లారెన్స్ బిష్ణోయి ఎవరు? ఈ మాఫియా గ్యాంగ్ చేసిన నేరాలేంటి?

Who is Lawrence Bishnoi What are the Crimes Committed by This Mafia Gang
x

లారెన్స్ బిష్ణోయి ఎవరు? ఈ మాఫియా గ్యాంగ్ చేసిన నేరాలేంటి?

Highlights

Lawrence Bishnoi: బాబా సిద్దిఖీ హత్యతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మరోసారి చర్చకు వచ్చింది.

Lawrence Bishnoi: బాబా సిద్దిఖీ హత్యతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మరోసారి చర్చకు వచ్చింది. యూనివర్శిటీలో విద్యార్ధిగా ఉన్నప్పుడే లారెన్స్ పై హత్య కేసు నమోదైంది. జాతీయ స్థాయి అథ్లెట్ గా ఉన్న ఆయన గ్యాంగ్ స్టర్ గా ఎలా మారారు? సల్మాన్ ఖాన్ కు ఆయనకు ఉన్న విరోధం ఏంటి? జైలు నుంచి ఆయన గ్యాంగ్ ను ఎలా నడుపుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూద్దాం.

సిద్దిఖీ హత్యకు కారణం ఏంటి?

మాజీమంత్రి, నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ నాయకులు బాబా సిద్దిఖీని బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు అక్టోబర్ 12న కాల్చి చంపారు. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నందున ఆయనను హత్య చేశారు.ఈ విషయాన్ని ఆ గ్యాంగ్ సభ్యులు శుభం లోంకర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొన్ని రోజులుగా సిద్దిఖీ కార్యకలాపాలపై రెక్కీ నిర్వహించిన దుండగులు ఆయనను హత్య చేశారు. ముంబైలోని కుర్లాలో నిందితులు ప్రత్యేకంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

ఎవరీ లారెన్స్ బిష్ణోయ్ ?

లారెన్స్ బిష్ణోయ్ 1993 ఫిబ్రవరి 12న పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లా దత్తరన్ వాలీలో సంపన్న కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి లవీందర్ సింగ్ కానిస్టేబుల్ ఉద్యోగం వదిలి 1997లో వ్యవసాయం ప్రారంభించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ సరిహద్దుల్లోని అబోహర్ అనే పట్టణంలో బిష్ణోయ్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. 2010లో చండీగఢ్ లోని డీఏవీ కాలేజీలో చేరారు. 2011లో పంజాబ్ యూనివర్శిటీ క్యాంపస్ స్టూడెంట్స్ కౌన్సిల్ లో చేరారు. అక్కడే ఆయన గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ను మొదటిసారిగా కలిశారు.

పంజాబ్ యూనివర్శిటీ నుంచి బిష్ణోయి ఎల్ఎల్ బీ పట్టా పొందారు. ఆ సమయంలోనే క్రిమినల్ యాక్ట్స్ మొదలు పెట్టారని ఆయనపై ఆరోపణలున్నాయి.

డీఏవీ కాలేజీలో ఉన్నప్పుడు బిష్ణోయి ప్రియురాలిని ఆయన ప్రత్యర్థి వర్గం గ్యాంగ్ వార్ లో సజీవదహనం చేసింది. ఆ ఘటన బిష్ణోయిని పూర్తిగా మార్చేసిందని, పూర్తిగా నేరాలవైపు మళ్ళడానికి అదే కారణమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

యూనివర్శిటీలోనే లారెన్స్ పై హత్యాయత్నం కేసు

పంజాబ్ యూనివర్శిటీలో ఉన్న సమయంలో సమయంలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓటమితో లారెన్స్ సహచరుడొకరు ప్రత్యర్థి వర్గం విద్యార్థి నాయకుడిపై కాల్పులకు దిగారు. ఈ కేసులో లారెన్స్ పై 2011-12లో కేసు నమోదైంది. 2014లో ఆయనను తొలిసారి రాజస్థాన్ లో అరెస్ట్ చేసి భరత్ పూర్ జైలుకు తరలించారు. విచారణ కోసం పంజాబ్ లోని మొహాలీకి తరలిస్తున్న సమయంలో ఆయన తప్పించుకున్నారు. 2016లో ఆయన మరోసారి అరెస్టయ్యారు. 2021లో భద్రతాకారణాలతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు.

సిద్దూ మూసేవాలా హత్య వెనుక

లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడుగా ఉన్న జస్విందర్ ను గ్యాంగ్ స్టర్ జైపాల్ భుల్లర్ హత్య చేశారు. భరత్ పుర్ లో బిష్ణోయ్ గ్యాంగ్ విస్తరణలో జస్విందర్ కీలకంగా వ్యవహరించారు. పంజాబ్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సిద్దూ మూసేవాలాను 2022 మేలో బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది. ఈ హత్యకు గ్యాంగ్ వారే కారణంగా చెబుతున్నారు.విక్కీ మిదుఖేడా హత్యకు ప్రతీకారంగానే ఈ మర్డర్ జరిగిందని అంటారు.ఆయుధ స్మగ్లింగ్, డ్రగ్స్ సరఫరాలో బిష్ణోయ్ గ్యాంగ్ పాత్ర ఉందని గుజరాత్ ఏటీఎస్ ఆరోపిస్తోంది.

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు

బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణజింకను అత్యంత పవిత్రంగా భావిస్తారు. 1998లో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడారని ఆయనపై కేసు నమోదైంది. దీంతో 2018 నుంచి సల్మాన్ ను హత్య చేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసు వాయిదాలకు జోథ్ పూర్ కోర్టుకు వచ్చిన సమయంలోనే హత్య చేస్తామని అప్పట్లోనే ఈ గ్యాంగ్ తెలిపింది. 2024 ఏప్రిల్ 14న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిగాయి. దీనికి బిష్ణోయ్ గ్యాంగ్ కారణమని పోలీసులు గుర్తించారు.

ఈ ఘటన జరిగిన నెలరోజుల తర్వాత ముంబైలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి పెద్దఎత్తున ఆయుధాలను సీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ హత్య చేసేందుకు ఈ గ్యాంగ్ వచ్చిందని పోలీసులు ప్రకటించారు. 2021 సెప్టెంబర్ లో కెనడాలో దవీందర్ బాంబిహా గ్యాంగ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ సుఖ్ దూల్ సింగ్ అలియాస్ సుఖా దునేకేని హత్య చేశారు. సిద్దిఖీ హత్యకు కొన్ని గంటల మధ్య దిల్లీ జిమ్ యజమానిని కాల్చి చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధుర్ అలియాస్ మటా అర్మాన్ ను కూడా దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.రోహిత్ గోదారా, గోల్డి బ్రార్ ద్వారా లారెన్స్ ముఠాలో మాధుర్ కూడా సభ్యుడిగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. రాజస్థాన్ లో 2023 డిసెంబర్ లో జైపూర్ లో హత్యకు గురైన రాష్ట్రీయ రాజుపుత్ కర్ణిసేన అధ్యక్షులు సుఖదేవ్ సింగ్ గోగమేడి హంతకులకు లారెన్స్ ముఠాతో సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు.

బిష్ణోయ్ పై కేసులు

చండీగఢ్ లో అతనిపై నమోదైన ఏడు ఎఫ్ఐఆర్ లలో నాలుగు కేసుల్లో ఆయన నిర్ధోషిగా విడుదలయ్యారు. మూడు కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. 2012 నుండి బిష్ణోయ్ ఎక్కువగా జైలులోనే ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆయుధాల వ్యాపారులు, స్థానిక నేరస్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు.2013లో ముక్త్ సర్ లో ప్రభుత్వ కాలేజీలో గెలిచిన అభ్యర్ధిని, లూథియానాలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓ అభ్యర్ధిని కాల్చి చంపారని ఆయనపై కేసులున్నాయి.

2014లో రాజస్థాన్ పోలీసులకు బిష్ణోయ్ గ్యాంగ్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సమయంలో ఆయన పోలీసులకు చిక్కారు. పలు సెక్షన్ల కింద ఆయనను జైలుకు పంపారు. జైలులో జస్విందర్ సింగ్ అలియాస్ రాకీ తో పరిచయం ఏర్పడింది. 2016లో రాకీని గ్యాంగ్ స్టర్ జైపాల్ భుల్లర్ కాల్చి చంపారు. 2020లో భుల్లర్ ను ప్రత్యర్థులు చంపారు. 2021లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద ఆయనను తీహార్ జైలుకు పంపారు.

బిష్ణోయ్ గ్యాంగ్ లో 700 మంది

బిష్ణోయ్ గ్యాంగ్ లో 700 మంది ఉన్నట్టు చెబుతారు. లారెన్స్ బిష్ణోయ్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నారు. అక్కడి నుంచే ఆయన తన గ్యాంగ్ ను నడుపుతున్నారు. జైలుకు అక్రమంగా సెల్ ఫోన్ల ను తెప్పించుకొని గ్యాంగ్ లోని తన అనుచరులతో నిరంతరం టచ్ లో ఉంటారని ఆయనపై ఆరోపణలున్నాయి. సమాజంలో పేరున్న వారిని చంపితే తమ గ్యాంగ్ కు పేరు వస్తుందని లారెన్స్ భావిస్తారు. ఈ గ్యాంగ్ లో గోల్డ్ బ్రార్ కీలకమైన వ్యక్తి అని చెబుతారు. ఆయన కెనడా నుంచి ఈ గ్యాంగ్ ను నడిపిస్తున్నారని అంటారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ గ్యాంగ్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ల్లో ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ మూడు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. సంపన్న వ్యాపారులు, రాజకీయ నాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తారని ఆయనపై ఆరోపణలున్నాయి.

లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ రేంజిలో తమ హవా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న ఈ గ్యాంగ్‌ ను పోలీసు శాఖ ఎలా కట్టడి చేస్తుందన్నది కీలక ప్రశ్న. ముంబయిలో మాఫియా ముఠాలను తుడిచి పెట్టేశామని గతంలో చెప్పుకున్న పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ ఇప్పుడు కొత్త సవాలుగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories