విఠోబా విఠలుడు లేదా పాండురంగడు అని కూడా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఎక్కువగా ఆరాధించే దైవం. ఈయనని విష్ణువు అవతారమైన...
విఠోబా విఠలుడు లేదా పాండురంగడు అని కూడా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఎక్కువగా ఆరాధించే దైవం. ఈయనని విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని అంశగా భావిస్తారు. విఠోబాను సాధారణంగా చేతులు వెనక్కు కట్టుకుని నిల్చుని ఉన్న నల్లటి యువకుడిగా చిత్రీకరిస్తారు. చాలా ప్రతిమల్లో రుక్మిణి కూడా తోడుగా ఉంటుంది.
మహారాష్ట్రలోని వార్కరీ, కర్ణాటకలోని హరిదాసు లాంటి ఏకేశ్వరోపాసనా సంప్రదాయాలలో విఠోబా ప్రధాన దైవం. పండరీపురంలోని విఠల దేవాలయం ప్రధాన దేవాలయం. విఠోబా గురించిన కథలన్నీ ఆయన భక్తుడు పుండరీకుడి చుట్టూ తిరుగుతాయి. ఈ పుండరీకుడే విఠోబాను పండరీపురమునకు రప్పించాడని భక్తుల విశ్వాసం. మరి కొన్ని కథలు ఆయన భక్తకవులను ఎలా కరుణించాడనే సంఘటనలమీద ఉంటాయి. ఈ వార్కరీ సంప్రదాయానికి చెందిన వాగ్గేయకారులు మరాఠీ భాషలో విఠోబా దేవునిపై అభంగాలు అనే దివ్య సంకీర్తనలు రచించారు. కన్నడదేశంలోని హరిదాసు సాంప్రదాయంలో స్తోత్రాలు, మరాఠీలోని హారతి పాటలు విఠోబా సాహిత్యంలో చెప్పుకోదగ్గవి. చాంద్రమానం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే శాయనీ ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశిలో విఠోబాకు విశేష పూజలు జరుగుతాయి.
విఠోబా పేరు మీద, చరిత్రమీద అనేక వాదోపవాదాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. అనేకమంది ఇండాలజిస్టులు విఠోబా సాంప్రదాయం ఆరంభం కాకముందే ఇలాంటి విగ్రహాలు వివిధ కాలాల్లో వీరుడిగానూ, గ్రామదేవుడిగానూ, శివుడి యొక్క మరో స్వరూపంగానూ, జైన దేవుడిగానూ పూజలందుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. విఠోబా సాంప్రదాయం, ప్రధాన ఆలయం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక వాదనలు జరుగుతున్నా 13వ శతాబ్దానికి మునుపే వాటి ఉనికిని నిర్థారించేందుకు ఆధారాలున్నాయి.
వివిధ నామాలు
విఠోబాకే విఠల, విఠ్ఠల, పాండురంగడు, పండరీనాథుడని, హరి, నారాయణుడనీ చాలా పేర్లున్నాయి. ఈ పేర్ల యొక్క మూలాల గురించి, అర్థాల గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వార్కరీ సాంప్రదాయం ప్రకారం విఠల అనే పదం విఠ్ (అంటే ఇటుక), ఠల (స్థలం అనే పదానికి రూపాంతరం, అంటే మీద నిలుచుని ఉన్న) అనే రెండు పదాల కలయిక. విఠోభా అంటే ఇటుకపై నిల్చుని ఉన్నవాడు అని అర్థం వస్తుంది. తూర్పు దేశాల చరిత్రను, సంస్కృతులను అధ్యయనం చేసిన విలియం క్రూక్ ఈ వివరణను సమర్ధించాడు. చేతులు వెనక్కి కట్టుకుని నిల్చుండటం అనే చిహ్నం భక్తుడు పుండలీకుడి గురించి ప్రచారంలో ఉన్న కథకు సంబంధించింది.
కానీ మరో భక్తుడు తుకారాం మాత్రం పేర్లకి వేరే వివరణ ఇచ్చాడు. ఆయన దృష్టిలో విఠ అంటే అజ్ఞానం అనీ ల అంటే అంగీకరించే అని అర్థం. విఠల అంటే అజ్ఞానులైన భక్తులను కూడా అక్కున చేర్చుకునేవాడని అర్థం. ప్రముఖ చరిత్రకారుడు రామకృష్ణ గోపాల్ భండార్కర్ మరొక వాదనను తెరపైకి తీసుకొచ్చాడు. ఆయన ప్రకారం విఠు అంటే విష్ణు అనే సంస్కృత పదానికి కన్నడ రూపాంతరం. మరాఠా సాంప్రదాయం ప్రకారం ల, భా అక్షరాలను చేరిస్తే పూజనీయత ఆపాదించబడుతుంది. కాబట్టి విఠల, విఠోబా పేర్లు వచ్చి ఉండవచ్చునని ఆయన భావన. ఈ విష్ణు అనే పేరు విఠుగా రూపాంతరం చెందడానికి మరాఠా, కన్నడ ప్రజలు సంస్కృత భాషను వేర్వేరుగా ఉచ్ఛరించడం కారణం కావచ్చు.
పుణెలోని దక్కను కళాశాలకు చెందిన పరిశోధకుడు ఎమ్మెస్. మాటే ప్రకారం పుండలీకుడు ఒక చారిత్రక పురుషుడు. ఆయన అప్పటి హోయసల రాజు విష్ణువర్ధనుడు లేదా బిత్తిదేవుడిని పండరీపురంలో విష్ణు ఆలయం నిర్మించేలా ప్రేరేపించాడు. అందులో దేవునికి బిత్తిదేవుని నామాంతరమైన విఠ్ఠలుడిగా నామకరణం చేశారు. విఠురాయ (విఠల రాజు), విథాయి (విఠల మాత) మరి కొన్ని నామాంతరాలు. గుజరాతీయులు నాథ్ అనే పేరును చేర్చి విఠలనాథుడు అని పిలుచుకున్నారు. మరికొంతమంది హిందీ భాషలో గౌరవ ప్రథమైన జీ కూడా చేర్చి విఠలనాథ్ జీ అని పిలుచుకున్నారు.
ఇక పాండురంగ లేదా పాండరంగ అనే పేరుకి శ్వేత వర్ణ దేవుడు అని అర్థం వస్తుంది. జైన సన్యాసి హేమచంద్ర (క్రీ.శ 1089–1172) ఈ పేరు శివుడిది కూడా అయి ఉండవచ్చునని భావించాడు. విఠోబా నల్లని వర్ణంతో చిత్రించినప్పటికీ ఆయనను శ్వేతవర్ణ దేవుడిగానే భావించారు. భండార్కర్ ఈ వైరుధ్యాన్ని ఇలా వివరించాడు. పాండురంగ అనేది పండరీపురం దేవాలయం లోని శివుడి రూపానికి ఒక విశేషణమనీ, ఇప్పటికీ అక్కడ ఉన్నది శివుని ఆలయమేనని ఆయన భావన. విఠోబా సాంప్రదాయం బాగా వేళ్లూనుకోవడంతో ఆ ఆలయం కూడా విఠోబా ఆలయంగా మారిందని ఆయన విశ్వాసం. ఇంకో వాదం ఏమిటంటే విఠోబా, ముందు శివుడి దేవాలయంగానే ఉండేది. తరువాత విష్ణు దేవాలయంగా గుర్తించారు. అందుకనే విఠోబాకు పాండురంగడని పేరు వచ్చింది. క్రూక్ ప్రతిపాదన ప్రకారం పండరీపూర్ యొక్క పూర్వనామమైన పండరాగా అనే పదాన్ని సంస్కృతీకరిస్తే పాండురంగ అయ్యింది. విఠోబాను పండరీనాథుడు (పండరీపురానికి యజమాని) అని కూడా పిలుస్తారు. చివరిగా విఠోబాను ప్రధానంగా విష్ణువు అవతారంగా భావిస్తారు కాబట్టి విష్ణు నామాలైన హరి, నారాయణ లాంటి పేర్లతో కూడా పిలుస్తారు.
ఆవిర్భావం
విఠోబా ఆరాధన ఎప్పుడు ప్రారంభమైందనే విషయంపై భిన్నాభిప్రాయాలు, వాదనలూ ఉన్నాయి. శాస్త్రవేత్తలు విఠోబా ఆవిర్భావం గురించి, విఠోబా ఒక విశిష్టమైన దేవుడిగా కొలవడం ఎప్పుడు ప్రారంభమైందనే విషయం గురించీ అనేక ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు ప్రతిపాదించారు. 8వ శతాబ్దానికి చెందిన ఆది శంకరాచార్యుడు రాసిన పాండురంగాష్టకం స్తోత్రాన్ని బట్టి విఠోబా ఆరాధన అంతకు మునుపే ప్రారంభమైందని భావించవచ్చు.
ఎ సోషల్ హిస్టరీ ఆఫ్ దక్కన్ అనే పుస్తకం రాసిన రిచర్డ్ మాక్స్వెల్ ఈటన్ ప్రకారం ఆరవ శతాబ్ద కాలానికే విఠోబా ఒక గ్రామదైవంగా ఆరాధింపబడేవాడు. విఠోబా చేతులు వెనక్కి కట్టుకుని నిల్చున్న ముద్ర బీహారుకు చెందిన పశువుల కాపరుల తెగ అహిర్ జాతి దైవం బిర్ కువర్ని పోలిఉంది. తరువాత అన్ని గ్రామదేవతలను ఆరాధించినట్టుగానే విఠోబాను కూడా శివుడిగా కొలవడం ప్రారంభించి ఉండవచ్చు. ఇలా భావించడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పండరీపురంలో విఠోబా ఆలయం చుట్టూ అనేక శైవ దేవాలయాలున్నాయి. విఠోబా కిరీటం శివలింగాన్ని పోలి ఉంది. కానీ 13వ శతాబ్దం నుంచి కవి సన్యాసులైన నామదేవుడు, ఏకనాథుడు, తుకారాం మొదలైన భక్తులు విఠోబాను విష్ణువు అవతారంగా భావించడం ప్రారంభించారు.
వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టియన్ లీ మాత్రం విఠోబా ఆరాధన సుమారు క్రీ.పూ 1000 లో కర్ణాటక రాష్ట్రం నుండి శైవారాధన ప్రధానంగా గల పండరీపురానికి తరలి వెళ్ళి ఉండవచ్చునని ఊహించాడు. అప్పట్లో ప్రధానంగా కృష్ణుని ఆరాధించే మహానుభవ సాంప్రదాయకుల ప్రభావంతో వైష్ణవ క్షేత్రంగా మారి ఉండవచ్చునని ఆయన ఊహ. ఇందుకు ఆధారంగా పట్టణంలో శివుని ఆరాధనకు సంబంధించిన శిథిలాలు గమనించవచ్చు.
సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన "శ్రీ విఠల్: ఏక్ మహాసమన్వయ" అనే పుస్తకం రాసిన ఆర్.సి. ధేరే విఠోబా ఆరాధన వేదకాలం కానీ అంతకు ముందుగానీ ఉండచ్చని అభిప్రాయపడ్డాడు. అంటే కృష్ణుని కంటే ముందు కాలానికి చెందినది. అతని సిద్ధాంతం ప్రకారం విఠోబా పశుసంపదను కాపాడటానికి ప్రాణాలు అర్పించిన అనేక మంది వీరుల కలయిక. విఠోబాను మొదటగా మహారాష్ట్రకు చెందిన గోవులను కాసుకునే ధాంగర్ తెగల వాళ్ళు పూజించేవాళ్ళు. గోసంపద నేపథ్యంగా గలిగిన దేవగిరి యాదవ వంశం ప్రాబల్యంలోకి రావడంతో విఠోబానే కృష్ణుడిగా కీర్తించడం మొదలు పెట్టారు. విఠోబాను ఈ విధంగా వైష్ణవ దేవుడిగా భావించడం వలన శైవదేవాలయం వైష్ణవ దేవాలయంగా మారింది. విఠోబాను బౌద్ధమతంలోకి కూడా ప్రవేశ పెట్టడానికి వీలుగా బుద్ధుడిని విష్ణువు అవతారంగా ప్రచారం చేశారు.
విఠోబాను విష్ణువుగా, కృష్ణుడుగా భావించినా ఆయన గోపికలతో సాగించిన రాసలీలలు లాంటి ఘట్టాలేవీ విఠోబాకు ఆపాదించలేదు. విఠోబాను తన భక్తులు ఎలాంటివారినైనా కరుణించగల దయా సముద్రుడిగా, ఒక తల్లి లాగా బిడ్డలను ప్రేమిస్తాడని వర్ణించారు.
ది కల్ట్ ఆఫ్ విఠోబా అనే గ్రంథం రాసిన జి. ఏ. డెలూరీ అనే చరిత్రకారుడు విఠోబా విగ్రహం ఒక వీరుడిదై ఉండవచ్చునని తరువాత కృష్ణుడి రూపాన్ని సంతరించుకుని ఉండవచ్చునని, పుండలీకుడు వైదిక పూజలను భక్తి ఉద్యమంగా మార్చి ఉండవచ్చునని అభిప్రాయపడ్డాడు. ఇండాలజిస్టు డా. తిలక్ అభిప్రాయం ప్రకారం విఠోబా అప్పుడు ఉన్న బ్రాహ్మణ దేవుళ్ళకు ప్రత్యామ్నాయంగా మారాడు. సామాన్య భక్తులైన వార్కరీల రాకతో విఠోబా ప్రాభవం మరింత మెరుగైంది. శివుడు, విష్ణువులకు చేసే పూజలు ఒక ఆచారం ప్రకారం జరుగుతూ ఉండటంతో విఠోబా ఒక సామాన్యుల దేవుడిగా, పేదలను అవసరంలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్భాంధవుడిగా రూపాంతరం చెందాడు. స్టీవెన్సన్ (1843) విఠోబా విగ్రహం జైన విగ్రహాలను పోలి ఉండటంతో ఆయన ఒక జైన సన్యాసి అయిఉండవచ్చునని భావించాడు.
పండరీపురంలోని ప్రధాన ఆలయ శిఖరం
విఠోబా చరిత్రను శాస్త్రీయంగా పరిశీలించాలంటే పండితులు పండరీపురంలో అత్యంత పురాతనమైనదిగా భావిస్తున్న ప్రధాన ఆలయం ఎన్ని సంవత్సరాల క్రిందటిదో నిరూపిస్తే తెలుస్తుంది. ఆలయంలోని అతి ప్రాచీనమైన భాగం క్రీ.శ 12, 13 వశతాబ్దాలకు చెందిన యాదవరాజుల కాలానికి చెందినది. ఆలయం విస్తరించడం చాలాకాలం కొనసాగినప్పటికీ చాలా భాగం 17వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. ఆలయం మొదటిసారిగా ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైందని భండార్కర్ చెప్పలేకపోయినా 13 వశతాబ్దానికి చెందినదని మాత్రం ఆధారాలు చూపించగలిగాడు. ఎస్.జి. తులుపే ప్రకారం క్రీ.శ 1189 కే ఆలయం అక్కడ ఉంది. అక్కడ పరిసరాల్లో దొరికిన ఒక శాసనంలో 1189 సంవత్సరంలో విఠోబా కోసం చిన్న గుడి కట్టినట్లు లిఖించబడి ఉంది. కాబట్టి విఠోబా ఆరాధన అంతకుముందే ప్రారంభమై ఉండవచ్చునని ఆయన నిర్ధారించాడు.
ఆలయ పైభాగంలోని రాతి స్తంభం పైన 1237 లో ఒక శాసనాన్ని కనుగొన్నారు. దాని ప్రకారం హోయసల రాజైన సోమేశ్వరుడు విఠలుడి నైవేద్య నివేదన ఖర్చుల కోసం ఒక గ్రామాన్ని దానం చేసి ఉన్నాడు. 1249 లో రాగిరేకుమీద లభ్యమైన శాసనం ప్రకారం క్రిష్ణుడు అనే యాదవరాజు భీమారధి నది ఒడ్డున ఉన్న పౌండ్రక క్షేత్రాన్ని మహావిష్ణువు సమక్షంలో తన సేనానాయకులలో ఒకడికి దానమిచ్చినట్టుగా ఉంది. పండరీపురంలోని మరో రాతి శాసనం అక్కడి ప్రజలు, విఠలుడు, ఇతర దేవతల ప్రీతి కోసం బలులు ఇచ్చినట్లు వివరించబడి ఉంది. కాబట్టి 13వ శతాబ్దం నుండి ఈ ఊరు పాండురంగని ఊరుగా పిలవబడుతూ వస్తోంది. ఆలయం లోపల మరొక రాతి శాసనం 1272, 1277 సంవత్సరాల మధ్యలో దాతలు అనేకమంది, ముఖ్యంగా యాదవ రాజు రామచంద్రుడి మంత్రి హేమాద్రి ఆలయానికి కానుకలు సమర్పించినట్లు లిఖించబడి ఉంది.
1209 సంవత్సరానికి చెందిన ఆలంది శాసనంలో విఠలుడు, రకుమాయి గురించి ప్రస్తావన ఉంది కాబట్టి విఠోబా గురించిన మొట్ట మొదటి శాసనం ఇదే అయి ఉండవచ్చునని రనడే భావిస్తున్నాడు. కానీ 516 సంవత్సరానికి చెందిన రాష్ట్రకూటుల రాగి శాసనంలో కూడా పాండరంగ అనే పేరు ఉంది. దీన్ని బట్టి సురుచి పాండే ఆరవ శతాబ్దానికే విఠోబా సాంప్రదాయం మొదలయి ఉండవచ్చునని భావిస్తున్నది.
ఆలయం లోని మూలమూర్తి యొక్క భౌతిక లక్షణాలను బట్టి, దానిని వివరించే కొన్ని రచనలను స్ఫూర్తితో విఠోబా ఆరాధన గురించి అనేక కథనాలు పుట్టుకువచ్చాయి. స్కాంద పురాణం లోని పుండలీకుడి కథను అనుసరించి పండరీపురంలో రెండు మూలమూర్తులు ఉండవచ్చునని శాండ్ అనే చరిత్రకారుడు నిర్ధారించాడు. ఒకటి తీర్థ మూర్తి, పవిత్ర భీమానది ఒడ్డున పుండలీకుడి ఆలయం దగ్గర్లోనే పశ్చిమంవైపుకు ఉన్నది. రెండవది క్షేత్ర మూర్తి, ప్రస్తుతం కొండమీద 1189 నుంచి ఉన్న ఆలయం యొక్క శక్తి స్థానంలో తూర్పువైపుకు ఉన్నది. కాబట్టి విఠోబా ఆరాధన ఆలయం కంటే ప్రాచీనమైనదని భావిస్తున్నాడు.
ఆలయ నిర్మాణంలో వాడిన హేమదపంతి వాస్తుకళను బట్టి అది 13వ శతాబ్దానికి చెందినదని భావించినా విఠోబా విగ్రహం మాత్రం అంతకు ముందు శైలి ప్రకారం పండరీపురంలో ఉన్న మరో చిన్న ఆలయం కోసం చెక్కి ఉండవచ్చునని డెల్యూరీ అనే చరిత్రకారుడు భావించాడు. ఆ విగ్రహ తయారీలోని పనితనం యాదవులు (1175–1318), చాళుక్యులు (943-1210), ఇంకా అజ్మీర్ చౌహాన్ల (685-1193) కాలం కంటే ముందుకాలానిది అయి ఉండాలి. విగ్రహ శాస్త్రం ప్రకారం పండరీపుర ఆలయం లాగా మరే విష్ణువు ఆలయం లేనప్పటికీ మధ్యప్రదేశ్ లోని ఉదయగిరి గుహల్లో ఉండే వెనక్కి చేతులు కట్టుకుని నిలుచున్న విష్ణుమూర్తి విగ్రహానికి, పండరీపురంలో ఉండే మూర్తికి సారూప్యత గమనించారు. కానీ అదే వేరే శిల్పకళ అని తేల్చారు.
పుండలీకుడు
విఠోబా పురాణ గాథల్లో ఎక్కువగా కనిపించే పాత్ర పుండలీకుడు. విఠోబాను ప్రధాన దైవంగా ఆరాధించే వార్కరీ సాంప్రదాయం ప్రారంభించిన చారిత్రక పురుషుడిగా ఈయనను అభివర్ణిస్తారు. స్టీవెన్ సన్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి వార్కరీ సాంప్రదాయంలో కొన్ని ఆచారాలు జైనుల, బౌద్ధుల నియమాలను పోలి ఉంటాయి కాబట్టి పుండలీకుడు ఒక జైన లేదా బౌద్ధ సన్యాసి అయి ఉండవచ్చునని భావించాడు. ఫ్రేజర్, ఎడ్వార్డ్స్, పి. ఆర్. భండార్కర్ (1922) మొదలైన చరిత్రకారులంతా పుండలీకుడు శివుడిని, విష్ణువును ఏకం చేయడానికి ప్రయత్నించాడని, ఇది కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభమై ఉండవచ్చునని భావించారు. రనడే (1933) ప్రకారం పుండలీకుడు ఒక కన్నడ సాధువు. అతను వార్కరీ సాంప్రదాయాన్ని ప్రారంభించడమే కాకుండా పండరీపురంలోని ఆలయానికి మొట్టమొదటి, ప్రధాన పూజారిగా ఉన్నాడు. ఉపాధ్యాయ మాత్రం అతను పూజారి అనే భావనను సమర్ధించాడు గానీ అతది కన్నడ మూలాన్ని మాత్రం ఒప్పుకోలేదు. ఎం.ఎస్ మాటే ప్రకారం పుండలీకుడు హోయసాల రాజు విష్ణువర్ధనుడిని ఒప్పించి పండరీపురంలో విష్ణు దేవాలయాన్ని నిర్మింపజేశాడు కాబట్టి అతను 12వ శతాబ్దానికి చెందిన వాడు అని తేల్చాడు. రేసైడ్ (1965), ధన్ పల్వార్ (1972), వాడెవిల్లీ (1974) మాత్రం అసలు పుండలీకుడు చారిత్రిక పురుషుడే కాదనీ, అతను కేవలం పురాణ పాత్ర అని భావించారు.
గుర్తింపు
గోవాలోని, శ్రీ బాలాజీ దేవాలయం యొక్క రెండు వరసలలో పది ఫలకాలతో కూడిన వెండి ద్వారం. ఇవి విష్ణువు యొక్క దశావతారాలు. పై నుంచి నాలుగో వరుసలో ఎడమ వైపున ఉన్నది విఠోబా రూపం. ఈ స్థానంలో బుద్ధుడిని చూపించేవారు.
విఠోబాను ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, శివుడి ప్రతిరూపాలుగా భావిస్తున్నారు. కొన్ని హిందూ శాస్త్రాల ప్రకారం బుద్ధుడు విష్ణువు యొక్క తొమ్మిదవ అవతారం అనుకుంటే విఠోబాను బుద్ధుడిగా కూడా భావించవచ్చు. విఠోబా కృష్ణుని అవతారమని కొన్ని పురాణాలలో పేర్కొన్నా వార్కరీలు మాత్రం విఠోబాను విష్ణువు ఒక అవతారంగా కాకుండా అసలు స్వరూపంగానే భావిస్తారు. 13వ శతాబ్దంలో కృష్ణుడిని ప్రధాన దైవంగా పూజిస్తూ ప్రాచుర్యంలోకి వచ్చిన మహానుభవ సాంప్రదాయ అనుసరణీయులు మాత్రం విఠోబా కృష్ణుడే కాదంటూ కొన్ని హేళనతో కూడిన వ్యాఖ్యానాలు చేశారు.
కొన్ని సాంప్రదాయాలలో విఠోబాను శివుడిగా కూడా పూజించేవారు. మహారాష్ట్రకే చెందిన ధంగర్లు విఠోబాను శైవమత దేవుడిగా భావించేవారు. అండర్ హిల్ అనే చరిత్రకారుడు పండరీపురంలోని ఆలయం శివకేశవులకు బేధం లేకుండా పూజించిన ఆలయమనీ ప్రతిపాదించాడు. కానీ ఆలయంలోని ప్రధాన అర్చకులకు (బద్వా బ్రాహ్మణులు) మాత్రం శివుడు కాదు, విష్ణువు కాదు, విఠోబా అంటే విఠోబానే. కొద్ది మంది అర్చకులు మాత్రం మూర్తి విగ్రహం హృదయ భాగంలో ఉన్న గుర్తులు చూపించి విష్ణువు లేదా కృష్ణుడితో పోలుస్తారు.
మహారాష్ట్రలోని కొన్ని పంచాంగాలలో కొన్ని ఆలయాల శిల్పాలలో దశావతారాలు సూచించేటపుడు బుద్ధుడి బదులు విఠోబాను చూపిస్తుంటారు. 17వ శతాబ్దంలో మరాఠా శిల్పులు విష్ణువు అవతారాల్లో తొమ్మిదో అవతారంలో బుద్ధుడి బదులు విఠోబాను చెక్కారు. వీటిని శివనేరి గుహలలో గమనించవచ్చు. కొంతమంది వాగ్గేయకారులు కూడా విఠోబాను బుద్ధుడిగా కీర్తించారు. బౌద్ధమతంలోకి మారిన బి. ఆర్. అంబేద్కర్ కూడా పండరీపురంలో ఉన్న విఠోబా విగ్రహం నిజానికి ఒక బుద్ధ విగ్రహం అని అభిప్రాయపడ్డాడు.
ప్రతిమా శాస్త్రం
విఠోబా యొక్క అన్ని ప్రతిమలు పండరీపురంలోని మూలమూర్తిని పోలి ఉంటాయి. అది నల్లటి బసాల్ట్ శిల నుంచి చెక్కబడిన 3 అడుగుల 9 అంగుళాల విగ్రహం. విఠోబా నల్లటి బాలుడిగా కనిపిస్తాడు. భక్త కవులు ఆయన్ని నల్లటి రూపంలో ఉన్న పరబ్రహ్మం అన్నారు. శివుడికి ప్రతీకగా భావించే లింగరూపం లాంటి పొడవాటి కిరీటం ఉంటుంది. కాబట్టి జెలియట్ విఠోబాను శివ కేశవ రూపంగా అభివర్ణించాడు. వార్కరీల్లో మొదటి కవి అయిన జ్ఞానేశ్వరుడుడి (13వ శతాబ్దం) అభిప్రాయం ప్రకారం విఠోబా శివుణ్ణి తలమీద మోస్తున్నాడు. వైష్ణవ పురాణాల ప్రకారం మొట్టమొదటి విష్ణు భక్తుడు శివుడే. అంటే విఠోబా, భక్తుల భారాన్ని తన తల మీద మోస్తున్నాడు.
పుండలీకుడు విసిరిన ఇటుకపై విఠోబా చేతులు వెనక్కి కట్టుకుని నిలుచుని ఉంటాడు. తుకారాం వర్ణన ప్రకారం కౌస్తుభ మణితో కూడిన తులసి మాలను, మకర కుండలాలను ధరించి ఉంటాడు. ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిలో చేతిలో చక్రం ఉంటుంది. ఇవి విష్ణువుకు సంబంధించిన అలంకారాలే. కొన్ని చిత్రాలు విఠోబా కుడి చేయి ఆశీర్వదించినట్లుగా చిత్రీకరించబడినట్లు ఉంటాయి కానీ మూలమూర్తి విగ్రహం అలా లేదు. సాధారణంగా రెండు చేతులతోనే ఉంటాడు కానీ కొన్ని చోట్ల నాలుగు చేతులతో కూడా కనిపిస్తాడు.
పండరీపురానికి దర్శనానికి వచ్చే భక్తులు విఠోబా పూర్తి స్వరూపాన్ని దర్శించుకోవడానికి వీలుగా ఆలయ అర్చకులు వస్త్రాలేమీ ధరింపజేయరు. జాగ్రత్తగా గమనిస్తే విగ్రహంలోనే సన్నగా చెక్కబడిన నడుముకు కట్టిన గుడ్డ, సన్నని పట్టీ కనిపిస్తుంది. ఇతర చిత్రాలలో మాత్రం సాధారణంగా పూజలకోసం అలంకరించినట్లు పీతాంబరం, కొన్ని బంగారు నగలు అలంకరించబడి ఉంటాయి.
పండరీపుర విగ్రహం ఎడమ రొమ్ముపై కృషుడు, విష్ణువు బొమ్మలై కనిపించినట్లుగా శ్రీవత్సలాంచనాలు కనపడతాయి. కుడి రొమ్ముపై శ్రీనికేతనం ఉంటుంది. నడుము చుట్టూ మేఖల ఉంటుంది. కాళ్ళ మధ్యలో భూమికి ఆనించిఉన్న ఒక పొడవాటి కర్ర ఉంటుంది. మోచేతుల దగ్గర ముత్యాల సరాలు ఉంటాయి.
భార్యలు
సాధారణంగా విఠోబా చిత్రపటాలలో ఆయనతో పాటు ఎడమ వైపున రకుమాయి (అంటే రుక్మిణీ మాత) కూడా ఉంటుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం రుక్మిణి దేవి కృష్ణుని భార్య. కృష్ణుడు విష్ణువు అవతారం కాబట్టి రకుమాయి అంటే లక్ష్మీ దేవి అని భావించవచ్చు. రకుమాయిని కూడా చేతులు వెనక్కి కట్టుకుని నిలుచుని ఉన్నట్లుగానే చిత్రీకరిస్తారు. పండరీపుర ఆలయ సముదాయంలో రకుమాయికి ప్రత్యేక ఆలయం ఉంటుంది. ఘుర్యే ప్రకారం రుక్మిణి విదర్భ ప్రాంతానికి చెందిన ఒక రాజకుమారి. ఆమెకు ఆ ప్రాంతానికి ఉన్న అనుబంధం దృష్ట్యా రాధ బదులు ఆమె విగ్రహాన్ని స్థాపించారు. ధాంగర్ సాంప్రదాయం ప్రకారం రకుమాయిని పద్మావతీ దేవి లేదా వారి పశుసంపదను రక్షించే దేవత పడుబాయిగా భావిస్తారు. ధాంగర్ జనపదులు విఠోబాకు, పడుబాయికి ప్రత్యేక ఆలయాలు ఎందుకున్నాయి అనేదానికి ఒక వివరణ ఇచ్చారు. విఠోబా సంసారానికి దూరంగా ఉండమని సూచిస్తూ పడూబాయిని దూరంగా మరో ఆలయంలో ఉంచాడని వారి విశ్వాసం. రకుమాయి కాకుండా సత్యభామ, రాహి (రాధ రూపాంతరం) కి కూడా పూజలు చేస్తారు. వీరందరూ కూడా హిందూ పురాణాల ప్రకారం కృష్ణుని భార్యలే.
పూజలు
విఠోభా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిన దేవుడు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా భక్తులున్నారు. కులదేవత ఆరాధన అంత లేకపోయినా మరాఠీ ప్రజలు విఠోబాను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. విఠోబా ప్రధాన ఆలయంలోనే రకుమాయి దేవికి కూడా ప్రత్యేక ఆలయం ఉంది. అందుకునే భక్తులు పండరీపురాన్ని భూవైంకుంఠం అని పిలుస్తు ఉంటారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల నుండి భక్తులు జ్ఞానేశ్వరుడు (13వ శతాబ్దం) కాలం నుంచే దర్శనానికి వెళ్ళివస్తుండే వారు.
మహారాష్ట్రలో విఠోబా పూజకు రెండు ప్రత్యేక సాంప్రదాయాలున్నాయి. ఒకటి బద్వ కుటుంబానికి చెందిన బ్రాహ్మణులు ఆలయంలో చేసే వైదిక పూజలు, రెండోది వార్కరీలు ఆచారిస్తున్న ఆధ్యాత్మిక పూజా విధానం. వైదిక పూజా విధానంలో రోజూ ఐదు విధులు ఉన్నాయి. ఉదయాన్నే మూడు గంటలకు హారతితో మేలుకొలుపు ఉంటుంది. దీన్నే కాకదారతి అంటారు. తరువాత పంచామృత పూజ. తరువాత ఉదయాన్నే భక్తులకు దర్శనం ఉంటుంది. తరువాత మధ్యాహ్న పూజలో భాగంగా మళ్ళీ అలంకరిస్తారు. మధ్యాహ్నం తరువాత జరిగేది అపరాహ్న పూజ. చివరికి రాత్రికి విఠోబాను నిద్రపుచ్చే పవళింపు సేవ. దీన్నే శేరారతి అంటారు. ఇవే కాకుండా కర్ణాటకలో విఠోబా ప్రధానంగా అనేక సాంప్రదాయాలున్నాయి.
వార్కరీ సాంప్రదాయం
భారతీయ వైష్ణవ సాంప్రదాయాలలో వార్కరీ సాంప్రదాయం అతి ముఖ్యమైనది. భాగవత ధర్మాన్ని అనుసరించే ఈ సాంప్రదాయంలో భక్తి, ఏకేశ్వరోపాసన ప్రధానంగా ఉంటాయి. ఈ సాంప్రదాయంలో శైవ వైష్ణవ సాంప్రదాయాలే కాక ఇతర మతాలలోని ఆచారాలు కూడా కలిసి ఉంటాయి. ఈ సంప్రదాయం కర్ణాటకలో పుట్టి మహారాష్ట్రకు విస్తరించిందని భావిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం మొట్టమొదటి భక్తకవి యైన జ్ఞానేశ్వరుని రచనల్లో విఠోబాను కర్ణాటకకు సంబంధించిన దేవుడుగా వర్ణిస్తాడు. కానీ వర్ణనలో వాడిన పదాలు అంత స్పష్టంగా లేవు. పుండలీకుడు ఒక చారిత్రక పురుషుడు అని విశ్వసించే వార్కరీలు, పండితులు మాత్రం విఠోభా ఆరాధానకు అతనే మూలస్తంభం అని భావిస్తారు. దీనికి ఆధారం విఠోబా భజనల్లో కనిపించే ''పుండలీక వరద హరివిఠల్'' (అంటే పుండలీకుడిని కాచిన వాడా అని అర్థం) అనే వాక్యం. కానీ జెలియట్ ప్రకారం ఈ సాంప్రదాయం 1275–1296 మధ్యలో జీవించిన జ్ఞానేశ్వరుడు ప్రారంభించాడు. వార్కరీలు జ్ఞానేశ్వరుడికి కూడా సముచిత స్థానం కల్పించారు. దీనికి మూలం వారి భజనల్లో కానవచ్చే జ్ఞానదేవ రచిలపాయ అంటే జ్ఞానదేవుడు పునాది వేశాడు అని అర్థం వచ్చే వాక్యం.
వార్కరీలు చేతిలో తంబుర, కాషాయం జెండా పట్టుకుని ఆలంది నుంచి పండరీపురం వరకు పాదయాత్ర చేస్తారు. నామదేవుడు (1270–1350) ఒక సాధారణ దర్జీ. విఠోబాను కీర్తిస్తూ అభంగాలు అనే మరాఠీ ఆధ్యాత్మిక గీతాలు, కీర్తనలు రచించాడు. ఈ భజనలు విఠోబా సాంప్రదాయం బాగా విస్తరించేందుకు దోహదపడ్డాయి. ఇందులో సాంప్రదాయ బ్రాహ్మణులు లాగా కాకుండా ఆడ, మగ, కుల, వర్గాలకు అతీతంగా అందరినీ అనుమతించేవారు. ముస్లిం పాలకుల పరిపాలనలో ఈ విశ్వాసం కొంచెం స్తబ్దత నెలకొన్నది. కానీ విజయనగర సామ్రాజ్య పతనం తరువాత దక్షిణాపథంలో యుద్ధాలు చెలరేగాయి. ముస్లిం పాలకులు వారి రాజ్యంలోని ప్రజల మద్ధతు కూడగట్టేందుకు వారి విశ్వాసాలను సమర్ధించవలసి వచ్చింది. ఈ సమయంలో ఏకనాథుడు (1533–99) వార్కరీ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాడు. శివాజీ సారథ్యంలో మరాఠా సామ్రాజ్యం స్థాపనతో ఒక సామాన్య వ్యాపారియైన తుకారాం (1568–1650), విఠోబా సాంప్రదాయాన్ని మహారాష్ట్ర ప్రాంతమంతటా విస్తరించాడు.
ఈ భక్తకవులందరూ, నామదేవుడి సేవకురాలైన జానాబాయి లాంటి వారు కూడా విఠోబాను కీర్తిస్తూ అనేక రచనలు చేశారు. ఈ కవిత్వం అంతా విఠోబాను ఓ తండ్రిగానో, తల్లిగానో భావిస్తూ, నిర్మల భక్తితో కీర్తించడం కనిపిస్తుంది. జానాబాయి లాంటి మహిళలే కాక వివిధ కులాల నుంచి వచ్చిన అనేక మంది సామాన్యులు విఠోబాను కీర్తిస్తూ అభంగాలు రాశారు. విసోభా ఖేచర, సేనా నవి (క్షురకుడు), నరహరి సోనార్, సవతా మాలి, గోర కుంభుడు (కుమ్మరి), కనోపాత్రా (దేవదాసి), చోఖామేళా ఒక అంటరాని వాడు, షేక ముహమ్మద్(1560–1650). ఏ సంప్రదాయంలో పుట్టిన వారైనా విఠోబాను తమ తల్లిదండ్రులుగా, పండరీపురాన్ని తమ పుట్టినిల్లుగా భావించే వారందరినీ వార్కరీలు తమ మతంలో చేర్చుకున్నారు. వార్కరీలు విఠోబా జపం చేస్తారు. ప్రతి నెల ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు.
హరిదాస సాంప్రదాయం
కర్ణాటకలోని హంపి లో కృష్ణదేవరాయలు కట్టించిన విఠల దేవాలయం. ఆయన గురువైన వ్యాసతీర్థులు హరిదాస సాంప్రదాయంలో ముఖ్యుడు. హరిదాసు అంటే హరి (విష్ణువు) యొక్క సేవకుడు అని అర్థం. అచలానంద విఠల ఈ సాంప్రదాయానికి ఆద్యుడు. వైష్ణవంలో విఠలుడి మీదనే కేంద్రీకృతమైన ఒక ప్రత్యేక శాఖ.
వార్కరీలు మహారాష్ట్రకు సంబంధించిన వారైతే, హరిదాసులు కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వారు. శర్మ అనే పండితుడు విఠోబా సాంప్రదాయం ముందుగానే కర్ణాటక లోనే ఉద్భవించిందనీ, తరువాత మహారాష్ట్రకు తరలి వెళ్ళిందనీ భావించాడు. ఈయన వాదనకు మూలం వార్కరీ సాంప్రదాయంలో పైన పేర్కొన్న జ్ఞానేశ్వరుడి రచనలు. లుగెంఢార్ఫ్ అనే చరిత్రకారుడు మాత్రం ఈ భక్తి ఉద్యమానికి మూల కారకుడు రాయల గురువైన వ్యాస తీర్థులు (1478–1539) అని భావిస్తున్నాడు. రాయల కాలంలో విఠలుడు రాజ లాంఛనాలతో పూజలందుకునే వాడు. ప్రస్తుతం హంపిగా పిలవబడుతున్న రాయల రాజధానిలో విఠల దేవాలయాన్ని నిర్మింప జేశాడు.
పండరీపురంలోని విఠల దేవాలయం ఎంత పవిత్రమైనదో హరిదాసులకు హంపిలోని విఠల దేవాలయం కూడా అంతే పవిత్రమైనది. వారు విఠోబాను కృష్ణుని రూపాలలో ఒకడిగా పూజలు చేస్తారు. హరిదాస సాహిత్యం సాధారణంగా విఠలుడిని, లేదా కృష్ణుని కీర్తించినట్లు ఉంటుంది. విఠలుడిపై గౌరవభావంతో హరిదాస కవులైన విజయ విఠలుడు, గోపాల విఠలుడు, జగన్నాథ విఠలుడు, వేణుగోపాల విఠలుడు, మోహన విఠలుడు మొదలైన వారు విఠలుడిని తమ పేర్లలో భాగంగా చేసుకున్నారు. కర్ణాటక సంగీతానికి ఆద్యుడు, హరిదాస ఉద్యమంలో ముఖ్యుడైన పురందర దాసు (1484–1564) తన కన్నడ రచనల్లో విఠలుని కీర్తిస్తూ మకుటాలు ఉంటాయి.
పుష్టిమార్గం సాంప్రదాయం
పుష్టిమార్గ సాంప్రదాయాన్ని ప్రారంభించిన వల్లభాచార్యుడు (1479–1531) పండరీపురాన్ని కనీసం రెండు సార్లు సందర్శించి ఉంటాడనీ భావిస్తున్నారు. విఠలుడు ఆయన్ని పెళ్ళి చేసుకోమని, తద్వారా తనే అతనికి సంతానంగా పుడతాననీ చెప్పినట్లు ఆ సాంప్రదాయీకుల విశ్వాసం. కోరినట్టే వల్లభాచార్యుడు వివాహం చేసుకున్నాడు. అతని రెండో సంతానం విఠలుని ప్రతిరూపంగా భావించి విఠలనాథ్ అని పేరు పెట్టుకున్నారు. ఇతన్నే గుసైంజీ అని కూడా పిలుస్తారు.
పండుగలు జ్ఞానేశ్వరుని పల్లకి, అతని పాదరక్షను వెండి రథం మీద ఊరేగిస్తూ ఆలంది నుంచి పండరీపురం వరకు తీసుకువెళతారు. విఠోబాకు సంబంధించిన పండుగలు ప్రధానంగా వార్కరీలు సంవత్సరానికి రెండు సార్లు సాగించే యాత్రలతో ముడిపడి ఉంటాయి. ఈ యాత్రలో భాగంగా యాత్రికులు జ్ఞానేశ్వరుడు, తుకారాం స్వగ్రామాలైన ఆలంది, దేహూ గ్రామాల నుంచి పండరీపుర ఆలయానికి యాత్ర చేస్తారు. భక్త కవుల యొక్క పల్లకీలు మోస్తూ దారి పొడవునా అభంగాలు కీర్తన చేస్తూ వెళతారు. వార్కరీలు వైదిక పూజలేమీ నిర్వహించకుండా కేవలం దర్శనం మాత్రం చేసుకుంటారు. పూజారులు నిర్వహించే వైదిక పూజలు ఆషాఢ, కార్తీక మాసాల్లో ఏకాదశి పర్వదినాన ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. అప్పుడే భక్తులు పెద్ద సంఖ్యలో యాత్రలు చేస్తుంటారు. మాఘ, చైత్ర ఏకాదశి రోజుల్లో కూడా కొద్ది సంఖ్యలో భక్తులు విఠోబాను దర్శించుకుంటారు.
సుమారు 800,000 మంది వార్కరీలు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పండరీపురానికి యాత్రగా వెళతారు. శాయనీ ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి రోజులకు విష్ణు పురాణాలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. హిందువుల విశ్వాసం ప్రకారం విష్ణువు పాల కడలిలో ఆదిశేషునిపై శయనిస్తాడు. ఈ నిద్ర శాయనీ ఏకాదశి నాడు మొదలై నాలుగు నెలలపాటు కొనసాగి ప్రబోధినీ ఏకాదశి నాడు అంతమవుతుంది. ఆషాఢ, కార్తీక మాసాల్లో జరిగే ఉత్సవాలు పౌర్ణమి దాకా కొనసాగి జ్యోతుల ఊరేగింపుతో ముగుస్తాయి. 11 వ శతాబ్దానికి చెందిన కొన్ని శాసనాలు పండరీపురానికి చేసే ఏకాదశి యాత్రల గురించి ప్రస్తావించి ఉన్నాయి. శాయనీ ఏకాదశి నాడు, ప్రబోధిని ఏకాదశి నాడు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైదిక పూజలు నిర్వహిస్తారు. దీనినే సర్కారీ మహాపూజ అని కూడా అంటారు.
ఏకాదశి కాకుండా పండరీపురంలో దసరా రాత్రి ఒక ఉత్సవం నిర్వహిస్తారు. అందులో భాగంగా విఠోబాకు ఎదురుగా ఉండే రంగ శిల (పెద్ద వేదిక) మీద భక్తులు అడుగులు వేస్తారు. దీని తరువాత దివిటీలతో ఊరేగింపు నిర్వహిస్తారు. ఇంకా హోలీ (రంగ పంచమి) నాడు దేవుడి పాదాలపై కుంకుమ చల్లుతారు. కృష్ణాష్టమి నాడు తొమ్మిది రోజులు పాటు విఠోబా ఎదురుగా ఆడి పాడతారు. బుధవారాలు, శనివారాలు, ఏ నెలలోనైనా ఏకాదాశి రోజుల్లో, ఇంకా వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఏ శుభ తిథి యైనా ఆలయం సందడిగా ఉంటుంది.
ఆధ్యాత్మిక రచనలు
విఠోబాకు సంబంధించిన ఆధ్యాత్మిక రచనలు ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఒకటి వార్కరీ సాహిత్యం, మరొకటి బ్రాహ్మణ సాహిత్యం, మూడోది ఈ రెండూ కలగలిసినది. వార్కరీ సాహిత్యం మరాఠీలో రాయబడి ఉంది. బ్రాహ్మణులు రాసిన సాహిత్యం సంస్కృతంలో ఉంటుంది. మూడో రకం బ్రాహ్మణులే మరాఠీలో రాసిన సాహిత్యం ఉంటుంది. మహీపతి రాసిన భక్తలీలామృత, భక్తవిజయ, బహినాబాయి రాసిన పుండలీక మహత్మ్యం నామదేవుడు రాసిన సుదీర్ఘమైన అభంగం వార్కరీ సాహిత్యంలో ముఖ్యమైనవి. ఇవన్నీ పుండలీకుడు పురాణ గాథను వివరిస్తాయి. స్కాంద పురాణం లోనూ, పద్మ పురాణం, విష్ణు పురాణాల్లో కనిపించే పాండురంగ మహత్మ్యం, పద్మ పురాణంలో కనిపించే భీమ మహత్మ్యం విఠోబాపై బ్రాహ్మణులు రాసిన సాహిత్యానికి ఉదాహరణలు. ఇక మూడో సాంప్రదాయానికి చెందిన రచనల్లో శ్రీధరుడు అనే బ్రాహ్మణుడు 750 శ్లోకాలతో రాసిన పాండురంగ మహత్మ్యం, అదే పేరుతో 181 శ్లోకాలతో ప్రహ్లాద మహారాజ్ రాసిన గ్రంథం ముఖ్యమైనవి.
పైన పేర్కొన్నవి కాకుండా అనేక సంఖ్యలో వార్కరీలు రాసిన అభంగాలు, స్తుతులు, హరిదాస సాంప్రదాయం నుంచి వచ్చిన కీర్తనలు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనది ఆది శంకరాచార్యుడు రాసినట్లుగా చెప్పబడుతున్న పాండురంగాష్టకం లేదా పాండురంగ స్తోత్రం. నామదేవుడు, లేదా జ్ఞానేశ్వరుడు లేక ఇంకా అనేకమంది కవులు రాసినట్లుగా చెప్పబడుతున్న తీర్థావళి గాథ అనే గ్రంథం వార్కరీ సాంప్రదాయాన్ని, విఠోబా ఆరాధనను మరింత విస్తృతం చేయడానికి రాయబడి ఉన్నాయి. ఇంకా నామదేవుడు రాసిన యుగే అత్తవిస విఠేవరి ఉభా, ఏ ఓ విఠల మాజే మౌళి రే లాంటి హారతి పాటలు కూడా విఠోబా సాహిత్యంలో భాగమే. ఈ హారతి పాటల్లో విఠోబా పీతాంబరాలు ధరించినట్లుగా, గరుడునితోనూ, హనుమంతునితోనూ సేవలు చేయించుకున్నట్లుగా వర్ణించారు. తెనాలి రామకృష్ణుడు (16 వ శతాబ్దం) రాసిన పాండురంగ మహత్మ్యం గ్రంథంలో విఠోబాను పాండురంగ అని సంబోధించాడు. పద్య భావం " ఓ పార్వతీ భక్తుడైన పుండరీకుడు, క్షేత్రపాలకుడైన కాల భైరవుడు సేవలు చేస్తుండగా పాండురంగడు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షమై ఆలయంలో వెలసియున్నాడు".
దేవాలయాలు
మహారాష్ట్రలో విఠోబాకు చాలా దేవాలయాలున్నాయి. ఇంకా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో కూడా కొన్ని దేవాలయాలున్నాయి. కానీ పండరీపురంలోనీ విఠోబా దేవాలయం ఒక మూలస్థానం లాంటిది. ఆలయం స్థాపించిన తేదీ మీద అనేక అభిప్రాయాలున్నా జ్ఞానేశ్వరుడి కాలానికి (13 వ శతాబ్దం) ముందే అక్కడ ఆలయం ఉందడానికి ఆధారాలున్నాయి. ఇక్కడ విఠోబాతో పాటుగా రుక్మిణి, సత్యభామ, రాధ, ఇంకా ఇతర వైష్ణవ దేవతలైన వేంకటేశ్వరుడు, మహాలక్ష్మి, గరుత్మంతుడు, ఆంజనేయుడు లాంటి వారు కూడా పూజలందుకుంటున్నారు. శైవ దేవతలైన గణపతి, శివుడి రూపంగా భావించే ఖండోబా, అన్నపూర్ణా దేవి లాంటి వారికీ పూజలు చేస్తుంటారు. నామధేవుడు, చొక్కమేళా, జానాబాయి లాంటి వారి స్మారక చిహ్నాలు కూడా ఆలయంలో ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రాముఖ్యం ఉన్న మరి కొన్ని ఆలయాలు తుకారాం జన్మస్థలమైన దేహూలో, సతారా జిల్లాలోని కోల్‌లో, కొల్హాపూర్, రాజ్ పూర్, మాధే, షాబాద్ లలో ఉన్నాయి.
గోవాలో కూడా చాలా దేవాలయాలు కనపడతాయి. ఇందులో ముఖ్యమైనవి సాంక్వెలిమ్, సాన్గెయెం, గోకర్ణం. మార్గోవ్ లోని విఠలదేవాలయాలలో కూడా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. గోవా లోని పోండా కూడా భక్తులను బాగా ఆకర్షిస్తుంటుంది. రాజస్థాన్ లోని నాథ్ ద్వారా లో విఠోబా విఠలనాథ్ పేరుతో పూజలందుకుంటున్నాడు.
విజయనగర, మరాఠీయుల పరిపాలనలో విఠోబా సాంప్రదాయం దక్షిణాపథంలోకి ప్రవేశించింది. ఇక్కడ విఠోబాను విఠల అని సంబోధిస్తుంటారు. హంపిలోని విఠల దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటి, మహారాష్ట్ర బయట ఉన్న అత్యంత ప్రముఖమైన విఠోబా దేవాలయం. దీన్ని 15వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలోనే కృష్ణదేవరాయలు ముస్లిం పరిపాలకుల నుంచి రక్షించడానికి పండరీపురం ప్రధాన మూర్తిని తీసుకొచ్చి ఉంచాడని కొంతమంది విశ్వాసం. దీన్ని తరువాత ఏకనాథుడి ముత్తాతయైన భానుదాస్ (1448–1513) తిరిగి పండరీపురానికి చేర్చాడు. ప్రస్తుతం హంపి విఠల దేవాలయంలో మూల మూర్తి లేడు. 1516, 1565 మధ్య కాలంలో విజయనగర సామ్రాజ్యపు ప్రధాన దేవుడైన విరూపాక్షుడి సమక్షంలో జరగాల్సిన కొన్ని ముఖ్యమైన లావాదేవీలు విఠల దేవాలయంలో జరిగాయి. మధ్వాచార్యుడి మూడు ఆశ్రమాలైన షిరూరు, పెజావర, పుట్టిగెలో విఠలుడు ప్రధాన దైవం. కర్ణాటక లోని ముళబాగల్ లో విఠలేశ్వర దేవాలయం ఉంది. తమిళనాడులోని శ్రీరంగం, తిరుపోరూరుకు సమీపంలోని విఠల పురం, తెన్నంగూరు, తంజావూరు జిల్లా కుంభకోణంకు సమీపం లోని గోవిందపురంలో విఠల దేవాలయాలున్నాయి. కంచిలో కూడా కొన్ని విఠల శిల్పాలు కనిపిస్తాయి.
రాయలసీమ లోని చిత్తూరు, కడప జిల్లాల్లోని చాలా గ్రామాల్లో పాండురంగనికి దేవాలయాలున్నాయి. ఈ ఆలయాలన్నింటిలో ప్రతి సంవత్సరం ఒక పౌర్ణమికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో అగ్నిగుండ ప్రవేశం ప్రధానమైన భాగం. ఇంకా ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పండరి భజనలు కూడా ప్రదర్శిస్తారు. ఈ భజనల్లో పండరీనాథుని కీర్తిస్తూ భక్తులందరూ వలయాకారంలో నిలిచి లయబద్ధంగా అడుగులు వేస్తారు. కోలాటం కూడా ప్రదర్శిస్తారు.
పురాణ కథలు
విఠోబాకు సంబంధించిన పురాణ గాథలన్నీ ఎక్కువగా ఆయన భక్తుడైన పుండరీకుడి చుట్టూ తిరుగుతాయి. ఇంకా విఠోబాను వార్కరీ సాంప్రదాయానికి చెందిన భక్తకవులను కరుణించిన వాడిగా చిత్రీకరించబడి ఉంటాయి. పుండరీకుని గురించిన ప్రస్తావన స్కాంద పురాణంలోనూ, పద్మపురాణంలోనూ ఉంది. ఇంకా శ్రీధరుడు రాసిన పాండురంగ మహాత్మ్యం అనే గ్రంథంలోనూ, అదే పేరుతో ప్రహ్లాద మహారాజ్ రాసిన గ్రంథం లోనూ, అనేక భక్తకవులు రాసిన అభంగాలలోనూ పుండరీకుని ప్రస్తావన ఉంది.
పుండరీకుడి గురించి మూడు రకాలైన కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో రెండు స్కాంద పురాణంలో పాఠ్యానికి దగ్గరగా ఉంటాయి. మొదటి కథ ప్రకారం పుండరీకుడు విష్ణు భక్తుడు. తల్లదండ్రుల సేవలో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకసారి గోవర్ధన గిరిధారియైన శ్రీకృష్ణుడు గోవులు కాచే గోపాలుడి రూపంలో పుండరీకుని కలవడానికి వస్తాడు. ఆయన రూపం దిగంబరమై, మకర కుండలాలతో, శ్రీవత్సముతో, తలపై నెమలి పింఛంతో చేతులు నడుము మీద పెట్టుకుని, గోవులను తరిమే కర్రను రెండు కాళ్ళ మధ్య పెట్టుకుని దర్శనమిచ్చాడు. పుండరీకుడు అతణ్ణి భీమానది ఒడ్డునే అదే రూపంలో ఉండిపొమ్మని కోరాడు. అలా ఉంటే ఆ స్థానం పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని ఆయన నమ్మాడు. ఈ ప్రాంతమే ప్రస్తుతం బీమా నది ఒడ్డున ఉన్న పండరీపురం అని గుర్తించారు. ఇక్కడ కృష్ణుని వర్ణించిన విధానం పండరీపురంలోని విఠోబా విగ్రహం యొక్క రూపురేఖలతో సరిపోయింది.
రెండో కథ ప్రకారం విఠోబా పుండరీకుడికి ఐదేళ్ళ బాలకృష్ణుడిగా దర్శనమిచ్చాడు. ఈ కథ రెండు పురాణాల్లోనూ, ప్రహ్లాద మహారాజ్, తుకారాం లాంటి భక్తకవుల రచనల్లోనూ కనిపిస్తుంది. మిగతా కథ శ్రీధరుడి రచనలోనూ, కొంచెం మార్పులతో పద్మపురాణం లోనూ కనిపిస్తుంది. పుండలీకుడు ఒక బ్రాహ్మణుడు. తన భార్యపై ప్రేమానురాగాలతో వయసు మళ్ళిన తల్లిదండ్రులను సైతం విస్మరిస్తాడు. తరువాత కుక్కుట మహర్షిని కలిసిన తరువాత తన జీవన విధానంలో మార్పు వస్తుంది. తల్లిదండ్రుల సేవకై అంకితం చేస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి నిచ్చెలియైన రాధ ఒకసారి ద్వారకకు వచ్చి ఆయన ఒడిలో కూర్చుంటుంది. అక్కడే రుక్మిణి ఉన్నా ఆమె పట్టించుకోలేదు, అందుకు కృష్ణుడు కూడా అభ్యంతరపెట్టలేదు. అందుకు రుక్మిణి అలిగి కృష్ణుని వదిలి పండరీపురం సమీపంలోని దండీవనానికి వెళ్ళిపోతుంది. దాంతో కృష్ణుడు బాధపడి ఆమెను వెతుకుతూ దండీవనంలోని పుండలీకుడి ఇంటి దగ్గర ఆమెను కనుగొంటాడు. కొంతసేపు బుజ్జగించిన తరువాత రుక్మిణి మెత్తబడుతుంది. తరువాత పక్కనే కృష్ణుడు పుండలీకుడు తన తల్లిదండ్రులకు సేవ చేస్తుండగా చూస్తాడు. పుండలీకుడు ఒక రాయిని బయటికి విసిరి దాని మీద నిల్చోమంటాడు. కృష్ణుడు ఆ రాయి మీదనే నిల్చుని పుండలీకుడి కోసం ఎదురు చూస్తాడు. సేవలన్నీ చేసిన తరువాత పుండలీకుడు కృష్ణుని విఠోబా రూపంలోనూ, రుక్మిణిని రకుమాయి రూపంలోనూ ఆ ఇటుక మీదే నిలిచి భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండమని కోరతాడు.
ఇతర పురాణాల ప్రకారం విఠోబా తన భక్తులను రక్షించడానికి ఒక అంటరానివాడు (మహర్) గానూ, బ్రాహ్మణ యాచకుడిగానూ వస్తాడు. మహీపతి రాసిన పాండురంగ స్తోత్రంలో విఠోబా తన మహిళా భక్తులైన జానాబాయి లాంటి వారికి ఇల్లు శుభ్రం చేయడం, బియ్యం దంచడం లాంటి ఇంటిపనులలో ఎలా సహాయం చేశాడో వర్ణిస్తాడు. సేనా అనే క్షురకుడికి ఏ విధంగా సహాయం చేశాడో వర్ణిస్తాడు. బీదర్ రాజు చెప్పినప్పుడు సంస్థానానికి రాలేదని అతన్ని నిర్బంధించమని ఆదేశాలు జారీ చేస్తాడు. అప్పుడు సేనా విఠోబా పూజలో తలమునకలై ఉండటంతో విఠోబాయే సేనా రూపంలో రాజు దగ్గరికి వెళ్ళి అతణ్ణి రాజదండన నుంచి కాపాడతాడు. ఇంకో కథలో దామాజీ అనే రాజోద్యోగి కరువులో ఉన్న ప్రజలకు ధాన్యాగారం నుంచి దానం చేస్తాడు. అప్పుడు విఠోబా మారు వేషంలో ఒక సంచీలో బంగారంతో వచ్చి అతను దానం చేసిన ధాన్యానికి ఖరీదు చెల్లిస్తాడు. మరో కథలో గోరకుంభుడు అనే భక్తుడు విఠోబాలో పాటలలో లీనమై అడుసు తొక్కుతుండగా ఆడుకుంటూ వచ్చిన పిల్లవాడిని అందులో వేసి తొక్కేస్తాడు. అప్పుడు విఠోబా వచ్చి ఆ పిల్లవాడిని పునరుజ్జీవితుడిని చేస్తాడు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire