Importance of sravana masam: మంగళకరం.. శుభకరం.. శ్రావణ మాసం!

Specialties and importance of Sravana Masam
x
Sravana masam poojalu
Highlights

Importance of sravana masam:శ్రావణ మాసం.. తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసాల్లో ఇది ప్రధానమైనదిగా చెప్పవచ్చు. కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢమాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుందీ శ్రావణం.

శ్రావణ మాసం.. తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసాల్లో ఇది ప్రధానమైనదిగా చెప్పవచ్చు. కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢమాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుందీ శ్రావణం. ఎండలు వెళ్ళిపోయి వర్షాలు మొదలై.. అన్నదాతలు పొలం పనుల్లో పూర్తిగా నిమగ్నమై పోతారు. ఇక ఆధ్యాత్మికంగా శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతీ పాత్రమైనదిగా చెబుతారు.

కొత్తగా పెళ్ళైన తమ ఇంటి ఆడపడుచులతో మంగళవారం గౌరీ పూజలు చేయించడం.. మెట్టినింట తమ ఇంటి మహాలక్ష్మ్ గా వరలక్ష్మీ పూజను కోడలితో చేయించడం ఇలా అమ్మవారి అంశగా ఆడపిల్లకు పుట్టింటా..మెట్టింటా గౌరవం ఇచ్చి శ్రావణ మాసం పర్వదినాలు సంతోషంగా గడిపే మాసం శ్రావణం. ఈరోజు (జూలై 21) నుంచి ప్రారంభం అవుతోంది. ఈ సందర్భంగా శ్రావణ మాస విశేషాలు మీకోసం.

శ్రవణ నక్షత్రం ప్రవేశంతో వచ్చేదే శ్రావణ మాసం. ముక్కంటికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం శ్రావణం. అలాగే శ్రీనివాసుడి జన్మ నక్షత్రం కూడ శ్రావణమే.. శ్రీకృష్ణుడు అవతరించింది శ్రావణ మాసంలోనే.. బలిచక్రవర్తికి పట్టాభిషేకం జరిగిన మాసం.. భక్తి మార్గాల్లో శ్రవణభక్తి మొదటిది. శ్రవణ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తాడని ప్రతీతి. అందుకే శ్రావణ మాసానికి ప్రత్యేకత సంతరించుకున్నది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు విశిష్టతే. ఈ మాసమంతా శ్రవణ నక్షత్రం ఉండటమే కారణమని పండితులు చెబుతున్నారు.

శ్రావణ మంగళవారం..

అభయమిచ్చే హనుమంతుడు. సకల విఘ్నాలను తొలగించి సకల దేవతల కంటే ముందే మొదటి పూజలందుకునే విఘ్నేశ్వరుడు.. సంతాన భాగ్యాన్ని కలిగించే సుబ్రహ్మేశ్వరుడు మంగళవారం నాడే జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. మంగళగౌరీకి ఎంతో ప్రీతికరమైన రోజు మంగళవారం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఆయా దేవతలందరినీ భక్తి శ్రద్ధలతో పూజిస్తే శుభాలను ప్రసాదిస్తారని భక్తుల నమ్ముతారు. మహిళలు మంగళ గౌరీ వ్రతం చేసి తమ భక్తి ప్రవృత్తులను చాటుకుంటారు.

శ్రావణ శుక్రవారం..

శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైనది. అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. వరలక్ష్మి వ్రతం ఆచరించే వారికి శుభప్రదమైనది. అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పూలు, అల్లిన మల్లె మాలను సమర్పిస్తే సకల పాపాలు తొలుగుతాయన్నది భక్తుల నమ్మకం. అలాగే రుణ విముక్తి, లక్ష్మీకటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం అదే విషయాన్ని పండితులు కూడా చెబుతున్నారు. ఈ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు.

శ్రావణ మాసంలో వచ్చే పండుగలు

శ్రావణ మాసంలో మొదటి పండుగ మంగళగౌరీ వ్రతం. ఆ తర్వాత నాగుల చవితి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పూర్ణిమ, గురు రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, శ్రీకృష్ణాష్టమి ఈ మాసంలోనే వస్తాయి.

మంగళగౌరీ వ్రతం

ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులు, పెండ్లికాని యువతులు ఆచరించే మంగళగౌరీ వ్రతం అత్యంత విశేషమైనది. అమ్మవారిని షోడశోపచారాలతో, అష్టోత్తోర శతనామాలతో పూజిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే సుఖసంపదలు, ధనధాన్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. పెండ్లి కాని వారికి వివాహం అవుతుందన్నది ప్రగాఢ విశ్వాసం. చివరి వారంలో పసుపు, కుంకుమలతో వాయినాలు సమర్పించుకుంటారు.

నాగుల పంచమి (జూలై 25)

శ్రావణ శుద్ధ చవితి, పంచమి రోజున నాగుల చవితి, పంచమిని జరుపుకొంటారు. ఈ రెండు రోజులతో పాటు, శ్రావణ శనివారాల్లో పెద్దలు, పిల్లలు పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తారు. నాగముద్రికలను సమర్పించుకుంటారు. ఇలా చేస్తే సర్వదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

వరలక్ష్మీ వ్రతం (జూలై 31)

నిత్య సౌభాగ్యం కోసం మహిళలు ఆచరించే వ్రతాల్లో వరల క్ష్మీ వ్రతం ఒకటి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రత్యేకంగా అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తారు. అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లేలా చూడాలని అమ్మవారిని కోరుకుంటారు.

శ్రావణ పూర్ణిమ (ఆగస్టు 3)

శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అంటారు. రక్షాబంధన్‌, జంద్యాల పౌర్ణమిగా జరుపుకొంటారు. ఇదే రోజున సంతోషిమాత జయంతి కావడం ఎంతో విశిష్టత. మాతను ఆరాధించడం ద్వారా సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయన్నది హిందువుల నమ్మకం.

శ్రీ కృష్ణాష్టమి (ఆగస్టు 11)

శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్టుడి జన్మాష్టమిగా జరుపుకొంటారు. ఒక్క కృష్ణాష్టమి వ్రతాన్ని నిష్టతో ఆచరిస్తే సంవత్సరంలో 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం లభిస్తున్నదని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పల్లె, పట్టణాల్లో ఉట్టి సంబురాలు, చిన్నారులను గోపికలు, చిన్ని కృష్ణులుగా అలంకరించి మురిసిపోతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories