Ganesh Chaturthi 2020: వినాయకచవితి చెప్పే గణేశతత్వం..సకల మానవాళికి శుభ సందేశం!

Ganesh Chaturthi 2020: వినాయకచవితి చెప్పే గణేశతత్వం..సకల మానవాళికి శుభ సందేశం!
x
Highlights

Ganesh Chaturthi 2020: పందిరి వేయడం దగ్గర నుంచి నిమజ్జనం దాకా వినాయకచవితి ఇచ్చే సామాజిక సందేశం!

వినాయక చవితి అంటే ఊరంతా పండగే. విఘ్నేశ్వరుడు అంటే అందరి దేవుడు. ఒకరకంగా ముల్లోకాలకు అధిపతి. విఘ్నాదిపతిగా ఆది పూజలందుకునే వినాయకునికి చేసుకునే వేడుక అలా ఇలా ఉండదు. నిజానికి గణేశుడు అంటేనే ప్రకృతికి ప్రతిరూపం. వినాయకుని పూజల్లో ప్రతి భాగంలోనూ ప్రకృతి తత్వం ఉంటుంది. సకల మానవాళికి అద్భుత మైన సందేశం ఉంటుంది.

లంబోదరుడి పుట్టుక.. ముల్లోకాదిపత్యం.. చంద్రుని వేళాకోళం.. శ్రీకృష్ణునికి నీలాపనిందలు ఇలా వినాయక కథ ప్రతి భాగమూ మానవాళికి అన్యాపదేశంగా జాగ్రత్త నాయనలూ అని చెబుతుంది. ఇక వినాయకుని పూజా విధానం ప్రకృతిని ప్రేమించాల్సిన అవసరాన్ని.. ఇంకా చెప్పాలంటే ప్రకృతికి మనం ఇవ్వాల్సిన దైవ స్థానాన్ని మనకు ప్రభోదిస్తుంది. స్వయంగా గజ ముఖుడైన విఘ్నరాజుడు.. జంతువులతో మమేకమై జీవించాల్సిన సందేశం ఇస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే మానవుడూ ఒక జంతువే అనే తత్వాన్ని చెబుతుంది. ఎలుకను వాహనం చేసుకోవడం ద్వారా మనిషి తనలోని ఎటువంటి లక్షణాలు కలిగి ఉండకూడదో తేల్చి చెబుతుంది. (ఎలుకను క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ప్రతీకగా పేర్కొంటారు).అటువంటి లక్షణాలు తొక్కి పడితేనే మానవుడు మహనీయుడు అవుతాడని చెబుతుంది. ఇష్టమైనప్పటికీ ఏవిషయంలోనూ అతి పనిచేయదని లంబోదర ఉదంతంతో చెప్పే వినాయకుడు.. ఎదుటి వ్యక్తిలోని లోపాల్ని అవహేళన చేయకూడదనే నీతిని కూడా చందమామ పరాభవంతో స్పష్టంగా తెలియపరుస్తాడు.

ఇవన్నీ పక్కన పెడితే, ప్రకృతిలో లభించే ప్రతి వస్తువూ లేదా జీవీ పవిత్రమినదే అనే విషయాన్ని పత్రితో చేసే పూజ ప్రభోదిస్తుంది. గరికతో చేసే పూజే నాకు ఇష్టం అనే గౌరీ పుత్రుడు వివిధ రకాల పత్రులతో తనకు పూజలు జరిపించుకుంటాడు. ఆ పూజల్లో వాడే ప్రతి పత్రం ప్రకృతి మానవునికి ప్రసాదించిన ఒక ఔషధ అమృతం. మన సంప్రదాయంలోని గొప్పతనం అదే. ప్రకృతితో మమేకమయ్యే ఎన్నో పర్వదినాలను అందించింది. అందులో వినాయక చవితి చాలా ముఖ్యమైనది. మానవుడిగా సర్వాదిపత్యం నాకుంది అనే గర్వాన్ని వీడి ఎన్నో జీవుల మధ్యలో మనమూ ఒక జీవి అనే విషయాన్ని చెప్పడమే వినాయక తత్త్వం. సాక్షాత్తూ శ్రీక్రిష్ణ్దుడు అంతటి వాడే నాది అని వేసుకున్న ఒక హారంతో అపనిందల పాలయినట్టు వినాయక కథ చెబుతుంది. దైవస్వరూపంగా భావించే కృష్ణుడికే నీలాపనిందలు తప్పనపుడు సామాన్య మానవులం మనమెంత అనే జ్ఞానాన్ని ప్రభోదిస్తుంది వినాయక చవితి కథ.

ఇక చివరిగా..సామాజిక సందేశాన్నిచ్చే పండుగ వినాయక్ చవితి. సృష్టిలో మానవులంతా ఒకటే అనే తత్త్వం ఈ నవరాత్రులలో ప్రతి హృదయంలోనూ స్పందిస్తుంది. వినాయకుని పందిరి వేయడం దగ్గరనుంచి నిమజ్జనం దాకా నవరాత్రులూ మానవాళిలోని కులమత స్థాయీ బేధాలను పక్కన పెట్టి అందరూ కల్సి తమ ఇంట్లో వేడుక చేసుకున్ననంత సంబరంగా ఈ వేడుక చేస్తారు. మొదటి పూజ అందుకున్నా.. సకల మానవాళిని తొమ్మిది రాత్రుల పాటు ఒక పందిరికిందకు తీసుకువచ్చినా.. ఆవిరి కుడుములు ఇష్టంగా అరగించినా.. అన్నీ జనాళికి శుభ సందేశాన్నిచ్చేవే. ఆలోచిస్తే.. ఆచరిస్తే వినాయక తత్త్వం సకల జీవరాశికీ ఆదర్శనీయమైన ఆచరణ మార్గాలు. వినాయకచవితి సందర్భంగా వచ్చే సామాజిక స్ఫూర్హ్తి ప్రతి మనసులోనూ నిత్యం ఉండటమే వినాయకుని పూజకు అర్ధం పరమార్ధంగా నిలుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories