భారతావని ఓ పుణ్యభూమి ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలల్లో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి,...
భారతావని ఓ పుణ్యభూమి ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలల్లో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి, వాటి పోషణార్థం, మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అందుచేతనే పరమతస్థులు తమ దండ యాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచు కొని కొల్లగొట్టారు. దేవాలయాలు కాలగమనంలో జీర్ణించి పోతున్నా వాటిని పునర్నిర్మిస్తున్నారు. క్రొత్త వాటిని కడుతూనే ఉన్నారు. అన్ని ఆలయాలకు ఆదరణ బాగా ఉంది. ఆలయాల వల్ల వ్వక్తికి, సమాజానికి, దేశానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి వలన ప్రజల్లో భక్తి భావన పెరిగి, సామాజికంగా ఐకమత్య భావన పెరిగి, తద్వారా దేశ భక్తి కలిగి, ప్రజల మానసికోల్లాసానికి ఉపయోగ పడుతుంది.
ఇలాంటి ఆలయాల్లో రాయ వేలూరు కోటలో ఉన్న జలకంఠేశ్వరాలయం అతి పురాతనమైనది, అందమైనది. అంతకన్న ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ ఆలయ ఆవరణలో ఉన్న కళ్యాణ మండపం. చూపరులను మంత్ర ముగ్ధులను చేయగల విన్యాసము విజయనగర శిల్ప కళలో ఉంది. దక్షిణ భారతదేశంలో విజయనగర శిల్పకళ లేని ఆలయం లేదు. ఫలాన గుడిని ఎవరు కట్టించారనగానే వెంటనే వచ్చే సమాధానం శ్రీ కృష్ణ దేవరాయలు అని. వారు కట్టిన ఆలయాలు అంత విస్త్రుతంగా ఉన్నాయి. వాటిలోని శిల్పకళ కూడా అంత విశిష్టంగా ఉంటుంది. ఆ ఆలయాలలోని కళ్యాణ మంటపాలలోని శిల్పకళ మరీ అద్భుతంగా ఉంటుంది. జలకంఠేశ్వరాలయంలోని కళ్యాణ మండపం చిన్నదైనా, శిల్పకళా కౌశలం రీత్యా చాల అద్భుతమైనది. ఇది విజయనగరాధీశుడు సదాశివరాయల కాలంలో కట్టబడినదిగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం రాయవేలూరు కోటలోనే ఉన్నందున, కాల గమనంలో కోటతో బాటు ఈ ఆలయం కూడా బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది.
ఈకళ్యాణ మండపంలోని శిల్పకళా రీతులకు ముగ్ధులైన బ్రిటిషు వారు దానిని ఏ కీలుకు ఆ కీలు జాగ్రత్తగా విడదీసి సముద్రాలు దాటించి లండనులో తిరిగి పునఃప్రతిష్ఠించాలని భావించారు. దానికి తగిన ఏర్పాట్లన్ని చేసుకున్నారు. దీని కొరకు లండను నుండి ఒక స్టీమరు కూడా బయలు దేరింది. కాని వారి దురదృష్టమో, భారతీయుల అదృష్టమో గాని ఆ స్టీమరు మార్గ మధ్యలో మునిగి పోయింది. ఆ సందర్భంలోనే జరిగిన అనేక రాజకీయ కారణాల వల్ల కళ్యాణ మండపాన్ని తరలించే కార్యక్రమం మూలన పడింది. ఆ విధంగా ఆ శిల్పకళా కౌశలాన్ని మనమీనాడు చూడగలుగుతున్నాము. ఈ కళ్యాణ మండపం ఆలయ ప్రధాన గోపురానికి ప్రక్కనే ఒక మూలన ఉంది. ఇది మూడు భాగాలుగా ఉంది. ఇందులో అన్నీ కలిపి నలబై ఆరు శిల్ప కళా శోభితమైన స్తంభాలు ఉన్నాయి. ముందు భాగంలో చుట్టు ప్రహరి గోడ లేదు. ఇందులోనే మధ్యన పైకప్పుకు ఉన్న శిల్పకళను బొమ్మలో చూడ వచ్చును. రెండో భాగం మొదటి దానికన్నా మూడడుగుల ఎత్తున ఉంది. ఏ కారణం చేతనో దీని లోనికి వెళ్లడానికి మెట్లు నిర్మించ లేదు.
దీని తర్వాత నున్న మూడో భాగం ఇంకొంచెం ఎత్తుగా ఉంది. ఈ రెండు భాగాలకు మాత్రం చుట్టు గోడ ఉంది. మధ్యలో కూర్మం (తాబేలు) శిల్పం చెక్కి ఉంది. ఇది మధ్యలో చిన్న వేదికలాగ కనబడుతుంది. స్తంభాలపై అష్ట దిక్పాలకుల చిత్రాలు, వినాయకుడు, విష్ణు, బ్రహ్మ, భూదేవి, శ్రీదేవి, సరస్వతి, పార్వతి మొదలగు దేవతా మూర్తుల చిత్రాలు అత్యంత సుందరంగా చిత్రించి ఉన్నాయి. ఇవి గాక నాట్య గత్తెల, సంగీత కారుల, శిల్పాలు కూడా ఉన్నాయి. ప్రతి స్తంభం మీద శిల్పకళను వివరంగా గమనిస్తే, అనేక పురాణ గాథలను స్ఫురింప జేస్తాయి. ఇందులోని ఒక శిల్పం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది ఒక ఎద్దు, ఒక ఏనుగు ఎదురెదురుగా నిలబడి ఉన్నట్టుంది. కాని ఆ రెండింటికి తల ఒక్కటే. ఎద్దు శరీరాన్ని మూసి చూస్తే ఏనుగు కనిపిస్తుంది. అలాగే ఏనుగు శరీరాన్ని మూసి చూస్తే ఎద్దు ఆకారం కనబడుతుంది. ఇలాంటి చిత్రం హంపి లోని అచ్యుత రామాలయంలోను, హజరా రామాలయంలోను, దసరా దిబ్బ ప్రక్కన మైదానంలోను ఉన్నాయి. ఇదొక శిల్ప కళా వైచిత్రి.
చరిత్ర
రాయ వెల్లూరు కోట లోనే ఉన్న జల కంఠేశ్వరాలయము, కోటతో బాటు పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాధినేత సదాశివరాయల కాలంలో కట్టబడింది. విజయనగర పతనానంతరము ఈ కోట, అందులో భాగమైన ఈ ఆలయము ముస్లింల పాలకులైన ఆర్కాడు నవాబు ల పాలన లోనికి వెళ్లింది. అలా చాలకాలము ఉంది. ఆ సమయంలో ఈ ఆలయం లోని దేవతా మూర్తులను, శివ లింగాలను ధ్వంసం చేయడమో, లేదా పెకలించి కోట అగడ్తలో పడవేయడమో జరిగింది. వాటిని అగడ్తలో పడవేసి ఉంటారనడానికి నిదర్శనంగా అడప దడపా అగడ్తలో దొరికిన శిల్ప ఖండాలే ఆనవాలు. శతాబ్దాలు గడిచి నందున ఆ విగ్రహాలు అగడ్తలోని బురదలో కూరుకు పోయి ఉంటాయని భావించబడుతున్నది. అగడ్తలో త్రవ్వకాలు జరిపితే అవి బయట పడవచ్చును. ముస్లిం పాలకుల తర్వాత ఈ కోట బ్రిటిషు వారి వశమై, అలా చాల కాలము ఉంది. ఆ సందర్భంలో బ్రిటిషు వారు కోటను వారి సైనిక కేంద్రంగా మార్చారు. ఇందులోని ఆలయ సముదాయాన్ని, వారి మందు గుండు సామాగ్రికి గోదాముగా వాడుకున్నారు. బ్రిటిషు వారి కాలంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం 1921 వ సంవత్సరంలో రాయ వెల్లూరు కోటను, అందులోనే ఉన్న మసీదును, జలకంఠేశ్వరాలయాన్ని జాతీయ సంపదగా గుర్తించి, దాని పరిరక్షణకు దానిని పురావస్తు శాఖకు అప్పగించింది. ఆ విధంగా ఈ జలకంఠేశ్వరాలయం కొన్ని శతాబ్దాల పాటు నిత్య ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోక, మూసి ఉన్న కోట గోడల మధ్య ఉండి పోయింది.
భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ప్రజలు, పుర ప్రముఖులు, ఆలయాన్ని తమ స్వాధీనం చేసుకోడాకి చేయని ప్రయత్నం లేదు. మతాచార్యులు అనేక ఉద్యమాలు, ఒత్తిడులు చేసినా ఫలితం కనబడలేదు. ఇది మత సంబంధమైన సున్నిత విషయమని, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడవచ్చునని భావించి, భారత దేశ అధ్యక్షులు గాని, భారత ప్రధాని గాని, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలు గాని ఈ విషయంలో ఏమీ చేయలేక పోయారు. చివరకు 1981వ సంవత్సరంలో జిల్లా కలెక్టరు వ్వక్తిగత మద్దతుతో, మైలారు గురూజీ సుందర స్వామి,, తంజావూరు రామనందేద్ర సరస్వతి స్వామి వారి మద్దతుతో వెల్లూరు పట్టణ ప్రముఖులు రహస్యంగా బయట ఒక గుడిలో ఉన్న శివ లింగాన్ని తెచ్చి, జలకంఠేశ్వరాలయంలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని రహస్య పథకాన్ని రచించారు. ఆ పధకంలో భాగంగా 1981 మార్చి 16 వ సంవత్సరంలో వేరే గుడిలో ఉన్న శివ లింగాన్ని మూసి ఉంచిన ఒక లారీలో తెచ్చి సిద్ధంగా ఉంచు కున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఉన్నట్టుండి ఒక్కసారిగా సుమారు రెండు వేలమంది పుర ప్రముఖులు అక్కడ గుమిగూడి లారీలో నుండి శివ లింగాన్ని దించి కోటలోని ఆలయంలోనికి ప్రవేశించి లింగాన్ని ప్రతిష్ఠించి, పూజా కార్యక్రమాలు చేసేశారు. ఉన్నట్టుండి జరిగిన ఈ వ్యవహారాన్ని పోలీసులు గాని, భారత స్వాతంత్ర్యానంతరము రాయ వెల్లూరు ప్రజలు, ఇతర మత పెద్దలు, ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠకు, నిత్య ధూప, దీప, నైవేద్యాలు చేయడాన్నిజిల్లా కలెక్టరు గాని అడ్డుకోలేక పోయారు. పురావస్తు శాఖ వారు ఈ సంఘటనను పోలీసులకు, జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడం తప్ప ఏమీ చేయ లేక పోయారు. ఆ తర్వాత కూడా ఇది సున్నితమైన మత సంబంధిత విషయమైనందున, దానితో ఏదైన శాంతి భద్రతల సమస్యలు పుట్టుకొస్తాయనే భయంతో అధికారులు ఎవరు ఎటువంటి చర్యలకు పాల్పడలేదు. ఆ తర్వాత, మతాచార్యుల మద్దతుతో ఆలయ ప్రాంగణంలో అన్ని గర్భగుడులలో విగ్రహాలను ప్రతిష్ఠించి, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ విధంగా వేలూరు పుర ప్రజలు తమ అనేక ఉద్యమాల ఫలితంగా శతాబ్దాల తరబడి మూసి ఉన్న చీకటి కోటలో మగ్గిన ఈ చారిత్రక జలకంఠేశ్వరాలయాన్ని భక్తులకు ప్రజలకు అందుబాటు లోనికి తెచ్చారు. ఎన్నో చారిత్రక సంఘటనలకు ఆలవాలమైన ఈ రాయవెల్లూరు కోట, అందులోని ఈ ఆలయము నకు సంబంధించిన ఈ పునః ప్రతిష్ఠ సంఘటన కూడా దాని చరిత్రలో ఒక భాగమై పోయింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire