History of Panchavati : తండ్రి ఆజ్ఞతో వనవాసానికి సిద్ధమైన శ్రీరామచంద్రమూర్తి శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణస్వామిలను వెంటబెట్టుకుని గోదావరి తీరమునకు...
History of Panchavati : తండ్రి ఆజ్ఞతో వనవాసానికి సిద్ధమైన శ్రీరామచంద్రమూర్తి శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణస్వామిలను వెంటబెట్టుకుని గోదావరి తీరమునకు చేరుకున్నాడు. అప్పటికే ఈ ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవనం గడుపుతూ వుండిన అగస్త్య మహాముని. 'మీ వనవాసానికి అనువైన ప్రాంతం ఇదే' అని సూచించడంతో శ్రీరాముడు ఈ ప్రాంతంలో పర్ణశాలను నిర్మించుకున్నట్లు కథనం. ఈ ప్రాంతానికి పంచవటి అని పేరు. ఇక్కడ ఐదు పెద్ద వటవృక్షాలు వుండడంవల్ల దీనికి పంచవటి అన్నట్లు కథనం. నాసిక్ లోని పంచవటి ప్రాంతంతో శ్రీరాముడితో ముడిపడిన అంశాలు, గుర్తులు దర్శనీయాలు అనేకం ఉన్నాయి.
రామకుండం..
పంచవటి సమీపంలో గోదావరినది ఉంది. నాసిక్‌కు సుమారు 30 కి.మీ దూరంలోని 'త్రయంబకం' సమీపంలోని కొండల్లో పుట్టిన గోదావరినది నాసిక్ నగరంగుండా సాగిపోతుంది. పంచవటి సమీపంలోవున్న గోదావరి నది స్నానఘట్టాలను 'రామకుండం' అనే పేరుతో పిలుస్తారు. తన తండ్రి మరణవార్తను భరతుడిద్వారా తెలుసుకున్న శ్రీరాముడు ఇక్కడే శ్రద్ధాకర్మలు చేసినట్లు చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా వనవాస సమయంలో ఈ నదిలోనే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు స్నానమాచరిస్తూ వుండేవారట. వారు స్నానమాచరించినట్లుగా చెప్తూవున్న స్నానఘట్టాలను 'సీతారామలక్ష్మణకుండ్' అనే పేర్లతో పిలుస్తారు. విడివిడిగా వున్న ఈ మూడు కుండాల్లోనూ స్నానమాచరించడం పుణ్యకార్యం. నదీతీరంలో శ్రీ గోదావరి మాత ఆలయం, శ్రీ గంగాదేవి ఆలయం, శ్రీ షిరిడీసాయిబాబా ఆలయాలు ఉన్నాయి. వీటిలో శ్రీ గోదావరి మాత ఆలయం మాత్రం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ సమయంలో మాత్రమే తెరుస్తారు. మిగతా సమయాలలో మూసి వుంటాయి. మిగతా ఆలయాలు తెరిచేవుంటాయి.
శ్రీ కపాలేశ్వర మందిరం...
రామకుండానికి ఎదురుగా చిన్న గుట్టపైన ఆలయం ఉంది. బ్రహ్మదేవుడు తనను తూలనాడుతూ వుండడంతో కోపాద్రిక్తుడైన శివుడు బ్రహ్మదేవుడి తలను నరికివేశాడు. అందువల్ల తనకు సోకిన బ్రహ్మ హత్యాపాతకాన్ని తొలగించుకునేందుకు వివిధ ప్రాంతాలలో తిరుగుతూ ఇక్కడికి చేరుకుని గోదావరీనదిలో స్నానమాచరించి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకుని శ్రీ మహావిష్ణువు మాట ప్రకారం శ్రీ కపాలేశ్వరుడుగా ఇక్కడ కొలువుదీరినట్లు కథనం. ఆలయం వెలుపల వృత్తాకారంగా దర్శనమిస్తుంది. ఆలయ ముఖమండపంలో బ్రహ్మదేవుడి పంచలోహ విగ్రహం ప్రతిష్ఠితమైంది. ప్రధాన ఆలయంలో శివుడు శ్రీ కపాలేశ్వరుడుగా లింగరూపంలో కొలువుదీరి పూజలందుకుంటూ ఉన్నాడు. ఈ స్వామిని దర్శించడంవల్ల ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటినీ దర్శించినంత ఫలం లభిస్తుంది.
గోరారామ్ ఆలయం...
గోదావరీ తీరం నుంచి పంచవటికి వెళ్లే ప్రధాన రహదారిలో కుడివైపున వున్న ఈ ఆలయంలో స్వామివారు తెల్లగా వుంటాడు కనుక దీనికి 'గోరారామ్' ఆలయం అనే పేరు. ప్రాచీనమైన ఈ ఆలయం పూర్తిగా చెక్కతో నిర్మించబడింది. పూర్వం వనవాస సమయంలో శ్రీరాముడు స్నానానంతరం ఈ ప్రాంతంలో కూర్చుని పూజలు, దైవప్రార్థనలు చేసేవారని కథనం. అందుకు చిహ్నంగా ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ ప్రధాన గర్భాలయంలో శ్రీ సీతారామలక్ష్మణులు కొలువుదీరి ఉన్నారు. తెల్లని పాలరాతిమూర్తులైన ఈ దేవతామూర్తులు జీవకళ ఉట్టిపడుతూ భక్తులపై కరుణ చూపుతూ దర్శనమిస్తారు.
కాలారామ్ ఆలయం...
శ్రీరాముడి వనవాస గాథతో ముడిపడిన ఆలయమైన ఇది పంచవటిలో పెద్ద ఆలయం. వటవృక్షాలకు దగ్గరలో ఉంది. వనవాస సమయంలో శ్రీరాముడు సీతారామలక్ష్మణులతో కలిసి కొంతకాలం ఇక్కడ నివసించినట్లు కథనం. ఛత్రపతి శివాజీ అనంతరం మహారాష్టన్రు పరిపాలించిన పీష్వాల పాలనలో సుమారు 225 సం.ల క్రితం పీష్వారంగారావు బడేకర్‌కు స్వప్నంలో శ్రీరాముడు సాక్షాత్కరించి తాను వనవాస సమయంలో గడిపినచోట ఆలయం నిర్మించమని పలికినట్లూ.. దీనితో పీష్వా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు కథనం.
మహారాష్ట్ర నిర్మాణ పద్ధతిలో దర్శనమిస్తున్న ఈ ఆలయ ప్రవేశద్వారంపై చిన్నగోపురం నిర్మించబడి ఉంది. ప్రధాన ఆలయం సభామండపం, ముఖమండపం, గర్భాలయాలను కలిగివుంది. సభామండపంలో గర్భాలయంలోని మూలవిరాట్టుకు ఎదురుగా శ్రీ ఆంజనేయస్వామి అంజలి ఘటిస్తూ కొలువుదీరి దర్శనమిస్తారు. గర్భాలయంలో శ్రీరామునికి కుడివైపున లక్ష్మణుడు, ఎడమవైపున సీతాదేవి కొలువుదీరి దివ్యమైన అలంకారాలతో దర్శనమిస్తారు. నల్లని శిలారూపంలో వున్న స్వామివార్లను నల్లని సీసపురాయితో మలచినట్లు చెప్పబడుతుంది. ఈ ప్రధాన దేవతామూర్తులతోపాటు ఆలయ ప్రాంగణంలో శ్రీ వినాయక, దత్తాత్రేయ, గోపాలదాసుగా ప్రసిద్ధిచెందిన నరసింహరాజ్ మహారాజ్‌లను దర్శించవచ్చు. నల్లని రాయితో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణంలో సిమెంట్‌ను ఉపయోగించక, కేవలం బెల్లం నీరు పోసి అతికించినట్లు చెప్పబడుతోంది.1782 నుంచి 1794వరకు పన్నెండేలు 23 లక్షల రూ.ల వ్యయంతో పీష్వారంగారావు బడేకర్ ఈ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
సీతాగుంఫా...
నాసిక్‌లో పంచవటి శ్రీ సీతారామలక్ష్మణులతో ముడిపడి వున్న మరో ప్రధాన ప్రాంతం- 'సీతాగుంఫా'గా పిలువబడుతున్న సీతాదేవి గుహ. వటవృక్షం వద్దే ఉంది. బయటకు మామూలు ఇంటిలా ఉంది. ఇందులోనే వనవాస సమయంలో కొంత కాలం శ్రీ సీతారామలక్ష్మణులు నివసించినట్లు, ఇక్కడినుంచే రావణాసురుడు సీతాదేవిని అపహరించినట్లు చెబుతారు. ముందు వరండా, అందులోనుంచి సుమారు 20 అడుగుల లోతులో గుహ ఉంది. దీని లోపలకు దిగగానే శ్రీ సీతారామలక్ష్మణ విగ్రహాలు, ఆ గదికి ఎడమవైపు గదిలో శివలింగం దర్శనమిస్తారు. పూర్వం ఈ శివలింగానికి సీతారాములు అభిషేకాలు, అర్చనలు చేసినట్లు కథనం. ఈ శివలింగాన్ని దర్శించిన అనంతరం ఈ గదిలో వున్న మరో సోపాన మార్గంగుండా పైకి చేరుకుంటారు. వీటితోపాటు నాసిక్‌లో గోదావరి ఆవలితీరంలో శ్రీ సుందరనారాయణస్వామి ఆలయం, నాసిక్ రైల్వేస్టేషన్ దగ్గరలో ముక్త్ధిమ్‌గా పిలువబడే బిర్లామందిర్, నాసిక్‌కు 30 కి.మీదూరంలో వున్న జ్యోతిర్లింగ క్షేత్రం 'త్రయంబకం'లను భక్తులు దర్శించుకోవచ్చు.
రవాణా-వసతి సౌకర్యాలు..
శ్రీ రామనవమి సందర్భంగా నాసిక్‌లో 13రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ముంబైనుంచి 187 కి.మీ, షిరిడీనుంచి 110 కి.మీ, ముంబై-సూరత్ రైలుమార్గంలో నాసిక్ ఉంది. నాసిక్‌రోడ్ రైలుస్టేషన్ నుంచి 8 కి.మీ దూరంలో పంచవటి ఉంది. షిరిడీ నుంచి ప్రతిరోజూ నాసిక్‌కు ప్రైవేటు ఆపరేటర్లు టూర్‌ను నిర్వహిస్తారు. ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి రావచ్చు. నాసిక్‌లోని బిర్లామందిర్, శంకరమఠంతోపాటు ప్రైవేటు లాడ్జిలలో వసతి లభిస్తుంది. శ్రీరాముడి పాదధూళితో పునీతమైన దివ్యక్షేత్రం నాసిక్‌ను దర్శించి భక్తులు పునీతులు కావచ్చు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire