మ‌హిమాన్వితం తిరుచానూరు ప‌ద్మ‌పుష్క‌రిణి

మ‌హిమాన్వితం తిరుచానూరు ప‌ద్మ‌పుష్క‌రిణి
x
Highlights

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వ‌ద్ద గ‌ల పుష్క‌రిణి అత్యంత మ‌హిమాన్విత‌మైంది. . సాక్షాత్తు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు కుంత‌ల‌ము అనే ...

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వ‌ద్ద గ‌ల పుష్క‌రిణి అత్యంత మ‌హిమాన్విత‌మైంది. . సాక్షాత్తు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు కుంత‌ల‌ము అనే ఆయుధంతో పుష్క‌రిణిని త‌వ్వార‌ని, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు ఈ పుష్క‌రిణిలో ఆవిర్భ‌వించార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంత‌టి విశిష్ట‌మైన పుష్క‌రిణిలో జూన్ 13 నుండి 17వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వార్షిక తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం ప‌ద్మ‌పుష్క‌రిణిలో నీటిని నింపి సిద్ధం చేశారు. శోభాయ‌మానంగా విద్యుత్ అలంక‌ర‌ణ‌లు చేప‌ట్టారు.

ఇదీ పద్మావతీ అమ్మవారి దివ్యకథ!

శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లో పాద్మపురాణం ఒకటి. ఇందులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భావాన్ని వివరించారు. వైకుంఠ లోకంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు శయనించి ఉండగా యజ్ఞానికి ఫలితమిచ్చే దైవం కోసం సప్తఋషులు వెతుకుతూ వచ్చారు. స్వామివారు యోగనిద్రలో ఉండి భృగుమహర్షిని చూడలేదు. కోపించిన భృగుమహర్షి స్వామివారి వక్షస్థలంపై తన్నారు. స్వామివారి వక్షస్థలంలో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారు ఆగ్రహం చెంది పాతాళలోకానికి వెళ్లిపోయారు. స్వామివారు కూడా అమ్మవారిని వెతుక్కుంటూ పాతాళలోకానికి వచ్చారు. అమ్మవారి ఆచూకీ కోసం భూమాత సహకారం తీసుకుని 56 దేశాలు తిరిగారు. అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన కొల్హాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని స్వామివారు దర్శించి పూజలు చేశారు. ఆ సమయంలో ఆకాశంలో అశరీరవాణి వినిపించింది. ''స్వర్ణముఖి నదీతీరానికి వెళ్లి బంగారు పుష్పాలను తీసుకొచ్చి పూజలు, తపం చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు'' అని తెలిపింది. స్వామివారు స్వర్ణముఖి నదీతీరానికి చేరుకుని 'కుంతలము' అనే ఆయుధంతో పుష్కరిణిని తవ్వారు. వాయుదేవున్ని పిలిచి ఇంద్రుని అనుమతితో స్వర్గలోకం నుంచి బంగారు పుష్పాలను తీసుకురావాలని ఆదేశించారు. స్వర్ణ కమలాలు వికసించేందుకు వైఖానసాగమోక్తంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించారు. స్వామివారు క్షీరం(పాలు)ను మాత్రమే ఆహారంగా తీసుకుని 12 సంవత్సరాల పాటు శ్రీమంత్ర జప తప అర్చన చేశారు. 13వ సంవత్సరం కార్తీక మాసంలో శుక్ల పక్షం, ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం పంచమి తిథినాడు శ్రీపద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు. 108 దివ్యదేశాల్లో అమ్మవారు స్వామివారి కోసం తపస్సు చేసినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉంది. తిరుచానూరులో మాత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కోసం శ్రీనివాసుడు తపస్సు ఆచరించినట్టు శ్రీ పాద్మపురాణంలో ఉండడం విశేషం.

5 రోజుల పాటు తెప్పోత్సవాలు

ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు. జూన్ 13వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీసుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అమ్మవారికి జూన్ 16వ తేదీ రాత్రి గజవాహనం, 17వ తేదీ రాత్రి గరుడ వాహనసేవలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా జూన్ 13 నుండి 17వ తేదీ వరకు అమ్మవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories