Veereshwaraswamy Temple : పరమ పవిత్రమైన గోదావరి తీర ప్రాంతాల్లో ఎన్నో ఎండ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఆ ఆలయాల్లో శ్రీ...
Veereshwaraswamy Temple : పరమ పవిత్రమైన గోదావరి తీర ప్రాంతాల్లో ఎన్నో ఎండ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఆ ఆలయాల్లో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి దేవాలయం కూడా ఒకటి. పచ్చని పొలాలు, ప్రకృతి సోయగాల మధ్యలో తూర్పుగోదావరి జిల్లా మురమళ్ళ అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది. అసలు ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏంటి, చరిత్ర ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.
స్థల పురాణం
భారద్వాజాంతర్భూత పావన వృద్ద గౌతమీ నదీతీరమందు ఉన్న మురమళ్ళ దివ్య క్షేత్రములో నిత్య కళ్యాణము పచ్చ తోరణముతో విరాజిల్లుచూ శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారు ప్రత్యేక్ష దైవముగా ప్రకాశించుచున్నారు. శ్రీస్వామివారికి నిత్యకళ్యాణము జరుగు.విశేషమునకు కారణమేమనగా దక్షయజ్ఞ ధ్వంసమునకు ఉద్భవించిన శ్రీ వీరభద్రుడు కోటి సూర్య ప్రకాశములతో ఉగ్రరూపుడై దక్షుడిని సంహరించి యజ్ఞమును ధ్వంసం చేసెను. తదుపరి శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షయాగము పూర్తి చేయుటకు సమ్మతించి దక్షుడి మొండెమునకు మేక తలను తగిలించి దక్షుడిని బ్రతికించెను. పిదప దక్షునిచే వేదోక్తముగా యజ్ఞము పూర్తిచేయించిన తరువాత కూడా వీరభద్రు కోపాగ్నిని వీడలేదు. సతీదేవి యోగశక్తితో అగ్నిపుట్టించుకుని అందులో ఆహుతైన కారణమే శ్రీ వీరభద్రుని కోపాగ్నికి కారణమని గ్రహించిన మహామునులు, దేవతలు భయకంపితులై వీరభద్రుని శాంతింపజేయుటకు శ్రీ మహావిష్ణువును ప్రార్థించిరి.
అంతట శ్రీ మహావిష్ణువు నరసింహావతారం దాల్చి శ్రీ వీరభద్రుని శాంతింపజేయుటకు ప్రయత్నించెను. నరసింహమావతారంలో ఉన్న విష్ణుమూర్తి ఎంత ప్రయత్నించినను వీరభద్రుడు శాంతించకపోవడంతో వెనువెంటనే మహావిష్ణువు నరసింహావతారంలో ఉన్న తన లీలను అచటనే వదలి వీరభద్రుని శాంతింపజేయుటకు త్రిమూర్తులందరూ ఆదిపరాశక్తిని ధ్యానించగా ఆదిపరాశక్తి ప్రత్యక్షమై కారణమేమని అడిగెను. కోటి సూర్యులకాంతితో ఉగ్రరూపుడైన వీరభద్రుడు చూచుటకు భయంకరముగా ఉన్నందున లోకమునకు శాంతి కలగదని వీరభద్రుని శాంతింపజేయమని కోరెను అంతట ఆదిపరాశక్తి షోడశ కళలలో ఒక కళను భద్రకాళి నామంతో వీరభద్రుని శాంతింపజేయుటకు భూలోకమునకు పంపెను. భద్రకాళీ అమ్మవారు తన శక్తి కొలది ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుడు శాంతించకపోవడంతో "అశ్శరభశ్శరభ" అనుచూ భద్రకాళి అమ్మవారు కన్యారూపము దాల్చి గౌతమి నది నుండి బయటకు వచ్చి వీరభద్రుని చూచెను.
అంతట వీరభద్రుడు కన్యారూపములో ఉన్న భద్రకాళిని చూసి శాంతించెను.అప్పుడు వీరిరువురికీ మునిమండలి యందు గాంధర్వ వివాహ పద్ధతిలో కళ్యాణము జరిపి శాంతింపజేసిరి. ఈ పవిత్ర ప్రదేశమైన గౌతమి నదీ తీరమున మహామునులందరూ ఆశ్రమములు ఏర్పరచుకొనిన ప్రదేశము మునిమండలి. ప్రస్తుతము వాడుకలో ఉన్న మురమళ్ళ గ్రామం. ఆనాటి నుండి మహామునులందరూ శ్రీ వీరేశ్వర స్వామివారికి గాంధర్వ వివాహ పద్ధతితో నిత్య కళ్యాణము చేయుచుండిరి లోక ప్రసిద్ధి గాంచిన శ్రీ స్వామివారి నిత్య కళా్యాణమునకు నిత్యము అగస్త్యుడు. శుకుడు, విశ్వామిత్రుడు వశిష్ఠుడు, గౌతముడు, భార్గవుడు, వ్యాసుడు, భారద్వాజుడు, మారీచుడు, కశ్యపుడు, మార్కండేయుడు, నారదులవారు మొదలైన ఋషీశ్వరులందరూ వేంచేచుదురని పురాణములో ఉంది. ఈ పద్ధతి ప్రకారమే నేటికీ శ్రీ స్వామి వారికి నిత్యకళ్యాణము చేయుట ఆనవాయితీగా వచ్చుచున్నది.
ఆలయం నిర్మాణం
కాలక్రమేనా గౌతమి నది వరదల కారణంగా ఒడ్డున ఉన్న ఆలయం నదిలోకి వచ్చాయి. కొమరగిరి వాస్తవ్యులు శైవులు వెలువలి శరభరాజు స్వప్నంలో శ్రీస్వామి వారు కనిపించి ఆలయ స్థితిని తెలిపి పున:నిర్మాణం చేయవలసిందిగా చెప్పెను. వెంటనే భక్తుల సహాయంతో శిథిలాలయంలో ఉన్న లింగమును బయటకు తీశారు. ఆలయంలో ఉన్న లింగమును గునపములతో లేవనెత్తుటకు ప్రయత్నించగా గునపముల దెబ్బకు లింగము పై భాగము నుండి నెత్తురు వచ్చింది. భక్తులు అంత భయభ్రంతులైన వారు శ్రీ స్వామివారిని ప్రార్థించగా అశరీరవాణి ఇలా పలికిందట. అచ్చట సమీపమున గల ఐ. పోలవరం గ్రామంలో శ్రీ బాణేశ్వర స్వామి వారి ఆలయమునకు చేతులపై తీసుకుని వెళ్ళవలసిందని ఆ మార్గంలో'నాకనుకూలముగా ఉన్నచోట నేనాగగలనని" పలికెను. వెంటనే వారు ఆ మహాలింగమును చేతులపై తీసుకోస్తుండా మురమళ్ళ గ్రామం దాటు లోపల ఒక 'పవిత్ర స్థలము చేరేసరికి ఆ దివ్యలింగము మహాభారం వహించింది. భక్తులు భారమును తట్టుకోలేక స్వామి వారి ఆజ్ఞగా తలచి ఆ అచటనే ఉంచి ఆలయము, గోపురము నిర్మించి ప్రతిష్ఠ చేశారు.పూర్వం వలె మహావైభవముగా నిత్య కళ్యాణము జరుపుతున్నారు.
నిత్య కల్యాణం
తమ సంతానానికి వివాహం ఆలస్యమవుతున్నవారు. ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తే త్వరలో వారి సంతానం వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులు అలా చేయించే కళ్యాణాలే నిత్యం జరుగుతూంటాయి. స్వామివారి నిత్య కళ్యాణానికి భక్తులేకాక అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్టుడు, గౌతముడు, వ్యాసుడు మొదలగు ఋషీశ్వరులనేకులు ప్రతి నిత్యం విచ్చేస్తారని పురాణ కథనం.
రవాణా సౌకర్యం
రవాణా సౌకర్యం ఉంది. వివిధ ప్రాంతాల నుండి మురమళ్ళకు దూరం.
అమలాపురం -22 కీలోమీటర్లు
రాజమహేంద్రవరం -85కీలోమీటర్లు
కాకినాడ-35 కీలోమీటర్లు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire