India: భారత్‌కు ప్రపంచ దేశాల ఆపన్నహస్తం!

World Wide Countries Support to India due Spreading of Corona
x

Representational Image

Highlights

India:భారత్‌కు మద్దతుగా బ్రిటన్‌, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలు * భారత్‌కు అండగా యూరోపియన్ యూనియన్

India: రెండో దశ కరోనా వ్యాప్తితో అతాలకుతలం అవుతున్న భారత్ కు ప్రపంచ దేశాలు తమ మద్దతును ప్రకటించాయి. కరోనాపై పోరాడుతున్న భారత్ కు అన్ని విధాలా సాయం చేస్తామని తెలిపాయి. కొన్ని దేశాలు ఆర్ధికంగా ఆదుకుంటామని చెబుతుంటే మరికొన్ని దేశాలు అవసరాన్ని బట్టి భారత్‌కు చేయుతనిస్తున్నాయి.

కొవిడ్‌ మహమ్మారిపై భారత్‌ జరుపుతున్న పోరులో ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలుస్తామంటూ ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయా దేశాలు వెల్లడించాయి. కరోనా రెండో దశ విజృంభణతో భారత్‌లో నెలకొన్న పరిస్థితుల పట్ల సానుభూతి వ్యక్తం చేసిన పలు దేశాలు వీలైన సాయం అందించడానికి కృషి చేస్తామని ప్రకటించాయి.

'భారత్‌లో హృదయవిదారక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కష్టకాలంలో మా ఆలోచనలు భారత్ వెంటే ఉంటాయి. కరోనాపై పోరులో మేము భారత్‌కు అండగా నిలబడుతామని అమెరికా హెల్త్ సెక్రటరీ మాట్ హన్‌కాక్ తెలిపారు. వైట్ హౌస్ ప్రతినిధి జెన్ సాకి మాట్లాడుతూ ఈ సంక్షోభ కాలంలో భారత్‌కు అవసరమైన సాయాన్ని అందించే మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ఇక భారత్‌ కు వెంటిలేటర్లు, ఔషధాల వంటివి పంపే ప్రయత్నం చేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్ అన్నారు.

కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్‌ ప్రజలకు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంఘీభావం ప్రకటించారు. ఇక బ్రిటన్‌, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలు కూడా భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. యూరోపియన్ యూనియన్ కూడా భారత్‌కు సాయం చేస్తామని ప్రకటించింది.

కరోనా బాధితులకు ప్రాణవాయువు అందించేందుకు అందుబాటులో ఉన్న వనవరులను భారత్‌ ఉపయోగించుకుంటోంది. ఆక్సిజన్‌ సరఫరాకు విదేశాల సహకారం సైతం తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రాణవాయువు సరఫరాకు సింగపూర్‌తో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ కోసం సింగపూర్‌ వెళ్లిన వాయుసేన విమానాలు భారత్‌కి చేరుకున్నాయి. సింగపూర్‌లోని ఛాంగి విమానాశ్రయం నుంచి ఆక్సిజన్‌తో బయలు దేరిన వాయుసేనకు చెందిన సీ17 విమానం బెంగాల్‌లోని పనాగర్‌ వైమానిక స్థావరానికి చేరుకుంది.

ఇక జర్మనీ నుంచి తీసుకొచ్చే ఆక్సిజన్ ప్లాంట్లను తొలుత రక్షణశాఖ ఆధ్వర్యంలోని కొవిడ్‌ కేంద్రాల్లో వాడనున్నారు. ఆ తర్వాతే ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు. కేవలం వారం రోజుల్లోనే ఈ మొబైల్‌ ప్లాంట్లను అందుబాటులోకి తెస్తామన్న రక్షణ శాఖ.. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య అవసరమైన ఆక్సిజన్‌ కంటెయినర్లను యుద్ధవిమానాల ద్వారా వాయుసేన చేరవేస్తోన్న విషయాన్ని గుర్తు చేసింది. రక్షణశాఖ తరపున వైద్య పరికరాలు, సిబ్బంది కొవిడ్‌ రోగుల సేవల్లో నిమగ్నమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories