Special Story on Ayodhya Ram Mandir : అయోధ్య రామునికి అపురూప ఆలయం!
Special Story on Ayodhya Ram Mandir : సుందర శిల్పాలు. అపురూప నమూనాలు. అబ్బురపరిచే స్థంభాలు స్థలపురాణం చాటే కళలు. ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడా అని...
Special Story on Ayodhya Ram Mandir : సుందర శిల్పాలు. అపురూప నమూనాలు. అబ్బురపరిచే స్థంభాలు స్థలపురాణం చాటే కళలు. ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామయ్య మందిరానికి భూమిపూజ జరిగే సందర్భమిది. శతబ్దాల నిరీక్షణకు తెరదించేసిన సమయమిది. తాను పుట్టిన పెరిగిన నేలపై కొన్ని వందల సంవత్సరాల పాటు తనకంటూ ఓ గుడి కూడా లేకుండా అరణ్యవాసం చేస్తున్న రామయ్యకు ఓ కోవెలను కడుతున్న విశేషమిది. అవును అయోధ్యా రామయ్య ఓ ఆలయంవాడు కాబోతున్నాడు. ఆ శుభ ఘడియలకు శ్రీకారం పడిపోయింది. సంకల్పం నెరవేరింది. ఆగస్టు 5వ తేదీన భూమిపూజ ఇంతకీ అయోధ్యలో రామయ్య మందిరం ఎలా ఉండబోతోంది? ఎలా కనిపించబోతోంది?
ఏదైనా ఆలయ అభివృద్ధి జరిగితే... దాని విశిష్టత పదులు, వందలు కాదు వెయ్యేళ్ల వరకు చెదిరిపోని విధంగా ఉండాలి. నాలుగు తరాలు చెప్పుకునేదిగా ఉండాలి. అదే తరహాలో ఆగస్టు 5వ తేదీ నుంచి మహా దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోబోతుంది అయోధ్యలో రామయ్య ఆలయం. ఊహకు అందని విధంగా, మరెక్కడా కనిపించని విధంగా నలువైపులా భుజ మండపాలు, ప్రాకారాలలో రామాయణ రూపాలు అద్భుతహా అనిపించేలా కోదండ రామయ్య కోవెల నిర్మాణం కాబోతోంది.
అయోధ్యకు పునర్‌వైభవం రాబోతుంది. కోవెలలోనే కోదండరాముడి కొలువు. అద్భుతమైన శిల్పసంపద మధ్య దాశరథి. శతాబ్దాల చరిత్రకు సరికొత్త శ్రీకారం ఇది. త్రేతాయుగంలో సరయూ నదీ తీరంలో జన్మించిన రామభద్రుడికి ఇన్నేళ్ల తర్వాత ఓ ఆలయం తయారుకాబోతోంది. అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి రామయ్యేదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత హిందువుల కల సాకారం కాబోతోంది. ఈ మహత్ కార్యానికి పునాది రాయి పడింది. శతాబ్దాల క్రితం శత్రుమూకల చేతిలో శిథిలమైన రాముడి ఆనవాళ్లను అద్భుతంగా తీర్చిదిద్దే ఘడియ రానే వచ్చింది. రామమందిర పరిధిలోని కుబేర్ తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం పరిమిత భక్తుల మధ్య కానిచ్చేశాు. రుద్రాభిషేకంతో భూమిపూజ కార్యక్రమం ప్రారంభించిన శ్రీరామజన్మభూమి ట్రస్ట్ కరోనా వైరస్ కారణంగా అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారని తెలిపింది.
రుద్రాభిషేకంతో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభించిన శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్... శివుడికి, రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్ని అనుసరించింది. లంకేయుడిపై దాడికి వెళ్లే ముందు రాముడు రుద్రాభిషేకంతో శివుణ్ని ప్రార్థించినట్టుగానే రామమందిర నిర్మాణాన్ని కూడా ప్రారంభించినట్టు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ తెలిపారు. పౌరోహితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య రామాలయానికి పునాదులు వేశారు. మే 11న భూమిని చదును చేసే కార్యక్రమం మొదలవగా ఆలయ నిర్మాణానికి పునాది రాయిని వేశారు. లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయిన అయోధ్య రాముడి దర్శనం పునః ప్రారంభించిన ట్రస్ట్ యథావిధిగా దర్శనాలు కొనసాగిస్తోంది.
రాముడి గుడి లేని ఊరు ఊరే కాదు అనుకునే దేశం మనది. అలాంటిది జగదానందకారకుడి జన్మస్థలంలో ఆయనకే ఇన్నాళ్లు ఓ గుడి లేదు. దీపం లేదు ధూపం లేదు. వివాదాస్పద స్థలంగా దశాబ్దాల తరబడి న్యాయస్థానంలో నానుతూ వచ్చిన రామజన్మభూమి నిస్సందేహంగా రాముడిదేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రామభక్తులను ఆనందంలో ముంచెత్తింది. రాముడు పుట్టిన చోటే ఆ రాముడికి ఓ అందమైన గుడి కడితే అందులో కొలువైన దేవుడిని చూసి తరించాలనుకుంది. అపూర్వమైన శిల్పకళతో న భూతో న భవిష్యతి అన్న రీతిలో ఓ అద్భుతమైన దేవాలయ సంకల్పం నెరవేరింది.
ఆలయం లేకపోయినా పూజలు ఆగలేదు నైవేద్యాలు లేకపోయినా నైరాశ్యం చెందలేదు. వందల, వేల ఏళ్ల చరిత్ర సంగతి పక్కన పెడితే దశాబ్దాల కిందటి వరకు అక్కడ ఓ మసీదు ఉండేది. ఆ స్థలంలో ుోబ మందిరం కట్టించాలనీ విగ్రహాలకు పూజ చేసుకోడానికి అనుమతి ఇవ్వాలనీ కొందరు.. కోర్టులో కేసుల మీద కేసులు వేశారు. ప్రభుత్వం ఆ ప్రదేశానికి తాళాలు వేసింది. తర్వాత కొంతకాలానికి ఆ దేవుళ్ల విగ్రహాలకు నిత్యపూజలు చేసుకోవడానికి మాత్రం పూజారులను అనుమతించింది. అలా రామజన్మభూమిలోకి రాముడు చేరుకున్నా, ఆ రాముడికి పూజలు అందుతున్నా ఓ ఆలయంగా భక్తులు చూసుకునే భాగ్యం మాత్రం కలగలేదు.
1992 డిసెంబరు 6 ఘటన తర్వాత రాముల వారి విగ్రహాలను వివాదాస్పద స్థలం నుంచి తీసి పక్కనే ఒక టెంటు కింద ఏర్పాటు చేశారు. అక్కడే ఓ వేదిక మీద విగ్రహాలను ఉంచి పూజాదికాల నిర్వహించారు. పటిష్టమైన బందోబస్తు మధ్య భక్తులను అనుమతించినా ఖాళీ చేతులతో వెళ్లి దండం పెట్టుకుని వచ్చేయాల్సి రావటంతో తీవ్ర అసంతృప్తిగా ఉండేది. ఆ టెంటును కూడా పదేళ్లకోసారి మార్చేవారు. ఏడాదికోసారి శ్రీరామనవమి సందర్భంగా విగ్రహాలకు నూతన వస్త్రాలను మాత్రం సమకూర్చేవారు.
దశాబ్దాల పాటు సాగిన రామజన్మభూమి వివాదంలో ఎన్నో జరిగాయి. ఆ స్థలం తమకు చెందాలంటే కాదు తమకు చెందాలని పోరాడిన మూడు పక్షాలనూ కాదని ఆ స్థలం సొంతదారు రాముడేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్ట. రాముడి తరఫున ఓ సంరక్షకుడిని నియమించాలనీ, దేవాలయ నిర్మాణాన్ని స్వతంత్ర ట్రస్టుకి అప్పజెప్పాలనీ సూచించింది. తర్వాత శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పేరుతో 15 మంది సభ్యులతో గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్వతంత్ర ట్రస్టుకి కూడా నాయకత్వం వహిస్తున్నారు రామ మందిర నిర్మాణ బాధ్యత అంతా ఇప్పుడీ ట్రస్టుదే. మహంత్ నృత్యగోపాల్‌దాస్ ట్రస్టు అధ్యక్షులుగా ఉన్నారు. కోర్టు అప్పజెప్పిన 2.77 ఎకరాలకు తోడు 1990ల్లోనే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూమితో కలిపి మొత్తం 67.703 ఎకరాలను ప్రభుత్వం ఈ ట్రస్టుకు బదిలీ చేసింది.
నిజానికి శ్రీరామనవమి లేదా అక్షయతృతీయ రోజున మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టాలనుకున్నారు. అయితే లాక్‌డౌన్ అడ్డురావడంతో మే చివరి వారంలో ప్రారంభించారు. పనులు మొదలుపెట్టడానికి ముందుగానే మార్చి 25న టెంట్‌లోని దేవాలయంలో ఉన్న సీతారాముల విగ్రహాలను మానస్ భవన్ ఆవరణలో కట్టిన మరో తాత్కాలిక దేవాలయంలోకి పల్లకీలో వేడుకగా తరలించారు. మే రెండో వారంలోనే భూమిని చదునుచేసి, శుభ్రం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ క్రమంలో జరిగిన తవ్వకాల్లో ఐదడుగుల శివలింగం, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు చెక్కివున్న స్తంభాలు, ఎర్రరాతి ఇసుక ధ్వజాలు, కలశం, రాతి పుష్పాల లాంటివి బయటపడ్డాయి. ఇవన్నీ పురాతన ఆలయానికి సంబంధించినవే. తవ్వకాల్లో బయటపడినవాటినన్నిటినీ భద్రం చేసి భవిష్యత్తులో ఏర్పాటుచేయబోయే మ్యూజియంలో ఉంచబోతున్నారు.
ఇంతకీ గుడి ఎలా ఉండబోతోంది? వీహెచ్‌పీ సూచించిన మోడలా ట్రస్ట్ సొంత నిర్ణయాలతో ఆలయానికి తుది రూపు ఇవ్వబోతోందా? ప్రాకారాలు, శిల్పసంపదలు, విగ్రహాలు, మార్గాలు, కళా నైపుణ్యాలు మొత్తంగా రామజన్మభూమి రాముడి ఆలయం ఎలా ఉండబోతోంది?
అయోధ్యలో రామయ్యకు కట్టబోయే గుడి కొత్తగా రూపకల్పన చేసింది కాదు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 1989లో ప్రముఖ శిల్పి చంద్రకాంత్ సోంపురా ఈ ఆలయ డిజైన్ని రూపొందించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి రూపకల్పన చేసిన ప్రభాకర్ సోంపురా కొడుకైన చంద్రకాంత్ 130కి పైగా దేవాలయాలకు వాస్తుశిల్పిగా వ్యవహరించారు. కరసేవకపురంలో 150 మంది శిల్పులు, వందలాది కార్మికులతో పనులు కూడా ప్రారంభించింది. కొన్నేళ్ల పాటు పనిచేశాక స్థలవివాదం ఎటూ తేలకపోవడంతో వారంతా ఎవరి ఊళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఆనాటి ఆలయ డిజైనుకే ఇప్పుడు ఆకృతిని ఇవ్వబోతున్నారు.
రామయ్యకు సంబంధించిన 67 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మితమవుతున్న ఆలయంలో గుడి శిఖరం నేల మీది నుంచి 128 అడుగుల ఎత్తు ఉంటుంది. దేవాలయం కొలతలు 268 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు ఉంటాయి. రెండంతస్తుల ఆలయంలో ఒక్కో అంతస్తులో 106 స్తంభాలు చొప్పున మొత్తం 212 స్తంభాలు ఉంటాయి. ఒక్కో స్తంభం మీద దేవీ దేవతల విగ్రహాలు పదహారు చొప్పున చెక్కి ఉంటాయి. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరో అంతస్తు నిర్మించేందుకూ అవకాశం ఉంది. ఆలయం పైకప్పునకు మొత్తం రాతి స్లాబ్స్‌నే వాడబోతున్నారు. సిమెంట్ కానీ ఇనుము కానీ వాడకుండా అంత పెద్ద ఆలయానికి స్లాబ్ వేశారు.
చాలావరకు ఉత్తరాది వైష్ణవ దేవాలయాలు ఉండే నగర శైలిలో దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం దేవాలయమంతా ఒక విశాలమైన, ఎత్తైన రాతి వేదిక మీద ఉంటుంది. దాని మీదికి వెళ్లడానికి మెట్లుంటాయి. దక్షిణాది గుడులలో లాగా పెద్ద పెద్ద ప్రహరీగోడలూ ద్వారాలూ ఉండవు. కుషాణుల పాలన చివరలో, గుప్తుల పాలన మొదట్లో ఇలాంటి దేవాలయాలను కట్టినట్లు చరిత్ర చెబుతోంది. అధికారికంగా నిర్మాణం ఇప్పుడే మొదలెట్టినా నిజానికి సగం పని అయిపోయింది. భారతీయ జనతా పార్టీ నేత ఎల్‌కే అడ్వాణీ చేపట్టిన రథయాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా సేకరించిన ఇటుకలు మందిరం గోడల్లో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక కరసేవకపురంలో రామజన్మభూమి న్యాస్ సంస్థ వర్క్‌షాపులో శిల్పులు చెక్కి వరసగా ఒక పద్ధతి ప్రకారం నంబర్లు వేసి పెట్టిన స్తంభాలు, శిల్పాలు, పైకప్పుకు అతికించాల్సిన పువ్వులు లాంటివన్నీ చాలావరకూ సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి పని మొదలైతే ఇక్కడ సిద్ధంగా ఉన్నవాటినన్నిటినీ తీసుకెళ్లి డిజైన్‌కి అనుగుణంగా వాటి వాటి స్థానాల్లో పెట్టి వైట్ సిమెంటుతో అతికించడమే.
విశాల ప్రాంగణంలో రూపొందుతున్న రామ మందిరమే కాదు, మందిరం కేంద్రంగా ఏర్పాటుచేసే పలు నిర్మాణాలనూ ఆకట్టుకునేలా ఉన్నాయ్. గర్భగుడిలో బాలరాముడికి ప్రత్యేక సింహాసనం ఉంటుంది. ప్రధాన ఆలయంతోపాటు సీతమ్మవారి వంటిల్లు, సీతాకూప్, రామ్ చబూత్రా, శేషావతార్ మందిర్ ఉంటాయి. సందర్శకులు బస చేయడానికి ధర్మశాల, భజన గృహం, సాంస్కృతిక కార్యక్రమాలకు రంగమండపం నిర్మించబోతున్నారు. 250 మంది శిల్పులు నిరంతరాయంగా పని చేస్తే గుడి నిర్మాణం పూర్తవడానికి అయిదేళ్లు పట్టవచ్చని గతంలో అంచనా వేశారు. ఇప్పుడు మళ్లీ ఇళ్లకు వెళ్లిన శిల్పులందర్నీ తిరిగి రప్పిస్తున్నారు. రాజస్థాన్ నుంచి శిలలను తెచ్చి మరికొన్ని స్తంభాలను చెక్కాలి. పాలరాయితో చౌకత్‌లను నిర్మించాలి. కీలకమైన ఆలయ శిఖరనిర్మాణం చేపట్టాలి.
రామమందిర నిర్మాణం పూర్తయ్యేవరకూ సీతారాముల విగ్రహాలను ఉంచి పూజలు జరపడానికీ, భక్తులు దర్శించుకోడానికీ వీలుగా ఒక తాత్కాలిక మందిరాన్ని రామజన్మభూమి ప్రాంగణంలోనే ఉన్న మానస్‌భవన్‌లో ఒక పక్కన బులెట్ ప్రూఫ్ ఫైబర్‌తో నిర్మించారు. తాత్కాలికమే అయినప్పటికీ ఎన్నో ప్రత్యేకతలతో దీన్ని తీర్చిదిద్దారు. ఘాజియాబాద్‌కి చెందిన నేచర్ హోమ్స్ అనే సంస్థ జర్మనీ, ఎస్తోనియాల నుంచి దిగుమతి చేసుకున్న పైన్ చెక్కతో కేవలం ఎనిమిది రోజుల్లో ఈ మందిరాన్ని నిర్మించింది. ఆలయనిర్మాణానికి సంబంధించిన వాస్తు నియమాలన్నిటినీ అనుసరిస్తూనే మరో పక్క భూకంపాలూ తుపానులూ వరదలూ లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా తట్టుకునేలా ఈ తాత్కాలిక ఆలయాన్ని తీర్చిదిద్దారు. మందిర నిర్మాణం పూర్తయి కొత్త ఆలయంలో శ్రీరాముడు కొలువు తీరబోతున్నాడు.
ఒకప్పుడు దేశంలోని ఏడు ప్రధాన తీర్థయాత్రాస్థలాల్లో ఒకటిగా పేరొందిన అయోధ్యకి తిరిగి ఆ వైభవం రాబోతోంది. నవ్య అయోధ్యగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయ్. ఫైజాబాద్ జిల్లాలో ఓ భాగంగా ఉన్న అయోధ్యను ఇప్పటికే ప్రత్యేక జిల్లాగా ప్రకటించింది. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో అయోధ్యలో విమానాశ్రయ నిర్మాణానికి భారీగానే నిధులు కేటాయించింది. పర్యటకుల్ని ఆకర్షించేందుకు సరయూ నది ఒడ్డున 151 మీటర్ల ఎత్తైన భారీ రామ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని కూడా యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా కోదండరామయ్య కొలువు దీరే అయోధ్యరూపు రేఖలే మారిపోతున్నాయ్.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire