Death Mystery: ఇది ఎన్నో వేల ఏళ్ళుగా మనుషులను వెంటాడుతున్న ప్రశ్న. హిందూ, ముస్లిం, క్రైస్తవం, బౌద్దం... ఇలా రకరకాల మతాలు ఈ ప్రశ్నకు రకరకాలుగా జవాబులు చెప్పాయి.
Death Mystery: ఇది ఎన్నో వేల ఏళ్ళుగా మనుషులను వెంటాడుతున్న ప్రశ్న. హిందూ, ముస్లిం, క్రైస్తవం, బౌద్దం... ఇలా రకరకాల మతాలు ఈ ప్రశ్నకు రకరకాలుగా జవాబులు చెప్పాయి. తాత్వికులు సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మరణానికి తమవైన నిర్వచనాలు చెప్పారు.
మరణం తరువాత ఏమైపోతామనే ప్రశ్నకు సైన్స్ కూడా లోతుగా పరిశోధనలు చేసింది. మృత్యు ముఖంలోకి వెళ్ళి వచ్చిన వారి అనుభవాలను రికార్డ్ చేసింది. ఆ ప్రకారం మరణం తరువాత ఏముంటుందో చెప్పే ప్రయత్నం చేసింది. మరణం గురించి లెక్కలేనన్ని సిద్ధాంతాలు పుట్టుకొచ్చినా ఇప్పటికీ మనిషి సంతృప్తి కలిగించే సమాధానం మాత్రం దొరకలేదు. ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకూ ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు అనేకానేక ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఆ ప్రయత్నాల్లో ఏవైనా డెత్ మిస్టరీని ఛేదించాయా? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జాతస్య మరణం ధ్రువం...
పుట్టినవారికి మరణము తప్పదు అని చెబుతుంది హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత. నిజమే, మరణం తప్పదు. అది తిరుగులేని వాస్తవం. కానీ, ఆ తరువాత ఏం జరుగుతుంది? చనిపోయిన తరువాత మరో జీవితం ఉంటుందా? మరణం తరువాత మనం శాశ్వత స్థితిలోకి వెళ్ళిపోతామా? లేక కన్ను మూయగానే మన ఎగ్జిస్టెన్స్‌కు పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుందా?
ఈ ప్రశ్నలకు ఇప్పటికీ జవాబుల్లేవు. కానీ, మరణం తరువాత మరో జీవితం ఏదో ఉందని మనిషి నమ్ముతున్నాడు. లక్ష ఏళ్ళ కిందటి సమాధుల్లో కూడా ఈ నమ్మకానికి ఆనవాళ్ళు కనిపించాయి. ప్రాచీన కాలం నాటి సమాధుల్లో మృతదేహం పక్కన కొన్ని పరికరాలు, ఆభరణాలు, కొంత ఆహారం ప్యాక్ చేసి పెట్టిన దృశ్యాలు కనిపించాయి. చనిపోయిన తరువాత మనం వెళ్ళే మరో ప్రపంచంలో మనకు ఎదురయ్యే పూర్వీకులకు ఇవ్వడానికే అవన్నీ సమాధుల్లో పెట్టేవారని చరిత్ర చెబుతోంది.
వేల ఏళ్ళుగా మనిషిని తొలిచేస్తున్న ఈ ప్రశ్న... ఎన్నో నమ్మకాలకు పునాదిగా నిలిచింది. మరణానంతర జీవితం గురించి ఈ భూమి మీద విభిన్న ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి నమ్మకాలను ఏర్పరచుకున్నారు? ముందుగా, మృతదేహాలను అత్యంత పదిలంగా భద్రపరిచిన ఈజిప్టులో ఏం జరిగిందో చూద్దాం.
మరణం ఒక మలుపు... ఈజిప్ట్ ప్రజల నమ్మకం
ప్రాచీన ఈజిప్టులో మరణాన్ని ఒక మలుపుగా చూశారు. అంతేకానీ, ముగింపుగా చూడలేదు. చనిపోయిన మనిషి ఆత్మ భూగర్భంలోంచి ప్రయాణించి మరణానంతర జీవితాన్ని చేరుకుటుందని వారు నమ్మేవారు. 2,400 ఏళ్ళ కిందట ఈజిప్టులో అందుబాటులో ఉన్న ‘The Book of the Dead’ అనే ప్రఖ్యాత గ్రంథంలో మరణానంతర జీవితం గురించిన అనేక విశేషాలున్నాయి. మరణానంతర జీవితాన్ని చేరుకోవడానికి ఎదురయ్యే అడ్డంకులను ఎలా ఎదుర్కోవాలో ఆ పుస్తకంలో రాశారు. అది చనిపోయిన వారికి గైడ్ లాంటిదన్నమాట. ఆ గ్రంథంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆచరించాల్సిన సంప్రదాయాలను వివరించారు. అందులో ముఖ్యమైనది.. గుండె బరువు లెక్కగట్టడం.
చనిపోయిన వ్యక్తి గుండె బరువు లెక్కగట్టడం ఆనాటి ఈజిప్షియన్ మతంలో ఒక కీలకమైన ఘట్టం. మనిషి మరో ప్రంపంచంలోకి, మరో జీవితంలోకి వెళ్ళాడా లేదా అన్నది తెలుసుకోవడానికి వారు ఈ ఆచారాన్ని పాటించేవారు. గుండె క్రతువులో దైవ ప్రతినిధులు చనిపోయిన వ్యక్తి గుండెను పరీక్షించేవారు. సత్యం, ధర్మం, న్యాయం, శాంతి, సామరస్యం అనే అయిదు అంశాలకు ప్రతినిధి అయిన ‘మాత్’ ఈక కన్నా చనిపోయిన మనిషి గుండె ఎక్కువ బరువుగా ఉంటే.. దాన్ని అమ్మిత్ రాక్షసుడు తినేశాడని నమ్మేవారు.
ఈజిప్టు రాజులైన ఫారోలను విశాలమైన సమాధుల్లో ఖననం చేసేవారు. ఆ సమాధుల్లో ఎంతో సంపదను దాచేవారు. అదంతా చనిపోయిన వారి ఆత్మలు మరో జీవితంలోకి వెళ్లినప్పుడు అక్కరకు వస్తుందని భావించేవారు. 2,580 – 2,560 మధ్య కాలంలో నిర్మించిన గిజా పిరమిడ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు. ఆనాటి ప్రజలకు మరణానంతర జీవితం పట్ల ఉన్న అపారమైన నమ్మకానికి అదొక నిదర్శనం.
పురాతత్వ శాస్త్రవేత్త జేమ్స్ క్విబెల్‌కు 1906లో అక్కడి సమాధుల్లో కొన్ని అక్షరాలు కనిపించాయి. ఆ అక్షరాలకు అర్థం ఏమిటని ఆరా తీస్తే... ఒక ఉదాత్త మహిళ మరణానంతర జీవితంలోకి వెళ్తోందని రాసినట్లు తేలింది. భయంకరమైన ప్రాణులను దాటుకుని సురక్షితంగా వెళ్లేందుకు ఆమె ఆత్మ జపించాల్సిన మంత్రాలను కూడా అక్కడ చెక్కారు. దీన్నిబట్టి, ప్రాచీన ఈజిప్టు ప్రజలు మరణానంతర జీవితాన్ని ఎంత బలంగా నమ్మారో అర్థమవుతుంది.
హిందువుల పునర్జన్మ సిద్ధాంతం
జీవితం జనన మరణాల సంక్రమణం అన్నది హిందువుల నమ్మకం. పుట్టడం, గిట్టడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం ఇలా నిరంతరం ఇది చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. జీవితంలో ఆచరించిన కర్మలను బట్టి మరణానంతర జీవితం ఉంటుందని హిందూమతం చెబుతోంది.
క్రీస్తు పూర్వం 500 ఏళ్ళ కిందటి రాసినట్లు చెబుతున్న భగవద్గీత.. మృత్యువు అంటే శరీరాల్ని మార్చుకోవడమే అని చెబుతోంది. అంటే, మనిషి దుస్తులను మార్చుకున్నట్లు, ఆత్మ దేహాలను మార్చుకుంటుంది. ఈ చంక్రమణం నుంచి బయటపడడమే మోక్షమని, దైవంలో లీనం కావడమని ప్రభోధిస్తుంది.
బౌద్ధం ఏమంటోంది?
జనన మరణ చక్రం అనేది బాధలతో కూడుకున్న మార్గమని బౌద్ధమతం చెబుతుంది. ఆత్మశాశ్వతం అనే భావనను బౌద్ధం అంగీకరించదు. కానీ, కర్మలతో ప్రభావితమైన అంతఃకరణ కొనసాగుతుందని చెబుతోంది. సిద్ధార్థ గౌతముడు క్రీస్తు పూర్వ 6వ శతాబ్దంలో బుద్ధుడిగా మారిన తరువాత నిర్వాణం అంటే ఏమిటో చెప్పారు. కోరికలు – దుఃఖంతో కూడుకున్న సంసారయాత్ర నుంచి పూర్తిగా విముక్తి పొందడమే నిర్వాణం అని ప్రవచించాడు. అదే మనిషి అంతిమ లక్ష్యం అని బోధించాడు.
టిబెటన్ బౌద్ధం పునర్జన్మలను బలంగా విశ్వసిస్తుంది. దలైలామాలు మళ్ళీ జన్మిస్తారని అక్కడి బౌద్ధులు చెబుతారు. 14వ శతాబ్దం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. వారి నమ్మకం ప్రకారం చనిపోయిన దలైలామా కొంతకాలానికి మళ్ళీ పుడతారు. అలా దలైలామాగా పుట్టింది ఎవరని గుర్తించడానికి వారు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు. అలా గుర్తించిన బాలుడిని రింపోచే అని పిలుచుకుంటారు. పెరిగి పెద్దయ్యాక అతడే బౌద్ధమత గురువు దలైలామా అవుతాడు. దలైలామా అంటే జ్ఞాన సముద్రం అని అర్థం.
చనిపోయిన వాళ్ళు ఉండే లోకం...
ఒక మనిషి చనిపోయాక అతడి ఆత్మ మానవాతీ లోకంలోకి ప్రయాణిస్తుందని ప్రాచీన రోమన్లు నమ్మేవారు. ఆ మానవాతీత లోకంలో ఆత్మలు దైవ విచారణను ఎదుర్కొంటాయి. మంచి పనులు చేసిన ఆత్మలు ఎలీషియన్ లోకానికి అంటే స్వర్గానికి చేరుకుంటాయి. అక్కడ అవి శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటాయి. తప్పుడు కర్మలు ఆచరించిన వారు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో జన్మించి కష్టాలు, దుఃఖాలు అనుభవించాల్సిందే.
గ్రీకుల పురాణ గ్రంథంలో నాయకుడు ఒడిస్సియస్ ఆ అతీతలోకంలోకి వెళతాడు. అక్కడ చచ్చిపోయిన వారి ఆత్మలతో మాట్లాడుతాడు. ఈ పురాణగాథ గ్రీకు నాగరికతనే ప్రభావితం చేసింది. మరణం తరువాత జీవితం అంటే ఈ గ్రంథంలో లాగే ఉంటుందని అక్కడి ప్రజల్లో ఇప్పటికీ చాలా మంది విశ్వసిస్తారు.
అసలు మనిషి చనిపోయిన తరువాత అంత్యక్రియలు జరిపే సంప్రదాయం ఎలా మొదలైంది? చరిత్రలో రికార్డయిన సమాచారం ప్రకారం క్రీస్తుపూర్వం 490వ సంవత్సరంలో మొదటిసారిగా చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు జరిగాయి. అప్పటి నుంచీ చనిపోయిన వ్యక్తి ఆత్మ అతీతలోకానికి సవ్యంగా ప్రయాణించాలంటే అంత్యక్రియలు పద్ధతి ప్రకారం చేయాలనే నమ్మకం మానవ సమాజంలో బలపడింది.
స్వర్గం – నరకం
ఇస్లాం, క్రైస్తవ మతాలు రెండూ స్వర్గం – నరకం ఉన్నాయని విశ్వసిస్తాయి. చనిపోయిన తరువాత ఆత్మల పరీక్ష ఉంటుందని, ఆ తరువాత దేవుడితో ఉండే స్వర్గానికి, లేదంటే శిక్షలు అమలు చేసే నరకానికి వాటిని పంపిస్తారని క్రైస్తవం చెబుతోంది. The Book of Revelation అనే ప్రాచీన క్రైస్తవ మత గ్రంథం ఈ ఫైనల్ జడ్జిమెంట్ గురించి వివరిస్తుంది.
ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ కూడా శాశ్వత శాంతి, సంతోషం ఉండే జన్నాకు మంచి ఆత్మలు చేరుకుంటాయని, తప్పు చేసిన వారు జహన్నమ్ అంటే నరకానికి వెళతారని చెబుతోంది. ఏడో శతాబ్దం నాటి ఈ మత గ్రంథం భూమి మీద మనిషి జీవితాన్ని బట్టే అతడు లేదా ఆమె మరణానంతర జీవితం ఉంటుందని చెబుతున్నాయి.
సైన్స్ ఏమంటోంది?
ప్రాణ స్పృహకు ముగింపే మరణం అంటోంది సైన్స్. శాస్త్రవేత్తలు మరణాన్ని జీవసంబంధ విషయంగానే చూస్తోంది. సైన్స్ ప్రకారం మెదడు తలుపులు పూర్తిగా మూసుకుపోవడమే మరణం.
అయితే, NDE అని ఓ కాన్సెప్ట్ ఉంది. అంటే, నియర్ డెత్ ఎక్స్ పీరియన్స్... అంటే, చావు నోట్లో తలపెట్టి బయటపడిన అనుభవం అన్నమాట. ఇలాంటి ఎన్.డి.ఈ అనుభవాలను లోతుగా పరిశోధించిన శాస్త్రవేత్తలు మనిషి మెదడుకు మరణానికి అతీతమైన శక్తి ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇటీవల 2014లో డాక్టర్ సామ్ పార్నియా నేతృత్వంలోని బృందం వైద్యపరంగా చనిపోయినట్లు నిర్ధారించిన వారిపై పరిశోధనలు చేసింది. ఆ పరిశోధనల్లో విచిత్రమైన అంశాలు వెలుగు చూశాయి. వైద్యపరంగా చనిపోయినట్లుగా నిర్ధారించిన తరువాత ప్రాణాలతో బయటపడిన అలాంటి వ్యక్తులు కొందరు తాము తమ శరీరాల మీద తేలుతూ ఉన్నామని చెప్పారు. మరికొందరు, తమకు అత్యంత ప్రకాశవంతమైన వెలుగు కనిపించిందని చెప్పారు. మరికొందరైతే, తమకు బాగా ఇష్టమైన వారిని కలిసి వచ్చామని చెప్పారు.
ఇదంతా మెదడులో జరిగే రసాయనిక చర్యల ఫలితమేనని కొందరు భావించారు. కానీ, కొందరు పరిశోధకులు మాత్రం, అవి చావును చూసి వచ్చిన వారి అనుభవాలేనని, వాటి అధారంగా మరణం తరువాత జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అన్నారు.
నిజానికి, నియర్ డేత్ ఎక్స్ పీరియన్స్ – ఎన్.డీ.ఈ అనే మూడు అక్షరాలు మొదటిసారి Life After Life అనే పుస్తకంతో పరిచయమయ్యాయి. ఈ పుస్తకాన్ని డాక్టర్ రేమండ్ మూడీ 1975లో రాశారు. మరణాన్ని కొన్ని క్షణాలు చూసి వచ్చిన వారి అనుభవాల గురించి అందులో చాలా ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఈ అనుభవాలను పరిశీలిస్తే సైన్స్ స్వరూపమే మారిపోతుందని మూడీ తన పుస్తకంలో రాశారు.
చావు – తత్వం
మనిషికీ, ప్రకృతికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి? మనిషి ఆలోచనలకు పునాది ఎక్కడ? ఈ సృష్టి ఇలా ఎందుకుంది? దీని పరమార్థం ఏంటని తలబద్దలు కొట్టుకుంటున్న తత్వవేత్తలు కూడా మరణ రహస్యం తేలితే తత్వం మరింత లోతుగా బోధపడుతుందని భావించారు.
గ్రీకు తత్వవేత్త... ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీగా భావించే సోక్రటీస్‌కు క్రీస్తు పూర్వం 399లో మరణశిక్ష విధించారు. ప్రజలందరూ పూజించే దేవుళ్ళను కాదంటున్నారని, కొత్త దేవుళ్ళ గురించి చెబుతున్నారని, యువతరాన్ని పాడు చేస్తున్నారని రోమన్ రాజ్యం ఆయనకు మరణశిక్ష విధించింది. అప్పుడు ఆ తత్వవేత్త ఏమన్నారో తెలుసా: మరణాన్ని హాయిగా ఆహ్వానిస్తున్నా. అది బహుశా అది అత్యంత గాఢమైన, కలలు లేని నిద్ర. మరో కొత్త జీవితంలోకి ప్రయాణం.’
అంత పెద్ద తత్వవేత్త కూడా ఆ రోజుల్లో మరణాన్ని అంతం కాదిది ఆరంభమనే వ్యాఖ్యానించారు. ఆత్మకు మరణం లేదని హిందూ తాత్వికధోరణినే వినిపించారు.
హిందూ తత్వశాస్త్రం ప్రకారం.. మరణం తరువాత కంటికి కనిపించని సూక్ష్మ పదార్థం దేహాన్ని వీడిపోతుంది. అదే ఆత్మ. అది అనంత విశ్వంలోని అనేకానేక ఆత్మల సమూహంలో కలిసిపోతుంది. ఆత్మకు మరణం లేదు. అది ఒక దేహం నుంచి మరో దేహానికి ప్రయాణిస్తుందని కదా భగవద్గీత చెబుతోంది.
ఆఫ్రికన్ ఆదిమజాతి ప్రజలు ఏమంటారు?
మృత్యువు విషయంలో ఆఫ్రికా ఖండంలోని ఆదిమ జాతుల ప్రజల నమ్మకాలు మరోలా ఉంటాయి. మరణం అంటే మహాశక్తిలోకి ప్రయాణం అని వారు భావిస్తుంటారు. చనిపోయిన వారు తమ బంధువులు, ఆత్మీయులతో దగ్గరగా మెలుగుతుంటారని వారు నమ్ముతుంటారు. బతికి ఉన్న వారిని చనిపోయిన వారు గమనిస్తుంటారని, వారికి దారి చూపిస్తుంటారని కూడా అంటారు. వారి నమ్మకంలో మరణం అనేది ముగింపు కాదు, కేవలం ఒక మలుపు.
ఇంతకీ మరణం తరువాత ఏంటి?
మరణం గురించి ఎంత తెలుసుకున్నా... మళ్ళీ ఇదే ప్రశ్న మనకు ఎదురవుతుంది. ఈ ప్రశ్నకు జవాబు అడిగే వారి మనసులోనే ఉంది. వారి ఆలోచనల్లోనే ఉంది. మరణం గురించి ఎన్నో సిద్ధాంతాలు వేల సంవత్సరాలుగా వింటున్నా ఇప్పటికీ మనకు అదొక మిస్టరీ.
ఇక్కడ ప్రశ్న... మరణం తరువాత ఏమవుతుంది అన్నది మాత్రమే కాదు. మరణానికి సంబంధించిన రకరకాల ఆలోచనలు మానవజాతిని విశ్వాసాలను ఎలా మార్చుతూ వచ్చాయనన్నదే అసలు ప్రశ్న. మరణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోంచే మతాలు పుట్టాయి. అంటే, మరణాన్ని అర్థం చేసుకోవడం అంటే, జీవితాన్ని అర్థం చేసుకోవడమే.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire