బొర్రా గుహలు కూలిపోనున్నాయా?

బొర్రా గుహలు కూలిపోనున్నాయా?
x
Highlights

బొర్రా గుహలు కూలిపోయి ఉన్నాయా? దేశంలోనే పురాతన గుహలుగా చెప్పబడుతున్న బొర్రా గుహలు కూలిపోనున్నాయా? 15 మిలియన్ల సంవత్సరాల నాటి గుహలు ఇక మనకు...

బొర్రా గుహలు కూలిపోయి ఉన్నాయా? దేశంలోనే పురాతన గుహలుగా చెప్పబడుతున్న బొర్రా గుహలు కూలిపోనున్నాయా? 15 మిలియన్ల సంవత్సరాల నాటి గుహలు ఇక మనకు కానరావా? బొర్రా గుహలు లేకుండా అరకు పర్యాటకాన్ని ఊహించుకోగలమా? అంటే అవుననే అంటున్నారు ఆర్కియాలజీ శాస్త్రవేత్తలు. పురా జీవశాస్త్ర శాస్త్రజ్ఞుల ప్రకారం బొర్రా గుహలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి.

విశాఖ మన్యంలో టూరిజం స్పాట్‌గా ఉన్న బొర్రా గుహలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. బొర్రా గుహల ప్రవేశ ద్వారాన్ని చూసిన ఎవరికైనా అలాగే అనిపిస్తోంది. ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధృవీకరించారు. తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పురాజీవ శాఖకు సూచించారు. దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. ప్రవేశ ముఖద్వారం వద్ద ఆకాశంలో నుంచి 100 అడుగుల లోతులో ఉన్న గుహల్లోకి వేలాడుతున్నట్టున్న బండరాళ్లు ఏ నిమిషంలోనైనా కూలి ఎవరి మీద పడతాయోనన్న భయం వెంటాడుతోంది. మరోవైపు గుహ మధ్యలో ఉన్న రాళ్ల సందుల్లో నుంచి నిత్యం జాలువారుతూ ఉన్న నీటి చుక్కల వల్ల వదులవుతున్న బండరాళ్లు ఎప్పుడైనా గుహల్లోకి కూలిపోవచ్చన్న అనుమానం కలుగుతోంది.

ఇక మూడవ సమస్య.. ఈ గుహలకు సమాంతరంగా పైన వంద మీటర్ల ఎత్తులో వేల టన్నుల లోడ్‌తో నిత్యం నడుస్తున్న ఐరన్ ఓర్ గూడ్స్ రైళ్ల వైబ్రేషన్ వల్ల మొత్తం గుహలకు ఒక్కసారిగా ప్రమాదం జరగొచ్చన్న భయం కూడా కలుగుతోంది. ఇదే కాక స్థానిక గైడ్లు చెబుతున్న ప్రకారం బొర్రా గుహలలో ఇటీవల పై నుంచి కొన్ని రాళ్లు విరిగి గుహలో పడ్డ ఘటన భవిష్యత్ ఘటనలకు ఊతమిస్తోంది. ఇప్పుడు టూరిజం శాఖ కూడా ఇదే విషయంపై దృష్టిపెట్టింది. ఎక్కడ లూజ్ ప్యాకింగ్ రాళ్లు ఉన్నాయో పరిశీలిస్తోంది. ఐరన్ జల్లెడలు లాంటి పరికరాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది.

బొర్రా గుహలకు మామూలు రోజుల్లో రెండు వేల నుంచి మూడు వేల మంది పర్యాటకులు వస్తుంటారు. టూరిస్ట్ సీజన్లో అంటే అక్టోబరు నుంచి జనవరి వరకూ 3 నుంచి 5వేల మంది పర్యాటకులు వస్తుపోతుంటారు. నిపుణులు చెబుతున్న ప్రకారం గుహలు కూలడం జరిగితే భారీ నష్టం జరుగుతుందన్నది వాస్తవం. అందుకే ముందు జాగ్రత్తగా గుహలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకునే ఉండేందుకు టూరిజం శాఖ ప్రత్యేక నిపుణులను నియమించింది. దీంతో శబ్ద తరంగాలకు సంబంధించిన ఇంజనీర్లు, పురా జీవ శాస్త్రానికి చెందిన శాస్త్రవేత్తలు బొర్రా గుహల పటిష్టతను పర్యవేక్షించే పనిలో ఉన్నారు.

అయితే, కొందరు స్థానికులు, పర్యాటకులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. బొర్రా గుహలను తాము చిన్నప్పటి నుంచి చూస్తున్నామని, హుద్ హుద్ వంటి భారీ తుపాను సమయంలో కూడా చెక్కు చెదరలేదని, భవిష్యత్‌లో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. మొత్తానికి చరిత్రాత్మక బొర్రా గుహలు కూలిపోతాయన్న శాస్త్రవేత్తల సూచనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరి గుహలను కాపాడుకునేందుకు టూరిజం శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories