ప్రతి మనిషికీ తనపై తనకు నమ్మకం ఉండటం, అతని విజయాలకి ఒక ముఖ్య అవసరం, దీనినే మనం ఆత్మ విశ్వాసం అని కూడా అంటాము. "నేను చేయగలను" అని అనుకునేదే...
ప్రతి మనిషికీ తనపై తనకు నమ్మకం ఉండటం, అతని విజయాలకి ఒక ముఖ్య అవసరం, దీనినే మనం ఆత్మ విశ్వాసం అని కూడా అంటాము. "నేను చేయగలను" అని అనుకునేదే ఆత్మవిశ్వాసం, "నేనే చేయగలను" అనేది మాత్రం అహంకారం అవుతుంది. ఈ రెండిటికి వ్యత్యాసం మనం తెలుసుకొని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా ఏదైనా చెయ్యగలరు అని ఎన్నో సంఘటనలు నిరూపించాయి. మనకి ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపొతే ఏ రంగంలోనైనా కూడా సరిగ్గా మనం రాణించలేము. ఆత్మవిశ్వాసం అనేది మనిషికి ఒక శక్తిమంతమైన ఔషదంలా పని చేస్తుంది. మనం అనుకున్న పనిని, అనుకున్నట్టు సాధించడానికి ఆత్మవిశ్వాసం చాలా తోడ్పడుతుంది.
ఎంత ఎక్కువ ఆత్మవిశ్వాసం ఉంటే అంత బాగా మనం జీవితంలో పైకి రావచ్చు. ఆత్మవిశ్వాసం పెంచుకోడానికి ముందు మన మీద మనకి సరైన అవగాహన ఉండాలి. ఈ అవగాహనే మన మాటల్లో ధ్వనిస్తుంది, మన చేతల్లో కనపడుతుంది. దీనివల్ల మనలో ఎంత ఆత్మవిశ్వాసం ఉందో అవతలి వారికి తెలుస్తుంది. మనపై మనకు వుండే అనవసర అనుమానాలతో మన ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అనుమానాలను తొలగించుకొని, ఈ ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆత్మ విశ్వాసం వుంటే ఎలా విజేతగా నిలబడవచ్చో మనం ఇప్పుడు ఒక మంచి కథ ద్వార తెలుసుకోవచ్చు. ఆ కథేంటో ఇప్పడు చూద్దాం..
ఫ్రండ్స్! మీరు కాకతీయ రాజుల గోప్పతనం గురించి మీరు వినేవుంటారు...అలాగే మీ స్కూల్ లో చదువుకొనే వుంటారు...అయితే అప్పట్లో కాకతీయ రాజులకు, మధురైకి చెందిన పాండ్య రాజులకు ఆధిపత్యం కోసం ఎప్పుడూ యుద్దాలు జరుగుతూ ఉండేవట. అయితే, అంగబలంలోనూ, అర్ధబలంలోనూ బాగా బలంగా ఉన్న కాకతీయరాజు గణపతిదేవుడు పాండ్యరాజులను ఓడించి, వారిని తనకు సామంతులుగా చేసుకోవాలనే కోరికతో వేచి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు గణపతిదేవుడికి తను ఆశించినట్టుగానే, మంచి అవకాశం రానే వచ్చింది. వెంబడే...యుద్ధం కోసం తయారవమని తన సేనాధిపతికి ఆయన కబురు పంపించాడు. అయితే అప్పటికే అనేక యుద్ధాలు చేసి అలసి, సొలసిపోయి ఉన్న సైనికులు అందుకు సన్నద్ధంగా లేరని రాజుకు విన్నవించాడు సేనాధిపతి. ఇలాంటి సమయంలో యుద్ధానికి వెళితే ఓటమి తప్పదని అనుమానాన్ని కూడా సేనాపతి వ్యక్తం చేశాడు. అయిన సరే యుద్దానికి సిద్దం కావాలని గణపతిదేవుడు ఆదేశించాడు.
అప్పడు సేనాధిపతి ఇక తప్పని పరిస్థితుల్లో, సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరారు. గణపతిదేవుడు దారిలో సైనికులు వాళ్ళలో వాళ్ళు నిరుత్సాహాన్ని గమనించాడు. గెలుపు సాధించే నమ్మకం సైనికులు ఎవరిలోనూలేదని గ్రహించిన ఆయన, వారిలో ఆత్మ విశ్వాసం కలిగించే ఉద్దేశ్యంతో తాము వెళుతున్న దారిలోని ఒక అమ్మవారి ఆలయం ఎదుట గుర్రాన్ని ఆపాడు. తను మాత్రమే గుడి లోపలికి వెళ్లి అమ్మవారికి నమస్కరించి బయటకు వచ్చిన రాజు "ఇప్పటికే అలసిపోయి ఉన్న మీరు, ఈ యుద్ధంలో గెలవలేమని అనుకుంటున్నారు కదూ...! ఈ విషయంలో అమ్మవారి సంకల్పం ఎలా ఉందో తెలుసుకుందాం రండి, మనం గెలుస్తామో లేదో చూద్దాం!" అంటూ పిలిచాడు.
తన వద్ద వున్న ఒక నాణెము తీసి చూపించి "బొమ్మా... బొరుసు వేస్తాను. నాణెముపై గల రాజముద్రిక పడిందంటే అమ్మవారు మనల్ని దీవించినట్లే...! ఇక విజయం మనదే...! లేదా బొరుసు పడితే మీరు కోరుకున్నట్టే...మనం వెనక్కి వెళ్ళిపోదాం" అంటూ నాణెం పైకి ఎగురవేశాడు. అంతే... నాణంపై రాజముద్రిక కనిపించింది. నాణెముపై రాజముద్రిక కనిపించగానే సైనికులలో ఒక్కసారిగా ఉత్సాహము ఉరకలు వేసి, అమ్మ వారి ఆశిస్సులు తమకే వున్నాయని, గెలుపు తమదేననే ఆత్మవిశ్వాసంతో శత్రుసైనికులను చీల్చి చెండాడారు. ఇలా గణపతిదేవుడు, మధురై పాండ్య రాజులతో తలపడి వారిని చిత్తుగా ఓడించి, వారి మిత్రరాజు కొప్పెరుజంగను తనకు దాసోహమయ్యేటట్లు చేసుకున్నాడు.
యుద్ధంలో విజయానంతరం సైనికులంతా సంతోషంలో మునిగి ఉండగా, సేనాధిపతి రాజు వద్దకు వచ్చి "యుద్ధానికి సంసిద్ధంగా లేని సైన్యం తో కూడా మీరు యుద్ధం చేయించి, విజయం సాధించడం ఆశ్చర్యంగా ఉంది ప్రభూ" అని పొగడసాగాడు. అప్పుడు గణపతిదేవుడు చిరు నవ్వు నవ్వుతూ, తాను అమ్మవారి గుడి దగ్గర వేసిన బొమ్మా బొరుసూ వెండి నాణేన్ని చూపించాడు. ఆశ్చర్యంగా ఆ నాణెంకి రెండు వైపులా కూడా రాజముద్రిక ఉండటం గమనించిన సేనాధిపతి, రాజు అద్బుత తెలివిని మెచ్చుకొని నమస్కరించాడు. ఫ్రండ్స్ ఇలా యుద్ధానికి ఏ మాత్రం సంసిద్ధంగా లేని సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రాజు తెలివిగా వెండినాణెం రెండువైపులా రాజముద్రిక ఉన్నదాన్నే బొమ్మా బొరుసు వేశాడు. వారిలో ఉత్సాహం ఉరకలు వేసేలా చేశాడు, అలా విజేతగా నిలిచాడు. ఇలా సరైన శిక్షణ వున్నా సైన్యంలో ఆత్మవిశ్వాసం నింపి... ఆత్మవిశ్వాసం ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు అని గణపతిదేవుడు నిరూపించాడు.
అయితే...విజయానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సరైన శిక్షణ కూడా అవసరము. ఆ శిక్షన లేకుంటే...మన మీద ఇతరుల విశ్వాసం ఒక జోక్ లా మారుతుంది. అదెలా అంటే... ఒక రోజు..ఒక టీచర్ తన స్టూడెంట్స్ తో " డియర్ స్టూడెంట్స్ ! మీరు ఈ పరీక్షల్లో తొంబై శాతానికి పైగా మార్కులు వచ్చేలా చదవాలి" అని అన్నాడు...అప్పుడు విద్యార్థులు లేదు సార్.. మేము నూటికి నూరు తెచ్చుకోడానికి ట్రై చేస్తాం అన్నారు.. వెంబడే...టీచర్ వారితో.... "రోజుకి ఒక రెండు గంటలు చదవరు..కానీ యెదవ జోకులకు తక్కువేం లేదు అన్నాడు".... వెంటనే... విద్యార్థులు...ముందు జోకులేసింది ఎవరు సార్..! అని అన్నారు.
సో ఫ్రెండ్స్! సరైన ఆత్మవిశ్వాసం పెరగటానికి సరైన శిక్షణ, సాదన వుండి, మన ఆత్మ విశ్వాసం పెరిగిన తర్వాత, గణపతిదేవుడు లాంటి నాయకుడు మనతో వుంటే...ఏదైనా సాధ్యమే. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మవిశ్వాసం మన తోటి వాళ్ళలో కూడా ఆత్మవిశ్వాసం నింపగలదు. మనవాళ్ళ విశ్వాసాన్ని మనం చూరగొనడమే మనలో ఉన్న ఆత్మవిశ్వాసానికి ప్రతీక. విజయం సాధించిన వారికి, సాధించని వారికి మధ్య తేడా ఈ ఆత్మవిశ్వాసమే అని మనమంతా తెలుసుకోవాలి. సో అల్ ది బెస్ట్.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire