భారతావని పతకాల పరుగులు.. ఈ హిమ 'స్వర్ణాలు'!

భారతావని పతకాల పరుగులు.. ఈ హిమ స్వర్ణాలు!
x
Highlights

మనమందరం క్రికెట్ సందడిలో పడి పట్టించుకోలేదు కానీ, ఇటీవల కాలంలో భారత్ క్రీడారంగంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఆ అద్భుతం పేరు హిమదాస్. పంతొమ్మిదేళ్ళ ఈ...

మనమందరం క్రికెట్ సందడిలో పడి పట్టించుకోలేదు కానీ, ఇటీవల కాలంలో భారత్ క్రీడారంగంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఆ అద్భుతం పేరు హిమదాస్. పంతొమ్మిదేళ్ళ ఈ పరుగుల పిల్ల పద్దెనిమిది రోజుల వ్యవధిలో ఐదు బంగారు పతకాలు సాధించి అథ్లెటిక్స్ రంగంలో సంచలనం సృష్టించింది. ఎక్కడో ఈశాన్యభారతంలో ఓ మూలగా ఉన్న పల్లె నుంచి దేశం తలెత్తుకునే స్థాయిలో తన ప్రతిభను ప్రదర్శించిన హిమదాస్ ఇప్పుడు మన అథ్లెట్ రంగానికి భవిష్యత్ తార. పరుగుల పోటీలో తిరుగులేని ప్రతిభ తనది. ఆ హిమస్వర్ణం గురించి తెలుసుకుందాం.

- జూలై 2 పోలాండ్.. పోజ్నాం అథ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్.. 200 మీటర్ల పరుగు.. 23.65 సెకన్లలో.. ఫలితం బంగారు పతకం

- జూలై 7 పోలాండ్.. కుట్నో అథ్లెటిక్ మీట్.. 200 మీటర్ల పరుగు.. 23.97 సెకన్లలో.. ఫలితం స్వర్ణం

- జూలై 13 చెక్ రిపబ్లిక్.. క్లాడ్నో అథ్లెటిక్ మీట్.. 200 మీటర్ల పరుగు.. 23.43 సెకన్లు.. బంగారు పతకం..

- జూలై 16.. చెక్ రిపబ్లిక్.. టాబర్ అథ్లెటిక్స్ మీట్... 200 మీటర్ల పరుగు.. 23.25 సెకన్లు.. స్వర్ణ పతకం..

- జూలై 20.. చెక్ రిపబ్లిక్.. నావే మెస్టో.. 400 మీటర్ల పరుగు.. 52.09 సెకన్లు బంగారు పతకం..

ఇదీ వరుస.. ప్లేస్ ఏదైనా.. టోర్నీ ఎక్కడైనా.. పరుగు పందెంలో గెలుపు మాత్రం హిమదాస్ దే!

ఎక్కడో పుట్టి..

ఈశాన్య భారతంలో.. అసోం రాష్ట్రంలో గౌహతీకి 140 కిలోమీటర్ల దూరంలో థింగ్ అనే ఊరిలో.. షెడ్యూల్ తెగలకు చెందిన ధనక్ సంచార కులానికి చెందిన అమ్మాయి. హిమదాస్. కులవివక్షను తరతరాలుగా అనుభవిస్తున్న చిన్న కుటుంబానికి చెందిన బిడ్డ. తండ్రి ఓ పేద రైతు. ఆరుగురు పిల్లలున్న కుటుంబం. హిమకు పరుగు అంటే పిచ్చి. ప్రతిభ అపారం. ఈ విషయం తెల్సినా కనీసం బూట్లు కూడా కొనిచ్చి ప్రోత్సహించలేని పరిస్థితి.

గురువుల అండతో..

కానీ, మట్టిలో మాణిక్యం అలానే ఉండిపోదు కదా.. ఎవరో ఒకరు తవ్వి తీస్తారు. అదే జరిగింది హిమ విషయంలో.. నిపాన్ దాస్ ఆమెలోని ప్రతిభను సరిగ్గా అంచనా వేశాడు. మంచి శిక్షణ ఉంటే దేశానికే పేరు తెస్తుందని నమ్మాడు. ఆమె తల్లి దండ్రులను ఒప్పించి గౌహతిలోని సృసజాయ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు చేర్చాడు. తన స్వంత ఖర్చులతో ఆమెకు కావాల్సిన బూట్లు వంటివి కొనిచ్చాడు. అక్కడ ఆమెకు అసోం రాష్ట్ర అథ్లెటిక్ కోచ్ నవజీత్ మలకర్ ఆమె పరుగుకు మెరుగులు దిద్దాడు. వంద మీటర్లు.. రెండొందల మీటర్ల పరుగులో ఆమె టైమింగ్ అద్భుతంగా ఉండేది. జాతీయస్థాయి పోటీల్లో మెరిసేది. దీనితో ఆమెను అంతర్జాతీయ పోటీలకు పంపించాలని నిర్ణయించారు. నైరోబీలోని వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ పోటీలకు పంపాలనుకున్నారు. కానీ, డబ్బు సమస్య. నిపాన్ దాస్, నవజీత్ ఇద్దరూ కల్సి అప్పులు చేసి అవసరమైన డబ్బు సమకూర్చి పోటీలకు పంపారు. తొలి అంతర్జాతీయ పోటీ.. చిన్న వయసు.. సహజంగానే కొద్దిగా నిరాశ పరచినా..5వ స్థానాన్ని సాధించింది. కోచ్ కు నమ్మకం పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో హిమ ప్రతిభ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఆఫి) కోచ్ గలేనా బుఖారియా దృష్టిలో పడింది. హిమదాస్ టైమింగ్ ఆమెకు నచ్చింది. దీంతో హిమ సరైన ట్రాక్ ఎక్కేందుకు దారి దొరికింది. గలేనా హిమకు పరుగులో మరిన్ని మెళకువలు నేర్పింది. హిమదాస్ కు ఇక ఎదురు లేకుండా పోయింది.

ఒలింపిక్స్ పతకంతోనే తృప్తి..

ఇప్పుడు హిమదాస్ పరుగుల బాటలో స్వర్ణ పుష్పాలు వచ్చి చేరాయి. అవి ఇక ఆగవు కూడా. ఎందుకంటే.. కష్టంతో వచ్చిన విజయం.. వినయాన్ని పెంచుతుంది. అదే జరిగింది హిమదాస్ విషయంలో. ఈ మధ్య అసోంలో వరదలకు రాష్ట్రంలోని ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఆ కష్టానికి చలించిన హిమ తన నెల జీతంలో సగం విరాళంగా ఇచ్చింది. తన ట్విట్టర్ లో వరద బాధితులను ఆదుకోమని పిలుపు ఇచ్చింది. ప్రతిభకు వినయం జతకూరితే విజయానికి తిరుగులేని బాటలు పడినట్టే. వరుసగా ఐదు బంగారు పతకాలు గెల్చినా హిమ వదనంలో సంతృప్తి లేదు. ఛాలెంజ్ లు జీవితాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి. వాటిని దాటడమే జీవితానికి అసలైన అర్థం అని చెప్పే హిమ.. ప్రతి అథ్లెట్ కల దేశానికి ఒలింపిక్స్ లో స్వర్ణం తీసుకురావాలనే. దానికోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాం. ఎలాంటి త్యాగాలైనా చేస్తాం అని చెబుతోంది. ప్రతి విద్యార్థీ తెల్లుసుకోవాల్సిన విజయగాథ హిమదాస్ ది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories