వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రదాయ.. అని పిలిస్తే చాలు ఆర్తులను అక్కున చేర్చుకుని నిండు ధైర్యాన్ని ఇచ్చేవాడు వినాయకుడు.
వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రదాయ.. అని పిలిస్తే చాలు ఆర్తులను అక్కున చేర్చుకుని నిండు ధైర్యాన్ని ఇచ్చేవాడు వినాయకుడు. దేవుళ్లలో ఆది దేవుడు, అందరి ఆరాధ్య దైవం ఆ బొజ్జగణపయ్య. తల్లిదండ్రులకు ముద్దుల తనయుడిగా, పార్వతీపరమేశ్వరుల ప్రియమైన పుత్రుడిగా పూజలందుకుంటున్న గణనాథుడు భక్తజనాలకు ఎన్నో సందేశాలు ఇస్తున్నారు. భక్తుల కష్టాలను తీర్చి సమస్తకోటి భక్త జనావలికి వరములనొసగేందుకు స్వయంభూగా వెలసినాడు.
భక్తులు చేస్తున్న కార్యం నిర్విఘ్నంగా జరగడం కోసం ఎల్లవేళలా తోడుంటానని అభయమిస్తాడు. అందుకే భక్తులు ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా ఈ గణనాధుని పూజింజి స్వామి వారి ఆశీస్సులను తీసుకుని ప్రారంభిస్తారు. దీనివల్లే స్వామివారికి ఆదిదేవుడు అని పేరు వచ్చింది. ఈ క్రమంలోనే కాణిపాకంలో స్వయంభువుగా వెలిసిన వినాయకుడు భక్తుల నుంచి ఎన్నో పూజలందుకుంటున్నాడు.
కానీ పాకం స్థలపురాణం...
కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు.
గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు.ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు.
ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.
ఆలయ చరిత్ర...
కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు.
స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయవ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. "బ్రహ్మహత్యా పాతక నివృత్తి" కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది. ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.
కానీపాకం ఆలయం ఎక్కడ, ఎలా వెలసింది...
ఈ పుణ్యక్షేత్రం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది.
దర్శనీయ ప్రదేశములు, దేవాలయాలు కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి. వరసిద్ది వినాయకుని ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు, ఒక విన్నూతమైన మండపం ఉన్నాయి. శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం ఉంది. షణ్ముఖ,దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం (నాగుపాము) తిరుగుతూ వుంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగఫై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్పుతూ ఉంటారు. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.
శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం ఉంది. పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని అజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. అంతే కాదు కానిపాకంలో వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాలమండపం, అద్దాల మేడ కూడా ఉంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire