Corona Effect on Lifestyle: జీవనశైలి మారితేనే భ‌విష్య‌త్తు.. కరోనా వేళ మారాలంటున్న మేధావులు

Corona Effect on Lifestyle: జీవనశైలి మారితేనే  భ‌విష్య‌త్తు.. కరోనా వేళ మారాలంటున్న మేధావులు
x
corona effect on life style
Highlights

Corona Effect on Life style: ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ కేసులు పెరుగుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వైరస్ మరింత విస్తరిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రధానంగా మన జీవనశైలిలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది

Corona Effect on Life style: ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ కేసులు పెరుగుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వైరస్ మరింత విస్తరిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రధానంగా మన జీవనశైలిలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దీనిని కట్టడి చేయాలంటే లేనిపోని భయాలకు పోకుండా కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది.

కరోనా విజృంభిస్తున్న వేళ జన జీవన శైలిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైరస్‌ రాకుండా అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఒక వేళ వైరస్‌ వచ్చినా దానిని జయించేందుకు ముందుగానే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. మాస్క్‌లు, శానిటైజర్ల వినియోగంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు బలమైన ఆహారాన్ని తీసుకుంటు న్నారు. ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకూ గతానికి భిన్నంగా మన లైఫ్‌స్టైల్‌ పూర్తిగా మారిపోయింది. ప్ర«ధానంగా ఇళ్లల్లో ఉన్న వృద్ధులు, పిల్లలను సంరక్షించుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

► సాధారణ గృహిణి నుంచి ఉద్యోగి వరకు ఇప్పుడు ముఖానికి మాస్క్‌లు, చేతులకు శానిటైజర్లను వినియోగిస్తున్నారు. బయటికి వెళ్లేప్పుడు కూడా జేబుల్లో, హ్యాండ్‌ బ్యాగుల్లో శానిటైజర్లను వెంట తీసుకెళ్తున్నారు.

► స్తోమతను బట్టి రూ.20 నుంచి రూ.500 వరకు విలువైన మాస్కులను వాడుతున్నారు.

రోగ నిరోధక శక్తిని పెంచుకునే క్రమంలో పసుపు, అల్లం, శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ తదితర వాటితో కషాయాలు తయారు చేసుకుని తాగుతున్నారు. కాఫీ, టీల స్థానే కషాయాలు తీసుకోవడం పెరిగింది.

► కరోనా సోకాక ఆందోళన చెందకుండా ముందు జాగ్రత్తగా అన్ని మందులను దగ్గర పెట్టుకుంటున్నారు.

► జ్వరానికి పెరాసెట్‌మాల్, జలుబు, దగ్గు, నొప్పులు వంటి వాటికి అవసరమైన మందు బిళ్లలను సరిపడా సిద్ధం చేసుకుంటున్నారు.

► కరోనా సోకినా తట్టుకుని ప్రాణాలు నిలుపుకొనేలా ఇమ్యూనిటీ బూస్ట్‌ కోసం మల్టీ విటమిన్‌ మాత్రలను మింగుతున్నారు.

ఆక్సీమీటర్, ఆవిరి యంత్రాల కొనుగోలు

► పెరుగుతున్న కరోనా కేసులతో ఆస్పత్రుల్లో ఖాళీ ఉండే పరిస్థితి లేదని పలువురు ముందుగానే జాగ్రత్తపడుతున్నారు.

► ప్రయివేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో మాట్లాడుకుని తమకు అవసరమైనప్పుడు బెడ్, వెంటిలేటర్‌ కేటాయించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు.

► శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిని తెలుసుకునేందుకు రూ.1,350 నుంచి 2,500 ఖరీదైన ఆక్సీమీటర్, ఊపిరితిత్తుల్లో నిమ్మును తగ్గించేలా రూ.200 నుంచి రూ.600 వరకు ఖరీదైన ఆవిరి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు.

► సత్వరం ఆక్సిజన్‌ అందించేలా రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకూ విలువైన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ మిషన్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్యా పెరుగుతోంది.

► కాన్సన్‌ట్రేటర్‌ మిషన్‌లో నీళ్లు పోసి కరెంటు ప్లగ్‌ పెడితే దానికదే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ మిషన్‌కు ఉండే మాస్క్‌ను ఏకకాలంలో ఒకరిద్దరు ముఖాలకు పెట్టుకుంటే ముక్కు ద్వారా ఆక్సిజన్‌ అంది ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది.

ముఖానికి మాస్క్‌ తప్పనిసరైంది..

నేను బయటకు వెళితే ఖచ్చితంగా శానిటైజర్, మాస్క్‌ వినియోగిస్తున్నా. జేబులో పెట్టుకునేలా పెన్‌ మాదిరిగా ఉండే శానిటైజర్‌ పైపును వెంట తీసుకెళ్తున్నా. దానిలో రోజువారీగా జల్‌ శానిటైజర్‌ నింపుకొని తీసుకెళ్లడం సులభంగా ఉంది. సురక్షితమైన క్లాత్‌తో తయారు చేసిన దాన్నే మాస్క్‌గా వినియోగిస్తున్నా. ఇంటికొచ్చాక మాస్క్, గ్లౌజులను మూత ఉండే డస్ట్‌బిన్‌లో పడేసి, మొదట కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని స్నానం చేశాకే ఇంట్లోకి వెళుతున్నా.

– మంగం రవికుమార్, ప్రైవేటు ఉద్యోగి, కలిసిపూడి, పశ్చిమగోదావరి

ఆహారపు అలవాట్లు మార్చుకున్నా..

కరోనా నేపథ్యంలో మా ఇంట్లో ఉదయం లేవగానే వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగుతున్నాం. టిఫిన్‌లో బాదం పప్పులు, ఒకటి లేదా రెండు గుడ్లతో పాటు అల్లం టీ తీసుకుంటున్నాం. మధ్యాహ్న భోజనంలో మిరియాల రసం, ఆకు కూరలు, కొద్దిగా మాంసాహారం లేదా క్యారెట్, బీట్‌రూట్, ఏదో ఓ కూర తింటున్నాం. రాత్రిపూట తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగుతున్నాం.

– ఎ.సుబ్బలక్ష్మి, గృహిణి, భీమవరం, పశ్చిమగోదావరి

Show Full Article
Print Article
Next Story
More Stories