ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం... "మన మాటల శక్తితో, ఇతరుల మనసులు ఎలా గెలవవచ్చు" ఫ్రండ్స్! మనము రోజు వాడే పదాలు, మాటలు, సరైన రీతిలో...
ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం... "మన మాటల శక్తితో, ఇతరుల మనసులు ఎలా గెలవవచ్చు"
ఫ్రండ్స్! మనము రోజు వాడే పదాలు, మాటలు, సరైన రీతిలో అమర్చినప్పుడు, సరైన పద్దతిలో వాడినప్పుడు, సరైన విధంగా వ్యక్తీకరించినప్పుడు, ఇతరుల మనసుని కూడా మనం మార్చవచ్చు. మన మాటలకి ఇతరుల మనసుని మార్చే శక్తి వున్నది. మాటలకున్న శక్తివల్ల మురికివాడలో పుట్టి జీవించే వ్యక్తిని కూడా, మీ మాటలతో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా మీరు చెయ్యగలరు. అతనిని విజయవంతమైన వ్యక్తిగా మార్చే శక్తి మీ మాటలకువుంది, లేదా మీ మాటలను మాత్రమే ఉపయోగించి ఎవరి సంతోషానైనా కూడా మీరు నాశనం చెయ్యగలరు. మీ మాటలు సృష్టించగలవు లేదా నాశనం చేయగలవు. మీ పదాలకు శక్తి వుంది, ఆ పదాలే శక్తిమయం, ఆ పదాలను మీ శక్తిగా కూడా మార్చుకోవచ్చు. మీరు మీ మాటలతో ఒక జీవితాన్ని మార్చవచ్చు, దేశ ప్రజలని ప్రేరేపించవచ్చు మరియు ఈ ప్రపంచాన్నే ఒక అందమైన ప్రదేశంగా మార్చవచ్చు.
అయితే ఎవరైనా మీ మాటలని అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి మధ్య ముఖ్యమైన తేడా మీరు ఎంపిక చేసుకున్న 'పదం' వల్లనే. ఎందుకంటే మీరు చాలా అందమైన విషయం చెప్పడానికి, ఒక తప్పు పదం వాడరనుకో.... అంతే అది ఎంత మంచి విషయమైన కూడా ఉపయోగం ఉండదు. మన మాటల ద్వార"విషాన్ని చిమ్మగలం" లేదా మన మాటల ద్వార "అమృతాన్ని పంచగలము". మాటల శక్తితో ఇతరులకు సహాయపడవచ్చు, స్వస్థత చేకూర్చవచ్చు లేదా ఇతరులకు హాని చేయవచ్చు, గాయపరచవచ్చు. ఆటంబాంబు కన్నా శక్తివంతమైనవి మన మాటలు, ఎందుకంటే ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగిన తర్వాతే అసలైన యుద్ధం వస్తుంది కదా. మనం అందంగా అమర్చిన పదాలు ఎదుటి వ్యక్తి మనసుని గెలుస్తాయి. సంతోషానికి అయినా, దుఃఖనికి అయిన, పెట్రోల్ లా పని చేసేది మన మాటలే.
మనం వాడే పదాలతో, మనం ఇతరులతో ఒక బంధాన్ని ఏర్పరచుకోవచ్చు లేదా విచ్ఛిన్నం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చరిత్రలో ఎంతోమంది మేధావులు వారి మాటలతో, మన ఎమోషన్స్ ను ప్రభావితం చేయగలిగారు. అలా మనం వారి ఉద్యమంలో ఒక భాగంగా మారేలా చేశారు. వారి మాటల ప్రభావంతో మనం ఎన్నో పనులు చేసేలా చేయగలిగారు. ముఖ్యంగా మనం అర్ధం చేసుకోవాల్సింది...మన ఆలోచనలు, మన భాషని మారిస్తే, మన భాష కూడా మన ఆలోచనలన్నీ మార్చగలదు కదా! అందుకే మన బాషలోని పదాలని జాగ్రత్తగా ఎంచుకొని, ఉత్సాహం ఇచ్చే పదాలని, ఉల్లాసం ఇచ్చే పదాలని, శక్తిని పెంచే పదాలను ఎక్కువగా వాడాలి. ఇలా వాడగా..వాడగా..మన పదాలే మన ప్రపంచం అవుతాయి. అందుకే ఆ పదాలని జాగ్రత్తగా ఎంచుకోవాలి. రాళ్ల మద్య వజ్రాలని వెతికినట్టు మంచి మాటలని వెతికి పట్టుకోవాలి.
ఎలాగైతే రక రకాల పూలని ఒక దండలో అందంగా అల్లుతామో, అలాగే మన పదాలని ఒక వ్యాక్యంలా అల్లవచ్చు. అలా ఎందుకు అల్లాలి అంటే... మీరు సాధారణంగా వాడె కొన్ని పదాలు కూడా ఇతరుల మనసులో ముద్రించబడిపోతాయి కాబట్టి. ఒక్కోసారి మనం కొన్ని మాటలు అన్న తర్వాత, అవి ఇతరులకు నచ్చకుంటే భాదపడవచ్చు..ఆ తర్వాత మనని క్షమించవచ్చు, కానీ వారు ఆ మాటని పూర్తిగా మరచిపోలేరు. కాబట్టి మాట అనే తూటాని మనం పెల్చక ముందే జాగ్రత్త వహించాలి. వాస్తవానికి మన మాటలాడటానికి పెద్ద మూల్యం ఏమీ ఉండదు, కానీ తప్పు మాట్లాడితే మాత్రం, ఆ తర్వాత పెద్ద మూల్యం చెల్లించుకోవలసివస్తుంది. సాధారణంగా మన ఇంట్లోని డిక్షనరీ లో ఉన్న పదాలు చూస్తే చాల సాధారణంగా కనిపిస్తాయి, కానీ ఆ పదాలను, ఒక పద్ధతిలో వ్యక్తి వాడితే, వాటి యొక్క అసాధారణ శక్తి బయటకు వచ్చి మనకు సహాయపడుతుంది.
మన మాటలు విత్తనాల లాంటివి, కాకపోతే అవి భూమిలో మొలకేత్తవు. అవి మన హృదయంలో పెరిగి పెద్దవై పోతాయి. కాబట్టి విత్తనాల లాంటి మాటలని జాగ్రత్తగా ఇతరుల మనస్సుల్లో నాటాలి. అందుకే అంటారు...మన నాలికకి ఎముక ఉండదు, కానీ అది ఎదుటి వ్యక్తి గుండెలను చీల్చే అంత పదునైనది అని. కాబట్టి దానిని చాల జాగ్రత్తగా వాడాలి. మనం ఒక పది సెకండ్లలో అనే మాటలు, పది సంవత్సరాలు అయినా ఇతరులలో గాయాన్ని అలాగే ఉంచవచ్చు. అలాగే ఇతరులను ఉత్సాహపరుస్తూ ఒక పేపర్ మీద, ఒక పెన్ను తో వ్రాసిన పదాలు, కొన్నిసార్లు ఈ ప్రపంచాన్ని, దాని గతిని కూడా మార్చగలవు, అలా ఎందరో గొప్ప రచయితలు తమ రచనలలోని పదాలతో అద్బుతాలు చేసారు.
ఫ్రండ్స్! ఈ ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసేది రెండు విషయాలు..మొదటిది..మనకొచ్చే ఐడియాలు మరియు రెండోది మన మాటలు. ఈ రెండు విషయాలు మనషులను, వారి మనసులను ఎంతో ప్రభావితం చేస్తాయి. అలాగే మాటలుగా మొదలైనవి, ఆ తర్వాత చేతలుగా మారుతాయి కాబట్టి, ఇప్పటి నుండి మీ మాట అనే విత్తనాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మీ పదాలను, మాటలను మెరుగుపరుచుకోవడం కోసం..ఇప్పటి నుండి మీ ముఖ్యమైన సంభాషణలను...మీ మొబైల్ ఫోన్ లో రికార్డు చేసి...ఆ తర్వత ప్రశాంతంగా ఆ రికార్డింగ్ విని, మీరు ఆ సంబాషణలోని ఎ పదాలని బెటర్ చేసుకోవచ్చో ఆలోచించండి. ఇలా మూడు వారలు చేస్తే మీ మాటలు, పదాలు ఎంతో మెరుగు అవుతాయి.
ముఖ్యంగా మనతో మనం మాట్లాడుకునే మాటలు కూడా మన మనస్సుని ఎంతో ప్రభావితం చేస్తాయట. కాబట్టి మనం బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు, దానికి తోడుగా బ్యాడ్ పదాలు ఎప్పుడూ వాడవద్దు. ఎందుకంటే మన బాడ్ మూడ్ని మనం మార్చుకోగలం. కానీ ఆతర్వాత ఏమి చేసినా వాడిన బ్యాడ్ పదాలను మార్చుకోలేము కదా. అందుకోసమే..ప్రేమతో కూడిన, కరుణతో నిండిన, ఆశావాదంతో నిలిచిన, ఉత్సాహంతో ఉపిరిపోసుకున్న, జీవాన్ని నింపే పదాలు ఎక్కువగా మన సంబాషణలలో వాడాలి. అందుకోసం మీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి లా, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తిలా, మిమ్మల్ని మోటివేట్ చేసే వ్యక్తిలా, మీతో మీరు మాట్లాడుకోగలిగిన నాడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అలాగే మీ నోటి నుండి వచ్చే ప్రతి పదాన్ని ప్రేమతో తడిపేయండి, ఇక దాని ప్రభావం చూడండి. ఇలా ఎప్పుడైతే ఇతరులతో మాట్లాడుతామో, వారి మనసుని మనం గెలిచేస్తాము. అల్ ది బెస్ట్.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire