గడ్డిపూల వనంలో వికసించిన కమలం..ఇక వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో పాగా వేసేదెవరు?
ఎర్రకోటను బద్దలుకొట్టిన తృణమూల్ కాంగ్రెస్ ఇక బెంగాల్ లో అధికారం కోల్పోనుందా ఇదే ప్రశ్న గత ఏడాది కాలంగా జాతీయ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. బంగ్లా...
ఎర్రకోటను బద్దలుకొట్టిన తృణమూల్ కాంగ్రెస్ ఇక బెంగాల్ లో అధికారం కోల్పోనుందా ఇదే ప్రశ్న గత ఏడాది కాలంగా జాతీయ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. బంగ్లా భావజాలంతో గద్దెనెక్కిన మమతా బెనర్జీకి ఆ భావజాలమే ఇప్పుడు ప్రతికూలంగా మారిపోయింది. లోక్ సభ ఎన్నికల సమయంలో మొదలైన హింసాకాండ నేటికీ రావణ కాష్ఠంలా రగులుతూనే ఉంది. బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బెంగాల్ లో ఏం జరుగుతోంది ? త్వరలోనే రాష్ట్రపతి పాలన వస్తుందా? ఇక ముందు బీజేపీ ఏం చేయనుంది?
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బీజేపీకి మింగుడు పడని రాష్ట్రాలు కొన్నే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది బెంగాల్. కమ్యూనిస్టు కంచుకోటనే ముక్కచెక్కలు చేసిన మమతా బెనర్జీకి బీజేపీ సునామీని తట్టుకోవడం మాత్రం కష్టంగా మారింది. ఇతర పార్టీలు అనుసరించే వ్యూహాలకు భిన్నమైన వ్యూహాన్ని అనుసరించడం బీజేపీకి ఆనవాయితీగా వస్తోంది. మైనారిటీల ఓట్లను గంపగుత్తగా సాధించుకోగలిగితే విజయం సాధించడం సులభమని బెంగాల్ లో అప్పట్లో వామపక్షం భావించింది. లెఫ్ట్ ఫ్రంట్ ను దెబ్బతీసేందుకు మమతా బెనర్జీ కూడా అదే వ్యూహం అనుసరించారు. బీజేపీ మాత్రం మెజారిటీ ఓట్లను భారీగా సాధించడంపైనే గురిపెట్టింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అదే వ్యూహాన్ని అనుసరించింది. తాజాగా బెంగాల్ లో కూడా అదే వ్యూహం అనుసరిస్తోంది. బెంగాల్ లో తాజాగా చోటు చేసుకున్న హింసాకాండ బీజేపీకి అక్కడ రాజ్యాధికారం చేపట్టేందుకు ఒక అవకాశంగ మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వ్యూహం విజయం సాధిస్తుందా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
బెంగాల్ అనగానే గుర్తుకొచ్చేది పునరుజ్జీవనం. అక్కడ జరిగిన ప్రతీ ఘటన కూడా యావత్ భారతదేశాన్ని ప్రభావితం చేసిందంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్ర్యానికి ముందు అక్కడ ఎన్నో పునరుజ్జీవన ఉద్యమాలు వచ్చాయి. రాజా రాంమోహన్ రాయ్ మొదలుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ వరకు ఎంతో మంది సామాజిక, మత సంస్కర్తలు అక్కడ పుట్టుకొచ్చారు. జగదీశ్ చంద్రబోస్ నుంచి అమర్త్య సేన్ దాకా ఎంతో మంది శాస్త్ర, సామాజిక అధ్యయనవేత్తలు అక్కడి నుంచే వచ్చారు. సత్యజిత్ రే నుంచి మహాశ్వేతాదేవి దాకా కళా, సాహిత్య రంగాల ప్రముఖులు అక్కడివారే. నక్సల్బరీ ఉద్యమం మొదలుకొని నందిగ్రాం ఉద్యమం దాకా ఎన్నో ప్రజా ఉద్యమాలు పురుడుపోసుకున్నది కూడా బెంగాల్ లోనే. దేశంలోనే తొలిసారిగా దశాబ్దాలు పాటు వామపక్ష ప్రభుత్వాలు రాజ్యమేలింది అక్కడే. దశాబ్దాలుగా వెలుగొందిన ఎర్రకోటను బద్దలుగొట్టిన గడ్డిపూలు మొలకెత్తింది కూడా బెంగాల్ లోనే. ఇక తాజాగా లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ గడ్డిపూల వనంలో కమల వికాసం జరిగింది. మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ పూర్తిగా కమలదళం వశమవుతుందా అన్నదే ఆసక్తిదాయకంగా మారింది.
ఎన్నికల సమయంలో హింసాకాండ సహజం. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత కూడా వారాల తరబడి హింసాకాండ కొనసాగడం మాత్రం అసహజం. గత కొన్ని వారాలుగా బెంగాల్ లో చోటు చేసుకున్న హింసాకాండలో పదుల సంఖ్యలో బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు మరణించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించేందుకు మీరే కారణమంటూ తృణమూల్, బీజేపీ పరస్పరం విమర్శించుకుంటున్నాయి. తాజాగా వైద్యుల పై జరిగిన దాడి ఘటన అగ్నికి ఆజ్యం పోసింది. ఈ సంఘటనకు మతం రంగు పులుముతున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీని విమర్శించింది. మరో వైపున బెంగాల్ డాక్టర్లు మమతా బెనర్జీ ఆదేశాలను ధిక్కరిస్తూ తమ ఆందోళనను ఉధృతం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వైద్యులు బెంగాల్ లోని తమ సహచరులకు మద్దతుగా గళమెత్తారు. దీంతో యావత్ దేశం దృష్టి మరోసారి బెంగాల్ పై పడింది. మొత్తానికి ఈ సంఘటన బీజేపీకి లబ్ధి చేకూర్చేదిగా మారింది. బీజేపీ అమ్ములపొదిలోకి మరో అస్త్రాన్ని చేర్చింది.
మమతా బెనర్జీ ప్రధానంగా వీధిపోరాటాలతో అధికారంలోకి వచ్చారు. అలా చేసిన పోరాటాలు అమెకు అధికారాన్ని అందించాయి. ఇప్పుడు బీజేపీ కూడా అదే వ్యూహం అనుసరిస్తోంది. వివిధ అంశాలపై వీధిపోరాటాలు ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితే వామపక్షం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అప్పట్లో తృణమూల్ తన ప్రత్యర్థి వామపక్షంతో పోరాడింది. ఇప్పుడు చరిత్ర పునరావృతమైంది. బీజేపీ ఇప్పుడు తృణమూల్ తో పోరాడుతోంది. ఆ పోరాటంలో వామపక్షాల కార్యకర్తులు లోపాయికారిగా బీజేపీకి సహకరించడం ఓ విశేషం. బీజేపీని ఎదుర్కొనేందుకు ఇప్పడు మమతా బెనర్జీ బంగ్లా భావజాలాన్ని తెరపైకి తీసుకువచ్చారు.
దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో జరిగిన కమల వికాసం బెంగాల్ లోనూ చోటు చేసుకుంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జరిగితే ఇక ఆ దెబ్బ నుంచి కోలుకోవడం తృణమూల్ కాంగ్రెస్ కు సాధ్యం కాదు. అందుకే మమతా బెనర్జీ బంగ్లావాదాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. నిజానికి లోక్ సభ ఎన్నికల సందర్భంగానే ఆమె ఆ పని చేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే 2011లో లెఫ్ట్ ఫ్రంట్ ను ఎదుర్కొనేందుకు కూడా మమతా బెనర్జీ ఇదే అస్త్రాన్ని ప్రయోగించారు. బెంగాల్ సంస్కృతిని ప్రముఖంగా చాటే బంగ్లా భావజాలాన్ని తన కరవాలంగా చేసుకున్నారు. రామకృష్ణ పరహహంస, వివేకానంద ప్రవచనాలను తన ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. తన ప్రసంగాల్లో భగవత్ గీత శ్లోకాలను, ఉపనిషత్తుల సూక్తులను ఉటంకించారు. బంగ్లా సంస్కృతిని ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే మమతా బెనర్జీ ప్రస్తావించిన బంగ్లా భావజాలం ముస్లింలతో ముడిపడింది. గతంలో వామపక్షాలు ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ కూడా అక్రమ వలసదారుల నుంచి రాజకీయ లబ్ధి పొందాయి.
మమతా బెనర్జీ అనుసరించిన బంగ్లా భావజాలాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ బంగ్లా భావజాలం నుంచి ముస్లింలను వేరు చేసి బంగ్లా భావజాలానికి హిందూ జాతీయవాదాన్ని జోడించింది. అది ఆ పార్టీ ఆశించిన ఫలితాలను అందించింది. లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో బీజేపీ ఘనవిజయం సాధించింది. బీజేపీ నుంచి చూస్తే ఇదేమీ కొత్త వ్యూహం కాదు. మొదటి నుంచి కూడా అది కులం అడ్డుగోడల్ని కూలదోసి హిందూ సమాజాన్ని ఏకం చేసింది. దళితవాదం, బీసీవాదం ప్రముఖంగా ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇదే వ్యూహంతో విజయం సాధించింది. కాంగ్రెస్ ను కూడా అదే వ్యూహంతో దెబ్బకొట్టింది. ఒకప్పుడు జాతీయ వాదానికి కాంగ్రెస్ ప్రతీకగా నిల్చింది. అయితే కాంగ్రెస్ జాతీయవాదం మైనారిటీలతో ముడిపడింది. దాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ జాతీయవాదానికి హిందుత్వాన్ని జోడించింది. అలా క్రమంగా జాతీయవాదంపై గుత్తాధిపత్యం సాధించింది. ఇప్పడు ఇదే వ్యూహాన్ని బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అనుసరించనుంది. బంగ్లాదేశ్ నుంచి చొరబడుతున్న ముస్లిం అక్రమవలసదారుల అంశాన్ని ప్రముఖంగా తెరపైకి తీసుకురానుంది.
బెంగాల్ లో చోటు చేసుకుంటున్న హింసాకాండను నివారించేందుకు గవర్నర్ అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. హింసాకాండ నేపథ్యంలో బెంగాల్ లో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలా జరిగితే అది తృణమూల్ కాంగ్రెస్ కే మేలు చేసినట్లవుతుంది. ఆ అంశంపై అది పోరాటం చేస్తుంది. అలా గాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా లభించే ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకునేందుకే బీజేపీ ప్రయత్నించవచ్చు. ఇప్పటికే అక్కడ బీజేపీ ఆకర్షణ అస్ర్తాన్ని ప్రయోగించింది. ఎంతో మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతోంది. బీజేపీ కార్యకర్తలు జైశ్రీరాం నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. జైశ్రీరాం పేరిట పోస్ట్ కార్డు ఉద్యమం కూడా నిర్వహించారు. కమ్యూనిస్టుల తరహాలోనే మమతా బెనర్జీ కూడా నిరంకుశంగా పాలించడం సాధారణ ప్రజానీకంలోనూ అసహనాన్ని పెంచుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దీదీ కంచుకోట బీటలు వారింది. మరో వైపున కమలం అక్కడ వికసించేందుకు సిద్ధమవుతోంది. బెంగాల్ మరో పునరుజ్జీవనానికి సిద్ధమవుతోందా అనే ప్రశ్న ఇప్పడు ఉదయిస్తోంది. అదే గనుక జరిగితే దాని ప్రభావం దేశంపై మరింతగా ఉంటుంది. ఆ తరహా వ్యూహాలతోనే దక్షిణాదిన ద్రావిడ, తెలంగాణ, కేరళ కమ్యూనిస్టు భావజాలాలను ఎదుర్కొనేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire