Raksha bandhan 2020: అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి కనుక..రక్షాబంధన్ పండుగ!
రక్షా బంధన్… ఓ ప్రవిత్ర బంధం. అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమే ఈ రాఖీ పండుగ. హిందు సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో పౌర్ణమి రోజున సోదర, సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు గుర్తుగా ఈ రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. సోదరి కట్టే రాఖీ..సోదరుడిపై గల అమితమైన ప్రేమకు ఓ తీపిగుర్తు. అంతే కాదు సోదరుల చేతికి రక్షాబంధనాన్ని కట్టి..తను పది కాలాల పాటు చల్లగా ఉండాలంటూ మనసారా కోరుకునే వ్యక్తి సోదరి. సోదరుడు రాఖీ కట్టిన సోదణిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీఇస్తాడు. అక్కల అనురాగం… తమ్ముళ్ల ఆత్మీయత.. అమ్మ నానలో సగమై చెల్లెమ్మకు తోడు నీడై ఉండే అన్నాల పండుగ రాఖీ.
ఒకే అమ్మకడుపులో పుట్టిన ఈ రక్తసంబంధం జీవితాంతం ఆనందంగా కొనసాగాలని, ఒకరికొకరు రక్షగా ఉండాలని ఓ చిన్న రంగుపూల తాడు సాక్షిగా కోరుకుంటారు. సోదరులు కూడా తనకు రాఖీ కట్టిన సోదరిని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటూ, కష్ట సుఖాల్లో తోడుండాలని ఈ రాఖీ పండుగ గుర్తు చేస్తుంది. తోబుట్టువుల ప్రేమకు గుర్తుగా కొన్ని ఏండ్లుగా ఈ రక్షాబంధనం కట్టడం ఆనవాయితీగా సాగుతోంది. తోడబుట్టిన వాడు ఆడబిడ్డలకు తల్లిదండ్రుల తర్వాత ముఖ్యం. అక్కా,చెల్లెల్ల సుఖ సంతోషాలలో సకల సౌభాగ్యాలలో తోడు నీడగా ఉంటాడు సోదరుడు.
రక్షా బంధన్ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.
రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే
పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి వెంటనే ఓ ఉపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడు యుద్దం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.
ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.
బలి చక్రవర్తి శ్రీమహా విష్ణువుకి అమిత భక్తుడు. ఆ విపరీతభక్తీతో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకుంటాడు బలి చక్రవర్తి. శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు విష్ణువుకూడా అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. దాంతో లక్షీ దేవ విష్ణువుని ఏలాగైనా వైకుంఠానికి తీసుకురావాలని ఆలోచించి పాతాలానికి వెళుతుంది. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకడుతుంది. . దీంతో కరిగిపోయిన బలి చక్రవర్తి విష్ణుమూర్తిని తన వెంట తీసుకెళ్లాలని చెబుతాడు. అలా లక్ష్మీ దేవి తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడిందని చరిత్ర కారులు చెపుతున్నారు. బలిచక్రవర్తి భక్తి అనే అర్థం వచ్చేలా రాఖీని బలేవా అని కూడా పిలుస్తారు.
చరిత్రపుటల్లో అలెగ్జాండర్ భార్య 'రోక్సానా' తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్తను చంపవద్దని పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్ ను చంపకుండా విడిచిపెడతాడు. ఆ సోదర బంధమే అలెగ్జాండర్ పై దాడి చేయకుండా అడ్డుకుందని ప్రచారంలో ఉంది.
అంతే కాదు దేవతల్లో మొదటి పూజను అందుకునే విఘ్న నాధుడు కూడా తన సోదరితో కలిసి రక్షాబందనాన్ని జరుపుకోవడం చూసి, అతని కుమారులు శుభ్, లాబ్ కూడా తన సోదరైన సంతోషి మా తో కలిసి రాఖీ పండుగను జరుపుకున్నారని చరిత్రలో ప్రచారంలో ఉంది.
ద్వాపర యుగంలో జరిగిన మహాభారత యుద్ధంలో కుంతి రాణి తన మనవడు అభిమన్యు – సుభద్ర, అర్జున్ కుమారుడు – మణికట్టు మీద పవిత్రమైన దారాన్ని కట్టుకున్నట్లు చెబుతారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire