప్రతిరోజు మిమ్మల్ని వెంబడించి చాలా చికాకులు తీసుకువస్తుంది. అష్టమ రాహు అర్ధాష్టమ శని మీ ఫలితాలను సానుకూల ధోరణి నుండి దూరం చేస్తున్నప్పటికీ గురుబలం దృష్ట్యా ఈ సంవత్సరం నష్టపోకుండా కాలక్షేపం చేయగలుగుతారు. మీరు చేయవలసిన ఉద్యోగ విధి నిర్వహణ సరిగా చేయకపోవడం - తద్వారా చికాకులు రాకుండా మీ స్నేహితులు సహకారం చేయడం జరుగుతుంది.
అధికారులు మీ ఉద్యోగ వ్యాపార విషయాలలో తరచుగా యిబ్బందులు కలుగచేస్తారు. మీరు తెలివిగా దాటవేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయములే కాక యితర విషయములను గురించి కూడా అనవరస ప్రమాణములు చేస్తుంటారు. విజ్ఞాన వినోద కార్యక్రమముల యందు అధికంగా పాల్గొంటారు. కొన్నిసార్లు మీ సలహా, మీ సహకారం ఫలించి లబ్ది పొందినవారు మిమ్మల్ని అధికంగా గౌరవిస్తారు. కన్స్ట్రక్షన్ రంగంలోను రియల్ ఎస్టేట్ రంగంలోను వున్నవారికి లేబర్ ప్రాబ్లమ్, మధ్యవర్తుల వలన చికాకులు బాగా పెరుగుతాయి. ఫైనాన్స్ వ్యాపారులకు శని రాహువుల ప్రభావంగా మోసపూరిత వాతావరణం అధికమని చెప్పాలి. కోర్టు వ్యవహారములలో వున్నవారికి ప్రతి విషయంలో మీరు తెలివిగా ప్రవర్తించినా మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా ఉండకపోవడం చేత కార్యసాఫల్యం ఆలస్యం అవుతుంది.
స్త్రీలకు ఈ సంవత్సరం విచిత్రమైన స్థితి ఉంటుంది. బుద్ధి వికాసం సందర్భానుసారంగా నడవదు. ఉద్యోగ విషయాలలో శ్రమచేసి పనులు పూర్తి చేసినా గుర్తింపు అందుదు. వ్యాపారంలో వుండే స్త్రీలకు సానుకూల స్థితి తక్కువ. కుటుంబ వ్యవహారములతో అంతా శుభపరిణామాలే ఉంటాయి.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
"ఓం నమో భగవతే పంచవదనాయ మహాబల ప్రచండాయ |
మహాభీమ పరాక్రమాయ సకల బ్రహ్మాండ నాయకాయ . సకల భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ యక్షిణీ పూతనా మహామారీ సకల విఘ్న నివారణాయ సకల శత్రు సంహారణాయ స్వాహా"
వృశ్చిక రాశి ఫలితములు
విశాఖ 4 వ పాదము
అనురాధ 1,2,3,4 పాదములు
జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
ఆదాయం-8 వ్యయం-14 రాజయోగం -4 అవమానం-5
ఈ సంవత్సరం అధిక కాలము శని కుజ గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. చికాకులు పోగొట్టుకుంటారు. ఎక్కువ అవకాశములు వస్తాయి. అయితే మీకు ఒక రకమైన భయము నిరుత్సాహం వెంబడించి పనులు ప్రారంభించకుండా ఆగిపోతారు. నష్టములు వచ్చే అవకాశములు లేని పనులు కూడా మీరు పొరపాటుగా వదిలివేయు అవకాశం ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉంటారు. శని కుజ సంచారం అనుకూలం దృష్ట్యా ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తే కచ్చితంగా కార్య విజయమే లభిస్తుంది. ఈ రాశివారు ఎవరైతే ఓర్పుగా వ్యవహరిస్తారో వారికి లాభాలు.ఉద్యోగం విషయంలో దూకుడు పనికిరాదు. ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది. గుర్తింపులేని జీవితం గడుపుతారు.
మీకు కుటుంబ, ఉద్యోగ వ్యాపార విషయాలలో బాగా అనుకూలిస్తారు. యిక ఆదాయం చాలా బాగా సిద్ధిస్తుంది. కానీ ఖర్చులని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. దైవ సంబంధమైన కార్యములు చేయువారికి కొంత ఉపశమనం లభిస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు కచ్చితంగా సానుకూలమే అవుతాయి. వ్యాపారులు మరియు సరుకులు నిల్వచేసి వ్యాపారం చేయు వారికి సామాజిక స్పృహ అధికంగా వుండి. దూకుడుతనం తగ్గించి ముందుకు వెడితే శుభపరిణామాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు మరియు పుణ్యక్షేత్ర సందర్శన పుణ్యకార్య విషయాల యందు అన్ని కోణాలలోను సానుకూల వాతావరణమే ఉంటుంది. కోర్టు వ్యవహారములలో వున్నవారికి రాహు కేతువుల ప్రభావం సరిగా లేకపోవడం చేత మీరు ఎవరినీ నమ్మలేని స్థితి ఏర్పడి కార్య నష్టాలకు దారితీయును. జాగ్రత్త పడండి.
స్త్రీలకు ఈ సంవత్సరం ఉద్యోగ విషయాలలో శ్రమ ఎక్కువ అవుతుంది కానీ లాభాలు అందుకుంటారు. అదేరీతిగా వ్యాపార విషయాలలో కూడా శుభ ఫలితాలు అందుకుంటారు. అయితే కుటుంబ విషయంలో మంచి ఫలితాలకు కుటుంబ సభ్యుల సహకారమునకు అవకాశం తక్కువ.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
శ్రీమన్నృసింహ విభవే గరుడ ధ్వజాయ - తాపత్రయో పశమనాయ భవౌషధాయ - తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ - క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే. ఈ శ్లోక పారాయణ చేయుట ద్వారా సమస్యలను దూరం చేసుకోగలుగుతారు.
ధనూరాశి ఫలితములు
మూల 1,2,3,4 పాదములు
పూర్వా షాఢ 1,2,3,4 పాదములు
ఉత్తరాషాఢ 1వ పాదము
ఆదాయం-11 వ్యయం-5 రాజయోగం-7 అవమానం-౫
ఈ సంవత్సరం అధిక కాలము రాహువు మకర గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. ఏలినాటి శని మూడవభాగం నడుచుచున్నది. అయితే గురు రాహువు సంచారం అనుకూలం దృష్ట్యా మీకు ఎటువంటి యిబ్బందులు వుండవు.ఒక విచిత్రమైన అనుభూతులు కలిగే అవకాశం ఉన్న కాలము. ఆరవ యింట వున్న రాహువు శత్రువుల మీద విజయం సాధించే అవకాశములు యిస్తుంటారు. అలాగే ప్రశాంతచిత్తంతో నడిచి విజయాలు సాధించే అవకాశం యిస్తారు. కొన్నిచోట్ల ధైర్యం ప్రదర్శిస్తారు. సందర్భానుసారంగా వ్యవహరిస్తారు.
గురువు కుంభంలో ఉండగా శ్రమతో కూడి పనులు పూర్తి అవుతాయి. కానీ కార్య నష్టములకు అవకాశం లేదు. గురువు మకరంలో వుండగా ఫలితాలు పూర్తిగా అనుకూలమే. సుఖజీవనం చేస్తారు. ధర్మ కార్యములు చేయడం తద్వారా చక్కగా ఆనందించడం జరుగుతుంది. ఏలినాటి శని దృష్ట్యా మీరు ప్రతిపనినీ స్వయంగా చేసుకోవడం ద్వారా ఉద్యోగ విషయంలో లాభదాయకం అవుతుంది. ఏలినాటి శని చివరికాలంలో ఆయన అనుకూలిస్తారు. శని జీవనోపాధి కారకుడు. ఉద్యోగ వ్యాపార విషయాలు విడిచి కొత్త ప్రయత్నాలు చేయవద్దు అని ప్రత్యేక సూచన. శని ప్రభావం పెద్దగా విద్యకు అవరోధం కాదు. రైతులకు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి అనే చెప్పాలి.
స్త్రీలకు ఈ సంవత్సరం ఆరోగ్య విషయంగా జాగ్రత్తలు పాటించాలి. పనులు ఆలస్యం అవుతాయి. కానీ ఉద్యోగ విషయంగా కుటుంబ విషయంగా మీరు సమన్యాయం చేయలేక యిబ్బంది పడతారు. వ్యాపారం చేయువారు ఆర్థిక లావాదేవీలు సరిగా నడవక యిబ్బందులకు గురి అవుతారు.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
అరుణారుణపంకజే నిషణ్ణః కమలాభీతి వరాన్కరైర్దధానః స్వరుచాహిత పంకజస్త్రి నేత్రో రవిరాకల్ప శతాకుతో వాహ్నః 2. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజమ్. ఈ శ్లోకపారాయణ మీకు శాంతినియిస్తుంది.
మకర రాశి ఫలితములు
ఉత్తరాషాఢ 2,3,4 పాదములు
శ్రవణం 1,2,3,4 పాదములు
ధనిష్ఠ 1,2 పాదములు
ఆదాయం-14 వ్యయం-14 రాజయోగం-3 అవమానం-౧
ఈ సంవత్సరం అధిక కాలము గురు కేతువు గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. ఏలినాటి శని అని భయపడకండి. చాలావరకు సమస్యలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న కాలము. చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో లాభాలు అధిక స్థాయిగా వస్తాయి. ఉద్యోగ విధి నిర్వహణ మీరు ఎంత బాగా చేసినా గుర్తింపురాదు. అంతేకాక తోటి ఉద్యోగులు, పై అధికారులు తరచుగా ఆగ్రహిస్తారు. మరికొన్ని సందర్భాలలో వీరే చాలా బాగా సహకరించి మిమ్మల్ని వృత్తిపరమైన సమస్యల నుండి బయటపడవేస్తారు. వ్యాపారులకు ఆశించిన మేర శుభ పరిణామాలు అందవు.
ఈ సంవత్సరం ఏ విషయంలోనూ యితరులతో పోలిక అనవసరము. మనకు మంచి ఫలితాలు ఉన్నాయా? లేదా? అని చూసుకుంటే సుఖపడతారు. ఆదాయం కొన్నిసార్లు బాగుండి కొన్నిసార్లు చికాకులను కలిగిస్తూ ఉంటుంది. ఖర్చులు నియంత్రించలేని పరిస్థితి ఉంటుంది. ఏదో ఒకరకంగా తెలివితేటలు పనిచేయక పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. జూలై, జూన్, ఆగస్టు, సెప్టెంబరు మాసాలలో కుజ సంచారం అనుకూలం లేని రోజులలో అందరితో కలహాలు బాగా పెరుగుతాయి.
రైతులకు శ్రమ ఎక్కువ అయితే ఫలితాలు బాగుంటాయి. అందరూ సహకరిస్తారు. కోర్టు వ్యవహారములలో వున్నవారికి పనులు బాగా ఆలస్యం అయినా మీ శ్రేయోభిలాషుల వలన మీరు రక్షణాత్మకంగా ఉంటారనే చెప్పాలి. స్త్రీలకు ఈ సంవత్సరం జూన్ దగ్గర నుండి నాలుగు మాసాలు ఏవిధమైన జాగ్రత్తలు పాటింపలేక పనులు సమర్థంగా చేయలేక యిబ్బంది పొందుతారు. అయితే మిగిలిన కాలం అంతా చాలా చక్కగా పనులు చేసుకొని మంచి జీవనం చేయు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా బాగా ఉంటుంది.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
బాలాంకుండీంచ ఢమరుం శూలం శంఖం సుదర్శనం- దధానం భక్త వరదం దత్తాత్రేయం నమామ్యహం
ఓం నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే - వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాంపతయే నమః అనే ఈ రెండు శ్లోకాలు పారాయణం చేయాది. దీని ద్వారా మీకు ప్రశాంతత చేకూరుతుంది.
కుంభ రాశి ఫలితములు
ధనిష్ఠ 3,4 పాదములు
శతభిషం 1,2,3,4 పాదములు
పూర్వాభాద్ర 1,2,3 పాదములు
ఆదాయం-14 వ్యయం-14 రాజయోగం-6 అవమానం-1
ఈ సంవత్సరం అధికకాలము కేతువు, బుధుడు గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. ఏలినాటి శని చాలా విచిత్రాలు ఎదురౌతాయి. ఈ రాశివారు గోచారం తెలుసుకొని భయపడడం కంటే మంచి ప్రణాళికా బద్ధంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తే మంచిది. అలాగే సంవత్సరం చివరి రోజులలో కూడా కుజసంచారం బాగా లేదు.సహజంగా మకర కుంభరాశులలో సంచారం చేయు శని మకర కుంభరాశుల వారిని యిబ్బంది పెట్టరు అని నానుడి. అందరితో కలహములు పెరుగుతాయి. సకాలంలో విధి నిర్వహణ చేయలేక ఉద్యోగ భంగం పొందినా ఆశ్చర్యం లేదనే చెప్పాలి.
వ్యాపారులకు కూడా సంతృప్తికరంగా వ్యాపారం లేకపోగా ఆర్థిక లావాదేవీలు వ్యాపారాన్ని యిబ్బంది పెడతాయి. ఈ సంవత్సరం ఆదాయం తక్కువ ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రతిపనిలోను విశేషమైన ఖర్చులు ఉంటాయి. ప్రమాణ విఘ్నములు ఎక్కువ సమాజంలో బంధువులలో తోటి స్నేహతులలో మిమ్మల్ని అర్థం చేసుకునే వారు తక్కువ. కుంభంలో గురువు వున్న కాలములో కొంతవరకు అనుకూలము వున్నది. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగాలలో వ్యాపారం చేయువారు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా ఉంటే మంచిది.
విద్యార్థులు బహుశ్రద్ధ ప్రదర్శించవలసిన కాలము. ఏలినాటి శని మిమ్మల్ని దారి తప్పిస్తుంది. కోర్టు వ్యవహారములలో వున్నవారికి ఏ పనీ పూర్తి అవ్వద్దు. మీరు ఎవరి వలననూ సరియగు సహకారం సూచనలు పొందలేరు. శ్రమతో కార్యలాభం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి చికాకులు అధికం అవుతాయి. అసలు కొన్ని సందర్భాలలో ఆలోచనలు విరమించే పనిచేస్తారు.
స్త్రీలకు ఈ సంవత్సరం ప్రతిపనీ మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రత్యేకంగా మరొక సూచన ఏమంటే ఉద్యోగ విషయంలో బహుశ్రద్ధ ప్రదర్శించడం. కుటుంబ వృత్తి విషయాలు సమతూకంగా నిర్వహించలేరు. యిబ్బందికర ఘటనలు ఎక్కువ. పుణ్యకార్యములు శుభకార్యములు చేస్తూ ఉంటారు.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
వందేవానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్రాంచితం - నానాలంకరణం త్రిపచనయనం దేదీప్య మానం రుచా - హస్తాబ్జెరసిఖేట పుస్తుకసుధా కుంభాంకుశాద్రీన్ హలం - ఖట్వాగం ఫణి భూరుహంచ దథతం దేవారి గర్వాపహం - ఈ శ్లోక పఠనం మీకు భవిష్యత్ మీద ఆశను కలిగిస్తుంది.
మీన రాశి ఫలితములు
పూర్వాభాద్ర 4 వ పాదము
ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు
రేవతి 1,2,3,4 పాదములు
ఆదాయం -11 వ్యయం-5 రాజయోగం-2 అవమానం-4
ఈ సంవత్సరం అధిక కాలము శని, గురువు గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. సెప్టెంబరు నుండి నాలుగు మాసములు కుజుడు అనుకూలింపక అదే సమయంలో గురువు వ్యయంలో కుంభంలో సంచారం చేయుకాలము మాత్రమే యిబ్బందికరము. మిగిలిన కాలము అంతా అనుకూలముగా ఉంటుంది. అన్ని కోణాలలోను శ్రమకు తగిన ఫలితాలు చక్కగా అందుతాయి. ప్రతి విషయంలోను అందరి నుండి మంచి సూచనలు సహకారము లభిస్తుంది. ముఖ్యంగా దైనందిన కార్యక్రమములు చక్కగా నిర్వహింపబడి మీ వలన ఎవరికీ యిబ్బంది లేకుండా మీరు సుఖంగా జీవనం చేయుటకు అనుకూలమైన కాలము నడుచుచున్నది.గురువు మకరంలో వున్నకాలం అంతా ఎంతో లాభదాయకంగా కాలక్షేపం జరుగుతుంది. అవివాహితులకు గురువు మకరంలో సంచారంలో ఉండగా శుభపరిణామాలకు అవకాశం ఉంటుంది.
విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు చాలావరకు సానుకూలమే. అందులోను విద్యాపరంగా వెళ్ళేవారికి సంవత్సరం అంతా అనుకూలమే. అలాగే ఉద్యోగ విషయంగా విదేశాలలో ప్రయత్నాలు చేయువారికి గ్రహచారం అనుకూలంగా కనబడుతోంది. అందరూ సహకరిస్తారు. ఈ సంవత్సరం సమస్యలు తీర్చుకొని కొత్త కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉన్నది. రైతులకు కాలం అనుకూలమే కానీ సంవత్సరాంతంలో ధనం వెసులుబాటు తగ్గుతుంది. కోర్టు వ్యవ హారములలో వున్నవారికి కార్యసాఫల్యం లక్షణాలు గోచరిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాలలో అనవసర భయము, ధనవ్యయము గోచరిస్తున్నాయి. తగు జాగ్రత్తలు అవసరం.
ఆరోగ్య విషయంలో యిబ్బందులు ఏమీ వుండవు అనే చెప్పాలి. కుంభంలో గురువు వుండగా కుజుడు సెప్టెంబర్ నుండి కన్య తుల రాశులలో సంచారం చేయు కాలంలో యిబ్బంది పెరిగే అవకాశం ఉంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం అంతా శుభపరిణామాలే. అందరితో స్నేహంగా ఉంటూ చాలావరకు కార్యములు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెడతారు. ఉద్యోగంలో వృద్ధి వ్యాపారంలో అభివృద్ది కుటుంబపరంగా అంతా విజయమే ఉంటాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడం వంటివే కాక సంతృప్తికర జీవనం సాగిస్తారు.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
"నమోస్తు రామాయ సలక్ష్మణాయ - దేవ్యైచ తస్యై జనకాత్మజాయై - నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో - నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః"
– ఈ శ్లోకం అధిక సంఖ్యలో పారాయణ చేయుట ద్వారా శుభ పరిణామములు చేరువ అవుతాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire