Yellow Crazy Ants: చీమల దండయాత్ర, చూపు కోల్పోతున్న పశువులు, వలస వెళ్తున్న ప్రజలు

Yellow Crazy Ants Leave Cattle Blind, Affect Crops In Tamil Nadu Villages
x

Yellow Crazy Ants: చీమల దండయాత్ర, చూపు కోల్పోతున్న పశువులు, వలస వెళ్తున్న ప్రజలు

Highlights

Yellow Crazy Ants: తమిళనాడు రాష్ట్రంలోని దుండిగల్‌లో జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో కొత్త సమస్య వచ్చి పడింది.

Yellow Crazy Ants: తమిళనాడు రాష్ట్రంలోని దుండిగల్‌లో జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో కొత్త సమస్య వచ్చి పడింది. పరిసర ప్రాంతాల్లో ఏడు గ్రామాలపై ఎల్లో క్రేజీ యాంట్స్ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ చీమలు గుంపులుగా సుమారు ఏడు గ్రామాలపై దండయాత్ర చేస్తున్నాయి. ఇవి పాకిన చోట దద్దుర్లు, పొక్కులు వస్తుండటంతో ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. పంటపొలాల్ని నాశనం చేస్తుండటంతోపాటు రైతులకు చెందిన మేకలు, పశువులు, ఎద్దులకు హాని చేస్తున్నాయి. ఎలుకలు, పిల్లులు, కుందేళ్లనూ స్వాహా చేస్తున్నాయి. పాములు, బల్లులను గుంపులుగా చుట్టుముట్టి అవలీలగా భోంచేస్తున్నాయి. పశువులకు గాయాలైన చోట్ల మాంసాన్ని తినేస్తున్నాయి. వీటి ప్రభావంతో కొన్ని పశువులు చనిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేకలు, పశువులు చూపు కోల్పోతున్నాయి.

గత కొన్నేళ‌్లుగా ఈ చీమలను చూస్తున్నామని, అయితే ఎప్పుడూ లేని విధంగా ప్రజలు, పశువులపై దాడి చేయడం చూడలేదని అంటున్నారు. అడవుల నుంచి లక్షల సంఖ్యలో చీమలు గ్రామాల్లోకి వస్తున్నాయి. చల్లటి వాతావరణంలో వీటి దాడి మరింత ఎక్కువగా ఉంటోందని గ్రామస్తులు చెబుతున్నారు. వీటి ప్రభావంతో ఇక్కడి జనజీవనం అస్తవ్యస్తమైందని ఇంటి నుంచి బయటికి రావడానికే భయపడుతున్నామని వాపోతున్నారు.

ఎక్కడైనా నిల్చుంటే చాలు క్షణాల్లోనే శరీరం పైకి చీమలు పాకేస్తున్నాయి. ఇవి కుట్టవు.. కరవవు.. కానీ పొత్తికడుపు కొన వద్ద ఉండే ఒక చిన్న గొట్టం ద్వారా ఇవి భయంకరమైన ఫార్మిక్‌ యాసిడ్‌తో కూడిన ద్రవాన్ని వెదజల్లుతుంటాయి. ఆ యాసిడ్‌ పడినచోట దురద, చర్మం పొట్టులా రాలడం వంటి సమస్యలు వస్తాయి. పశువుల కంట్లో పడితే చూపు పోతుంది. కుంటల్లో నీళ్లు తెచ్చుకోవాలన్నా అక్కడా వేల సంఖ్యలో చీమలుంటున్నాయని, తమ రోజువారీ జీవనం దుర్భరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీమల మందు వంటివి చల్లుతున్నా వాటి తీవ్రత తగ్గడం లేదంటున్నారు.

ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండటం, కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో కీటక శాస్త్రవేత్తలు, అటవీశాఖ అధికారులు వీటిపై దృష్టిపెట్టారు. నమూనాల్ని సేకరించి పరిశోధనకు పంపడంతోపాటు వాటి నైజాన్ని పరిశీలిస్తున్నారు. గతంలో ఆస్ట్రేలియాలోని క్రిస్‌మస్ ఐలాండ్‌లో లక్షలాది ఎర్ర చీమలు ఎర్ర పీతలను చంపి తినేశాయి. వాటి నివారణకు హెలికాప్టర్ల ద్వారా ముందులను పిచికారి చేశారు. దీంతో 95శాతం ఫలితాలొచ్చాయని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories