బర్డ్ ఫ్లూ చికెన్ వలనే వస్తుందా? మనుషుల్లో కనిపించే లక్షణాలు ఏమిటి?

Bird Flu fear in Humans
x
ప్రతీకాత్మక చిత్రం 
Highlights

అందరినీ భయపెడుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలు ఎలా ఉంటాయి?

ఇప్పుడు అందర్నీ భయపెడుతున్న విషయం బర్డ్ ఫ్లూ! దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ ఫ్లూ విస్తరిస్తూవస్తోంది. తెలుగు రాష్ట్రాలల్లోనూ అక్కడక్కడా బర్డ్ ఫ్లూ ఉనికి కనబడుతోంది. ఇక అదిగో పులి.. ఇదిగో తోక వంటి సమాచారం చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఎక్కడ ఒకేసారి నాలుగు కోళ్లు చనిపోయినట్టు తెలిసినా బర్డ్ ఫ్లూ ఏమోననే అనుమానంతో భయపడే పరిస్థితి ఉండిపుడు. నిజానికి బర్డ్ ఫ్లూ ప్రమాదకరమైన వ్యాధి అయినా.. నివారణ చర్యలతో దగ్గరకు రాకుండా చూసుకోవచ్చు. అసలు బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి. ఎలా వ్యాపిస్తుంది? చనిపోయిన పక్షి బర్డ్ ఫ్లూ కారణంగానే చనిపోయిందా అనే విషయాలు ఒకసారి పరిశీలిస్తే..

బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి? మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా?

బర్డ్ ఫ్లూ వైరస్ వలన వస్తుంది. ఆ వైరస్ పేరు హెచ్5ఎన్1. ఇది కోళ్లు..బాతులు వంటి పక్షి జాతుల్లో ఒకదాని నుంచి మరోదానికి వేగంగా విస్తరిస్తుంది. అయితే, పక్షి నుంచి మనిషికి అంత త్వరగా సోకె అవకాశం లేదు. ఈ వైరస్ మొదటి సారిగా 1977 లో కనుగొన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ వ్యాధి మనుషుల్లో తీవ్రంగా వ్యాప్తి చెందిన దాఖలాలు లేవు. ఇప్పటివరకు ఈ వైరస్ తో 353 మంది బాధపడ్డారని అధికారులు చెబుతున్నారు. వారిలో 221 మంది మృత్యువాత పడ్డారు. అంతే ఈ వైరస్ సోకితే మరణించే వారి సంఖ్య ఎక్కువ. కానీ, ఈ వ్యాధి సోకి చనిపోయిన వారంతా పక్షులకు దగ్గరగా..పక్షులతో మెలింగిన వారే కావడం గమనార్హం. ఇక ఇక్కడ ఇంకా ముఖాయమైన ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకినట్టు ఇప్పటివరకూ ఎక్కడా రికార్డు కాలేదు.

వ్యాప్తి ఇలా.. వ్యాధి సోకిన పక్షిని గుర్తించడం ఎలా?

కోళ్ల సోంగ, పెంట, మాంసం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది. కోళ్ల పరిశ్రమలో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పక్షి ఈకలు చెల్లా చెదురుగా ఉంటాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. వ్యాధి ఎక్కువ అయితే, ఆ పక్షి వివిధ శరీర భాగాలు దెబ్బతిని చనిపోవడం జరుగుతుంది.

చికెన్ తింటే బర్ద్ ఫ్లూ వస్తుందా..

ఆరోగ్యంగా ఉన్న కోడి వల్ల బర్ద్ ఫ్లూ వచ్చే అవకాశం లేదు. అయితే, బర్డ్ ఫ్లూ ఆ చికెన్ లో ఉన్నదీ, లేనిదీ మనకు తెలీదు కాబట్టి.. చికెన్ కచ్చితంగా బాగా వేడి వద్ద అంటే 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి తినాలి. సరిగ్గా ఉడకని చికెన్ తినడం వలన బర్ద్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుంది.

బర్ద్ ఫ్లూ సోకితే మనుషులలో కనిపించే లక్షణాలు ఇవే..

దగ్గు, జ్వరం, గొంతునొప్పి, కారే ముక్కు, ఒంటి నొప్పులు, తలనొప్పి, కళ్లు ఎర్రగా అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఏ వైరస్ గురించి అయినా పెద్దగా భాయపడాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. చికెన్..గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకుతుంది అనేది పూర్తిగా నిజం కాదు. ఒకవేళ ఎప్పుడన్నా వైరస్ సోకిన చికెన్ ను తింటే.. అది కూడా సరిగా ఉడికించకుండా తింటే మాత్రం వైరస్ సోకె అవకాశం ఉంటుంది. ఇక కోళ్ల ఫామ్ లో పని చేసే వారు మాత్రం తగినంత ముందు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories