Ganesh Chaturthi 2020: వినాయకుని వాహనం ఎలుక అని తెలుసు.. మరి ఆయన మూషికవాహనుడు ఎలా అయ్యాడో తెలుసా?
Ganesh Chaturthi 2020: వినాయక వాహనం పై ప్రత్యెక కథనం.
ఎవరి తాహతును బట్టి వారికి వాహనాలు ఉండడం సహజమే కదా. తాహతు ఒక్కటే కాదు ఇష్టాలూ ఉంటాయి. ఒక్కోరూ ఒక్కోరకమైన వాహనాన్ని ఇష్టపడతారు. మరి మన దేవుళ్ళకూ ఎవరికి వారికి వాహనాలున్నాయి. రకరకాల జంతువులు.. పక్షులు మన దేవతల వాహనాలుగా ఉన్నాయి. గణేశునికి ఎలుక వాహనమైంది. మరి మిగతా దేవతలందరూ వేగంగా పరుగెత్తే జంతువులు, పక్షులను తమ వాహనంగా ఎంపిక చేసుకుంటే, దీనికి భిన్నంగా తొలి పూజలందుకునే వినాయకుడు మూషికాన్ని తన వాహనంగా మార్చుకున్నారు. ఈ మూషికానికి అఖుడని పేరు. ఎలుక క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ప్రతీక. మూషికం తమో రజోగుణాల విధ్వంసకర శక్తికి సంకేతం. మూషికుడనే రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి శరణుజొచ్చి, తన వాహనంగా చేసుకొమ్మని వినాయకుడిని వేడుకున్నాడు. మూషికాన్ని తన వాహనంగా వినాయకుడు చేసుకోవడంపై రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి అవేమిటో వినాయక చవితి సందర్భంగా ఓ సారి తెలుసుకుందాం.
ఒకరోజు దేవతలంతా ఇంద్ర సభలో సమావేశమయ్యారు. ఇందులో గంధర్వులు, కిన్నెరలు, అప్సరసలు సైతం పాల్గొన్నారు. ఓ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుండగా, క్రౌంచుడు అనే గంధర్వుడు సభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు. చర్చలో అనేకమంది పాల్గొన్నా, అప్సరలతో పరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు. క్రౌంచుడి తీరును శ్రీమహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించినా అతడు పట్టించుకోలేదు. దీంతో ఇంద్రుడు ఆగ్రహించి, తక్షణమే ఎలుకగా మారమని శపించాడు. తన తప్పును మన్నించమని గంధర్వుడు కోరినా, ఫలితం దక్కలేదు.
మూషికంగా మారిన తర్వాత కూడా తన ప్రవర్తనతో దేవతలకు విసుగు తెప్పించాడు. దీంతో ఇంద్రుడు అతడిని దేవలోకం నుంచి తరిమేయాలని ఆదేశించాడు. భటులు దాన్ని తరిమేయడంతో భూలోకంలో పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమంలోనూ రుషులకు ఇబ్బందులు కలిగించి, ఒకరోజు ఆశ్రమానికి విచ్చేసిన వినాయకుడ్ని విడిచిపెట్టలేదు. విసిగిపోయిన పరాశరుడు అతనిని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుని అడిగాడు. పరాశరుని కోరిక మన్నించిన వినాయకుడు అతడిపై దాడికి సిద్ధమయ్యాడు.
దీంతో గణేషుడు తన పాశాన్ని మూషికంపై ప్రయోగించగా అది క్రౌంచుని మెడకు చుట్టుకుని ఆయనకు చెంతకు తీసుకొచ్చింది. భయపడిపోయిన క్రౌంచుడు క్షమించమని కోరాడు. క్రౌంచుడిని క్షమించిన వినాయకుడు, మళ్లీ పొరపాటు చేయరాదని హెచ్చరించాడు. అయితే, క్రౌంచుడు తనకు శాపవిముక్తి కలిగించమని ప్రాధేయపడ్డాడు. తాను క్షమించినా మూషికం సంతోషంగా లేదని వినాయకుడు గందరగోళానికి గురయ్యాడు. క్రౌంచుడే మూషికమని తెలుసుకుని, అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు.
ఇంద్రుని శాపానికి తిరుగులేకపోవడంతో దాన్ని భర్తీ చేసే దిశగా ఆశీర్వాదించాడు. ఈ ప్రతిపాదనకు మూషికం కూడా అంగీకరించడంతో తన వాహనంగా చేసుకున్నాడు. ఏ కార్యం ప్రారంభించినా ఆది దేవుడు వినాయకుని పూజించడం ఆనవాయితీ, కాబట్టి గణేశుడితోపాటటు పూజలందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు. దీంతో గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు. ఇక్కడ మరొక సమస్య వచ్చింది. వినాయకుడి బరువును మోయలేను కాబట్టి తేలికగా మారమని కోరాడు. వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి వాహనంగా మారిన సమయాన తన బరువుని మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు.
ప్రచారంలో మరో కథ
గజాసురుడనే రాక్షసుడు తమ గురువు శుక్రాచార్యుల ఆదేశంతో శివుడి గురించి కఠోర తపస్సు చేశాడు. అతడి తపోదీక్షకు మెచ్చిన శివుడు వరం ప్రసాదించాడు. శివుడి వరగర్వంతో గజముఖుడు ముల్లోకాలను ఇబ్బందిపెట్టాడు. అతడి బాధలుకు తట్టుకోలేక దేవతలు ఇంద్రుని వద్దకు వెళ్లి గజముఖుడి దుశ్చర్యల గురించి మొరపెట్టుకుంటారు. గజముఖుడిని కట్టడి చేయడం తన వల్లకాదని చెప్పిన ఇంద్రుడు దేవతలతో కలిసి కైలాసానికి వెళ్లి వినాయకుడికి విన్నవించాడు.
గజముఖుడి చర్యలు నానాటికీ హెచ్చుమీరిపోవడంతో భూత గణాలతో అతడి నగరాన్ని గణేశుడు ముట్టడించి యుద్ధం చేస్తాడు. రాక్షసులు ఆయుధాలతో మరణించలేదని గ్రహించిన వినాయకుడు తన దంతాల్లో ఒకదాన్ని విరిచి వారిపైకి విసురుతాడు. దీన్ని గమనించిన గజముఖుడు.. తక్షణం మూషిక రూపం ధరిస్తాడు. తక్షణమే వినాయకుడు ఆ మూషికంపై ఆశీనుడవుతాడు. అప్పటి నుంచి గజముఖుడు మూషికం రూపంలో గణపతికి వాహనంగా మారిపోయాడు.
అదండీ విషయం..మూషికాన్ని తన వాహనంగా విఘ్నాధిపతి చేసుకోవడం వెనుక కథ ఏదైనా.. క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలను తొక్కి పెట్టి ఉంచాలనేది దాని అంతరార్ధంగా భావించాలి. ఎందుకంటె.. ఎలుక వీటన్నిటికీ ప్రతీకగా చెబుతారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire