Kapila Theertham : తిరుమల-తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రం. ఇక్కడ తిరుమల లోని శ్రీవేంకటేశ్వరుని ఆలయంతోబాటు అన్నీ వైష్టవాలయాలే......
Kapila Theertham : తిరుమల-తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రం. ఇక్కడ తిరుమల లోని శ్రీవేంకటేశ్వరుని ఆలయంతోబాటు అన్నీ వైష్టవాలయాలే... గోవిందరాజ స్వామి ఆలయం, కోదండ రామాలయం, కళ్యాణ వేంకటేశ్వరాలయము, వరదరాజ స్వామి ఆలయము, పద్మావతి అమ్మవారి ఆలయము మొదలగునవన్నీ వైష్ణవాలయాలే. కాని తిరుమల కొండ పాద భాగాన అలిపిరికి అతి సమీపంలో ఒక శివాలయమున్నది. అదే కపిల తీర్థము.
కపిలతీర్థం
శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమిని చీల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది. త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తిక మాసం లో వచ్చు కార్తిక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. ఈ ఆలయం తి.తి.దే. వారి ఆద్వర్యంలో పనిచేస్తుంది, శివరాత్రి పండుగ, బ్రహ్మొత్సవాలు వైభవంగా జరుగుతాయి.
తిరుమల అంటే శ్రీవారే. అణువణువూ వేంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అనీ, మల అంటే శైలం (కొండ) అనీ కూడా అర్థం. అంటే తిరుమల... శ్రీశైలమన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా... అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది! అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామివారి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడకు వస్తే... ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపుతిప్పనివ్వవు. ఇక్కడి ప్రశాంత వాతావరణం... అడుగుతీసి అడుగు వేయనివ్వదు. ఇంతటి సుమనోహర తీర్థం ఇక్కడ ఎలా ఏర్పడిందంటే...కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరువాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు
చరిత్ర
విజయనగర చక్రవర్తి, అచ్యుత రాయలు ఈ తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. 1830ల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రికుడు, యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాశారు. బ్రాహ్మణ సమారాధనకు ఇక్కడ కట్టియున్న విశాలమైన మంటపం అనుకూలంగా ఉండేదని, ఆ చుట్టుపక్క స్థలాల్లో హైదరాబాద్ రాజ్య పేష్కారు చందులాలా ఏర్పాటుచేసిన దానధర్మాలు బాగా జరిగేవని ఆయన వ్రాశారు.
11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్రచోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో రాయన్ రాజేంద్రచోళ అనే చోళ అధికారి దీని నిర్మాణ సూత్రధారి. చోళులు శివభక్తులు కావడంతో దీన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించారు. ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే... అచ్యుతదేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వారుతీర్థంగా మార్చారు. ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది. అది నమ్మాళ్వార్ అనే ఆళ్వారు గుడి అని చెబుతారు. 12వ శతాబ్దం నుంచీ 18వ శతాబ్దం వరకూ దీన్ని ఆళ్వారు తీర్థంగానే వ్యవహరించారు. పదహారో శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట. ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందట. కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితోపాటు కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు.
పూజలు, ఉత్సవాలు
కపిలతీర్థము పరమ పవిత్రమైనదని పురాణాలు ఘోషిస్తున్నందున,..... ముల్లోకాల్లోని సకల తీర్థాలు ఇందులో కొంత సమయం ఉంటాయని చెపుతున్నందున ఈ తీర్థములో స్నానమాచరించుటకు భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. పైనుండి ధారగా పడే జలధారల క్రింద నిలబడి స్నానం చేయడానికి భక్తులు పోటీలు పడుతుంటారు. ఆ కారణంగా కార్తీక మాసం ప్రారంభంకాగానే ఈ తీర్థానికి భక్తులు పోటెత్తుతారు. నిత్యం ఈ తీర్థములో పుణ్య స్నానాలు చేసి పరమేశ్వరునికి దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో, ఆరుద్రా నక్షత్రం రోజున ..... ఆలయంలో లక్ష బిల్వార్చన, అన్నాభిషేకము ఘనంగా జరుగుతాయ. శివ రాత్రికి ప్రత్యేక ఉత్సవాలతో బాటు ప్రతి ఏడు పుష్య మాసంలో తెప్పోత్సవాలు, మాఘ మాసంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
ఈక్షేత్రానికి ఎలా వెళ్ళాలి ?
తిరుమల, తిరుపతి క్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినందున ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్తూరు జిల్లాలో పవిత్ర మైన తిరుపతి పట్టణానికి ఉత్తరదిక్కున తిరుమల కొండ పాద భాగాన అలిపిరికి సమీపంలో ఈ క్షేత్రము ఉంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire