సప్తనదీజలాలు, లక్షపెన్నులతో గణనాథునికి అభిషేకం..ఎక్కడో తెలుసా...

సప్తనదీజలాలు, లక్షపెన్నులతో గణనాథునికి అభిషేకం..ఎక్కడో తెలుసా...
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి విగ్నష్వర ఆయలం ఒకటి.

ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి విగ్నష్వర ఆయలం ఒకటి. ఇక్కడ ఆ గణనాధుడు స్వయంభూగా వెలసిన గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం పొందింది. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో వెలసింది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, ప్రకృతి రమణీయతలతో, సుందర ప్రశాంత వాతావరణం ఈ ఆలయం భాసిల్లుతుంది. ఏకదంతుడు ఇక్కడ సిద్ది వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నారు.

స్థలపురాణం...

ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతుంటారు. స్వయంభువ వినాయకక్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు అని చెపుతుంటారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.

ఈ క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనది స్థలపురాణం వివరిస్తుంది. పూర్వం అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతూ వుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని 14 వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొనబడింది. ఈ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ముగ్గురు మూర్ఖులను వినాయకుడు శపించాడనీ తరువాతి కాలంలో వారే మూగ, చెవిటి,గుడ్డివారిగా జన్మించి కాణిపాకం వినాయకుడి ఆవిర్భావాన్ని గుర్తించారని స్థలపురాణం వివరిస్తుంది.

ఆలయప్రశస్థి...

సువిశాలమైన ఆవరణలో ఎతైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాలయంలో శ్రీవిఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా ప్రతీ దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. అయితే అయినవిల్లిలో సిద్ధివినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం. అంతేగాక ఈ గ్రామంలో దక్షిణ సింహాద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలుగవని, గృహాలు సంవృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢవిశ్వాసం. రెండు గోపురాలతోచూపరులను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయ సౌందర్యం సందర్శకులను సమ్మోహనపరుస్తూ ఉంది. ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవునికి, శివునికి, శ్రీఅన్నపూర్ణాదేవికి, శ్రీకాలభైరవస్వామికి ఉపాయాలు ఉన్నాయి. శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారని విశ్వసిస్తున్నారు.

ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి. దక్షిణ గోపురం ద్వారా ఆలయానికి చేరితే వినాయకుడిని దర్శనం చెసుకోవచ్చు. ఇక్కడ స్వామి దక్షిణ ముఖుడై ఉన్నాడు. ప్రధాన ఆలయంలోని విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి తూర్పు గోపురం నుండి ప్రవేశించవచ్చు. ఈ ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఆలయం లోనే శ్రీదేవి, భూదేవి సమేతుడైన కేశవ స్వామి ఉన్నారు. అన్నపూర్ణా దేవి ఆలయం కూడా ఈ ఆలయ సన్నిధిలో ఉంది. ఆలయానికి క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు గుడి కూడా ప్రధానాలయ ప్రాంగణం లోనే ఉంది. ఈ ఆలయానికి వివిధ ప్రదేశాలనుండి భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకొంటారు. ఇక్కడి ఆలయంలో పూజలు శైవ ఆగమశాస్త్రానుసారంగా జరుగుతాయి.

ప్రత్యేక పూజలు...

ఈ ఆలయంలో ప్రతీనెలా కృష్ణపక్ష, శుక్లపక్ష చవితి తిధులు, దశమి, ఏకాదశులలో, వినాయకచవితి పర్వదినాలలో సిద్ధివినాయకునికి విశేషార్చనలు జరుపుతారు. ప్రతినిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం కొబ్బరికాయలు, పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఇక్కడకు వచ్చి కోరిన కోర్కెలు తీరిన వెంటనే మరలా మొక్కుబడులు తీర్చుకొ నడం విశేషం. దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, ప్రముఖులు నిత్యం స్వామివారిని సందర్శిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని విశ్వసిస్తున్నారు. అయినవిల్లి సిద్ధివినాయకుని భక్తిశ్రద్ధలతో అర్చిస్తే కోర్కెలతోపాటు బుద్ధి వికసిస్తుందని విశ్వసిస్తున్నారు.

ముక్తేశ్వరాలయం, క్షణ ముక్తేశ్వరాలయం...

సరిగ్గా అయిన వెల్లి గ్రామానికి రెండుకిలో మీటర్ల దూరంలోని సర్వపాపాలను తొలగించే ముక్తేశ్వరుడు భక్తులకు దర్శనం ఇస్తాడు. ఈ ఊరికి ఉన్న పేరు మీదుగా కల ముక్తేశ్వరుని దేవాలయము బహు పురాతనమైనది. ఒకదానికెదురుగా ఒకటిగా రెండు శివాలయములు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. మెదటి దాని ఎదురుగ ఉండే ఆలయములో దేవుని క్షణ ముక్తేశ్వరుడు అంటారు. ముక్తేశ్వరస్వామి ఆలయములో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారము పోలి ఉంటుంది. దీనిని వనవాస సమయంలో ఇటు వైపుగా వచ్చిన శ్రీరాముడు ఇక్కడి శివలింగమును అర్చించి దాని మాహాత్మ్యమును తెలుసుకొని క్షణ కాలము ఇక్కడి పరమేశ్వరుని అర్చించిన ముక్తి కలుగునని చెప్పెనని స్థల పురాణము ద్వారా తెలియుచున్నది.

ఇలా చేరుకోవాలి...

రాజమహేంద్రవరం నుంచి అయినవిల్లికి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం నుంచి బస్సు, ఆటోలో దేవాలయాన్ని చేరుకోవచ్చు. కాకినాడ నుంచి యానాం, అమలాపురం, ముక్తేశ్వరం మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories