అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ లో బీజేపీ ఎందుకు ఓడిపోయింది?

Why did BJP lose in Faizabad
x

ఫైజాబాద్ లో బీజేపీ ఎందుకు ఓడిపోయింది?

Highlights

ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల బేసిక్ అవసరాలు తీర్చడంలో బీజేపీ వైఫల్యం చెందిందనే విమర్శలున్నాయి.

అయోధ్యలో రామమందిరం నిర్మించి ప్రాణప్రతిష్ఠ కూడా చేసినప్పటికీ బీజేపీకి ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిరాశే మిగిలింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి లల్లూసింగ్ 55 వేల ఓట్లతో ఓడిపోయారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధి అవధేష్ ప్రసాద్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధిపై ఉన్న వ్యతిరేకత కూడా ఎస్పీ అభ్యర్థికి కలిసి వచ్చిందని భావిస్తున్నారు.

అయోధ్యలో 85 వేల కోట్లతో అభివృద్ది పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేసింది. 2031 వరకు అయోధ్యలో అభివృద్ది కోసం ఈ మాస్టర్ ప్లాన్ ను తయారు చేశారు. రామమందిర నిర్మాణంతో స్థానికంగా టూరిజాన్ని, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే ఈ మాస్టర్ ప్లాన్ ఉద్దేశం. అయోధ్యలో రైల్వే స్టేషన్ ను, ఎయిర్ పోర్టును పునర్నిర్మించారు. అయోధ్య పట్టణాన్ని 1,200 ఎకరాల్లో విస్తరించనున్నారు. ఈ మేరకు 2,200 కోట్ల రూపాయలను వచ్చే ఐదేళ్లలో ఖర్చు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి లల్లూసింగ్ రెండుసార్లు బీజేపీకి ప్రాతినిధ్యం వహించారు. 2024లో కూడా మూడోసారి బీజేపీ ఆయననే బరిలోకి దింపింది. అయితే, లల్లూసింగ్ పై స్థానిక ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ విషయాన్ని బీజేపీ పట్టించుకోకపోవడం కమలానికి కలిసిరాలేదు. రామమందిర నిర్మాణం ఓట్లు తెచ్చి పెడుతుందనే భావన ఆ పార్టీని ముంచింది. నిరుద్యోగం, ఉపాధి అవకాశాలను పట్టించుకోలేదని స్థానికులు భావిస్తున్నారు. లల్లూసింగ్ తమ కోసం ‎ఏ పని చేయలేదని స్థానికులు అసంతృప్తితో ఉన్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని స్థానికుల్లో నమ్మకం కలిగించడంలో కమలదళం విఫలమైంది.

వీటిని సమాజ్ వాదీ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంది. బీజేపీ రామమందిరంపై ఆశలు పెట్టుకొంటే.. అదే మందిరంతో స్థానికులు ఏ రకంగా ఇబ్బందిపడుతున్నారనే విషయాలను ప్రచారస్త్రాలుగా మార్చుకొని ఎస్పీ విజయకేతనం ఎగురవేసింది.ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల బేసిక్ అవసరాలు తీర్చడంలో బీజేపీ వైఫల్యం చెందిందనే విమర్శలున్నాయి. ప్రజలకు అవసరమైన ఉపాధి, నివాస గృహలు, ఆరోగ్యంగా నివసించేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ, ఈ హామీని నిలుపుకోలేదని స్థానికుల్లో అసంతృప్తి ఉంది.

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న కుటుంబాలకు కూడా ఎలాంటి సాయం అందలేదనే విమర్శలున్నాయి. బాబ్రీ మసీదు- రామమందిరం వివాదంలోకూడా పలువురిపై కేసులున్నాయి. రెండుసార్లు యూపీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని స్థానికులు కోపంతో ఉన్నారు. ఇది సమాజ్ వాదీ పార్టీకి కలిసి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సమాజ్ వాదీ పార్టీ అవధేష్ ప్రసాద్ ను ఎంపిక చేయడం సమాజ్ వాదీ పార్టీకి కలిసివచ్చింది. దళిత సామాజిక వర్గానికి చెందిన అవదేశ్ ప్రసాద్ 9సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

1957 నుండి ఫైజాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ఎన్నికైన తొలి దళిత ఎంపీ కూడా అవధేష్ ప్రసాద్. జనరల్ సీటులో దళిత సామాజిక వర్గానికి చెందిన అవధేష్ ను గెలిపించుకుంది సమాజ్ వాదీ పార్టీ. ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉంటారు. దళితుడిని బరిలోకి దింపడం ద్వారా ఆ సామాజిక వర్గం ఓట్లను తమ వైపునకు తిప్పుకోవడంలో సమాజ్ వాదీ పార్టీ విజయవంతమైంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం ద్వారా ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మాణంతో బడా వ్యాపారులు రంగ ప్రవేశం చేస్తున్నారు.. దీని ప్రభావం స్థానికంగా ఉన్న చిన్న వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉందని చేసిన ప్రచారం సమాజ్ వాదీ పార్టీకి కలిసి వచ్చింది.

దేశవ్యాప్తంగా రామ మందిర నిర్మాణం ఓట్లు కురిపిస్తుందని బీజేపీ భావించింది. కానీ, ఈ మందిరం ఉన్న ప్రాంతంలోనే ఆ పార్టీ ఓటమిపాలైంది. స్థానిక సమస్యలు పట్టించుకోకుండా మందిరాలు నిర్మించినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరని ఈ నియోజకవర్గం చెప్పకనే చెప్పినట్లయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories