స్నేహ గీతాల మధ్య గీతల్ని గౌరవిస్తేనే స్నే'హితం' !

స్నేహ గీతాల మధ్య గీతల్ని గౌరవిస్తేనే స్నేహితం !
x
Highlights

స్నేహం.. ఈ పదం ఎంత అందమైనదో అంత ప్రమాదమైనది.. మిత్రుడు ఎంత మంచి చేయగలడో, ఒక్కోసారి అంతకు మించి చెడు చేయగలడు.. స్నేహ బంధం ఎంత మధురమో అంత చేదునీ...

స్నేహం.. ఈ పదం ఎంత అందమైనదో అంత ప్రమాదమైనది.. మిత్రుడు ఎంత మంచి చేయగలడో, ఒక్కోసారి అంతకు మించి చెడు చేయగలడు.. స్నేహ బంధం ఎంత మధురమో అంత చేదునీ పంచుతుంది.. ఇవన్నీ చూసి ఏంటి స్నేహితుల దినోత్సవం రోజున ఇంత నెగెటివ్ అనుకుంటున్నారా? ఇది పవిత్రమైన స్నేహ బంధాన్ని వ్యతిరేకంగా చెప్పడం కాదు. స్నేహానికి రెండో కోణం కూడా ఉంటుంది.. దానికే కూడా గౌరవాన్ని ఇవ్వాలని చెప్పే సూచన మాత్రమే.

అనుమానమే అక్కర్లేదు.. సృష్టిలో తీయనైనది స్నేహమే. కానీ, మన సృష్టిలోనే ఎన్నో వైరుధ్యాలు ఉన్నట్టుగానే, స్నేహంలో కూడా ఉంటాయి అని చెప్పడం కోసమే ఇది. మన పుట్టినరోజు జరుపుకుంటాం. ఆరోజు గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని మన వ్యవహారంలోని తప్పొప్పుల్ని బేరీజు వేసుకుంటాం. అదేవిధంగా ఈ స్నేహితుల దినోత్సవం రోజున కూడా మన స్నేహితులలోని మంచి చెడును ఒక్కసారి బేరీజు వేసుకుని ముందుకు సాగితే మంచిదనేదే చెప్పదలచుకున్నది.

లెక్కలు.. ఎక్కాలు సరిచూసుకునేది కాదు స్నేహం అని చాలా తేలికగా చెప్పేస్తారు. కానీ, ప్రస్తుత ప్రపంచం అలా లేదు. కచ్చితంగా అన్నిటినీ కొలతలు వేసుకునే ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఈ ఆధునిక యుగంలో ఉన్నాయి. స్నేహం అంటే మన పక్క బెంచీలో కూచున్న వాడికి పావలా పెట్టి బిస్కట్ కొనివ్వడం కాదు. కాలేజీలో మన తోటి విద్యార్థితో కలసి క్లాసు ఎగ్గొట్టి సినిమా చూడటం కాదు. అది ఒక నమ్మకం. నిజానికి ఏ బంధానికైనా నమ్మకమే పునాది. ఆ నమ్మకం తో కలసిన బంధమే నిలబడుతుంది. అయితే, ఒక్క విషయం మాత్రం స్పష్టం. చాలా పాత మాటైనా ఎప్పటికీ కొత్తగా ఉండేదే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబందాలన్నదే ఆ మాట. ఇది అన్ని బంధాలకీ వర్తిస్తుంది. స్నేహ బంధానికీ ఇందులో మినహాయింపు లేదు.

ఎలా ఉండాలి?

ముందే చెప్పినట్టు స్నేహం అంటే ఓ నమ్మకం. కష్టం కలిగినపుడు.. సంతోషం పట్టలేనప్పుడు.. దుఃఖం మనల్ని మున్చుతున్నప్పుడు.. సంబరాలు మనల్ని చుట్టుముడుతున్నప్పుడు.. మొట్టమొదటగా ఎవరికి చెప్పి మన మనసులోని అనుభూతిని పంచుకోవాలని అనిపిస్తుందో వారితో ఉండేదే నిజమైన స్నేహం. అలా అని మనం అంత నమ్మకంగా మన మనసుని పంచుకున్నట్టు , అవతలి వారూ మన అనుభూతులకు స్పందిన్చాలనేం లేదు. ఎందుకంటే.. మనకి ఏవిధమైన అంచనా అవతలి వారిమీద ఉందో, వారికి మన మీద అదేరకమైన అంచనా ఉండాలి. అంటే ఇద్దరి మనసుల్లోనూ ఒకరిపై ఒకరికి ఒకేరకమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే అది నిజమైన స్నేహంగా నిలుస్తుంది. స్నేహం అంటే రోజూ కలసి కూచుని గంటలు గంటలు కబుర్లు చెప్పుకోవడం కాదు. దూరాన ఉన్నా.. అవతలి వారి యోగ క్షేమాల గురించి ఆలోచించగలిగే మనసు ఉన్నవారి మధ్య ఉండేదే స్నేహ బంధం. మనవ సంబంధాలలో ప్రతీ సంబంధానికీ ఒక పలుచని గీత అడ్డు వుంటుంది. ఆ గీత దాటనంత వరకూ ఎవరితోనైనా.. ఏ బంధమైనా నిలుస్తుంది. సరిగ్గా ఆ గీత ఏది అనేది తెల్సుకున్న వారిద్దరి మధ్యా ఏర్పడేదే అసలైన స్నేహ బంధం. స్పష్టంగా చెప్పాలంటే.. స్నేహాన్ని నిర్వచించడం ఎంత కష్టమో.. దానికి హద్దుల్ని తెలుసుకోవడమూ అంతే కష్టం.

బాల్య స్నేహమే మధురం..

అవును! బాల్యంలో ఏమీ తెలియని వయసులో నిష్కల్మషంగా ఒకరితో ఒకరు ఏర్పరుచుకున్న స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కాలం.. డబ్బు వంటివి వారిని భౌతికంగా దూరం చేసినా, మనసు పొరల్లో ఆ స్నేహం మెదులుతూనే ఉంటుంది. ఎందుకంటే.. అది ఏ స్వార్థాన్ని.. లెక్కల్నీ వేసుకోవడం తెలీని వయసులో కలిగిన బంధం కాబట్టి. పెద్దయ్యాకా ఏర్పడే స్నేహాల విషయంలో మాత్రం కచ్చితంగా స్వార్థం ఉంటుందనేది ప్రముఖ సైకాలజిస్టులు చెబుతున్న మాట. దానికి కారణాలు స్పష్టం అంటున్నారు. బాధ్యతల మధ్య జీవితాన్ని సాగించాల్సి రావడం మొదటిది. ఇక, పెళ్లి తరువాత వచ్చిన భాగస్వామితో ఉండే ఇబ్బందులు ఒక కారణం. తప్పనిసరి పరిస్థితుల్లోనే స్నేహగీతాన్ని పాడుతారు తప్పితే మనస్ఫూర్తిగా స్నేహితాలు కొనసాగించడం కష్టం అనేది వారి మాట.

అందుకే.. జీవితంలోని ప్రతి స్నేహాన్ని గుడ్డిగా నమ్మకూడదు. బాల్య స్నేహితం లో ఉండే మధురిమ జీవితమంతా దొరుకుతుందని భావించకూడదు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన ప్రరిస్తితులు ఇప్పుడు ఉన్నాయి. వాటిని గమనించుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది.

స్నేహితుల దినోత్సవాన్ని ఎంతో సంబరంగా జరుపుకుంటున్న స్నేహితులందరూ తమ 'స్నేహగీతాల' మధ్య ఉన్న 'గీత'లని కూడా 'గౌరవిస్తే'.. జీవితంలో అందరూ మన స్నేహితులే అవుతారు. సన్నిహితులుగానే మిగిలిపోతారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories