Happy Birthday Google: గూగుల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు!

Happy Birthday Google: గూగుల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు!
x
Highlights

గూగుల్ గురించి తెలీని వారు లేరు. ఇంకా చెప్పాలంటే గూగుల్ దాదాపు ప్రజలందరి నేస్తం. గూగుల్ ఉపయోగించకుండా స్మార్ట్ ఫోన్ వినియోగించే వారు లేరంటే అతిశయోక్తి కాదు. సమాచార వ్యవస్థలో పెను విప్లవాన్ని తీసుకొచ్చింది గూగుల్.

గూగుల్ గురించి తెలీని వారు లేరు. ఇంకా చెప్పాలంటే గూగుల్ దాదాపు ప్రజలందరి నేస్తం. గూగుల్ ఉపయోగించకుండా స్మార్ట్ ఫోన్ వినియోగించే వారు లేరంటే అతిశయోక్తి కాదు. సమాచార వ్యవస్థలో పెను విప్లవాన్ని తీసుకొచ్చింది గూగుల్. అంతరిక్షం నుంచి ఆవకాయ దాకా.. గుండు సూది నుంచి గుండెలు మార్చిన వారి విశేషాల వరకూ.. పుట్టుక నుంచి చావు దాకా.. ఏ విషయం పై సమాచారం కావాలన్నా ఒక్క రెండు పదాలు టైప్ చేస్తే చాలు క్షణాల్లో మన ముందు ఆ వివరాలన్నీ నిలుపుతుంది గూగుల్! ప్రపంచాన్ని మన గుప్పెట్లో బంధించే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తోంది. అంతేకాదు.. ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా గూగుల్ గురించి తలుచుకోకపోతే అసలు పొద్దుపోయే పరిస్థితే లేదు ఇప్పుడు. అందుకే మనవాళ్ళు సరదాగా ఏదన్న తెలియని విషయాన్ని తెలుసుకోవలనుకున్నపుడు గూగుల్ మాతని అడిగి చెబుతాను అంటారు. అంటే సమాచారానికి తల్లిలాంటిది గూగుల్ అని చెప్పడమే అది.

ఈరోజు(సెప్టెంబర్ 27) గూగుల్ పుట్టినరోజు. రెండు దశాబ్దాల తన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని మూడో దశాబ్దంలోకి అడుగిడుతోంది గూగుల్. ఈ సందర్భంగా గూగుల్ గురించిన కొన్ని విశేషాలు!

కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేస్తున్న ఇద్దరు స్నేహితులు లారీ పేజ్, సర్గే బ్రిన్ 1998 లో గూగుల్ ప్రారంభించారు. అప్పటినుంచీ ఇప్పటివరకూ అంచెలు అంచెలుగా విస్తరిస్తూ వచ్చింది గూగుల్. సెర్చ్ ఇంజన్ లలో గూగుల్ తరువాతే ఏదైనా అనేంతగా విజయవంతం అయింది.

గూగుల్ ప్రత్యేకత అదే!

ఎన్నో సెర్చ్ ఇంజన్లు ఉండగా గూగుల్ కే ఎందుకు ఇంత ఆదరణ దక్కింది అనేది పెద్ద ప్రశ్నే. అయితే, సింపుల్ గా చెప్పాలంటే సంప్రదాయ లెక్కలు కాకుండా విభిన్నంగా ఆలోచించడమే గూగుల్ ప్రత్యేకత. సంప్రదాయాక సెర్చ్ ఇంజన్ లు పేజీలో ఎన్ని సార్లు ఆయా పదాల్ని వెతికారు అనే లెక్కలు వేస్తూ పని చేస్తాయి. కానీ గూగుల్ పేజీలు .. వెబ్సైట్ ల మధ్య సంబంధాలను విశ్లేషిస్తుంది. దీనికి పేజ్ రాంక్ అని పేరు పెట్టారు లారీ పేజ్, సర్గే బ్రిన్ వారి ఈ సిద్ధాంతమే గూగుల్ కు ప్రత్యేకత తీసుకువచ్చింది. ఇది పేజీల సంఖ్య, వాటి ప్రాముఖ్యత అనుసరించి వెబ్సైట్ ను అంచనా వేస్తుంది. అందువల్ల గూగుల్ వేగవంతంగా ఏ సమాచారాన్నైనా అందిపుచ్చుకోగలుగుతుంది. కచ్చితంగా ఎలా గూగుల్ వెబ్సైట్ ల పేజీలను కంపేర్ చేస్తుందనే విషయం ఇతమిత్థంగా తెలియకపోయినా.. గూగుల్ ఆల్గోరిథమ్స్ ద్వారా ఈ ప్రక్రియ ఎక్కువ కచ్చితత్వంతో పూర్తి అవుతుందని తెలుస్తోంది.

సెర్చ్ ఇంజన్ ఒక్కటే కాదు..

గూగుల్ అంటే సెర్చ్ ఇంజిన్ ఒక్కటే కాదు. లక్షలాది మంది ప్రజలను అనుసంధానం చేస్తున్న వేదిక. గూగుల్ లో లేనిది ఏదీ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒక మనిషికి సంబంధించిన అన్ని కార్యకలాపాలనూ అవసరమైతే గూగుల్ గుర్తించగలదు అంటే దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. సమాచార మార్పిడి, ఫోటోలు, వీడియోల ప్రసారం, రకరకాల భాషల మధ్య అనుసంధానం.. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ వ్యవస్థ మానవుని నిత్యకృత్యాలకు సమాంతర వ్యవస్థగా మారిపోయింది. ప్రపంచంలో ఫోన్ లేదా కంప్యూటర్ అందుబాటులో ఉన్న ఎవరైనా సరే గూగుల్ తెలీదు అంటే అది వింతగా చెప్పుకోవచ్చు.

గూగుల్ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ తో మమేకమైన వారందరికీ శుభాకాంక్షలు!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories