సృష్టి స్థితి లయ కారకుడైన నీలకంఠేశ్వరుడు, బోలా శంకరునికి అఖండ భారతంతో అనేకానేక దేవాలయాలు ఉన్నాయి. శైవక్షేత్రాలన్నీ ఒకలా కాకుండా ఒక్కో క్షేత్రం ఒక్కో...
సృష్టి స్థితి లయ కారకుడైన నీలకంఠేశ్వరుడు, బోలా శంకరునికి అఖండ భారతంతో అనేకానేక దేవాలయాలు ఉన్నాయి. శైవక్షేత్రాలన్నీ ఒకలా కాకుండా ఒక్కో క్షేత్రం ఒక్కో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాటిలో అన్ని క్షేత్రాల్లో మహిమ గల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం.
ఆలయ చరిత్ర
క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రమును గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారు.
ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు.
క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 26 న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మత్తులు చేస్తూ వస్తున్నారు అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒక వైపు బాగా బీటలు వారింది.
మరో రెండు రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు కానీ రెండు రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయింది. ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణలతో కూడిన ఒక కమిటీని నియమించింది.
క్షేత్ర పురాణము
సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. ఈ క్షేత్రాన్ని 'దక్షిణ కాశీ ' అని కూడా అంటారు. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంభువుగా వెలిసినాడు. ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారమంగా గాక చతురస్రంలో వుంటుంది.
కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా తీసి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడని చరిత్ర.
ఈ దేవాలయం చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో అనేక చిత్రాలను చిత్రించారు. ఈ ఆలయంలో " మణికుండేశ్వరాఖ్య " అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రంలో లాగా ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారకమంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము. దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయం ఉంటుంది. దేవాలయానికి సమీపములో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురం యొక్క సింహద్వారము దక్షిణాభిముఖాన ఉంటుంది. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాసమనియు, సత్య మహా భాస్కరక్షేత్రమనియు, సద్యోముక్తిక్షేత్రమనియు, శివానందైక నిలయమని పేర్కొన్నారు.
దేవాలయ చరిత్ర, ప్రత్యేకతలు
ఈ దేవాలయము యొక్క పేరు మూడు జంతువుల కలయికతో ఏర్పడినది.
శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందినది.
ఇది స్వర్ణముఖి నది తీరములో ఉన్న క్షేత్రము. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖముగా ప్రవహించడం జరుగుతున్నది.
ఈ దేవాలయములోని లింగము పంచభూత లింగములలో ఒకటైన వాయులింగము
ఆలయ విశేషాలు
ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వరస్వామి సాంకేతిక కళాశాలను 1997లో స్థాపించారు.
నాలుగు దిక్కుల దేవుళ్ళు
శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.
గోపురాలు
ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమరూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిచ్చాలు" దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని "బాల జ్ఞానాంబి గోపురం" అని, ఉత్తరం గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున "చంద్ర పుష్కరిణి" ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.
ఇతర శివలింగాలు, పరివార దేవతలు
- ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు.
- భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము
- అగస్త్యుడు - నీలకంఠేశ్వర లింగము
- ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగము
- ఇంకా వ్యాసుడు,
- మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము),
- రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు,
- సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు,
ధర్మరాజు ప్రతిష్ఠించినవనే లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై ఉన్నాడు. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.
మంటపములు
ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము, పదునారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. నూరుకాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం. పదహారు కాళ్ళ మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలున్నాయి.
రాహు కేతు క్షేత్రము
ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.
దక్షిణామూర్తి
దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.
తీర్ధాలు
ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయట. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా "మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.
ఇతర విశేషాలు
ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి. (2007 నాటికి) దేవస్థానానికి ఆదాయం సుమారు 7 కోట్ల రూపాయలు ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతున్నది.
పాతాళ గణపతి ఆలయము
ఈ ఆలయమునకు ప్రవేశద్వారము వైపున పాతాళ గణపతి ఆలయము ఉంది. ఇందులోనికి ప్రవేశము ఒకసారికి ఒకరికి మాత్రమే ఉంది. మెట్లద్వారాలోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గము లోనికి ఉంది. దాదపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం ఉంది. ఈ స్వామి కోర్కెలు తీర్చేవాడని ప్రసిద్ధి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire