Independence Day 2024: నల్లగొండ గడ్డమీదనే జాతీయ జెండా రూపకల్పనకు పురుడు

Independence Day 2024 The Indian Flags Story
x

Independence Day 2024: నల్లగొండ గడ్డమీదనే జాతీయ జెండా రూపకల్పనకు పురుడు

Highlights

ఉమ్మడి నల్లగొండ జిల్లా..ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం నడిగూడెం రాజవారి కోటలోనే పింగళి వెంకయ్య మన జాతీయ జెండాకు రూపకల్పన చేశారట.

Independence Day 2024: మువ్వల జెండాను చూస్తే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. భారత స్వాతంత్ర సంగ్రామ పోరులో ఎంతో కీలక పాత్ర పోషించింది ఈ జెండా. సామాన్య ప్రజానీకాన్ని..కదనరంగం వైపు నడిపించింది భారత త్రివర్ణ పతాకం. ప్రతి పౌరుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ గుండెల నిండా నింపుకున్న ఆ మువ్వన్నెల త్రివర్ణ పతాకం ఆవిర్భవించి 77 ఏళ్లు పూర్తయింది. అలాంటి మువ్వన్నెల జాతీయ జెండా రూపకల్పనకు పురుడు పోసుకుంది నల్లగొండ గడ్డమీదనే.

ఉమ్మడి నల్లగొండ జిల్లా..ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం నడిగూడెం రాజవారి కోటలోనే పింగళి వెంకయ్య మన జాతీయ జెండాకు రూపకల్పన చేశారట. గాంధీ సూచన మేరకు పింగళి రూపొందించిన జాతీయ జెండాకు..1947 జులై 22న రాజ్యాంగ సభ తీర్మానం చేసి.. ఆమోదించింది. భారత జాతి ఐకమత్యానికి సంకేతంగా నిలుస్తున్న పతాకం రూపు దిద్దుకుంది నడిగూడెం రాజవారి కోటలోనే. ఈ కోట గదుల్లోనే పింగళి వెంకయ్య జాతీయ జెండాకు రంగులద్దారు. గడీలు, జమీందారి వ్యవస్థ అంటే మనకు వెంటనే గుర్తుకువచ్చేది అరాచకం, బానిసత్వం, అందుకు పూర్తి భిన్నంగా స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిలూదిన కోట నడిగూడెం కోట.

ఎత్తైన గోడలతో తొమ్మిది ఎకరాల సువిశాల ప్రాంతంలో ఈ కోటను 1875 లో నిర్మించారు. ఈ సంస్థానంలో మునగాల, నడిగూడెం, తాడ్వాయి, రేపాల, కరివిరాల, సిరిపురం, రామాపురం, వెలిదండ, కొక్కిరేణి,ఆంధ్రలో నందిగామ సహా 40 గ్రామాలు ఉండేవి. స్వాతంత్ర్య కాంక్ష కలిగిన జమిందార్ రంగారావుకి పింగళి వెంకయ్య పరిచయంతో కోట కేంద్రంగా స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది. అక్కడే జాతీయ జెండా నిర్మాణానికి పునాది పడింది. నిజాం నవాబుకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలంతా భయపడుతున్నారు. అదే సమయంలో జమిందార్ రాజా నాయిని రంగారావు, పింగళి వెంకయ్య ఈ నడిగూడెం కోట నుంచే ఉద్యమానికి ఊపిరి ఊదారు. దక్షిణ భారతదేశంలో మహాత్మాగాంధీకి ఉన్న ఏకైక ప్రియ శిష్యుడు పింగళి వెంకయ్య. స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపునిచ్చే విధంగా, పౌరులను ఏకం చేసేందుకు ఒక జెండా కావాలని కోరినప్పుడు నడిగూడెం కోటలోనే పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపకల్పన చేశారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మూడు రంగులతో తయారు చేసి మధ్యలో మహాత్మా గాంధీకి ఇష్టమైన నూలువడికే రాట్నం ఉంచారు. 1926లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ జాతీయ మహాసభలో పింగళి వెంకయ్య రూపొందించిన జెండా బాగా ఆకర్షించింది.

అప్పటికే దేశం నలుమూలల నుంచి 16 నమూనాలు వచ్చాయి. కానీ పింగళి వెంకయ్య రూపొందించిన జెండాలో చిన్న మార్పులు చేసి రాట్నం స్థానంలో అశోక చక్రం చేర్చారు మహాత్మా గాంధీ. అప్పటి జాతీయ ఉద్యమ నాయకులకు సైతం వెంకయ్య జెండానే ఆకర్షించిందనేది చరిత్ర. ఈ జెండాను పట్టుకునే ఉద్యమకారులు స్వాతంత్ర్యం వచ్చే వరకు పోరాడారు.. నడిగూడెం కోటకు జాతీయ జెండాను రూపకల్పన చేసిన ప్రాంతంగా కీర్తి దక్కింది. జాతీయోద్యమ సేవలకు గుర్తింపుగా 2009 సంవత్సరంలో కేంద్రం 5 తపాలా బిళ్ళను విడుదల చేసింది.

చారిత్రక ఘటనకు వేదికైన ఆనాటి ఈ రాజ భవనం నేడు పూర్తిగా శిధిలావస్ధకు చేరుకుంది. నాటి ఆనవాళ్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. రాజా వారసులు కోటను ఓ రీసెర్చ్ సెంటర్ కు అద్దెకు ఇచ్చారు. అద్దెకు తీసుకున్న వారు ఎవరిని కోటలోకి అనుమతించక పోవడంతో పర్యాటకులు నిరాశతో వెనక్కి తిరుగుతున్నారు. ఈ చారిత్రక కట్టడాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బావి తరాలకు అందించాలని స్థానికులు కోరుతున్నారు.నడిగూడెం కోటను ఒక టూరిస్టు కేంద్రంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు.అత్యంత విశిష్టత కలిగిన ఈ కోట ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని,సందర్శకులకు అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories