Tanguturi Prakasham Jayanti : దేశంలో నేతలు ఎంతో మంది ఉన్న ప్పటికీ ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రజా హృదయ విజేతలుగా పేరు పొందే వారు కొందరే ఉంటారు.
Tanguturi Prakasham Jayanti : దేశంలో నేతలు ఎంతో మంది ఉన్న ప్పటికీ ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రజా హృదయ విజేతలుగా పేరు పొందే వారు కొందరే ఉంటారు. అలాంటి విశిష్ట వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకు లలో, ప్రజా నేతలలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు అగ్రగణ్యులు. అంతటి మహనీయుని జయంతి నేడు. ప్రతి ఏడాది ఆగస్ట్ 23 ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలను నిర్వహిస్తారు. ప్రకాశం పంతులు జీవితం సవాళ్లతో ఆటుపోట్లతో కూడినది. ఆయన జీవితం త్యాగ చరితం, విలువైన పాఠ్య గ్రంథం.
టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెము గ్రామంలో తన మేనమామ ఇంట జన్మించారు. తండ్రి గోపాలకృష్ణయ్య ..తల్లి సుబ్బమ్మ. ప్రకాశం గారి భార్య పేరు హనుమా యమ్మ. 1884 లో ప్రకాశం తండ్రి గోపాలకృష్ణయ్య మరణించారు. దాంతో ప్రకాశం కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. తండ్రి మృతి చెందిన రెండు నెలలకు ప్రకాశం తమ్ముడు జానకిరామయ్య జన్మించాడు. తండ్రి మరణించడంతో కుటుంబం తిరిగి కనపర్తిలోని మేనమామ ఇంటికి చేరుకుంది. పోషణ భారం కావడంతో ప్రకాశం తల్లి సుబ్బమ్మ తన బిడ్డలతో ఒంగోలుకు చేరుకుని భోజనం హోటల్ ను ప్రారంభించారు. మిడిల్ స్కూల్ పరీక్షకు ప్రకాశం మూడు రూపాయలు పరీక్ష ఫీజు చెల్లించవలసి వచ్చింది. అయితే ఆ డబ్బు ఎక్కడ సమకూరక పోవడంతో తల్లి సుబ్బమ్మ తన పట్టు చీర కుదువ పెట్టీ పరీక్ష ఫీజు చెల్లించి తన కుమారుని విద్యాభ్యాసానికి ఆటంకం లేకుండా చేశారు. ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గురువుగా లభించడం ప్రకాశం జీవన సరళిని మార్చివేసింది.
హనుమంతరావు నాయుడు పెద్ద తరగతుల విద్యార్థులకు లెక్కలు ట్యూషన్ చెప్పేవారు. కాలగమనంలో ఇమ్మానేని హనుమంతరావు నాయుడు తన కుటుంబంతో రాజమండ్రికి తరలి వెళ్లారు. ప్రకాశం కూడా తన గురువుతో పాటు రాజమండ్రికి వెళ్లి అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం ప్రకాశం ఇంగ్లాండు వెళ్లి బారిష్టర్ కోర్సు చదివేందుకు కూడా హనుమంతరావు నాయుడు సహకరించారు. లాయర్ గా ప్రకాశం తన వాదనా పటిమతో మొండి కేసులతో పాటు, పెద్ద పెద్ద కేసులను సైతం గెలిపించడంతో ఆయన పేరు ప్రతిష్టలు మరింత వ్యాప్తి చెందాయి. కేసుల సంఖ్య తో పాటు ఆయన ఆస్తులు ఆదాయం పెరిగాయి.
1907లో బారిష్టర్ వృత్తి లో ప్రవేశించిన ప్రకాశం 1921 దాకా ఆ వృత్తిని కొనసాగించారు. పెద్దపెద్ద జడ్జీల ఎదుట కూడా ధైర్యంగా వాదించడం లో ప్రకాశం వాదనా పటిమ అపూర్వం. భయమనే మాట ఆయన జీవిత నిఘంటువులోనే లేదు. న్యాయవాదిగా క్షణం తీరిక లేకుండా గడిపే ప్రకాశం గారి దృష్టి స్వాతంత్ర్య సంగ్రామం వైపు మరలింది.
మహాత్మా గాంధీ పిలుపుతో ప్రకాశం న్యాయవాద వృత్తి కి స్వస్తి పలికి స్వాతం త్ర్య సంగ్రామంలో కి వెళ్లారు. ఇది ఆయన జీవితాన్ని కీలక మలుపు తి ప్పింది. ప్రకాశం స్వరాజ్య పత్రిక తో పాటు పలు పత్రికలను నిర్వహించారు. ప్రధానంగా స్వరాజ్య పత్రిక కోసం ప్రకాశం తన ఆస్తులను వెచ్చించ వలసి వచ్చింది. ప్రకాశం అంటే గిట్టని కొందరు గాంధీ గారికి ఆయనపై పలు చాడీలు చెప్పడంతో స్వరాజ్య పత్రికను నిలుపుదల చేయాలంటూ గాంధీజీ ప్రకాశం పంతులుకి సూచించారు. అందుకు ప్రకాశం నిరాకరించారు, తాను ఎలాంటి తప్పు చేయలేదని సత్యానికి కట్టుబడి ఉన్నానని గాంధీ స్పష్టం చేశారు. ప్రకాశం ధైర్యసాహసాలకు మచ్చుతునక అనదగిన సంఘటన సైమన్ కమిషన్ రాక సందర్భంగా చోటు చేసుకుంది.
మద్రాసులో ఒక యువకుడు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆ యువకుడిని కాల్చి చంపారు. ఆ యువకుడి శవాన్ని తీసుకు వచ్చేందుకు ఎవరికీ ధైర్యం చాలలేదు. విషయం తెలుసుకున్న ప్రకాశం అక్కడకు చేరుకొని మృతదేహం వద్దకు వెళ్ల బోగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ముందుకు అడుగు వేస్తే కాల్చి చంపుతామంటూ వారు హెచ్చరించారు. ఒక పోలీసు ప్రకాశం గుండెలకు తన తుపాకీని గురిపెట్టాడు. అయినప్పటికీ ప్రకాశం వెనుకడుగు వేయకుండా దమ్ముంటే కాల్చం డం టూ తన ఛాతీ చూపించడంతో ఆ పోలీసు భయపడి ఊరుకున్నాడు. ప్రకాశం ప్రదర్శించిన ధైర్య సాహసాలను అక్కడి ప్రజలు కొనియాడారు. ఆంధ్ర కేసరిగా పౌరుష సింహునిగా ఆయనను కీర్తించారు. ఉప్పు సత్యాగ్రహంలో కూడా ప్రకాశం కీలక పాత్ర పోషించారు. దేవరంపాడు లోని ప్రకాశం పంతులు భవనాన్ని శిబిరంగా కార్యకర్తలు ఉపయోగించుకున్నారు. ఉప్పు సత్యాగ్రహం విజయవంతం అయిన దానికి గుర్తుగా దేవరంపాడు లో విజయ స్తంభాన్ని ప్రతిష్టించారు. 1935 నవంబర్ 21 అప్పటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు దేవరంపాడు విజయ స్తంభాన్ని ఆవిష్కరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రకాశం ఆ సందర్భంగా ఒక ట్రస్ట్ డీ డును తయారు చేయించి తనకు గల భవనాన్ని..రెండు ఎకరాల పొలాన్ని స్వాధీనం చేశారు.
1937లో ప్రకాశం గారు కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. రాజాజీ మంత్రివర్గంలో ప్రకాశం గారు రెవె న్యూ మంత్రిగా ..ఆ తరువాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా వ్యవహరించారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి గా ప్రకాశం పంతులు ప్రమాణ స్వీకారం చేశారు. కర్నూల్ ను రాజధానిగా సూచించింది కూడా ప్రకాశం పంతులు. 13 నెలలపాటు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. తక్కువ కాలం పాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రకాశం పంతులు రాష్ట్ర ప్రగతికి అవసరమైన పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ..అభివృద్ధి కార్యక్రమాలకు చర్యలు చేపట్టారు. ప్రత్యర్థుల కుట్రల వల్ల ప్రకాశం ఎక్కువ కాలం పాటు అధికారంలో కొన సాగలేక పోయారు. కుట్ర రాజకీయాలు ఆయన ప్రభుత్వాన్ని కుప్ప కూల్చా యి. అయినా ఆయన భయపడలేదు. ప్రజలే తన తోడుగా నీడగా ఆయన భావించి వారితోనే మమేక మయ్యారు.
1957 మే నెలలో ప్రకాశం పంతులుగారు వేసవి కాలంలో ఒంగోలు ప్రాంతంలో పర్యటించి తీవ్రమైన వడదెబ్బకు గురయ్యారు. ఆయనను హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి చేర్చి 18 రోజుల పాటు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 1957 మే 20న ప్రకాశం పంతులుగారు దివంగతులయ్యారు. ప్రకాశం పంతులు మరణవార్త యావత్ భారత దేశాన్ని కదిలించింది. బారిస్టర్ గా లక్షల రూపాయలు విలువైన ఆస్తులను సంపాదించినప్పటికీ దేశ స్వాతంత్ర్య సాధన కోసం వాటిని తృణప్రాయంగా వెచ్చించి ప్రకాశం నిరుపేదగా మిగిలిపోయారు. చరిత్రలో ఇటువంటి త్యాగధనులు అరుదుగా కనిపిస్తారు. తన జీవితాన్ని ధనాన్ని దేశ సేవకు ప్రజాసేవకు వెచ్చించి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజల మనిషిగా ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు .
ప్రకాశం జిల్లా ఏర్పాటు:
జిల్లా ఏర్పాటు ప్రకాశం ఆశయం. ఎంతోమంది మహనీయుల కృషి ఫలితంగా కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో జిల్లా ఏర్పాటు కల సాకారమైంది. జిల్లా సాధన కోసం రొండా నారప రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అన్ని ప్రయత్నాలు ఫలించి 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు జిల్లా ఏర్పాటైంది. ప్రకాశం పంతులు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 1972 మే 12న. ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లా గా మార్పు చేశారు. ప్రకాశం పంతులు కాంస్య విగ్రహాన్ని నాటి రాష్ట్ర గవర్నర్ అబ్రహం ఒంగోలులో ఆవిష్కరించారు. జిల్లా పరిపాలనా భవనానికి ప్రకాశం భవనం అనే పేరు పెట్టారు. ప్రతి ఏటా ఆగస్టు 23వ తేదీన ప్రకాశం పంతులు జయంతి ఉత్సవాలను ఒంగోలు కలెక్టరేట్ తో పాటు దేవరంపాడు.. వినోదరాయుని పాలెంలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటితరం రాజకీయ నాయకులు టంగుటూరి ప్రకాశం పంతులులోని దేశభక్తిని, త్యాగనిరతిని ప్రజా సంక్షేమ దృష్టిని ఆదర్శంగా తీసుకుని తాము కూడా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కృషి చేయాలని ఆశిద్దాం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire