Vonti Mitta Ramalayam temple history : పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడి మూలమూర్తులు...
Vonti Mitta Ramalayam temple history : పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రం ఏకశిలానగరం అని ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడివిడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఈ ఆలయమున్న ఒంటిమిట్ట ఆంధ్రా భద్రాచలంగా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు.
ఆలయచరిత్ర..
ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి, ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది.
స్థల పురాణం..
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.
ఆలయ విశేషాలు..
ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో శ్రీరామ, సీత, లక్ష్మణ చెక్కబడ్డాయి. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశీలా విగ్రహం స్థాపించినట్లు కథనం.
ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి, దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.
చోళ, విజయనగర వాస్తుశైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. చరిత్ర మధ్యయుగాల్లో మన దేశాన్ని దర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపైన "శ్రీ రఘువీర శతకాన్ని" రచించాడు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగు వారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ, సరళ కవి బమ్మెర పోతన, జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ, ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరాముడికే. ఈ సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు.ఆంధ్రవాల్మీకిగా ఖ్యాతిచెందిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట నివాసి కావడం విశేషం.
బ్రహ్మోత్సవాలు..
చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.
ఇమాంబేగ్ బావి..
ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం, ఇక్కడి విశేషం. పుట్టపర్తికి వచ్చే ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఆలయ శిల్ప సంపద చూసి ముచ్చటపడిపోతుంటారు.
పూజలు, ఉత్సవాలు..
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఎలా చేరుకోవచ్చు..
ఈ ఆలయం కడప-తిరుపతి రహదారిపై ఉంది. కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
రైలులో రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది.
కడప రైల్వేస్టేషన్‌లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యముంది.
తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire