Poop Transplant: తమ్ముడి మలంతో మాత్రలు చేయించి వేసుకున్న యువతి.. అసలేమిటీ చికిత్స?

The Young Woman Who Made Her Talk With Her Brothers Faeces.
x

Poop Transplant: తమ్ముడి మలంతో మాత్రలు చేయించి వేసుకున్న యువతి.. అసలేమిటీ చికిత్స?

Highlights

Poop Transplant: మనుషుల మలం కూడా ఔషధంగా వాడతారనే సంగతి తెలుసా? అవును మీరు విన్నది నిజమే. కాస్త వింతగా అనిపించేటప్పటికీ ఇది కూడా ఒక చికిత్సే.

Poop Transplant: మనుషుల మలం కూడా ఔషధంగా వాడతారనే సంగతి తెలుసా? అవును మీరు విన్నది నిజమే. కాస్త వింతగా అనిపించేటప్పటికీ ఇది కూడా ఒక చికిత్సే.

ఈ చికిత్సనే ‘పూప్ ట్రాన్స్‌ప్లాంట్’ లేదా ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంట్ (ఎఫ్ఎంటీ) అని పిలుస్తారు.

అయితే, కొన్నిసార్లు ఈ చికిత్స వికటిస్తుంది కూడా. నెట్‌ఫ్లిక్స్ తాజా డాక్యుమెంటరీ ‘హ్యాక్ యువర్ హెల్త్: ద సీక్రెట్స్ ఆఫ్ యువర్ గట్’లో ఈ చికిత్సతో ఇబ్బంది పడ్డ ఒక మహిళ తన అనుభవాలను వివరించారు.

అసలు ఆమెకు ఏమైంది?

అమెరికాకు చెందిన డేనియెల్ కోప్కే కాలేజీ రోజుల నుంచే అజీర్తి (ఇన్‌డైజేషన్), గ్యాస్ నొప్పులు, తీవ్రమైన మల బద్ధకం (కాన్‌స్టిపేషన్)లతో బాధపడేవారు.

వైద్యుల దగ్గరకు వెళ్తే ఆమెకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఉందని పరీక్షల్లో తేలింది. ఈ సమస్యకు చికిత్స కోసం ఆమె చాలా మంది వైద్యుల చుట్టూ తిరిగారు. కానీ, ఫలితం లేకపోయింది.

దీంతో ఇంటర్నెట్‌లో చదివిన ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంట్ (ఎఫ్ఎంటీ) చికిత్సను తనకు తానుగానే సొంతంగా ప్రయత్నిద్దామని భావించారు.

ఆమె ఏం చేశారు?

ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంట్ (ఎఫ్ఎంటీ) చికిత్స కోసం ఆరోగ్య వంతుల నుంచి మలాన్ని సేకరించాల్సి ఉంటుంది. దీని కోసం డేనియెల్ తన సోదరుడిని ఆశ్రయించారు.

అతడి మలం నుంచి సూక్ష్మజీవులను మొదట సేకరించారు. వీటిని మాత్రల రూపంలో తీసుకున్నారు.

అయితే, ఈ చికిత్స తర్వాత ఆమె బరువు పెరిగారు. అంతేకాదు తన తమ్ముడి మొఖంపై ఉన్నట్లు మొటిమలు కూడా చాలా వచ్చాయని ఆమె చెప్పారు.

దీంతో డోనర్‌ను ఆమె మార్చేశారు. ఈ సారి బాయ్‌ఫ్రెండ్ మలాన్ని ప్రయత్నించారు. అయితే, ఈ సారి తన బాయ్‌ఫ్రెండ్ డిప్రెషన్ కూడా తనకు వచ్చిందని ఆమె చెప్పారు.

‘‘కొన్ని రోజుల తర్వాత అసలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేనంత కుంగుబాటు వచ్చినట్లు అనిపించింది’’ అని ఆమె చెప్పారు.

దీంతో మళ్లీ తన తమ్ముడి మలం నుంచి సేకరించిన సూక్ష్మీజీవుల మాత్రలను వేసుకోవడం మొదలుపెట్టారు.

అసలు ఏమిటీ చికిత్స..

మనుషుల కడుపులోని కొన్ని కోట్ల సూక్ష్మజీవులకు ఆరోగ్య సమస్యలను నయంచేసే సామర్థ్యం ఉంటుంది. హానికర సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్లపై ఇవి పోరాడుతుంటాయి.

ఇలాంటి సూక్ష్మజీవులను ఆరోగ్య వంతుల నుంచి నుంచి సేకరించి, రోగుల కడుపులో ప్రవేశపెట్టడమే ఈ ఫీకల్ ట్రాన్స్‌ప్లాంట్ లేదా పూప్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స.

కడుపులో తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉండే రోగులకు సాధారణంగా ఈ చికిత్సను సూచిస్తుంటారు. ఈ చికిత్సలో భాగంగా ప్రవేశపెట్టే మంచి సూక్ష్మజీవులు కడుపులోని హానికర సూక్ష్మజీవులపై పోరాడుతాయి. ఫలితంగా కడుపులోని పరిస్థితులు మళ్లీ పూర్వస్థితికి వస్తాయి.

యాంటీబయోటిక్స్‌కు లొంగని మొండి బ్యాక్టీరియా సీ. డిఫికైల్ ఇన్ఫెక్షన్ (సీడీఐ)పై చికిత్సలో భాగంగా ప్రస్తుతం పూప్ ట్రాన్స్‌ప్లాంట్‌ను సూచిస్తున్నారు. మిగతా అన్ని చికిత్సలు విఫలమైనప్పుడు మాత్రమే దీన్ని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.

ప్రస్తుతం అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఇలాంటి రెండు చికిత్సలను మాత్రమే అనుమతిస్తోంది.

అయితే, జీర్ణ సమస్యలు, జీవక్రియా సమస్యలు, రోగ నిరోధక శక్తి సమస్యలపై ఈ చికిత్స ఇంకా ప్రయోగ దశలోనే ఉంది.

ఎలా చేస్తారు?

ఈ చికిత్సకు కొన్ని విధానాలు ఉన్నాయి. వీటిలో కొలనోస్కోపీ ముఖ్యమైనది. ఈ చికిత్సలో మలద్వారం గుండా కెమెరా అమర్చిన ఒక చిన్న ట్యూబ్‌(కొలనోస్కోప్)ను పంపిస్తారు. దీని ద్వారా ఆరోగ్యవంతుల మలంలోని సూక్ష్మజీవులను రోగుల కడుపులోకి పంపిస్తారు.

ఇక రెండో విధానం అప్పర్ ఎండోస్కోపీ. దీనిలో ఎండోస్కోప్‌ను నోరు లేదా ముక్కు ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఇది కొలనోస్కోపీకి ప్రత్యామ్నాయంలా పనిచేస్తుంది. అయితే, దీనిలో సక్సెస్ రేటు కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మొదట చిన్న పేగుల గుండా ఈ సూక్ష్మజీవులు పెద్దపేగుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. చాలావరకు ఇక్కడే అడ్డుకట్ట పడిపోతుంటుంది.

మూడో విధానం ఓరల్ క్యాప్సుల్. దీనిలో ఆరోగ్యకర సూక్ష్మజీవులను మాత్రల రూపంలో కడుపులోకి పంపిస్తారు. తాజాగా ఇలాంటి ఒక చికిత్సకు ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది.

శుద్ధి చేసిన తర్వాతే..

సాధారంగా దాతల నుంచి సేకరించిన మలాన్ని మొదట సెలైన్‌తో కలుపుతారు. దీన్ని ఫిల్టర్‌చేసి ఒక ద్రవాన్ని తయారుచేస్తారు.

కావాలంటే ఈ ద్రవాన్ని వెంటనే చికిత్సలో ఉపయోగించొచ్చు. లేదంటే దీన్ని పూప్ డోనర్ బ్యాంక్‌కు పంపించొచ్చు. దీన్ని అక్కడ ఫ్రీజ్ చేస్తారు. లేదంటే దీన్ని ఆరబెట్టి క్యాప్సుల్స్ కూడా చేయొచ్చు.

ఇక్కడ దాతలకు కూడా మొదట రక్త పరీక్షలు, స్టూల్ టెస్టులు చేస్తారు. వారి మెడికల్ హిస్టరీని పరిశీలిస్తారు. అంతా సవ్యంగా ఉంటేనే వారి నుంచి మలాన్ని తీసుకుంటారు.

ఎంతవరకు పనిచేస్తుంది?

ఇక్కడ సక్సెస్ రేటు అనేది వ్యక్తిని బట్టీ మారుతూ ఉంటుంది. అయితే, సీ డిఫ్ ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవడంలో ఇది 80 నుంచి 95 శాతం వరకు పనిచేస్తుందని అధ్యయనాల్లో తేలింది.

ఈ చికిత్స తీసుకున్న తర్వాత కడుపు ఉబ్బరం, వాంతులు, వికారం, కడుపు నొప్పి లాంటి సమస్యలు రావచ్చు. కొందరికి జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే, కొన్ని కేసుల్లో హానికర సూక్ష్మజీవులు కూడా దాతల నుంచి రోగుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దాతల ఆరోగ్యం బావుండటంతో అతడి శరీరంలో ఇవి అచేతన స్థితిలో ఉండొచ్చు. కానీ, రోగి శరీరంలోకి వెళ్లినప్పుడు ఇవి విజృంభించే అవకాశం ఉండొచ్చు.

అందుకే దాతలకు ముందుగానే అన్ని పరీక్షలు చేయించుకున్నాకే ముందుకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories