జాతీయ విజ్ఞాన దినోత్సవమును ఈ రోజునే సైన్స్ డే గా పేర్కొంటారు. ప్రతి ఏడది ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డేను జరుపుకుంటారు.
జాతీయ విజ్ఞాన దినోత్సవమును ఈ రోజునే సైన్స్ డే గా పేర్కొంటారు. ప్రతి ఏడది ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డేను జరుపుకుంటారు. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి, ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా పేరుగాంచిన సీవీ రామన్‌గా ( ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్) 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. దీంతో ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు.
అంతే కాదు ఆయన చిన్నతనం నుంచి భౌతికశాస్త్రంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. 'నా మతం సైన్సు.. దానినే జీవితాంతం ఆరాధిస్తా..' అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తిల్లో సర్ సీవి రామన్ మొదటివారు. అంతేకాదు, విజ్ఞాన శాస్త్రంలో ఆఘనత సాధించిన ఏకైక ఆసియా వాసిగానూ ఖ్యాతిగడించారు. రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్దం ఆ తేదిని జాతీయసైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది.
సర్. సీవిరామన్ బాల్యం, విద్యాభ్యాసం
చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్ దంపతులకు జన్మించాడు. వీరిది మధ్య తరగతి కుటుంబం. వీరి కుటుంబం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు.
ఈయన తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని విశాఖపట్నంలో పూర్తిచేశారు. సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకుడు కావడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు.
ఆయన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్‌ఫిట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఎమ్మే చదివి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు.
ఉద్యోగం
1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. రామన్ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్ ముఖర్జీ బ్రిటీష్ ప్రభుత్వానికి లేఖ రాస్తూ... రామన్ సైన్స్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. కానీ, బ్రిటీష్ ప్రభుత్వంఅంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు.
ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్‌తో పెళ్ళయింది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజారు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున వెళ్ళాడు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్‌కు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారాలు, సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి.
అతని తల్లి పార్వతి అమ్మాళ్‌కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1921లో లండన్‌లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చాడు.
అప్పుడు శ్రోతల్లోని ఒకరు ఇలాంటి అంశాలతోరాయల్ సొసైటీ సభ్యుడవు కావాలనుకుంటున్నావా అంటు నవ్వులాటగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మార్చాడు. తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు.
సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అని ఊహించాడు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం కె.యస్.కృష్ణన్ రామన్ వద్దకు పరుగెత్తుకొని వచ్చి కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంతో చెప్పగానే రామన్ ఎక్సలెంట్ న్యూస్ అని సంతోషపడ్డా, కాంప్టన్ ఫలితం ఎక్సరేయిస్ విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాల్లేకపోయినా, రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నాడు.
1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించాడు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు. ఈయన పరిశోధనలను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు.
ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న' అవార్డు బహుకరించారు. ఈ సమయంలో ఆయన సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి. ఆయన నాజీవితంలో ఒక విఫల ప్రయోగం. ఎందుకంటే నేను నా మాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను. అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20 న ఆయన భౌతికంగా కన్నుమూసారు.
దీంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి. 1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire