Ratan Tata: 'స్నేహితుడా వీడ్కోలు' అని ట్వీట్ చేసిన సిమీ గరేవాల్ ఎవరు?

Who is Ratan Tatas Secret Girlfriend Why did the Marriage with her Also Stop
x

Ratan Tata రహస్య స్నేహితురాలు ఎవరు?

Highlights

రతన్ టాటా జీవితంలో ఒకనాటి బాలీవుడ్ నటి, టీవీ హోస్ట్ సిమీ గరేవాల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వారిద్దరికీ ఒకరంటే మరొకరికి చాలా అభిమానం ఉండేది.

రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ‘నాలుగుసార్లు పెళ్లి చేసుకోవాలని సీరియస్ గా ఆలోచించాను. కానీ, చివరి నిమిషంలో పరిస్థితులు మారిపోయాయి’ అని ఆయన ఒక సందర్భంలో చెప్పారు. పెళ్ళి చేసుకోకపోవడం వల్ల ఒక్కోసారి ఒంటరితనాన్ని అనుభవించానని చెప్పారు. అదే సమయంలో స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతాను కాబట్టి పెద్దగా చింతించలేదనీ చెప్పారు.

పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే?

రతన్ నావల్ టాటా 1962లోన అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత లాస్ ఏంజిల్స్ లోని ఏబీ ఆర్కిటెక్చర్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో ఓ యువతితో ప్రేమలో పడ్డారు. ఆ యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

ఆ సమయంలో ఆయన తన నానమ్మకు అనారోగ్యంగా ఉండడంతో ఇండియాకు తిరిగి వచ్చారు. ఏడాదిపాటు ఇండియాలోనే ఉన్నారు. ఇండియా -చైనా మధ్య యుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో రతన్ టాటా ప్రేమించిన యువతిని ఇండియాకు పంపడానికి ఆమె తల్లితండ్రులు ఒప్పుకోలేదు.

దీంతో ఈ బంధానికి బ్రేక్ పడింది. పెళ్లి చేసుకునే విషయమై జీవితంలో నాలుగుసార్లు సీరియస్ గా ఆలోచించినట్లు రతన్ టాటా 2011 లో సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, ప్రతిసారీ ఏదో రకమైన భయంతో వెనకడుగు వేశానని చెప్పారు.

ఒకసారి మాత్రం, రతన్‌కు నిశ్చితార్థం జరిగిందని, పెళ్లి పత్రికలు కూడా వేయాల్సిన సమయంలో చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ అయిందని ఆయన సన్నిహితులు కొందరు చెబుతారు. ఆయన పేరేంట్స్ విడిపోవడం కూడా పెళ్లి చేసుకోకుండా ఉండడానికి మరో కారణమన్నది మరికొందరి అభిప్రాయం.

పెళ్లి చేసుకోనందుకు బాధగా ఉండేది

భార్య లేకుండా, కుటుంబం లేకుండా పోవడం వల్ల కొన్ని సార్లు ఒంటరితనాన్ని అనుభవంచినట్లు రతన్ టాటా ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు. అయితే వ్యక్తిగత స్వేచ్ఛను తాను ఆనందిస్తానని, పెళ్ళి చేసుకోకపోవడం వల్ల వేరొకరి భావాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని అన్నారు. కొన్నిసార్లు ఆలోచించినప్పుడు పెళ్లి చేసుకోనందుకు బాధగా కుడా అనిపించేదని ఆయన చెప్పారు.

టీవీ హోస్ట్ సిమీ గరేవాల్‌తో స్నేహం

రతన్ టాటా జీవితంలో ఒకనాటి బాలీవుడ్ నటి, టీవీ హోస్ట్ సిమీ గరేవాల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వారిద్దరికీ ఒకరంటే మరొకరికి చాలా అభిమానం ఉండేది. అది స్నేహంగా, ప్రేమగా మారిందనీ సన్నిహితులు చెబుతారు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుందామని కూడా అనుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, రతన్ టాటా మిగతా పెళ్ళి ప్రయత్నాల్లాగే ఇది కూడా పీటల దాకా రాకుండానే ఆగిపోయింది.

ఎక్కువగా తెల్ల దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోయే సిమీ గరేవాల్ నటిగా, టీవీ హోస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టార్జాన్ గోస్ టు ఇండియా సినిమాతో నటిగా మారిన సిమీ గరేవాల్ ఆ తరువాత మేరా నామ్ జోకర్, కర్జ్ వంటి చిత్రాలతో సినీ నటిగా రాణించారు. రెండివూ విత్ సిమీ గరేవాల్ పేరుతో ఆమె చేసిన ఇంటర్వ్యూలు ఆమెకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చాయి. ఆమె వ్యక్తిగత జీవితం కూడా ప్రేమలు, వైఫల్యాలతోనే సాగింది. ఎన్ని కష్టాలు వచ్చిన హుందాతనాన్ని పోగొట్టుకోకుండా ఆమె కెరీర్‌లో ఎదుగుతూ వచ్చారు.

“రతన్‌తో నా స్నేహం చాలా కాలం సాగింది. ఆయన పర్ఫెక్ట్ మ్యాన్. జెంటిల్మన్. నిరాడంబరంగా ఉండడానికే ఇష్టపడతారు. ముఖ్యంగా, ఆయనలో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. ఇండియాలో ఉంటే ఆయనకు అస్సలు సమయం దొరికేది కాదు. విదేశాల్లో ఉన్నప్పుడే కాస్త రిలాక్సెడ్‌గా ఉండేవారు” అని సిమీ ఓ సందర్భంలో చెప్పారు.

రతన్ టాటా తుదిశ్వాస విడిచారని తెలిసి ఆమె బాధతో ఇలా ట్వీట్ చేశారు.

‘నీవు వెళ్ళిపోయావని అంతా అంటున్నారు. నువ్వు లేని లోటును ఎలా భరించడం... చాలా కష్టం. స్నేహితుడా వీడ్కోలు!’

Show Full Article
Print Article
Next Story
More Stories