Safari vs Fortuner Viral Video: సఫారీ కారు vs ఫార్చునర్ కారు వైరల్ వీడియో

Safari vs Fortuner Viral Video: సఫారీ కారు vs ఫార్చునర్ కారు వైరల్ వీడియో
x
Highlights

Safari car rams into Fortuner car: ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు చూస్తే మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. నడిరోడ్డుపై సఫారి వాహనంతో ఎదురుగా...

Safari car rams into Fortuner car: ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు చూస్తే మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. నడిరోడ్డుపై సఫారి వాహనంతో ఎదురుగా ఉన్న ఫార్చూనర్ కారుని ఢీకొనడంతో పాటు తన సొంత మనుషుల పై నుంచే కారును పోనివ్వడానికి సిద్ధపడ్డాడు ఓ వ్యక్తి. అంతటితో ఆగలేదు.. మళ్లీ తన సఫారి కారును వెనక్కి తిప్పుకుని వచ్చి ఈసారి అదే ఫార్చూనర్ కారును ముందు నుంచి బలంగా ఢీకొట్టాడు. సఫారి కారు ఢీకొన్న వేగానికి ఫార్చునర్ కారు 10-20 అడుగుల మేర వెనక్కి వెళ్లింది. ఈ క్రమంలో ఫార్చునర్ కారు వెనకాలే బైకులు, స్కూటీలపై ఉన్న వ్యక్తులను ఢీకొని వారిని కూడా వెనక్కి ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో ఎవ్వరు కూడా సఫారి కారు డ్రైవ్ చేస్తోన్న వ్యక్తి జరిపిన దాడి నుండి తప్పించుకునే వ్యవధి లేకపోయింది.

విచిత్రం ఏంటంటే.. ఈ రెండు కార్లలో ఉన్న వ్యక్తులు బద్ధశత్రువులు కాదు.. రోడ్డుపై ముక్కు మొఖం తెలియని వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ అస్సలే కాదు. రెండు కార్లలో ఉన్నది ఒక్కటే కుటుంబం. ఫార్చునర్ కారులో సతీష్ శర్మ, అతడి భార్య, చిన్న కొడుకు, డ్రైవర్ ఉన్నారు. ఇక సఫారీ కారులో సతీష్ శర్మ పెద్ద కొడుకు బిందేశ్వర్ శర్మ ఉన్నాడు. ఇప్పుడు అసలు మ్యాటర్ అర్థమైంది కదా.. కొడుకే తన సఫారి కారుతో తండ్రి కారును ఢీకొట్టాడన్నమాట.

ఇంతకీ వీళ్ల మధ్య గొడవేంటి ?

సతీష్ శర్మ రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు. పెద్దకొడుకు బిందేశ్వర్ శర్మ తన భార్యతో అంబర్‌నాధ్ ప్రాంతంలో ఉంటున్నాడు. బిందేశ్వర్ శర్మకు అతడి భార్యతో ఆస్తి గొడవలు నడుస్తున్నాయి. కొడుకు - కోడలు మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకే సతీష్ శర్మ తన భార్య, చిన్నకుమారుడితో కలిసి డ్రైవర్‌ని తీసుకుని పెద్దకొడుకు ఇంటికి వెళ్లాడు. కానీ అప్పటికి బిందేశ్వర్ ఇంట్లో లేడు. దాంతో కోడలుతో మాట్లాడి తిరిగి ముంబైకి బయల్దేరారు.

వాళ్లు దారి మధ్యలో ఉండగానే బిందేశ్వర్ తన సఫారీ వాహనంతో వెనక నుండి వేగంగా రావడాన్ని సతీష్ శర్మ కారు డ్రైవర్ గమనించాడు. బహుశా బిందేశ్వర్ తన తండ్రితో మాట్లాడటానికే వెనకాల వస్తున్నాడేమో అనే సందేహంతో కారుని ఓ పక్కకు పార్క్ చేసి అందులోంచి బయటికి దిగాడు. కానీ సతీష్ శర్మ కుటుంబం ఊహించిదానికి భిన్నంగా బిందేశ్ శర్మ సఫారి కారును ఆపకుండా తన తండ్రి ఉన్న ఫార్చునర్ కారు డ్రైవర్‌ని ఢీకొంటూ వెళ్లాడు. అతడు అప్పుడు ఎలాగోలా బిందేశ్వర్ కారు బ్యానెట్‌పైకి ఎక్కి కారు పై నుండి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ ఈసారి బిందేశ్వర్ మళ్లీ సఫారి కారును వెనక్కి తీసుకొచ్చి ఫార్చునర్ కారుని ఢీకొన్నప్పుడు మాత్రం అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. సతీష్ శర్మ కారు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దాడికి పాల్పడిన బిందేశ్వర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బిందేశ్వర్ శర్మకు తన తండ్రి సతీష్ శర్మతోనూ విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే అతడు తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్న ఫార్చునర్ వాహనాన్ని ఢీకొట్టినట్టు సమాచారం. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పట్టపగలే జరిగిన ఈ దాడి ప్రత్యక్షసాక్షుల వెన్నులో వణుకు పుట్టించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories