Govt rules for marriages:శ్రావణ మాసం పెళ్లిళ్లకు ఈ నిబంధనలు పాటించలేదో.. ఇబ్బంది తప్పదు!
Govt rules for marriages: కరోనా దెబ్బతో పెళ్లిళ్లకు ఇబ్బంది వచ్చిపడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే శుభకార్యాలు నిర్వహించాలి.
శ్రావణ మాసం వచ్చిందంటే ఒకటే సందడి. మహిళల మంగళ గౌరీ పూజలూ.. వరలక్ష్మీ వ్రతాలూ.. కొత్త జంటల ఆషాఢ హార్డిల్ వెళ్ళిపోయిన ఆనందంలో హంగామా.. వర్షాలు పడుతుంటే అన్నదాతల పొలం పనుల హడావుడీ.. ఇలా అన్ని వర్గాల వారికీ శ్రావణ మాసం సందడిగా మారిపోతుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే పెళ్ళిళ్ళ ముహూర్తాలు మొదలవుతాయి. ఆషాఢమాసం.. మూఢo.. వెళ్ళిపోయి మంచి రోజులు శ్రావణ మాసం రాకతో మొదలవుతాయి. సాధారణంగా శ్రావణ మాసం రాకకోసం అంతా ఎంతో ఆత్రుత తో ఎదురు చూస్తారు. అయితే, ఈసారి మాత్రం ఆ సందడి లేకుండా పోయింది. కరోనా దెబ్బతో ఒకరి ఇళ్ళకు ఒకరు వెళ్లి వాయినాలు ఇచ్చుకునే అవకాశం మహిళలకు లేకుండా పోయింది. మన నీడను చూసి మనమే భయపడేలా ఉంది పరిస్థితి. అదేవిధంగా ఈ మాసంలో పెళ్లి ముహూర్తాలు కూడా జోరుగా ఉంటాయి.
ఈ శ్రావణ మాసంలో ముహూర్తాలు ఇవే!
మంగళవారంతో ప్రారంభమైన శ్రావణమాసంలో ఆగస్టు 14వరకు శుభకార్యాలు నిర్వహించడానికి ముహూర్తాలు ఉన్నట్లు వేద పండితులు చెబుతున్నారు. జూలైలో 25, 26, 27, 29 తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టులో 2, 5, 8, 9, 13, 14లల్లో కూడా మంచి రోజులున్నట్లు వేద పండితులు వివరిస్తున్నారు. ఆయా సుముహూర్తాలలో అన్ని రకాల శుభకార్యాలు నిర్వహించవచ్చని సూచిస్తున్నారు. అయితే, అధికమాసం కారణంగా సెప్టెంబర్, అక్టోబర్‌లో ఎలాంటి ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఇక ఈముహూర్తాలు మిస్ అయితే.. నవంబర్ 18నుంచి మళ్లీ సుముహూర్తాలు ప్రారంభం అవుతాయని వారు అంటున్నారు. సో, అన్నిరోజులు ఆగడం ఇబ్బంది అయిన వారు ఈముహూర్తాల్లోనే తమ శుభకార్యాలు జరిపించేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.
పెళ్లిళ్లకు కష్టాలు..
కరోనా కష్టంతో పెళ్ళిళ్ళు కూడా చాల జాగ్రత్తగా జరపాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ముహూర్తాలు తప్పిపోతే మళ్ళీ కార్తీక మాసం వరకూ ఆగాలి. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. అందుకే.. ముందుగా అనుకున్న శ్రావణ మాస శుభఘడియల్లో వివాహాలు జరిపించేయాలని అంతా భావిస్తున్నారు.
ఇప్పుడు పెళ్ళంటే పందిళ్ళు.. సందళ్ళు కాదు. చిన్న కుటుంబ కార్యక్రమం. పందిరి వేసే పనిలేదు. పదిమందినీ ఆహ్వానించే అవకాశమూ లేదు. పెళ్లి చేస్తున్నాం అని బంధువులకు చెప్పాలి కాబట్టి చెప్పి.. కరోనా కదా రాకండి అని నిర్మొహమాటంగా చెప్పుకోవడం చాల చోట్ల కనిపిస్తోంది. ఇటు కబురు అందిన బంధువులు కూడా పెళ్ళికి వెళ్ళడానికి సిద్ధంగా లేకపోవడం కూడా జరుగుతోంది. రిస్క్ తీసుకోవడం ఎందుకనే భావన చాలా మందిలో నెలకొంది. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సిద్ధపడ్డ వారికి కొన్ని తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు..
ఇప్పుడు పెళ్లికి అటునుంచి ఓ రెండు వందలు..ఇటునుంచి ఓ రెండు వందలూ బంధు మిత్రులు రావడాలు కుదరదు. పెళ్లి చేయాలంటే ప్రభుత్వం చెప్పిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సిందే. పెళ్లి చేసుకోవాలంటే ఏమి చేయాలంటే..
♦ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో పెళ్లిళ్లకు వధువు నుంచి 10 మంది, వరుడి నుంచి 10 మంది మొత్తంగా 20 మందితో మాత్రమే అనుమతులు ఇస్తున్నారు.
♦తహసీల్దార్ వద్ద పెళ్లికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి కోసం 10 రూపాయల నాన్ జ్యూడీషియల్ స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్దార్‌కు అందజేయాలి.
♦ముద్రించిన పెళ్లి పత్రిక కానీ, పురోహితుడు రాసిన లగ్న పత్రిక జతచేసి తెల్లని కాగితంపై దరఖాస్తు చేసుకోవాలి. అలాగే వివాహానికి హాజరయ్యే 20 మంది పేర్లు కూడా అందులోనే రాసి ఇవ్వాలి.
♦దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఆధార్‌కార్డు జిరాక్స్ కూడా అందజేయాలి.
♦రెవెన్యూ అధికారులు దరఖాస్తును పరిశీలించి నిబంధనలతో కూడిన అనుమతి పత్రాన్ని జారీ చేస్తారు.
♦నిబంధనలు పాటించని వారిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని 188 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటారు.
పల్లెలా.. పట్టణాలా అనే బేధం లేకుండా అందరి పరిస్థితి ఇప్పుడు ఒకేలా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 20 మందితో మాత్రమే వివాహాలు జరిపించాలసి ఉంటుంది. అలా హామీ ఇస్తేనే అనుమతి ఇస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ఇక అనుమతి పొంది వివాహాలు జరిపించేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనాలు ఏర్పాటు చేయరాదని కూడా తెలియజేస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే పెళ్లి అనుమతి పొందిన వ్యక్తిని బాధ్యుడిని చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. అంతే కాదు కేవలం పెళ్లి చేసుకోవడానికి మాత్రమె ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. తరువాత ఆ కార్యక్రమం.. ee కార్యక్రమం అంటూ ఇంట్లో సందడి చేద్దాం.. దగ్గరి వాళ్ళను పిలిచి ఓ రిసెప్షన్ ఇద్దాం అని అనుకుంటే చిక్కులు తప్పవు. అటువంటివి ఏవీ కుదరవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇక ఇటువంటి విందులకు అవకాశమే లేదు.
కాదు కూడదని సందడి చేశారో..
పెళ్లికి అనుమతి పొందిన వారిలో చాలా మంది నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం కాదులే అనే ధీమాలో ఉన్నారు. అనుమతి పొందాక నిబంధనలు పాటిస్తున్నామా..? లేదా..? అని పరిశీలించే వ్యవస్థ లేదని, స్థానికంగా ఉండే పోలీసులను మేనేజ్ చేసుకోవచ్చని భావిస్తున్నారు. కాని ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.
అది అందరి బాధ్యత..
ఏమైనా పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ముహుర్తం మించిపోవడం అనేదే కాదు, కొన్ని కుటుంబాలలో ఆ పెళ్లి తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితులూ ఉండొచ్చు. కనుక కరోనా కారణంగా వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. కరోనా అంటే ఏమిటో.. అది తెచ్చే కష్టం ఏమిటో.. అందరికీ తెలిసిందే.. అందువల్ల ఎవరికీ వారు జాగ్రత్తలు పాటించాల్సిందే. ఒక శుభకార్యం చేసి.. దానికి హంగామా జత చేసి వందమందికి అశుభం కలిగించడం సరైన పని కాదు కదా. ఎవరికీ వారు సామాజిక బాధ్యత తో వ్యవహరించాల్సిందే. పెళ్లి చేయక తప్పదు కాబట్టి.. తక్కువ మందితో వీలయితే 20 మందికంటే తక్కువ మందితో తంతు ముగించేయవచ్చు. అన్నట్టు బోలెడంత టెక్నాలజీ ఉంది కదా.. పెళ్లిని వీడియో తీసి దానిని లైవ్ ఇవ్వచ్చు. బంధువులంతా వారి ఇళ్లలోనే సరదాగా టీవీల ముందు కూచుని వివాహ వేడుకను చూసి వధూవరులను ఆశీర్వదిస్తారు. అందరి ఆశీర్వాదలే కదా ముఖ్యం. అందరినీ ఒకదగ్గర చేర్చి జరగకూడనిది జరిగితే, వారి బాధను శాపంగా మోయడం అవసరం లేదనే స్పృహ ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. దీనికోసం ప్రభుత్వాలు మీ జీవితాల్లోకి తొంగి చూసి మెమ్మల్ని దారిలో పెట్టె పని తెచ్చుకోవద్దు. సింపుల్ గా వేడుక చేసుకోండి. సంతోషంగా అందరి ఆశీస్సులు పొందండి.
మీరు సంతోషంగా ఉండండి.. అందరినీ సంతోషంగా ఉండనివ్వండి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire