Mysore Chamundeshwari Temple: అమ్మవారి ఆలయాల్లో ఎంతో ప్రసిద్ది గాంచిన మరో ఆలయం మైసూర్ చాముండేశ్వరి ఆలయం. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి.
Mysore Chamundeshwari Temple: అమ్మవారి ఆలయాల్లో ఎంతో ప్రసిద్ది గాంచిన మరో ఆలయం మైసూర్ చాముండేశ్వరి ఆలయం. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గ అని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ చాముండేశ్వరి దేవాలయం కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని మైసూరు ప్యాలెస్కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై ఉంది. మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ, కుల దేవతగా ఆరాధీస్తూ, ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు.
ఆలయ చరిత్ర..
ఈ పుణ్యక్షేత్రాన్ని 12 వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని భావిస్తున్నారు. ఈ దేవాలయ గోపురాన్ని బహుశా 17 వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు. 1659లో 3000 అడుగుల కొండ శిఖరానికి వెయ్యి మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. ఆలయం వద్ద అనేక నంది చిత్రాలు ఉన్నాయి. కొండ మీద 800 వ మెట్ల వద్ద ఒక చిన్న శివాలయం ముందు ఒక పెద్ద నల్లరాతి నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం 15 అడుగుల ఎత్తుతో, 24 అడుగుల పొడవుతో ఉంది. ఈ నంది విగ్రహం మెడ చుట్టూ చాలా అందమైన గంటలు చెక్కబడి ఉన్నాయి.
ఈ ఆలయానికి 1761-82 మధ్యకాలంలో మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. ఈ సంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారు.
నవరాత్రి ఏడవ రోజున చాముండీ దేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి 12 రోజులు అన్ని ఆభరణాలను దేవికి అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్లీ ఖజానాకు తరలిస్తారు. చాముండీ దేవికి ధరింపజేసే ఆభరణాలలో కొన్ని శ్రీకంఠ్‌దత్ నరసింహరాజ ఒడయార్ తన వద్ద ఉంచుకొని, వీటిని దసరా సందర్భంలో దేవస్థానానికి సమర్పిస్తూ రావటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న 12 ఆభరణాలు, ఒడయార్ వద్ద ఉన్న 34 ఆభరణాలు మేలి బంగారు, వెండి, వజ్రాలు, ముత్యాలు, రత్నాలతో పొదగబడి ఉంటాయ. చామరాజ ముడి, కర్ణపత్రం, డాలు, 3 పతకాలు, ఖాసహారం, పచ్చల పతకం, జడ బిళ్ల, జడ సరాలు వంటివి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఒడయార్ దగ్గర వజ్ర ఖచితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటా హస్త, కవచ కలశం, డమరుకం, ఖడ్గ హస్తం, కోటి హస్తం మొదలైన ఆభరణాలు ఉన్నాయి. 1971-72 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం ఒడయార్ ప్రభువుల నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకోవటంతో అప్పటి మహారాజు జయచామరాజ్ ఒడయార్ దసరా ఉత్సవాలను నిర్వహించలేదు. సింహాసనంపై పట్టాతో ఉన్న కత్తిని వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ దసరా ఉత్సవాలను ప్రజలే నిర్వహించటానికి కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు పెట్టెలలో ఉన్న చాముండేశ్వరి ఆభరణాలను ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ ఒక పెట్టెను మాత్రమే ఇవ్వడం జరిగింది. దీంట్లో 12 రకాల ఆభరణాలు ఉన్నాయి. మరొక పెట్టె ఒడయార్ దగ్గర ఉండిపోయింది. తమ దగ్గర ఉన్న ఆభరణాలను ప్రతి సంవత్సరం నవరాత్రులలోని 7వ రోజు ఒడయార్ వంశీకులు చాముండేశ్వరి దేవాలయానికి సమర్పిస్తారు.
ఆ ఆభరణాలను మూల విరాట్ విగ్రహానికి అలంకరించరు. మూల విగ్రహానికి పలు ఆభరణాలైన డాలు, కవచం నిత్యం ఉంటాయి. విశేషమైన ఆభరణాలను మాత్రం ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు. దీంతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులు చూడటానికి అవకాశం ఉంటుంది.
కుల దేవత చాముండీ దేవి సకల ఆభరణాలను మైసూరు మహారాజులే ఇస్తూ వచ్చారు. ముమ్మడి కృష్ణరాజు ఒడయార్ చాముండీ దేవికి పరమ భక్తులు. కుల దేవత ప్రీత్యర్థం నవరత్నాల పేరుతో తొమ్మిది సార్లు సేవలు చేసేవారు. నక్షత్ర మాలిక అనే విశేషమైన ఆభరణంతో దేవిని అలంకరించేవారు. దేవి ధరించే 27 పతకాల గురించి ఒక శ్లోకం రాశారు. ఆనాటి మహారాజులు దేవికి సమర్పించిన ఆభరణాల ఖరీదు ఎంత అనేది నిర్ధారించడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. చాముండీ దేవికి పచ్చల హారాన్ని చేయించారు. ముమ్మడి కృష్ణరాజు ఒడయార్ కాలంలో దీని ఖరీదును తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. బెంగుళూరులోని ప్రసిద్ధ వజ్ర వ్యాపారి చెప్పిందాన్నిబట్టి - మైసూర్ నగరాన్ని రెండుసార్లు వేలం వేస్తే ఎంత డబ్బు వస్తుందో ఆ మాత్రం డబ్బు కూడా ఈ హారానికి సరిపోదని అభిప్రాయపడ్డారు.
ఆలయ విశేషాలు..
సంవత్సరాని కొక్కసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు. తల మీదున్న చామరాజ ముడి (కిరీటం), కంఠాభరణాలతో, కర్ణ పత్రాలతో, 3 పతకాలు, హారం, 28 మణులను పొదిగిన కంఠి, జడ పిన్నులు, జడ బిళ్ల, వజ్ర ఖచితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటా హస్త కవచం, కలశం, డమరుకాస్త్రం, ఖడ్గ హస్తం తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండీదేవి అలరారుతుంది.
దేవికి అలంకరించే ఒక ఆభరణం 'మాటి'. ఇటీవల ఇది ముక్కలై.. దేవికి అలంకరించిన పుష్పాలతో పాటు చెత్తబుట్టను చేరింది. చెత్తను ఊడుస్తున్నప్పుడు ఇది దొరికింది. అప్పుడు దీని విలువను బేరీజు వేస్తే ఒక్క ముక్కనే 75 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఒక ఆభరణాల వ్యాపారి చెప్పారు. కోట్ల విలువచేసే ఈ ఆభరణాలను అత్యంత రక్షణ వలయాల మధ్య దాచిపెడ్తారు. ఒడయార్ వద్ద ఉన్న ఆభరణాలను, ప్రభుత్వం వద్ద ఉన్న ఆభరణాలను గట్టి పోలీసు బందోబస్తు మధ్య చాముండేశ్వరి దేవాలయానికి తీసుకువస్తారు.
ఖజానా నుండి ఆభరణాలను తీసుకు రావటం మొదలుకొని చాముండేశ్వరి దేవికి అలంకరించటం.. ఆపైన జరిగే దృశ్యాలన్నింటినీ ఎప్పటికప్పుడు వీడియో రికార్డు చేయటమే కాదు.. అప్రమత్తతతో కాపాడతారు. ఈ పెట్టెలను ఆలయానికి తీసుకువచ్చిన తర్వాత ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. తరువాత పెట్టెకు పూజలు చేసి దేవాలయ ప్రధాన పూజారులు, అర్చకలు, పోలీసులు, దేవాలయ నిర్వాహకులు, జనం సమక్షంలో పెట్టెలోని ఆభరణాలను బయటికి తీయటం జరుగుతుంది. ఆభరణాలు సరిగ్గా ఉన్నాయో లేదో పర్యవేక్షిస్తారు. తరువాత చాముండేశ్వరి దేవికి అలంకరించి ఉత్సవాలు ఆరంభించింది మొదలు దసరా పండుగ ముగిసేంతవరకు ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ఇక ఆభరణాలను విలువ కట్టడం మాటటుంచి.. ఆభరణాలలోని ఒక్కో రాయి విలువ 15 నుండి 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. వజ్రాల విలువను నిర్ధారించడం ఇప్పటికీ పూర్తి కాలేదు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire