పంటల కొనుగోళ్ళ నుంచి కేసీఆర్ యూటర్న్.. రైతులకు మేలు జరుగుతుందా?
పంటల కొనుగోళ్ళ నుంచి తప్పుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెంటనే కాంగ్రెస్, బీజేపీ నుంచి కౌంటర్లు స్టార్టయ్యాయి. రైతులకు అన్యాయం...
పంటల కొనుగోళ్ళ నుంచి తప్పుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెంటనే కాంగ్రెస్, బీజేపీ నుంచి కౌంటర్లు స్టార్టయ్యాయి. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ..ఊరుకునేది లేదంటున్నారు హస్తం, కమలం పార్టీ నాయకులు. అసలు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏంటి? దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? విపక్షాలేమంటున్నాయి..?
రైతులకు మార్కెట్ కమిటీల బంధనాల విముక్తి కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రైతులు దేశంలో ఎక్కడైనా తమ పంటల్ని అమ్ముకోవచ్చంటూ.. మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో..కొత్త చట్టాలు తీసుకువచ్చింది. అయితే వీటికి వ్యతిరేకంగా గడచిన 33 రోజులుగా దేశ రాజధానిని ముట్టడించారు రైతులు. కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందే..అంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలను వ్యతిరేకించారు. అయితే హఠాత్తుగా ఆయనలో మార్పు వచ్చింది. కేంద్రం తెచ్చిన చట్టాలు బాగున్నందున..ఇకపై తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో పంటలను కొనుగోళ్ళు చేయదని ప్రకటించారు. రైతులు తమకు ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చని ప్రభుత్వం తెలియచేసింది. ప్రభుత్వం పంటల్ని కొనుగోలు చేయడం వల్ల ఖజానాకు నష్టం కలుగుతోందని కూడా సర్కార్ వారి ప్రకటన తెలియచేసింది. దీంతో కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వరి, గోధుమలు తదితర పంటల్ని కొనుగోలు చేసి...ప్రజా పంపిణీ వ్యవస్థకు అందిస్తాయి. అలాగే రాష్ట్రాల స్థాయిలో మార్క్‌ఫెడ్‌లు కొన్ని ఇతర పంటల్ని కొనుగోలు చేస్తాయి. దీంతో మార్కెట్‌లో పోటీ ఏర్పడి రైతుకు మంచి ధర వచ్చేది. ఒక్కోసారి కనీస మద్దతు ధర కంటే కూడా ఎక్కువే గిట్టుబాటయ్యేది. గడచిన ఆరేళ్ళుగా పంటల కొనుగోళ్ళ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 7 వేల కోట్ల మేర నష్టం వాటిల్లనట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తెచ్చిన చట్టాలు బాగున్నందున ...ఇకపై రైతులు దేశంలో ఎక్కడైనా తమ పంటల్ని అమ్ముకోవచ్చని...రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ళను నిలిపివేస్తుందని తెలియచేసింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేంద్రాన్ని విమర్శించిన ముఖ్యమంత్రి...ఇప్పటికైనా ఆ చట్టాలను అమలు చేయడానికి పూనుకోవడం మంచి పరిణామం అని ప్రశంసించారు. కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నామని చెప్పి.. రైతులకు లాభం చేకూర్చే విషయంలో బాధ్యతల నుంచి తప్పుకొంటే ఊరుకోబోమని కేసీఆర్‌ను హెచ్చరించారు బండి సంజయ్..
ఏడాది క్రితం రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానాన్ని తీసుకు వచ్చారు కేసీఆర్. రాష్ట్రాన్ని కొన్ని కాలనీలుగా విభజించి ఎక్కడ ఏ పంట వేయాలో ప్రభుత్వమే నిర్ణయించింది. అలా కాకుండా రైతులు తమకు ఇష్టం వచ్చిన విధంగా పంటలు వేసుకుంటే ప్రభుత్వం కొనదని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అప్పుడే దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గలేదు. సన్న వడ్లు ఎక్కువగా సాగు చేయాలని ప్రభుత్వం చెప్పడంతో వరి పండించే రైతులు వాటినే వేశారు. అయితే వరదలతో కొంత పంట దెబ్బతిన్నది. తర్వాత ధర కూడా పెద్దగా రాలేదు. దీంతో రైతుల్లో అసహనం పెరిగింది. నియంత్రిత సాగు పట్ల మరోసారి వ్యతిరేకత వ్యక్తమయింది. దీంతో ఈసారి రైతులు తమకు ఇష్టం వచ్చిన పంటలు వేసుకోవచ్చని..ప్రభుత్వ నియంత్రణ ఏదీ ఉండబోదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుని అమలు చేయడం..కొన్నాళ్ళ తర్వాత దాని నుంచి వెనక్కు వెళ్ళడం మామూలేనంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను మొదట్లో వ్యతిరేకించిన కేసీఆర్.. ఇప్పుడు చాలా బాగున్నాయనడం ఆయనలోని అపరిపక్వతకు చిహ‍్నమన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. ప్రభుత్వం పంటల్ని కొనుగోలు చేస్తే నష్టం వస్తుందని నిన్ననే తెలిసిందా అని ప్రశ్నించారాయన. పంటల కొనుగోళ్ళను నిలిపివేసి..రైతుల నడ్డి విరిచే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారాయన.
ప్రభుత్వానికి నష్టం వస్తుందనే సాకుతో పంటల కొనుగోళ్ళను నిలిపివేస్తామనడం కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని..లాభ నష్టాలు చూసుకుని విధానాలు మార్చుకోవడానికి అంటూ వ్యవసాయ నిపుణులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం రైస్ మిల్లు కాదు..డాల్ మిల్లు కాదని ప్రభుత్వం చేసిన కామెంట్స్‌ను తప్పుపడుతున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు బాగున్నాయంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మొదట్లో ఎందుకు వ్యతిరేకించారని...ఇంతలో ఆ చట్టాల్లో ఏం మంచి కనిపించిందని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ తీసుకున్న కొత్త నిర్ణయంతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్ట పోతారని..రైతుల ఆత్మహత్యలు మరింతగా పెరుగుతాయని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు.
కేంద్ర చట్టాలు అమలు చేయాలంటే..కొనుగోలు కేంద్రాలు మూసివేయాలా? తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలు. కేసీఆర్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న కాషాయ నేతలు. బీజేపీకి కౌంటర్ ఇస్తున్న టీఆర్‌ఎస్ మంత్రులు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు జరిగే నష్టమేంటి..?
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశంలో ఆహార సంక్షోభం తీవ్రంగా ఉండేది. దేశ ప్రజల అవసరాలకు సరిపడా పంటలు పండేవి కాదు. శాస్త్రవేత్తల కృషి కారణంగా అధిక దిగుబడినిచ్చే వంగడాలు రావడం..ఇరిగేషన్ ప్రాజెక్టులు పెరగడంతో..సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. దిగుబడులు పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం 1964 నుంచి దేశంలో కనీస మద్దతు ధరల విధానాన్ని తీసుకువచ్చింది. దేశ వ్యాప్తంగా పండే 23 రకాల పంటలకు ప్రభుత్వం ధరలను నిర్ణయిస్తోంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసినా..రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నా...ప్రయివేటు వ్యాపారులు కొన్నా కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే. ఆ విధంగా రైతులకు నష్టం రాకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఏనాడూ రైతు లాభపడినట్లు చరిత్రలో చూడలేదు. పైగా కొన్ని దశాబ్దాలుగా పంటల దిగుబడి విపరీతంగా పెరుగుతోంది. రోజు రోజుకూ సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. దీంతో ఆహార ధాన్యాలు దాచుకోవడానికి గోదాములు సరిపోవడంలేదు. మొత్తం వ్యవసాయ రంగాన్ని సంస్కరించాలనే లక్ష్యంతో కేంద్రం కొత్త సాగు చట్టాలను తీసుకువచ్చింది. రైతులకు నష్టం లేకుండా చేయడానికే..రైతును రాజును చేయడానికే ఈ కొత్త చట్టాలు తెచ్చామని ప్రధాని మోడీ చెబుతున్నారు.
దేశంలో 80 శాతానికిపైగా చిన్న, సన్నకారు రైతులే ఉంటారు. ఏటా పంట చేతికొచ్చే సమయంలో వరదలు, భారీ వర్షాలతో నష్టం జరుగుతుంది. కోతలయ్యాక నష్టానికే అమ్ముకోవాల్సిన పరిస్థితులున్నాయి. కనీస మద్దతు ధర అమలులో ఉన్నప్పటికీ...దళారుల చేతిలో చిక్కిన రైతులు నష్టపోతూనే ఉన్నారు. చిన్న రైతులు డబ్బు అవసరంతో...వెంటనే అమ్మేసుకుంటున్నారు. పంట నిల్వ చేసుకోవడానికి వారికి అవకాశం లేదు, ఉంచుకునే వీలూ లేదు. పెద్ద రైతులు మాత్రం ఎప్పుడూ లాభపడుతుంటారు. ఈ స్థితిలో కేంద్రం కొత్త చట్టాలు మరింత సంక్షోభానికి కారణమవుతాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 80 శాతానికిపైగా ఉన్న చిన్న రైతులకు కొత్త చట్టాలు చేటు తెస్తాయంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్తితి అధ్వాన్నంగానే ఉందని..కొత్త చట్టాలతో మరింత చితికిపోతారనే భయం వెంటాడుతోంది. ఈ భయంతోనే దేశ రాజధానిలో వణికించే చలిని సైతం లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్నారు. దేశంలో పరిస్థితి ఇలా ఉంటే..తెలంగాణ రాష్ట్రంలో ఉనికిలో ఉన్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మూసివేస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనతో రైతుల గుండెల్లో బండ పడింది.
రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మూసివేయమని కేంద్ర చట్టాల్లో ఉందా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కొనుగోలు కేంద్రాలు మరిన్ని పెంచాలని కేంద్రం చెబితే..ఉన్నవాటిని ఎలా మూసివేస్తారని నిలదీసారాయన. రైతు వేదికల్ని కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. రైతాంగంలో మరింత అయోమయాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారాయన.
బీజేపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. కొనుగోలు కేంద్రాలు మూసివేస్తూ తీసుకున్న నిర‌్ణయాన్ని ప్రశ్నించడం మానుకోవాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు పంటల్ని కొనుగోలు చేస్తున్నాయా అని ప్రశ్నించారు వేముల.
ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటివల్ల రైతులకు మేలు జరిగితే చాలని అందరూ అంగీకరిస్తారు. కాని చట్టాలతోనే రైతులకు నష్టం కలిగిస్తే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేంద్ర చట్టాలు అమలు చేస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం..ఉన్న కొనుగోలు కేంద్రాలను మూసివేస్తే రైతులకు లాభమా? నష్టమా అని ప్రశ్నిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire